India economic growth
-
ప్రపంచ వేదికపై భారత్: నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అమెరికాలో సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (CSIS) ప్రెసిడెంట్ అండ్ సీఈఓ జాన్ జే హామ్రేతో జరిగిన సమావేశంలో ఆర్థిక సాధికారతలో భారత్ అభివృద్ధిని గురించి వివరించారు. దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని.. ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.2014లో రాష్ట్ర రాజధానులకు సమీపంలో ఉన్న గ్రామాలకు కూడా విద్యుత్ సదుపాయం అంతంత మాత్రంగానే ఉండేది. నేడు ప్రతి గ్రామంల్లో విద్యుత్ సదుపాయం మాత్రమే కాకుండా.. ప్రతి ఇంటికి కుళాయి నీటి కనెక్షన్లు ఉన్నాయని.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన 'జల్ జీవన్ మిషన్' కార్యక్రమం గురించి కూడా సీతారామన్ వెల్లడించారు.ఇంతకు ముందు గ్రామాలకు కుళాయి నీటి కనెక్షన్లు ఉండేవి, కానీ ఇప్పుడు ప్రతి ఇంటికి కుళాయి నీటి కనెక్షన్స్ అందించడం జరిగింది. లక్షలాది భారతీయ కుటుంబాల ఆరోగ్యం, పారిశుధ్యం వంటి సౌకర్యాలపై కూడా కేంద్రం సానుకూల దృష్టి పెట్టిందని ఆర్ధిక మంత్రి పేర్కొన్నారు.ఇదీ చదవండి: పండక్కి 13 స్పెషల్ ఎడిషన్స్.. మార్కెట్లో కొత్త కార్ల జోరుమున్సిపాలిటీలు కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే పన్నుల్లో కొంత భాగాన్ని, ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా అదనపు నిధులను పొందుతాయని ఆమె వివరించారు. అంతే కాకుండా మార్కెట్ నుంచి వనరులను సేకరించేందుకు వారి సామర్థ్యాలను పెంచుతున్నాము. ఇది దేశాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని నిర్మలా సీతారామన్ వివరించారు.భారతదేశ ఆర్థిక వృద్ధికి కొన్ని సంస్కరణలు జరుగుతున్నాయి, భవిష్యత్తులో కూడా జరుగుతూనే ఉంటాయి. ఇప్పటికే ఎంతోమంది పెట్టుబడిదారులు కొత్త రంగాలలో విరివిగా పెట్టుబడులు పెడుతున్నారు. కొనసాగుతున్న సంస్కరణలు, పెరిగిన గ్లోబల్ ఎంగేజ్మెంట్తో.. భారతదేశం ప్రపంచ వేదికపై ప్రత్యేక గుర్తింపు పొందుతుందని సీతారామన్ స్పష్టం చేశారు. -
2047 నాటికి భారత్ ధనిక దేశం కావడం కష్టమే!.. మార్టిన్ వోల్ఫ్
2047 నాటికి భారతదేశం సూపర్ పవర్‌గా అవతరిస్తుంది, అయితే అధిక ఆదాయ ఆర్థిక వ్యవస్థగా మారదని ఫైనాన్షియల్ టైమ్స్ చీఫ్ ఎకనామిక్స్ వ్యాఖ్యాత మార్టిన్ వోల్ఫ్ పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత భారత్‌గా అవరిస్తుందన్న ప్రధాని మోదీ కల నెరవేరడం అసాధ్యమని ఆయన అన్నారు.ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మార్టిన్ వోల్ఫ్ మాట్లాడుతూ.. గ్లోబల్ మార్కెట్ల వృద్ధి నెమ్మదిగా ఉండటం మాత్రమే కాకుండా, బలహీన ఆర్థిక వ్యవస్థల కారణంగా భారతదేశ ఎదుగుదల కష్టతరం అవుతుందని అన్నారు. కానీ ప్రపంచ దేశాలు ఇండియా వైపు చూస్తాయని.. అవకాశాలను అందిపుచ్చుకుని సద్వినియోగం చేసుకుంటే.. ఆ తరువాత భారత్ ఆర్థికంగా కూడా ఎదుగుతుందని ఆయన అన్నారు.ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేస్తుందని పేర్కొంది. దీనికోసం కేంద్రం విజన్ డాక్యుమెంట్‌పై పని చేస్తోంది. ఇండియా అధిక ఆదాయ ఆర్థిక వ్యవస్థగా మారటానికి ప్రతి వ్యక్తి జీడీపీ సంవత్సరానికి 7.5 శాతానికి చేరుకోవాలి. అప్పుడే వికసిత భారత్ సాధ్యమవుతుందని వోల్ఫ్ అన్నారు. -
అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా భారత్!.. వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో సహా వచ్చే మూడేళ్లలో 6.7 శాతం స్థిరమైన వృద్ధిని నమోదు చేయడం ద్వారా భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇండియా ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని వరల్డ్ బ్యాంకు మంగళవారం విడుదల చేసిన నివేదిక పేర్కొంది.భారత్ 2023-24 ఆర్థిక సంవత్సరం వృద్ధి 8.2 శాతానికి చేరుకుందని వరల్డ్ బ్యాంక్ అంచనా వేసింది. ఇది జనవరిలో నిపుణులు అంచనా వేసినదానికంటే 1.9 శాతం ఎక్కువని గణాంకాలు చెబుతున్నాయి. 2025-26లో 2.7 శాతానికి చేరుకునే ముందు 2024లో వృద్ధి 2.6 శాతం వద్ద స్థిరంగా ఉంటుందని పేర్కొంది.భారతదేశంలో ప్రాంతీయ వృద్ధి కూడా గణనీయంగా పెరుగుతోంది. బంగ్లాదేశ్‌లో వృద్ధి పటిష్టంగా ఉంటుంది. అయితే పాకిస్తాన్, శ్రీలంకలు నెమ్మదిగా బలపడే సూచనలు ఉన్నాయి. ఇండియా మాత్రమే ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా కొనసాగుతుందని వెల్లడించింది.వ్యవసాయోత్పత్తి పుంజుకోవడం, ద్రవ్యోల్బణం తగ్గడం వల్ల ప్రైవేట్ వినియోగ వృద్ధి ప్రయోజనం పొందుతుందని వరల్డ్ బ్యాంక్ పేర్కొంది. జేడీపీకి సంబంధించి ప్రస్తుత వ్యయాన్ని తగ్గించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వ వినియోగం నెమ్మదిగా మాత్రమే పెరుగుతుందని అంచనా వేశారు.ప్రపంచ ద్రవ్యోల్బణం 2024లో 3.5 శాతం.. 2025లో 2.9 శాతానికి మధ్యస్థంగా ఉంటుందని అంచనా వేశారు. ఈ క్షీణత కేవలం ఆరు నెలలు మాత్రమే ఉంటుంది. ఆ తరువాత వేగంగా పుంజుకుంటుందని.. అయితే కేంద్ర బ్యాంకులు పాలసీ వడ్డీ రేట్లను తగ్గించడంలో జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. -
ఫైనాన్షియల్ రంగం, ప్రైవేట్ పెట్టుబడుల దన్ను!
