Deloitte Survey India
-
మూడు నెలలకోసారి సైబర్ రిస్క్ మదింపు
న్యూఢిల్లీ: టెక్నాలజీ అత్యంత వేగంగా పురోగమిస్తున్న నేపథ్యంలో కంపెనీలు తమ సైబర్ రిస్కులను ఏడాదికోసారి కాకుండా మూడు నెలలకోసారి మదింపు చేసుకోవాల్సిన అవసరం ఉందని డెలాయిట్ ఇండియా రిస్క్ అడ్వైజరీ పార్ట్నర్ దిగ్విజయసింహ చుదసమా తెలిపారు. కంపెనీలే కాకుండా ప్రజలు కూడా సైబర్ రక్షణ కోసం స్వీయ–మార్గదర్శకాలను రూపొందించుకోవాలని, కీలకమైన డేటాను షేర్ చేయడం వల్ల తలెత్తే సమస్యలపై అవగాహన కలిగి ఉండాలని ఆయన పేర్కొన్నారు. హ్యాకర్లు మరింత అధునాతనమైన పద్ధతుల్లో సైబర్ దాడులకు దిగుతున్నందున ఈ తరహా రక్షణాత్మక చర్యలు అవసరమని చుదసమా వివరించారు. తమ ప్రయోజనాలను, తమ డేటాను పరిరక్షించుకునేందుకు ఉపయోగపడే విధానాలను రూపొందించుకోవడంపై కంపెనీలు కసరత్తు ప్రారంభించాలని ఆయన సూచించారు. -
భారీ స్థాయికి ఆన్లైన్ రిటైల్ మార్కెట్
న్యూఢిల్లీ: దేశ ఆన్లైన్ రిటైల్ మార్కెట్ శరవేగంగా వృద్ధి చెందుతోంది. 2022 నాటికి 70 బిలియన్ డాలర్లుగా (రూ.5.74 లక్షల కోట్లు) ఉన్న మార్కెట్ విలువ 2030 నాటికి నాలుగు రెట్ల వృద్ధితో 325 బిలియన్ డాలర్లకు (రూ.26.65 లక్షల కోట్లు) చేరుకుంటుందని డెలాయిట్ ఇండియా ఓ నివేదికలో తెలిపింది. ఈ కామర్స్ రంగం ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో వేగంగా వృద్ధి చెందుతున్నట్టు వెల్లడించింది. ఆర్డర్ల సంఖ్యా పరంగా ప్రథమ శ్రేణి పట్టణాలను ఇవి అధిగమించినట్టు పేర్కొంది. ఆఫ్‌లైన్ (భౌతిక దుకాణాలు)తో పోలిస్తే వచ్చే దశాబ్ద కాలంలో ఆన్లైన్ రిటైల్ విస్తరణ రెండున్నర రెట్లు అధికంగా ఉంటుందని వివరించింది. ‘‘2022లో టైర్–2, 3 పట్టణాలు మొత్తం ఈ కామర్స్ ఆర్డర్లలో 60 శాతం వాటా ఆక్రమించాయి. టైర్–3 పట్టణాల్లో ఆర్డర్లు 65 శాతం పెరిగాయి. టైర్–2 పట్టణాల్లో ఆర్డర్లలో 50 శాతం పెరుగుదల కనిపించింది. ఆన్లైన్ రిటైల్ భారీగా వృద్ధి చెందడానికి ఎన్నో అంశాలున్నాయి. ఆర్డర్ చేయడంలో, వాటిని తిప్పి పంపించడంలో సౌకర్యం ఉండడం, 19,000 పిన్కోడ్ల పరిధిలో లాజిస్టిక్స్ వసతులు (డెలివరీ, పికప్) ఉండడం కీలకమైనవి’’అని ఈ నివేదిక వివరించింది. పైగా భారత్‌లో 22 కోట్ల ఆన్లైన్ షాపర్స్ ఉండడం కూడా ఈ కామర్స్ వృద్ధిని మరింత నడిపిస్తోందని తెలిపింది. భారీగా పెట్టుబడులు ఈ కామర్స్ రంగంలో భారీ పెట్టుబడులు రావడాన్ని సైతం డెలాయిట్ నివేదిక ప్రస్తావించింది. ప్రైవేటు ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ సంస్థల నుంచి గత ఐదేళ్లలో 23 బిలియన్ డాలర్ల నిధులను ఆకర్షించినట్టు తెలిపింది. రిటైలర్లు సైతం ఓమ్నిచానల్ మార్గాన్ని అనుసరిస్తున్నట్టు, ఆఫ్‌లైన్, ఆన్లైన్ రెండు మార్గాల్లోనూ కస్టమర్లకు చేరువు అవుతున్నట్టు వివరించింది. ‘‘పెరుగుతున్న ఆదాయం, వేగంగా డిజిటలైజేషన్, మధ్యతరగతి వర్గం విస్తరణతో భారత్‌లో ఆన్లైన్ రిటైల్ రంగం అసాధారణ వృద్ధిని చూస్తుందన్న నమ్మకం ఉంది. టెక్నాలజీ సామర్థ్యాలు, భవిష్యత్తు వ్యూహాల ద్వారా రిటైలర్లు కస్టమర్ల డిమాండ్‌ను చేరుకోవడమే కాదు, విలువ పరంగా నూతన ప్రమాణాలను సృష్టించనున్నారు. మరిచిపోలేని షాపింగ్ అనుభూమతిని ఇవ్వనున్నారు’’అని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ ఆనంద్ రామనాథన్ అభిప్రాయపడ్డారు. టైర్–2 పట్టణాల్లో ఇంటర్నెట్ వినియోగం పెరగడం, ఆన్లైన్ వ్యాపారాలను సులభంగా ప్రారంభించే అవకాశం, కావాల్సినవి సులభంగా గుర్తించడం, సులభతర చెల్లింపుల విధానాలు దేశంలో రిటైల్ రంగ ముఖచిత్రా న్ని మార్చేస్తాయని డెలాయిట్ నివేదిక అంచనా వేసింది. ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియా లిటీ, మెటావర్స్ అనేవి కస్టమర్‌తో అనుసంధానతను మార్చేస్తాయని, కస్టమర్లకు రిటైలర్లు మరింత దగ్గర కావడంతోపాటు, వారి సంతృప్తిని సంపాదించేందుకు వీలు కలి్పస్తాయని పేర్కొంది. కిరాణా దుకాణాలను పెద్ద రిటైల్ ఎకోసిస్టమ్‌తో అనుసంధానించడం ద్వారా ఉత్పత్తుల శ్రేణి, వ్యాపా రం మరింత విస్తరించుకోవచ్చని సూచించింది. -
6.5–7.1 శాతం వృద్ధి సాధ్యమే
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022– 23) భారత్ జీడీపీ 6.5 శాతం నుంచి 7.1 శాతం మధ్య వృద్ధిని నమోదు చేస్తుందని డెలాయింట్ ఇండియా అంచనా వేసింది. ‘‘ద్రవ్యోల్బణం గత కొన్ని నెలలుగా అధిక స్థాయిల్లోనే ఉంటూ విధానకర్తలకు సవాలుగా మారింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆర్బీఐ 1.9 శాతం రెపో రేటు పెంచినప్పటికీ ద్రవ్యోల్బణం గరిష్ట పరిమితికి పైనే 9 నెలలుగా కొనసాగుతోంది. డాలర్ బలపడడంతో దిగుమతుల బిల్లు పెరిగి ద్రవ్యోల్బణం మరింత పెరిగింది. కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ ఏడాది ముగింపు లేదా వచ్చే ఏడాది ఆరంభంలో మాంద్యం తలెత్తవచ్చు. దీంతో పరిస్థితులు ప్రతికూలంగా మారొచ్చు. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితుల ప్రభావం భారత్ వృద్ధి కారకాలపై చూపించడం మొదలైంది. ఈ పరిస్థితుల్లో భవిష్యత్తుకు సంబంధించి స్థిరమైన అంచనాలు వేయడం కష్టమే’’అని డెలాయిట్ ఇండియా తన నివేదికలో వివరించింది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2023–24) భారత్ జీడీపీ 5.5–6.1 శాతం మధ్య వృద్ధిని నమోదు చేయవచ్చని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 8.7 శాతం వృద్ధిని నమోదు చేయడం తెలిసిందే. సవాళ్లు ఉన్నాయ్.. ‘‘పండుగల సీజన్ వినియోగ రంగానికి తగినంత ప్రోత్సాహాన్నిస్తుందని అంచనా వేశాం. కానీ, ఇది ఇంకా స్థిరమైన పునరుద్ధరణను