న్యూఢిల్లీ: పటిష్ట ఫైనాన్షియల్ రంగం, ప్రైవేట్ పెట్టుబడులు పెరగడం వంటి కారణాలతో ఏప్రిల్‌తో ప్రారంభమైన 2023–24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వృద్ధి 6.3 శాతంగా ఉంటుందని పరిశ్రమల సంస్థ ఫిక్కీ సోమవారం వెల్లడించింది. కొన్ని సవాళ్లతో కూడిన అంశాలు నెలకొన్నప్పటికీ స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు 6.3 శాతంగా ఉంటుందని ఫిక్కీ ఎకనమిక్ అవుట్‌లుక్ సర్వే పేర్కొంది. సర్వేలో మరికొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► ఫలితాలు అనుకున్నదానికంటే మెరుగ్గా ఉంటే వృద్ధి రేటు 6.6 శాతంగా నమోదవుతుంది. ఏదైనా ప్రతికూలతలు ఎదురయితే 6 శాతానికి తగ్గవచ్చు. భౌగోళిక రాజకీయ ఒత్తిడి కారణంగా అనిశ్చితి కొనసాగడం, చైనాలో వృద్ధి మందగించడం, కఠిన ద్రవ్య విధానం, సాధారణ రుతుపవనాల కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు వృద్ధికి ప్రతికూలతలు. ► మొత్తం స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 15 శా తం వాటా ఉన్న వ్యవసాయ రంగం, అనుబంధ కార్యకలాపాల విషయంలో వృద్ధి రేటు 2.7 శా తంగా ఉంటుంది. అయితే 2022–23తో పోలి్చ తే (4 శాతం) ఈ వృద్ధి రేటు తగ్గుతుందని సర్వే వెల్లడిస్తోంది. ఎల్ నినో ప్రభావం దీనికి కారణం. ► జీడీపీలో మరో 15 శాతం వాటా ఉన్న పారిశ్రామిక రంగం వృద్ధి రేటు 5.6 శాతంగా నమోదుకావచ్చు. ► ఎకానమీలో మెజారిటీ వాటా కలిగిన సేవల రంగం వృద్ధి రేటు 7.3 శాతంగా ఉండే వీలుంది. ► 2023 సెపె్టంబర్లో సర్వే జరిగింది. పరిశ్రమ, బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రముఖ ఆర్థికవేత్తల నుంచి అభిప్రాయాలను తీసుకోవడం జరిగింది. ► మొదటి త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధి రేటు నమోదుకాగా, రెండవ–మూడవ త్రైమాసికాల్లో ఈ రేట్లు వరుసగా 6.1 శాతం, 6 శాతాలకు తగ్గవచ్చు. ► రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2023–24లో సగటున 5.5 శాతంగా నమోదయ్యే వీలుంది. కనిష్టంగా 5.3 శాతం, గరిష్టంగా 5.7 శాతంగా ఉండవచ్చు. ద్రవ్యోల్బణం గమనం అనిశ్చితంగానే ఉందని సర్వేలో పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు. ప్లస్ 2, మైనస్ 2తో 4 శాతం వద్ద ద్రవ్యోల్బణం ఉండాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న సంగతి తెలిసిందే. 2023–24లో వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనావేస్తుండగా, క్యూ2లో 6.2 శాతం, క్యూ3లో 5.7 శాతం, క్యూ4లో 5.2 శాతంగా అంచనా. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో అంచనా 5.2 శాతంగా ఉంటుందని ఆర్బీఐ పాలసీ అంచనావేస్తోంది. ► తీవ్ర అనిశ్చితి పరిస్థితుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోనే కొనసాగవచ్చు. 2024 వరకూ ఇదే ధోరణి నెలకొనే అవకాశం ఉంది. అయితే భారత్ ఎకానమీ ఈ సవాళ్లను తట్టుకుని నిలబడగలుగుతుంది. భారత్ ఎగుమతులపై మాత్రం ప్రతికూల ప్రభావం తప్పదు. 2024–25 ప్రారంభంలో పావుశాతం రేటు కోత 2024 మార్చి వరకూ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో యథాతథంగా 6.5 శాతంగా కొనసాగే వీలుందని ఫిక్కీ సర్వే తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2024–25)మొదటి లేదా రెండవ త్రైమాసికాల్లో రెపో రేటును ఆర్బీఐ పావుశాతం తగ్గించే అవకాశం ఉందని విశ్లేíÙంచింది. ఉక్రేయిన్‌పై రష్యా యుద్ధం, క్రూడ్ ధరల తీవ్రత, అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్ ధరలు, దీనితో ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో ఈ సవాలును అధిగమించడానికి ఆర్బీఐ 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి నాటికి రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి చేరింది. అయితే ద్రవ్యోల్బణం కొద్దిగ అదుపులోనికి వస్తుందన్న సంకేతాల నేపథ్యంలో ఈ నెల మొదట్లో జరిగిన సమీక్షసహా గడచిన మూడు ద్రవ్య పరపతి విధాన సమక్షా సమావేశాల్లో యథాతథ రేటు కొనసాగింపునకే ఆర్బీఐ పెద్దపీట వేసింది. జూలైలో నమోదయిన 15 నెలల గరిష్ట స్థాయి (7.44 శాతం) రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్ నాటికి పెద్ద మరింత ఊరటనిస్తూ, మూడు నెలల కనిష్ట స్థాయి 5.02 శాతానికి దిగివచి్చంది. అయితే ద్రవ్యోల్బణం పట్ల ఆర్బీఐ అత్యంత అప్రమత్తంగా ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ పలు సందర్భాల్లో స్పష్టం చేస్తున్నారు. ద్రవ్యోల్బణం 2–4 ఆర్బీఐ లక్ష్యం అని కూడా ఆయన ఇటీవలి పాలసీ సమీక్షలో ఉద్ఘాటించారు. -
పాతికేళ్లలోపు వారికి.. ఉద్యోగాల్లేవ్!
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ, ఇంజనీరింగ్ వంటివి పూర్తికాగానే ఏదో ఓ ఉద్యోగం కోసం వెతుకులాట తప్పదు. కొందరు పైచదువులకు వెళ్లినా చాలా మంది ఉద్యోగం కోసం చూస్తుంటారు. కానీ ఉద్యోగాలు దొరకని పరిస్థితి. దేశంలో పాతికేళ్ల వయసులోపు పట్టభద్రుల్లో 42శాతం మంది ఇలా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారే. 25 ఏళ్లు దాటినవారిలోనూ 15శాతం మంది నిరుద్యోగులే. కోవిడ్ నాటి పరిస్థితులు దాదాపు చక్కబడినా, భారత్ ఆర్థిక వృద్ధి వేగవంతమైందన్న అంచనాలున్నా.. కొత్తగా ఉద్యోగాల్లో చేరే గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగిత శాతం ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని నిపుణులు అంటున్నారు. అదే 35ఏళ్లు పైబడిన గ్రాడ్యుయేట్లలో 5 శాతమే నిరుద్యోగం ఉందని అంటున్నారు. ‘‘స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2023: సోషల్ ఐడెంటీస్ అండ్ లేబర్ మార్కెట్ ఔట్ కమ్స్’’పేరిట అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ‘జాతీయ గణాంక సంస్థ, జాతీయ ఆర్థిక, కుటుంబ ఆరోగ్య సర్వేలు, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా, ఎంప్లాయ్మెంట్–అన్ ఎంప్లాయ్మెంట్ తదితర నివేదికల ఆధారంగా ఈ అధ్యయనం చేసినట్టు వర్సిటీ వర్గాలు తెలిపాయి. ప్రేమ్‌జీ వర్సిటీ నివేదికలో ఏముందంటే.. ♦ అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ అధ్యయన నివేదికలో పలు కీలక అంశాలు వెల్లడయ్యాయి. నివేదిక ప్రకారం.. దీర్ఘకాలికంగా చూస్తే భారత్‌లో జీడీపీ వృద్ధికి–ఉద్యోగాల వృద్ధికి సంబంధం లేకుండా పోయింది. వేగంగా జీడీపీ వృద్ధి సాధించేందుకు అనుసరించే విధానాలు వేగంగా ఉద్యోగాల కల్పనకు తోడ్పడటం లేదు. ♦ కరోనా సమయంలో చాలా మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోవడంతో.. జీవనం గడిపేందుకు మళ్లీ వ్యవసాయం, స్వయం ఉపాధి వైపు మళ్లారు. దీనితో ఈ రెండు రంగాల్లో 2020 ఏప్రిల్–జూన్ మధ్య ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఆ తర్వాత పురుషులకు సంబంధించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోవిడ్ ముందటి కాలానికి చేరుకోగా.. మహిళలకు కొంత మేర మాత్రమే అవకాశాలు వచ్చాయి. ♦ వ్యవస్థీకృత మార్పుల ప్రభావంతో.. కరోనా అనంతర కాలంలో వ్యవసాయం నుంచి పురుషులు వైదొలిగినా, నిర్మాణ రంగంలో అవకాశాలు వచ్చాయి. కానీ మహిళలు మాత్రం వర్క్‌ఫోర్స్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. అయితే 2004 నుంచీ స్తంభించిపోయిన మహిళా ఉద్యోగిత శాతం.. 