చూపించలేదు. పరిశ్రమలో, తయారీ రంగంలో రుణాల వృద్ధి చెప్పుకోతగ్గ స్థాయిలో పెరిగింది. దీంతో ప్రైవేటు రంగంలో మూలధన పెట్టుబడులకు ఎంతో సానుకూల అవకాశాలున్నాయి. స్థిరమైన పెట్టుబడులకు సుస్థిరమైన డిమాండ్ అవసరం. అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గుతున్న తరుణంలో ఎగుమతులు, ప్రభుత్వ తోడ్పాటు అన్నవి వృద్ధికి కావాల్సినంత మద్దతును ఇవ్వలేవు. ద్రవ్యోల్బణం, కమోడిటీ ధరలు, కరెన్సీ విలువ క్షీణత రూపంలో వృద్ధి క్షీణించే రిస్క్‌లు సైతం ఉన్నాయి’’అని డెలాయిట్ ఇండియా ఆర్థికవేత్త రుక్మి మజుందార్ తెలిపారు. అంతర్జాతీయంగా ధరలు 2023 మధ్య నాటికి తగ్గుతాయని అంచనా వేస్తున్నట్టు డెలాయిట్ తెలిపింది. ముడి చమురు ధరలు కొంత తగ్గుముఖం పట్టి, కంపెనీల ముడి సరుకుల ధరలు సైతం దిగొస్తాయని, ఫలితంగా దేశీయంగా ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు క్షీణిస్తాయని పేర్కొంది. -
ఉద్యోగుల్లో తరుముకొస్తున్న..మానసిక ముప్పు, భయపెట్టిస్తున్న షాకింగ్ రిపోర్ట్!
న్యూఢిల్లీ: ఉద్యోగుల మానసిక సమస్యలు సంస్థలపై పెద్ద భారాన్నే మోపుతున్నాయి. ఏ స్థాయిలో అంటే 14 బిలియన్ డాలర్ల మేర (రూ.1.2 లక్షల కోట్లు). డెలాయిట్ తూచ్ తోమత్సు ఇండియా ఇందుకు సంబంధించి ఒక నివేదిక విడుదల చేసింది. మానసిక అనారోగ్యం కారణంగా విధులకు గైర్హాజరు కావడం, తక్కువ ఉత్పాదకత, వలసలు కలసి కంపెనీలు ఈ స్థాయిలో నష్టపోతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా అంతర్జాతీయంగా ఉద్యోగుల్లో మానసిక అనారోగ్య సమస్యలు పెరుగుతూ పోతున్నట్టు ఈ నివేదిక తెలిపింది. అంతర్జాతీయంగా మానసిక అనారోగ్యం వల్ల పడే భారంలో భారత్ వాటా 15 శాతంగా ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గణాంకాలు చెబుతున్నాయి. భారత ఉద్యోగుల్లో మానసిక ఆరోగ్యం ఎలా ఉంది, సంస్థలపై దాని ప్రభావం ఏ మేరకు అనే విషయాలను తెలుసుకునేందుకు డెలాయిట్ ఈ సర్వే నిర్వహించింది. పని ఒత్తిళ్లు ఎక్కువే.. పనిలో ఉండే ఒత్తిళ్లు తమ మానసిక ఆరోగ్యానికి దెబ్బతీస్తున్నట్టు 47 శాతం మంది నిపుణులు చెప్పారు. ఆ తర్వాత ఆర్థిక సమస్యలు, కరోనా మహమ్మారిని వారు కారణాలుగా పేర్కొన్నారు. ఈ ఒత్తిళ్లు అన్నవి వ్యక్తిగతంగా, వృత్తి పరంగా, సామాజికంగానూ ఉద్యోగులపై చూపిస్తున్నాయి. ఒకవేళ ఉద్యోగులు పనికి వచ్చినా, వారు ఎదుర్కొంటున్న ఒత్తిళ్ల వల్ల కారణంగా ఉత్పాదకత తక్కువే ఉంటున్న విషయాన్ని ఈ నివేదిక ఎత్తి చూపింది. గడిచిన ఏడాది కాలంలో 80 శాతం ఉద్యోగులు మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. గణాంకాలు భయపెట్టే విధంగా ఉన్నా.. 39 శాతం మంది సామాజిక నిందల భయంతో తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి వెనుకాడుతున్న పరిస్థితి నెలకొంది. పని ప్రదేశాల్లో మానసిక అనారోగ్యం ఉన్నప్పటికీ 33 శాతం మంది తాము ఎప్పటిమాదిరే విధులకు హాజరవుతున్నామని చెప్పగా.. 29 శాతం మంది కొంత సెలవు తీసుకోవడం చేస్తున్నట్టు చెప్పారు. ఇక 20 శాతం మంది రాజీనామా చేసి ఒత్తిడి తక్కువగా ఉండే మెరుగైన ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నట్టు డెలాయిట్ సర్వేలో వెల్లడించారు. ఉద్యోగుల ఆరోగ్యాన్ని ప్రాధాన్య అంశంగా సంస్థలు పరిగణించాలని.. మానసిక అనారోగ్యానికి మూల కారణాలను తెలుసుకుని పరిష్కారాలపై దృష్టి పెట్టాలని డెలాయిట్ సూచించింది. -
ఉద్యోగుల ధోరణి మారింది, ఈ వస్తువులపై పెట్టే ఖర్చు భారీగా పెరిగింది
న్యూఢిల్లీ: దేశంలో వినియోగం పుంజుకుంటోంది. ఉద్యోగులు తిరిగి కార్యాలయాలకు రావడం క్రమంగా పెరుగుతోంది. దీంతో విచక్షణారహిత అవసరాలు,ఉత్పత్తులపై ఖర్చు పెట్టే ధోరణి పెరుగుతున్నట్టు కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ నిర్వహించిన సర్వేలో తెలిసింది. ‘గ్లోబల్ స్టేట్ ఆఫ్ కన్జ్యూమర్ ట్రాకర్’ పేరుతో ఈ సంస్థ సర్వే వివరాలతో ఓ నివేదికను విడుదల చేసింది. కరోనా రెండు విడతల తీవ్రత అనంతరం..సాధారణ వ్యాపార కార్యకలాపాల దిశగా భారత్ అడుగులు వేస్తోందని పేర్కొంది. కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం, టీకాలను పెద్ద ఎత్తున వేస్తుండడం భారతీయుల్లో కొత్త విశ్వాసాన్ని తీసుకొచ్చినట్టు తెలిపింది. కార్యాలయాలకు తిరిగి రావడం భద్రంగానే భావిస్తున్నారని..ప్రయాణాలపై వెచ్చించేందుకు,విచక్షణారహిత ఉత్పత్తులపై మరింత ఖర్చు చేసేందుకు వారు సముఖంగా ఉన్నారని వివరించింది. వ్యక్తిగత కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భారతీయులు సహజంగా సంకోచించరని..ఇవన్నీ ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు సానుకూల ధోరణులుగా పేర్కొంది. దేశవ్యాప్తంగా కరోనా ఆంక్షలు పూర్తిగా సడలించడం వినియోగ దారుల్లో సానుకూల సెంటిమెంట్‌కు దారితీసినట్టు వివరించింది. కార్యాలయాలకు వెళ్లాల్సివస్తే, జాగ్రత్తలు తీసుకునే ధోరణి ఉద్యోగుల్లో ఉన్నట్టు తెలిపింది. ఖర్చు వీటి కోసమే.. ►మద్యంపై 12 శాతం ఖర్చు చేస్తున్నారు. ►కేబుల్ టీవీ కోసం 36 శాతం, వస్త్రాలు, పాదరక్షల కోసం 36 శాతం ►ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కోసం 33 శాతం ►అలాగే, ఫర్నిషింగ్ ఉత్పత్తుల కోసం 25 శాతం ►రెస్టారెంట్ల కోసం 22 శాతం ►68 శాతం మంది స్థానికంగా తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. ►74 శాతం మంది బలమైన బ్రాండ్లను ఎంపిక చేసుకుంటున్నారు. చదవండి: ‘మెదడు మొద్దుబారిపోతోంది.. ఆఫీసులకే వస్తం’ -
2026-27 నాటికి 5 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా భారత్..!