2019 తర్వాతి నుంచి కొంతమేర పెరిగింది. ♦ 2004లో క్యాజువల్ వేజ్ వర్కర్లతోపాటు వారి వారసులలో 80శాతం మంది అదే ఉపాధిలో ఉండగా.. 2019 నాటికి చాలా వరకు మార్పు వచ్చింది. కానీ ఎస్సీ, ఎస్టీవర్గాల్లో మాత్రం అలాగే కొనసాగుతోంది. అంతేకాదు 20 మందికిపైగా ఉద్యోగులున్న సంస్థల యజమానుల్లో ఎస్సీ, ఎస్టీలు చాలా తక్కువగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కూడా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయి. చాలా రంగాల్లో ఇప్పటికే పనిచేస్తున్న అనుభవజు్ఞలైన ఉద్యోగులనే కొనసాగిస్తున్నారు. చాలా దేశాల్లో ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు కూడా పెంచుతున్నారు. సంస్థల మూసివేతలు పెరుగుతున్నాయి. యువకులకు శిక్షణనిచ్చి, వారి నుంచి ఉత్పాదక పెంచే సేవలు అందుకోవడానికి జాప్యమయ్యే పరిస్థితిలో నైపుణ్యాలున్న పాతవారినే కొనసాగిస్తున్నారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ, కోవిడ్ మహమ్మారి ప్రభావం చిన్న, మధ్యతరహా సంస్థలపై తీవ్రంగా పడింది. వాటిలో ఎస్సీ,ఎస్టీ వర్గాలకు చెందినవారు ఎక్కువగా ఉపాధి కోల్పోవడంతో ఆ వర్గాల్లో నిరుద్యోగం పెరిగింది. – డి.పాపారావు, ఆర్థిక, సామాజిక రంగాల విశ్లేషకులు నైపుణ్యాల కొరతతోనూ సమస్య దేశంలోని గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఇంగ్లిష్‌లో తగిన ప్రావీణ్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. చదువుకుంటూ ఉద్యోగం చేసే అవకాశం, నైపుణ్యాలను పెంచుకునే అవకాశం వారికి తక్కువ. చిన్నదైనా ప్రభుత్వ ఉద్యోగం కావాలని కోరుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు, డిగ్రీ వంటివి పూర్తికాగానే డెలివరీ బాయ్స్, కాల్ సెంటర్ ఉద్యోగాలు వంటివి చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. కానీ చదువుకు తగ్గ ఉద్యోగం కోసం ఎదురుచూడక తప్పడం లేదు. యువతలో నైపుణ్యాల కల్పనతోపాటు బీకామ్, బీఎస్సీ, బీఏ వంటి కోర్సులు చదివిన వారికి కూడా ప్రైవేట్ పరిశ్రమలు, సంస్థలు ఉద్యోగాలు ఇచ్చేలా చర్యలు చేపట్టాలి. – రమణ భూపతి, క్వాలిటీ థాట్‌గ్రూప్ చైర్మన్ , ఎడ్టెక్ కంపెనీ -
చైనాతో వాణిజ్య బంధం తెంచుకోవాలనడం సరికాదు
న్యూఢిల్లీ: సరిహద్దులో అతిక్రమనలకు ప్రతీకారంగా చైనాతో భారత్ వాణిజ్య సంబంధాలు తెగతెంపులు చేసుకోవలన్న డిమాండ్ సరికాదని నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ పనగారియా స్పష్టం చేశారు. అలాచేయడం వల్ల భారత్ ఆర్థిక వృద్ధి వేగమూ మందగిస్తుందని హెచ్చరించారు. అందుకు బదులుగా ముందు భారతదేశం తన వాణిజ్యాన్ని విస్తరించడానికి బ్రిటన్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) వంటి దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ)కుదుర్చుకోవడానికి ప్రయత్నించాలని కొలంబియా విశ్వవిద్యాలయంలో ఎకనమిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన సూచించారు. ‘‘ రెండు దేశాలు వాణిజ్య ఆంక్షలు విధించుకోవచ్చు. అయితే 17 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ (చైనా)కు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ (భారతదేశం)ని దెబ్బతీసే సామర్థ్యమే అధికంగా ఉంటుంది’’ అని ఆయన విశ్లేషించారు. ‘‘మనం చైనాను శిక్షించాలని ప్రయత్నిస్తే, అది వెనక్కి తగ్గదు. అమెరికా ఆంక్షల విషయంలో చైనా ఎలా ప్రతిస్పందించిందన్న విషయాన్ని, ఇందుకు సంబంధించి అమెరికాలో పరిణామాలను మనం ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి’’ అని ఆయన అన్నారు. ఆంక్షల విధింపు వల్ల లాభంకన్నా నష్టాలే ఎక్కువనే అన్నారు. రష్యాపై ఆంక్షల విధింపు ద్వారా అమెరికా, యూరోపియన్ యూనియన్లు ఎలాంటి ప్రతికూల పర్యవసానాలను ఎదుర్కొంటున్నాయో కూడా మనం గమనించాలని అన్నారు. చౌక కాబట్టే కొంటున్నాం... భారతదేశం దిగుమతి చేసుకునే అనేక ఉత్పత్తులకు చైనా చౌకైన సరఫరాదారు కాబట్టే భారత్ బీజింగ్ నుండి కొనుగోలు చేస్తోందని పనగారియా చెప్పారు. భారతదేశం ఎగుమతి చేయాలనుకుంటున్న వస్తువులకు చైనా మంచి ధరను అందించబోదని అన్నారు. ఇక్కడే మనం అమెరికా వంటి వాణిజ్య భాగస్వాములకు మన వస్తువులను భారీగా అమ్మడంపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. దీని ఫలితంగా చైనాతో వాణిజ్య లోటు– అమెరికాతో వాణిజ్య మిగులుతో భర్తీ అవుతుందని అన్నారు. వెరసి చైనాతో వాణిజ్యలోటు తీవ్రత వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదన్నారు. ఏటేటా భారీ వాణిజ్యలోటు భారత్– చైనాల మధ్య వాణిజ్య లోటు (ఎగుమతులు–దిగుమతుల మధ్య వ్యత్యాసం) ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–అక్టోబర్ మధ్య కాలంలో 51.5 బిలియన్ల డాలర్లకు చేరుకుంది. 2021–22లో ఈ లోటు 73.31 బిలియన్ డాలర్లు. 2020–21లో 44.03 బిలియన్లతో పోల్చితే వాణిజ్యలోటు భారీగా పెరగడం గమనార్హం. తాజా ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్–అక్టోబర్ మధ్య చైనా దిగుమతులు 60.27 బిలియన్ డాలర్లు. ఎగుమతులు 8.77 బిలియన్ డాలర్లు. క్యాడ్‌పై ఇప్పటికి ఓకే... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) భారత్ కరెంట్ ఖాతా లోటు (క్యాడ్) 2 నుండి 3 శాతం (జీడీపీ విలువతో పోల్చి) మధ్య ఉండవచ్చని అన్నారు. ఇది భారత్ తట్టుకునే పరిమితిలో ఉందని పేర్కొన్నారు. ఈ స్థాయి క్యాడ్‌తో స్థూల ఆర్థిక స్థిరత్వానికి ఎటువంటి ముప్పు ఉండబోదని స్పష్టం చేశారు. 2020–21లో భారతదేశం జీడీపీలో 0.9 శాతం కరెంట్–ఖాతా మిగులు నమోదయ్యింది. 2021–22లో 1.2 శాతం కరెంట్–ఖాతా లోటు ఏర్పడింది. ఒక నిర్దిష్ట కాలంలో ఒక దేశంలోకి వచ్చీ–దేశంలో నుంచి బయటకు వెళ్లే విదేశీ మారకద్రవ్య విలువ మధ్య నికర వ్యత్యాసాన్ని ‘కరెంట్ అకౌంట్’ ప్రతిబింబిస్తుంది. దేశానికి సంబంధిత సమీక్షా కాలంలో విదేశీ నిధుల నిల్వలు అధికంగా వస్తే, దానికి కరెంట్ అకౌంట్ ‘మిగులు’గా, లేదా దేశం చెల్లించాల్సిన మొత్తం అధికంగా ఉంటే ఈ పరిస్థితిని కరెంట్ అకౌంట్ ‘లోటుగా’ పరిగణిస్తారు. దీనిని సంబంధిత సమీక్షా కాలం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువతో పోల్చి శాతాల్లో పేర్కొంటారు. -
భారత్ వృద్ధి అంచనాలకు మూడీస్ కోత!