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ 2026-27 ఆర్థిక సంవత్సరానికి 5 ట్రిలియన్ డాలర్ల(దాదాపు రూ.368 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించడానికి 8 ట్రిలియన్ డాలర్ల (దాదాపు రూ.588 లక్షల కోట్లు) తాజా గ్రీన్‌ఫీల్డ్ పెట్టుబడులు అవసరమని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ డెలాయిట్ విశ్లేషించింది. గ్రీన్‌పీల్డ్ పెట్టుబడి అంటే.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్‌డీఐ)లో ఒక విధానం. ఈ విధానంలో ఒక పేరెంట్ కంపెనీ వివిధ దేశాల్లో అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసి కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఇందుకు అనుగుణంగా భారీగా పెట్టుబడులు పెడుతుంది. భారత్‌లో ఈ తరహాలో భారీ పెట్టుబడుల ఆవశ్యకతను డెలాయిట్ ఇచ్చిన తాజా నివేదికలో వివరించింది. కోవిడ్-19 సవాళ్లలోనూ దేశానికి భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయని డెలాయిట్ పేర్కొంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ఆశావహ పరిస్థితిని, ఆర్థిక మూలాలకు పటిష్టతను అందించిందని వివరించింది. 2020-21లో ఈక్విటీ, రీ-ఇన్వెస్టెడ్ ఎర్నింగ్స్, క్యాపిటల్‌సహా రికార్డు స్థాయిలో 81.72 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. కోవిడ్ ముందస్తు ఆర్థిక సంవత్సరం (2019-20)తో పోల్చితే ఇవి 10 శాతం అధికం కావడం గమనార్హం. అమెరికా, బ్రిటన్, జపాన్, సింగపూర్లలోని బహుళజాతి కంపెనీలకు చెందిన 1,200 మంది వ్యాపార వేత్తల అభిప్రాయాల ప్రాతిపదికన ఈ సర్వే అధ్యయనం రూపొందింది. (చదవండి: తెలంగాణలో మరో కంపెనీ భారీగా పెట్టుబడులు) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు భారత్ ఆకర్షణీయ దేశంగా ఉందని నివేదిక పేర్కొంటూ, నిపుణులైన కార్మిక శక్తి, ఎకానమీ వృద్ధి అవకాశాలు దీనికి కారణమని తెలిపింది. భారత్‌లో మరిన్ని సంస్కరణల ఆవశ్యకత అవసరమని పేర్కొన్న నివేదిక, తద్వారా దేశానికి మరింత భారీ స్థాయిలో ఎఫ్‌డీఐలను ఆకర్షించవచ్చని వివరించింది. -
కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించే చాన్స్!
బడ్జెట్లో చర్యలపై డెలాయిట్ సర్వేలో అంచనా... న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్)తో సతమతమవుతున్న పారిశ్రామిక రంగాన్ని మోదీ సర్కారు ఈసారి బడ్జెట్లో కాస్త కనికరించనుందా? ట్యాక్స్ కన్సెల్టెన్సీ దిగ్గజం డెలాయిట్ ఇండియా సర్వేలో మెజారిటీ కార్పొరేట్లు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కార్పొరేట్ పన్నును తగ్గించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మరో రెండు వారాల్లో(ఫిబ్రవరి1న) 2017–18 ఆర్థిక సంవత్సరానికిగాను బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. 2015 ఫిబ్రవరి బడ్జెట్ ప్రసంగంలో జైట్లీ కార్పొరేట్లకు ఇస్తున్న పన్ను ప్రోత్సాహకాలను దశలవారీగా తొలగించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, 2017, ఏప్రిల్ 1 నుంచి కార్పొరేట్ పన్నును క్రమంగా 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గిస్తామని అప్పుడే వెల్లడించారు. సర్వేలో పాల్గొన్న కార్పొరేట్లలో 53 శాతం మంది ఈసారి కార్పొరేట్ పన్ను రేటులో తగ్గింపు ఉండొచ్చని పేర్కొన్నారు. ‘నల్లధనాన్ని అరికట్టడం కోసం ప్రభుత్వం చాలా కఠిన చర్యలు తీసుకున్న నేపథ్యంలో పన్ను రేటు తగ్గించేందుకు ఇదే సరైన సమయం. డీమోనిటైజేషన్ ప్రకటన తర్వాత ఆర్థిక వృద్ధి దిగజారుతుండటం అత్యంత ఆందోళన కలిగిస్తున్న అంశం. దీనికి ప్రధానంగా డిమాండ్ పడిపోవడమే కారణం. సర్వేలో ఎక్కువమంది ఇదే విషయాన్ని ప్రస్తావించారు. డిమాండ్‌పై ప్రతికూల ప్రభావాన్ని తొలగించేందుకు బడ్జెట్లో ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందని 80 శాతం మంది సర్వేలో స్పందించారు’ అని డెలాయిట్ పేర్కొంది. గతేడాది ప్రభుత్వ పన్ను ఆదాయాల్లో కార్పొరేట్ పన్ను వాటా దాదాపు 19 శాతం కాగా, ఆదాయపు పన్ను వాటా 14 శాతంగా నమోదైంది. ఇతర ముఖ్యాంశాలివీ... పన్ను ప్రోత్సాహకాలు పూర్తిగా తొలగించడం మంచిదని.. దీనివల్ల లిటిగేషన్లకు ఆస్కారం తగ్గుతుందని సర్వేలో 40% అభిప్రాయపడ్డారు. ఇన్ఫ్రా వంటి రంగాల్లో వృద్ధి కొనసాగాలంటే లాభాలతో ముడిపడిన పన్ను ప్రోత్సాహకాలు తప్పనిసరి అని మరో 40% మంది పేర్కొన్నారు. ఇన్ఫ్రా రంగానికి ప్రోత్సాహకాలు పూర్తిగా తొలగించకుండా పెట్టుబడులతో ముడిపడిన పన్ను రాయితీలు కల్పించాలని 15శాతం మంది కోరారు. నోట్ల రద్దు తర్వాత రియల్ ఎస్టేట్ పరిశ్రమకు సంబంధించి డిమాండ్ తీవ్రంగా దెబ్బతింది. బ్యాంకింగ్ వ్యవస్థలోకి డిపాజిట్ నిధులు పోటెత్తడంతో రుణాలపై వడ్డీ రేట్లు దిగిరానున్నాయి. మరోపక్క, ప్రభుత్వం కూడా వడ్డీరేట్ల రాయితీలను అందిస్తోంది. ఇవన్నీ చైక గృహాలకు డిమాండ్‌ను మళ్లీ భారీగా పెంచనున్నాయి. మొత్తంమీద నిర్మాణాత్మక సంస్కరణల జోరు పెంచేందుకు ప్రభుత్వం విధానపరమైన చర్యలను కొనసాగించే అవకాశం ఉందని డెలాయిట్ అభిప్రాయపడింది.