న్యూఢిల్లీ: అధిక ద్రవ్యోల్బణాన్ని కారణంగా చూపిస్తూ, మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ గురువారం 2022 క్యాలెండర్ ఇయర్ భారతదేశ ఆర్థిక వృద్ధి వృద్ధి అంచనాను 9.1 శాతం నుండి 8.8 శాతానికి కుదించింది. ఈ మేరకు అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం వెలువరించిన 2022–23 గ్లోబల్ స్థూల ఆర్థిక వ్యవస్థ అవుట్‌లుక్ నివేదికలో ముఖ్యాంశాలు ఇవీ.. ► డిసెంబర్ త్రైమాసికం 2021 (2021 అక్టోబర్–డిసెంబర్) నుండి ఈ సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో వృద్ధి ఊపందుకున్నట్లు హై–ఫ్రీక్వెన్సీ డేటా సూచిస్తోంది. ► అయితే ముడి చమురు, ఆహారం, ఎరువుల ధరల పెరుగుదల ప్రభావం రాబోయే నెలల్లో గృహ ఆర్థిక, వ్యయాలపై ఉంటుంది. ఇంధనం, ఆహార ద్రవ్యోల్బణం మరింత పెరక్కుండా సెంట్రల్ బ్యాంక్ అనుసరిస్తున్న రేట్ల పెంపు విధానం డిమాండ్ రికవరీ వేగాన్ని తగ్గిస్తుంది. ► 2022 ఎకానమీ స్పీడ్‌ను 8.8 శాతానికి తగ్గిస్తున్నా, 2023 వృద్ధి అంచనాలను 5.4 శాతంగా యథాతథంగా కొనసాగిస్తున్నాం. ► పటిష్ట రుణ వృద్ధి, కార్పొరేట్ రంగం ప్రకటించిన పెట్టుబడి ప్రణాళికలు, ప్రభుత్వం మూలధన వ్యయానికి అధిక బడ్జెట్ కేటాయింపుల వంటి అంశాలు పెట్టుబడుల పక్రియ బలపడుతున్నట్లు సూచిస్తున్నాయి. ► అంతర్జాతీయంగా ముడి చమురు, ఆహార ధరలు మరింత పెరగకపోతే ఆర్థిక వ్యవస్థ పటిష్టమైన వృద్ధి వేగాన్ని కొనసాగించేంత బలంగా కనిపిస్తోంది. ► 2022, 2023 క్యాలెండర్ సంవత్సరాల్లో ద్రవ్యోల్బణం సగటున వరుసగా 6.8 శాతం, 5.2 శాతంగా ఉంటుందని అంచనా. ► అనేక ప్రతికూల కారకాల కారణంగా 2022, 2023 ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించాల్సి వస్తోంది. ద్రవ్యోల్బణం అంచనాలను పెంచాల్సిన పరిస్థితి ఉత్పన్నం అవుతోంది. ► సరఫరాల సమస్యలు ద్రవ్యోల్బణాన్ని పెంచుతున్నాయి. వినియోగదారుల కొనుగోలు శక్తి క్షీణించేట్లు చేస్తున్నాయి. ఆయా అంశాలతో సెంట్రల్ బ్యాంకులు కఠిన ద్రవ్య విధానానికి మొగ్గుచూపే పరిస్థితికి దారితీస్తున్నాయి. దీనితోపాటు ఆర్థిక మార్కెట్ అస్థిరత, ఆస్తుల రీప్రైసింగ్, కఠిన ద్రవ్యపరిస్థితుల వంటి అంశాలు ఎకానమీల మందగమనానికి ప్రధాన కారణం. ► మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీసింది. అనంతరం రికవరీకి పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధం ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా కనబడుతోంది. జీరో–కోవిడ్ విధానంతో చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో కొనసాగుతోంది. వచ్చే ఏడాదినాటికి ప్రధాన ద్రవ్యోల్బణం రేట్లు (శాతాల్లో) తగ్గుతాయని మేము భావిస్తున్నప్పటికీ, ధర స్థాయిలు ఎక్కువగానే ఉంటాయి. ఆయా అంశాలు డిమాండ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ► చైనా వృద్ధి రేటు 2022లో 4.5 శాతం, 2023లో 5.3 శాతం ఉంటాయని భావిస్తున్నాం. అమెరికా, బ్రిటన్ ఎకానమీల వృద్ధి రేటు దాదాపు 2.8 శాతంగా ఉంటుందని అంచనా. కట్టుతప్పిన ద్రవ్యోల్బణం... ఈ సంవత్సరం ప్రారంభం నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యానికి మించి నమోదవుతోంది. రిటైల్ ద్రవ్యోల్బణం 2 నుంచి 6 శాతం శ్రేణిలో నమోదుకావాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది. అయితే జనవరిలో 6.01 శాతం, ఫిబ్రవరిలో 6.07 శాతం, మార్చిలో 17 నెలల గరిష్ట స్థాయిలో ఏకంగా 6.95 శాతానికి చేరడం ఆందోళన కలిగిస్తోంది. ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం ఎనిమిదేళ్ల గరిష్టం 7.79 శాతానికి చేరడంతో జూన్ మొదటి వారంలో జరిగే పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ ఎంపీసీ మరో దఫా రేట్ల పెంపు ఖాయమని నిపుణులు పేర్కొంటున్నారు. పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ మొదటి వారం ఆర్బీఐ పరపతి సమీక్ష భారీగా 1.2 శాతం మేర పెంచేసింది. దీనితో 2022–23లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతం ఉంటుందన్న క్రితం అంచనాలు 5.7 శాతానికి పెరిగాయి. వరుసగా నాలుగు త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం 6.3 శాతం, 5.8 శాతం, 5.4 శాతం, 5.1 శాతంగా ఉంటుందని ఆర్బీఐ కమిటీ అంచనావేసింది. అయితే ఈ లెక్కలు తప్పే అవకాశాలు స్పష్టమవడంతో నేపథ్యంలో ఈ నెల మొదట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్యపరపతి విధాన మధ్యంతర కమిటీ ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా రెపో రేటును అనూహ్య రీతిలో 4 శాతం నుంచి 4.4 శాతానికి పెంచింది. నాలుగేళ్ల తర్వాత రెపో రేటు పెరగడం ఇదే తొలిసారి. 2018 ఆగస్టు తర్వాత ఆర్బీఐ పాలసీ రేటు పెంపు ఇది. కరోనా సవాళ్ల తీవ్రత నేపథ్యంలో... 2020, మే 22న రుణ రేటును కనిష్ట స్థాయికి (4 శాతానికి) తగ్గించిన నాటి నుంచి 4 శాతం వద్ద రెపో రేటు కొనసాగుతోంది.వరుసగా 11 ద్వైమాసిక సమావేశాల కాలంలో రెపో రేటును 4 శాతం వద్ద యథాతథంగా ఆర్బీఐ కొనసాగిస్తోంది. 4.4 శాతానికి రెపో రేటును పెంచడంతోపాటు వ్యవస్థలో నుంచి తక్షణం రూ.87,000 కోట్లు వెనక్కు మళ్లే విధంగా... రెపో రేటుతో బ్యాంకులు ఆర్బీఐ వద్ద తప్పనిసరిగా ఉంచాల్సిన ‘వడ్డీ రహిత’ నిధులకు సంబంధించిన నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ని కూడా పరపతి విధాన కమిటీ 50 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 4.5 శాతానికి పెరిగింది. వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత)ని కట్టడి చేసి తద్వారా ద్రవ్యోల్బణం స్పీడ్‌ను తగ్గించాలన్నది ఈ ఇన్‌స్ట్రమెంట్ల ప్రధాన ఉద్దేశ్యం. వచ్చే నెల్లో అరశాతం రేటు పెంపు ఖాయం బ్రిటిష్ బ్రోకరేజ్ సంస్థ బార్క్లేస్ విశ్లేషణ ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జూన్‌లో జరిగే ఆర్థిక సంవత్సరం రెండవ ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షలో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలుచేసే వడ్డీరేటు రెపోను మరో 0.50 శాతం పెంచే అవకాశాలు అధికంగా ఉన్నాయని బ్రిటిష్ బ్రోకరేజ్ సంస్థ బార్క్లేస్ విశ్లేషించింది. అలాగే వృద్ధి రేటు అంచనాలనూ 7.2 శాతం నుంచి 7 శాతానికి కుదించే అవకాశం ఉందని పేర్కొంది. ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాల బ్యాండ్‌ను 6.2–6.5 శాతం శ్రేణిగా సవరించే వీలుందని అంచనావేసింది. ద్రవ్యోల్బణం కట్టడి, మధ్య కాలిక ఆర్థిక స్థిరత్వం లక్ష్యాలుగా పాలసీ సమీక్ష ఉంటుందని అభిప్రాయపడింది. వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత)కట్టడి లక్ష్యంగా క్యాష్ రిజర్ రేషియో (సీఆర్ఆర్)ను మరో 0.50 శాతం పెంచే అవకాశం ఉందని తెలిపింది. బార్క్లేస్ విశ్లేషణలు నిజమైతే రెపో రేటు 4.90 శాతానికి, సీఆర్ఆర్ 5 శాతానికి పెరిగే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం కట్టడి–వృద్ధి సమతౌల్యత ఆర్బీఐ ముందున్న ప్రస్తుత కీలకాంశమని వివరించింది. -
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎకానమీ గ్రోత్ ఎంతంటే!
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022–23) 7.5 శాతం నుంచి 8 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నట్లు పారిశ్రామిక వేదిక– సీఐఐ ప్రెసిడెంట్ టీవీ నరేంద్రన్ అభిప్రాయపడ్డారు. దేశ వృద్ధిలో ఎగుమతులు కీలక పాత్ర పోషిస్తాయని కూడా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. నరేంద్రన్ అభిప్రాయం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 7.2 శాతం అంచనాలకన్నా అధికంగా ఉండడం గమనార్హం. ఏప్రిల్ మొదటి వారంలో జరిగిన 2022–23 ఆర్థిక సంవత్సరం తొలి ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షలో ఎకానమీ వృద్ధి రేటు అంచనాలను ఆర్బీఐ ఏకంగా 60 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గించిన సంగతి తెలిసిందే. దీనితో ఈ అంచనా 7.8 శాతం నుంచి 7.2 శాతానికి దిగివచ్చింది. ఈ నేపథ్యంలో ఎకానమీపై సీఐఐ ప్రెసిడెంట్ అభిప్రాయాలు ఇవీ... ►కోవిడ్–19 మహమ్మారి తదుపరి వేవ్‌ను, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రభావాలను తట్టుకోడానికి దేశం సిద్ధంగా ఉండాలి. ఈ సవాళ్లను దేశం ఎదుర్కొంటుందన్న భరోసా ఉంది. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ అధిక వృద్ధి పథాన్ని నిలుపుకోగలదని మేము విశ్వసిస్తున్నాము. ప్రత్యేకించి ఎగుమతి విషయంలో మేము చాలా ఆశాజనకంగా ఉన్నాము. భారతదేశ పురోగతిలో ఎగుమతులు కీలక భాగమవుతాయి. ►ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ తాజా సవాళ్లు ప్రపంచ సప్లై చైన్‌పై ప్రభావం చూపుతుంది. ఆయా అంశాలను పరిగణనలోకి తీసుకుంటూనే భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనా 7.5–8 శాతం ఉంటుందని భావిస్తున్నాం. ► కోవిడ్ సవాళ్లకు సంబంధించి అనుభవాలు చూస్తే, ప్రపంచవ్యాప్తంగా కొత్త వేవ్ ఉన్న ప్రతిసారీ, అది భారతదేశాన్ని కూడా తాకుతుంది. కాబట్టి, భవిష్యత్తులో వచ్చే వేవ్‌లను ఎదుర్కొనడానికి మనం సిద్ధంగా ఉండాలి. ►కోవిడ్‌ను ఎదుర్కొనడానికి పరిశ్రమ పటిష్ట రక్షణాత్మక ప్రోటోకాల్‌లను కలిగి ఉంది. మహమ్మారి నిర్వహణలో అలాగే ఇన్ఫెక్షన్లు పెరిగినప్పటికీ సురక్షితంగా పనిచేయడంలో సామర్థ్యానికి సంబంధించి మంచి అనుభవాన్ని సముపార్జించింది. ► గతంలో మైక్రో–కంటైన్మెంట్ (తక్కువ పరిధిలో ఆంక్షలు) వ్యూహం భారతదేశానికి బాగా పనిచేసింది. మళ్లీ భారీగా లాక్డౌన్ విధించే అవకాశం ఉండబోదని పరిశ్రమ విశ్వసిస్తోంది. ►ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ను నిర్వహించడంలో విస్తృతంగా ఆమోదించబడిన సూత్రం ఏమిటంటే, కఠినమైన లాక్డౌన్లకు వెళ్లడం కంటే దానితో జీవించడం నేర్చుకోవడం. దీనిని భారత్ అర్థం చేసుకుంది. ► చమురు, ఇతర వస్తువుల ధరల పెరుగుదల పరిశ్రమల మార్జిన్లు, వినియోగదారుల కొనుగోలు శక్తిపై ప్రభావం చూపుతోంది. అయితే భారతదేశంలో స్టాగ్ఫ్లేషన్ (ధరలు పెరుగుతూ, వస్తు డిమాండ్ పడిపోవడం) వంటి పదాన్ని ఉపయోగించాల్సిన అవసరం లేదని విశ్వసిస్తున్నాం. ►ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 7.5–8 శాతం పరిధిలోనే ఉంటుందని భావిస్తున్నాం. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ భారత్ 8.2 శాతం వృద్ధి సాధిస్తుందని పేర్కొంటోంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని అంచనా వేస్తోంది. సంవత్సరానికి సగటు ద్రవ్యోల్బణం ఆర్బీఐ లక్ష్య పరిధిలోనే (2–6 శాతం) ఉంటుందని విశ్వసిస్తున్నాం. ►మహమ్మారి సంబంధిత ఆంక్షలు ఎత్తివేసినందున, వినియోగ డిమాండ్ బలంగా పుంజుకుంటోంది. ముఖ్యంగా కాంటాక్ట్–ఇంటెన్సివ్ రం గాలలో ఈ పరిస్థితి నెలకొనడం హర్షణీయం. ప్రపంచ ఎగుమతుల్లో కోకింగ్ కోల్ కీలకమైనది. ఈ ఎగుమతుల్లో రష్యా, ఉక్రెయిన్ వాటా దాదాపు 11 శాతం. ఉక్కుకు సంబంధించి కీలకమైన ముడి పదార్థం ఇది. సరఫరా అంతరాయాలు ఈ ఇన్పుట్ ధర పెరగడానికి కారణమయ్యాయి, ఇది భారతీయ ఉక్కు తయారీ సంస్థలపై ప్రభావం చూపుతోంది.గ్లోబల్ బొగ్గు ధరలు వార్షిక ప్రాతిపదికన ఇప్పటివరకు 400 శాతానికి పైగా పెరిగాయి. విద్యుత్ ఉత్పత్తితో పాటు అనేక తయారీ పరిశ్రమలలో కీలకమైన ముడి పదార్థంగా ఉండటం వల్ల ఆయా రంగాల వ్యయ భారాలు భారీగా పెరిగవచ్చు. యుద్ధ ప్రభావాల నుంచి తప్పించుకోలేం... యుద్ధ పరిణామాల నుంచి భారత్ తప్పించుకోలేదని నరేంద్రన్ స్పష్టం చేశారు. ఆయన దీనిపై ఏమన్నారంటే, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రభావాల గురించి పరిశీలిస్తే, మనం నివసిస్తున్న, పెరుగుతున్న ప్రపంచీకరణ, పరస్పరం అనుసంధానిత ప్రపంచంలో, ఏ దేశమూ దాని రాజకీయ సరిహద్దుల వెలుపల ఉత్పన్నమయ్యే సంఘటనల నుండి పూర్తిగా రక్షించబడదు. ఈ నేపథ్యంలో రష్యా లేదా ఉక్రెయిన్‌తో భారత్ ఆర్థిక సంబంధాలు తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ యుద్ధం ప్రభావం భారత్‌పై తప్పనిసరిగా ఉం టుంది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు మార్చిలో బేరల్‌కు 128 డాలర్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. 100 డాలర్ల పైన కొనసాగుతున్నాయి. ఇది ద్రవ్యోల్బణాన్ని, పలు రంగాలలో ఇన్పుట్ వ్యయ భారాలను పెంచే విషయం. -
భారత్ ఎకానమీకి వెలుగు రేఖలు!
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక రంగానికి సంబంధించి కొంత ఆశావహమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. క్రితం క్షీణ రేటు అంచనాల తగ్గింపు వరుసలో తాజాగా మూడీస్ నిలిచింది. కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో 2020 ఏప్రిల్–2021 మార్చి మధ్య భారత్ ఆర్థిక వ్యవస్థ 11.5 శాతం క్షీణిస్తుందన్న తన తొలి అంచనాలను మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ గురువారం మైనస్ 10.6 శాతానికి తగ్గించింది. తయారీ రంగానికి, ఉపాధి కల్పనకు కేంద్ర ఉద్దీపన చర్యలు దోహదపడతాయని సూచించింది. అంతర్జాతీయ బ్రోకరేజ్ దిగ్గజం– గోల్డ్‌మన్ శాక్స్ తన క్రితం భారీ 14.8 శాతం క్షీణ అంచనాలను 10.3 శాతానికి సవరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా మూడీస్ క్షీణ రేటు కుదింపునకు తగిన విశ్లేషణలతో ముందుకు వచ్చింది. 2020లోసైతం క్షీణ రేటు అంచనాలను మూడీస్ ఇంతక్రితం మైనస్ 9.6 శాతం అంచనావేయగా, తాజాగా దీనిని మైనస్ 8.9 శాతానికి తగ్గించింది. కరోనా వైరస్ సంక్షోభంతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడం ధ్యేయంగా ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ (స్వావలంబన భారత్) 3.0 పేరుతో కేంద్రం నవంబర్ 12వ తేదీన 2.65 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ అమలు చేసినప్పట్నుంచీ ఇప్పటిదాకా ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీల మొత్తం పరిమాణం దాదాపు రూ. 30 లక్షల కోట్లుగా ఉంటుందని (స్థూల దేశీయోత్పత్తిలో 15 శాతం) ఈ ప్యాకేజ్ సందర్భంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. భారత తయారీ రంగంలో పోటీతత్వాన్ని పెంచడానికి, ఉపాధి కల్పనకు, మౌలిక రంగంలో పెట్టుబడులకు మద్దతునివ్వడానికి కేంద్రం తాజాగా ప్రకటించిన రూ.2.7 లక్షల కోట్ల ఉద్దీపన చర్యలు ‘‘క్రెడిట్ పాజిటివ్’’అని తెలిపింది. 2021–22లో భారత్ వృద్ధి సైతం 10.8 శాతంగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపింది. ఇంతక్రితం ఈ అంచనా 10.6 శాతం. ఏడాదిలోనే ఆర్థిక రికవరీ: ఇండియాలెండ్స్ సర్వే భరోసా వచ్చే 12 నెలల్లో ఆర్థిక రికవరీ నెలకొంటుందన్న విశ్వాసం ఒక జాతీయ సర్వేలో వ్యక్తం అయ్యింది. సర్వేలో 77 శాతం మంది ఏడాదిలోపే రికవరీ ఉంటుందన్న భరోసాతో ఉంటే, వీరిలో 27 శాతం మంది మూడు నెలల్లోపే రికవరీ ఉంటుందన్న నమ్మకంతో ఉన్నారు. డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫాం ఇండియాలెండ్స్ ఈ సర్వే నిర్వహించింది. నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడం లేదా సొంత వ్యాపారం ప్రారంభించే పనిలో చాలా మంది నిమగ్నమయ్యారని సర్వేలో తేలింది. ఈ సర్వేలో 18–55 ఏళ్ల వయసున్న వేతన జీవులు, స్వయం ఉపాధి పొందుతున్న 1,700 మంది పాల్గొన్నారు. వీరిలో 41 శాతం మంది 25–35 ఏళ్ల వయసున్న యువత ఉన్నారు. సెప్టెంబర్ త్రైమాసికంలో క్షీణత 9.5 శాతం: ఇక్రా జీడీపీ సెప్టెంబర్ త్రైమాసికంలో 9.5 శాతం క్షీణిస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనావేసింది. నవంబర్ 27న తాజా గణాంకాలు విడుదల కానున్న నేపథ్యంలో ఇక్రా ఈ అంచనాలను ఆవిష్కరించింది. ఉత్పత్తి వరకూ పరిగణనలోకి తీసుకునే జీవీఏ (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్) విషయంలో పరిశ్రమల క్షీణ రేటు అంచనాలను 38.1% నుంచి 9.3 శాతానికి తగ్గించింది. తయారీ, నిర్మాణ, సేవల రంగాలు తొలి అంచనాలకన్నా మెరుగుపడే అవకాశం ఉందని ఇక్రా ఈ సందర్భంగా పేర్కొంది. 2020–25 మధ్య వృద్ధి 4.5 శాతమే: ఆక్స్ఫర్డ్ ఎకానమీస్ భారత్ ఆర్థిక వ్యవస్థ 2020–25 మధ్య 4.5 శాతం వృద్ధి రేటునే సాధిస్తుందని ప్రపంచ గణాంకాల దిగ్గజ సంస్థ– ఆక్స్ఫర్డ్ ఎకానమీస్ గురువారం అంచనావేసింది. ఇంతక్రితం ఈ అంచనా 6.5 శాతం. కరోనా ప్రేరిత అంశాలే తమ అంచనాల సవరణకు కారణమని పేర్కొంది. ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు 2020–21 స్థూల దేశీయోత్పత్తిలో 7 శాతం ఉంటుందని సంస్థ విశ్లేషించింది. పలు సంస్థల అంచనాలు ఇలా... కరోనా కల్లోల పరిస్థితులతో మొదటి త్రైమాసికం భారత్ ఆర్థిక వ్యవస్థ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 23.9 శాతం క్షీణ రేటును నమోదుచేసుకున్న నేపథ్యంలో... ఇప్పటికే పలు ఆర్థిక, రేటింగ్ సంస్థలు 2020–21లో భారత్ ఆర్థిక వ్యవస్థ క్షీణ రేటు 8 శాతం నుంచి 11% వరకూ ఉంటుందని అంచనావేశాయి. ఆయా అంచనాలను పరిశీలిస్తే (శాతాల్లో) సంస్థ క్షీణత అంచనా కేర్ 8.2 యూబీఎస్ 8.6 ఎస్అండ్పీ 9 ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 9 ఆర్బీఐ 9.5 ప్రపంచబ్యాంక్ 9.6 ఫిచ్ 10.5 ఎస్బీఐ ఎకోర్యాప్ 10.9 ఇక్రా 11 ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ 11.8 ఐఎంఎఫ్ 10.3 -
ఆర్థిక మాంద్యాన్ని తగ్గించడమెలా?
భారతీయ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందన్నది దాదాపు అందరూ అంగీకరిస్తున్న విషయమే. కానీ మాంద్యంనుంచి బయటపడవేయడానికి కేంద్రం ఎంచుకుంటున్న ప్రాధాన్యతలు వినియోగంకోసం ఖర్చుపెట్టగల వారికి అనుకూలంగా ఉండాలి. అదే డిమాండును తనంతట తానుగా సృష్టిస్తుంది. భారతీయ అభివృద్ధి నమూనాను వ్యవసాయ రంగ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మార్చివేయడమే మాంద్యానికి ప్రధాన కారణం. రెండు విధానపరమైన ప్రకంపనలు అంటే పెద్దనోట్ల రద్దు, జీఎస్టీని ప్రవేశపెట్టడం అనేవి వినియోగదారుల నడ్డి మరింతగా విరిచాయని చెప్పాలి. ప్రభుత్వ ప్యాకేజీలన్నీ సరఫరా రంగంలో ఉద్దీపన చర్యలకు అత్యవసరమైనవే కానీ డిమాండ్ పడిపోయిన ఆర్థిక రంగంపై ఇవేమంత ప్రభావం చూపడం లేదు. అందుకే వినియోగంపై ఖర్చుపెట్టాలనే ఆకాంక్ష అధికంగా ఉండే సగటు ప్రజలకు కొనుగోలు శక్తిని ఎక్కువగా అందించడం అనేది ఆర్థిక వ్యవస్థ వృద్ధికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమవుతుంది. భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంతో ఉందని సాక్ష్యాధారాలతో తెలుస్తున్నప్పటికీ, ఈ వాస్తవాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అంగీకరించిన తర్వాత ఈ అంశం చర్చనీయాంశం కాకుండా పోయింది. భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా వృద్ది చెందుతున్నప్పటి రోజులతో పోలిస్తే 2019–20 రెండో త్రైమాసికంలో మన వృద్ధి రేటు 4.5 శాతానికి పడిపోయింది. అంటే గత 26 త్రైమాసికాల్లో ఇది అత్యంత తక్కువ శాతం అన్నమాట. వినియోగం, మదుపు, ఎగుమతులు అనే మూడు వృద్ధి చోదక శక్తులూ పూర్తిగా తిరోగమన బాటలో ఉంటున్నాయి. వీటిలో వినియోగం గత నాలుగు దశాబ్దాల్లోకెల్లా కనిష్ట స్థాయికి పడిపోయింది. అందులోనూ గ్రామీణ వినియోగం 8.8శాతానికి తగ్గిపోగా, పట్టణ వినియోగంలో పెరుగుదల లేకుండా పోయింది. రెండో త్రైమాసికంలో స్థూల పెట్టుబడులు 2018–19తో పోలిస్తే స్థిరధరల వద్ద ఒక్కటంటే ఒక్క శాతం వృద్ధిని మాత్రమే నమోదు చేశాయి. కాగా ఎగుమతులు మాత్రం ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి. ఈ సంఖ్యలు మన దృష్టిలో నాలుగు అంశాల సమ్మిళిత ప్రభావాన్ని ప్రతిబింబిస్తున్నాయి. అవేమిటంటే, విధానపరమైన ప్రకంపనలు, వ్యవసాయ సంక్షోభం, నిరుద్యోగిత పెరుగుదల– వేతనాల వాటాలో భారీ తగ్గుదల, ఆర్థికరంగ సంక్షోభం. వీటిలో మొదటి అంశాన్ని మినహాయిస్తే, మిగిలిన మూడు అంశాలూ గత కొన్ని దశాబ్దాలుగా ఆర్థిక వ్యవస్థను కుళ్లబొడుస్తున్న వ్యవస్థాగత అవరోధాలు మాత్రమే. పెట్టుబడుల తగ్గుముఖం రెండు విధానపరమైన ప్రకంపనలు అంటే పెద్దనోట్ల రద్దు, జీఎస్టీని ప్రవేశపెట్టడం అనే విధాన మార్పులను వెంటవెంటనే తీసుకువచ్చారు. పెద్దనోట్ల రద్దు ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు తీవ్రంగా ప్రభావితమై 15 లక్షల ఉద్యోగాలను కోల్పోయాయని ‘సెంటర్ ఫర్ మోనిటరింగ్ ది ఇండియన్ ఎకానమీ’ అంచనా వేసింది. పైగా పేలవంగా రూపొందించిన జీఎస్టీ వల్ల ఈ పరిశ్రమల వ్యథలు మరింత పెరిగాయి. దీంతో ఎక్కడ చూసినా అనిశ్చితి పేరుకుపోవడం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ప్రభుత్వ పాలసీల పరంగా కలిగిన షాక్ కారణంగా కలిగిన ఉద్యోగాల, వేతనాల నష్టాలు డిమాండును కుంగదీయడమే కాకుండా పెట్టుబడులు కూడా గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. భారతీయ అభివృద్ధి నమూనాను వ్యవసాయ రంగ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మార్చివేశారు. జనాభాలో అతిపెద్ద విభాగానికి ఆధారభూతంగా ఉంటున్నప్పటికీ స్థూల దేశీయ వస్తూత్పత్తిలో వ్యవసాయ రంగ వాటా గణనీయంగా పడిపోతోంది. దీనికి గానూ కనీస మద్దతు ధర (ఎమ్ఎస్పీ)ని పెంచడం ద్వారా, ఇతర ప్రధాన పంట లకు కూడా దాన్ని పొడిగించడం ద్వారా వ్యవసాయదారులను దుస్థితి నుంచి తొలగించి వారికి కాస్త ఉపశమనం కలిగించాలని, 2005లో నేషనల్ ఫార్మర్స్ కమిషన్ (ఎన్ఎఫ్సీ) నొక్కి చెప్పింది. యూపీఏ ప్రభుత్వం కనీస మద్దతు ధరను అర్థవంతంగా పెంచి ప్రారంభంలో కాస్త శ్రద్ధ చూపినప్పటికీ, జాతీయ రైతుల కమిషన్ చేసిన సిఫార్సులను ఇంతవరకు ఏ ప్రభుత్వమూ అమలు చేసింది లేదు. దీని ఫలితంగా 2010–2011 సంవత్సరం వరకు రైతులు, రైతులు కానివారి మధ్య పెరుగుతూ వచ్చిన వ్యాపార లావాదేవీలు ఆ తర్వాతి నుంచి పతనమవుతూ వచ్చాయి. అదేసమయంలో వ్యవసాయ కూలీల వేతనాలు 2007–08 నుంచి 2013–14 వరకు సగటున సంవత్సరానికి 17 శాతం దాకా పెరుగుతూ వచ్చాయి కానీ గత మూడేళ్లలో ఈ పెరుగుదల నిలిచిపోయింది. ఈ రెండు పరిణామాలూ గ్రామీణ డిమాండును స్తంభింపచేశాయి. వ్యవసాయరంగంలో ఉపాధి అవకాశాలు భారీగా పడిపోయాయని, వ్యవసాయేతర రంగాల్లో ఉపాధి వృద్ధి రేటు చాలా తగ్గిపోయిందని ది పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2017–18 నివేదించింది. మొత్తంమీద నిరుద్యోగిత రేటు 6.1 శాతంగా నమోదు కాగా, పట్టణ యువకుల్లో నిరుద్యోగిత రేటు 19 శాతంగానూ, పట్టణ యువతుల్లో నిరుద్యోగిత రేటు 27 శాతంగా నమోదైంది. నిరుద్యోగితకు సంబంధించిన ఈ గణాంకాలు గడిచిన 45 ఏళ్లలో అత్యధికం. ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే నికర నిరుద్యోగిత పతనం 2017–18లో 471.3 మిలియన్లుగా నమోదైంది. అంటే దేశ జనాభాలో 47 కోట్లమందికి ఉపాధి అవకాశాలు సరిగా లేవు. స్వాతంత్య్రానంతరం ఉపాధి అవకాశాలు ఇంతగా పతనం కావడం ఇదే మొదటిసారి. పతనబాటలో దేశీయ–విదేశీయ డిమాండ్ పట్టణ రంగానికి సంబంధించి, ఆర్బీఐ సమర్పించిన కేఎల్ఎమ్ఈఎస్ డేటాబేస్ ప్రకారం 2011 నుంచి 2017 వరకు వస్తూత్పత్తి రంగంలో ఉపాధి పెరుగుదల 1.4 శాతం పడిపోగా, సేవల రంగంలో 2 శాతం మేరకు పడిపోయింది. 2004 నుంచి 2010 మధ్యకాలంలో ఇది 2.5 నుంచి 2.8 శాతం మేరకు పతనమైనట్లు తెలుస్తోంది. ఇదే కాలానికి వస్తూత్పత్తి రంగంలో కార్మిక వేతనాలు 8.1 శాతం నుంచి 5.4 శాతానికి పడిపోగా సర్వీసు రంగంలో 7.2 నుంచి 6.1 శాతానికి పడిపోయినట్లు ఆర్బీఐ డేటా చెబుతోంది. అందుచేత, గ్రామీణ ఆదాయం, పట్టణ కార్మికుల వేతనాలు పడిపోవడానికి తోడుగా ఆదాయ పంపిణీ కూడా తగ్గుముఖం పట్టడంతో దేశీయ డిమాం డులో తీవ్ర వ్యత్యాసం చోటు చేసుకుంది. ఇక ఎగుమతుల వృద్ధి తిరోగమనంతో విదేశీ డిమాండ్ దెబ్బతింది. గత కొన్ని సంవత్సరాలుగా బ్యాంకింగ్ రంగంలో మూలధనాన్ని పెంచుతున్నప్పటికీ (2018–19లో రూ. రూ.1.06 లక్షల కోట్లు కాగా 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ. 70,000 కోట్లు) నిరర్థక ఆస్తులు పెరుగుతూ పోతున్నాయి. 2019 మార్చి 31 నాటికి వీటి మొత్తం రూ.8.6 లక్షల కోట్లకు చేరుకుంది. చివరకు బ్యాంకింగేతర ఫైనాన్షియల్ రంగం కూడా సంక్షోభంలో పడుతోంది. ఉదాహరణకు, 2019 ఆర్థిక సంవత్సరానికి గానూ లీజింగ్, ఆర్థిక సేవలకు సంబంధించి రూ. 16,935 కోట్ల విలువకు ప్రతికూల వృద్ధి నమోదైనట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్–ఫైనాన్షియల్ సర్వీసెస్ నివేదించింది. ఇది వాణిజ్య రుణాలను తీసుకోవడంపై గణనీయంగా ప్రభావం చూపుతోంది. మొత్తంమీద డిమాండు కుదించుకుపోవడం, మదుపుదారుల్లో నిరాశతో కూడిన ఆర్థిక రంగ సంక్షోభం మొత్తం పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం కలిగిస్తోంది. ప్యాకేజీలు సరే.. వినియోగం పెంపుదల మాటేది? ఆర్థిక సంక్షోభ నివారణకు, కేంద్రప్రభుత్వం కార్పొరేట్ పన్ను తగ్గింపు, రియల్ ఎస్టేట్, ఆటో మొబైల్స్, ఎగుమతి రంగాలను పునరుద్ధరించే దిశగా పలు ప్యాకేజీలను ప్రకటించింది. కానీ విచారకరమైన విషయం ఏమిటంటే ప్రభుత్వ ప్యాకేజీలన్నీ సరఫరా రంగంలో ఉద్దీపన చర్యలకు అత్యవసరమైనవే కానీ డిమాండ్ పడిపోయిన ఆర్థిక రంగంపై ఇవేమంత ప్రభావం చూపడం లేదు. అందుకే వినియోగంపై ఖర్చుపెట్టాలనే అభిలాష, ఆకాంక్ష ఎక్కువగా ఉండే సగటు ప్రజలకు కొనుగోలు శక్తిని ఎక్కువగా అందించడం అనేది ఆర్థిక వ్యవస్థ వృద్ధికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమవుతుంది. అయితే అధికంగా వినియోగంపై ఖర్చుపెట్టే వారికి కొనుగోలు శక్తిని పెంచడానికి ఏ ప్రభుత్వమైనా అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. జాతీయ గ్రామీణ ఉపాధి పథకం వంటి పథకాలపై అధికంగా ఖర్చుపెట్టడం ద్వారా, విద్య, ఆరోగ్య సేవలు, గ్రామీణ మౌలిక వసతుల కల్పనా రంగాల్లో మదుపు చేయడం ద్వారా ఈ లక్ష్యాన్ని సులువుగా సాధించవచ్చు. దీనిపై వేగంగా చర్యలు తీసుకోవడం వల్ల డిమాండ్ పెరిగి బలమైన మదుపుదారులను ఆకర్షించవచ్చు. ఉపాధి పథకాలే మూలమలుపు సామాజిక అకౌంటింగ్ చట్రాన్ని ఉపయోగించి జాతీయ ఉపాధి పథకం, మరో రెండు సామాజిక భద్రతా పథకాల ప్రభావం ప్రభావాన్ని అంచనా వేసినప్పుడు, ఇలాంటి పథకాల పరోక్ష ప్రభావం గణనీయంగా ఉందని తెలిసింది. జాతీయ ఉపాధి పథకం వంటి పథకంపై ప్రత్యక్ష వ్యయం కారణంగా గ్రామీణ రైతుల పరోక్ష ఆదాయం 1.8 రెట్లు పెరిగింది. పెన్షన్ లేక బేసిక్ ఇన్కమ్ టైప్ పథకంలో పెట్టిన ప్రత్యక్ష వ్యయం రెండు రెట్లు పెరిగింది. పైన పేర్కొన్న పథకాలకు తగినన్ని వనరులను కల్పించడానికి గానూ ప్రభుత్వం పన్ను రూపంలోని, పన్నేతర రూపంలోని ఎరియర్స్‌ను విడుదల చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇవి 2017–18 చివరినాటికి వరుసగా రూ. 9 లక్షల కోట్లు, 2 లక్షల కోట్లుగా పేరుకుపోయిన విషయం తెలిసిందే. అలాగే భారీ స్థాయిలో అందుబాటులో ఉన్న రక్షణ, రైల్వే మిగులు భూములను కూడా ప్రభుత్వం ఉపాధి పథకాలకు ఉపయోగించాల్సి ఉంది. ప్రొ‘‘ అతుల్ శర్మ, ప్రొ‘‘ బిశ్వజిత్ ధార్ (ది వైర్ సౌజన్యంతో) -
జీడీపీ.. పల్టీ
భారత్ ఆర్థిక వ్యవస్థకు గణాంకాల షాక్ తగిలింది. మూడు కీలక అంశాలకు సంబంధించి... శుక్రవారం ఆందోళన కలిగించే గణాంకాలు వెల్లడయ్యాయి. రెండవ త్రైమాసికం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్ట స్థాయి 4.5 శాతానికి పడిపోయింది. ఇక ప్రభుత్వ ఆదాయాలు– వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు... అక్టోబర్ ముగిసే నాటికే బడ్జెట్ అంచనాలు దాటిపోయింది. మరోవైపు మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో (ఐఐపీ) దాదాపు 44 శాతం వాటా ఉన్న 8 పారిశ్రామిక రంగాల గ్రూప్ అక్టోబర్‌లో అసలు వృద్ధి నమోదుచేసుకోకపోగా, –5.8 శాతం క్షీణతలోకి జారింది. న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వృద్ధి తీవ్ర మందగమనంలోకి జారినట్లు తాజా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి గణాంకాలు మరింత స్పష్టం చేశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019 ఏప్రిల్– 2020 మార్చి) రెండవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) కేవలం 4.5 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది. గడచిన ఆరు సంవత్సరాల్లో వృద్ధి వేగం ఇంత తక్కువ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. 2012–13 జనవరి–మార్చి త్రైమాసికంలో 4.3 శాతం వృద్ధి నమోదయ్యింది. 2018–19 రెండవ త్రైమాసికంలో వృద్ధి రేటు 7 శాతం నమోదయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ మధ్య ఈ రేటు 5 శాతం. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎస్ఎస్ఓ) విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... - ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్–సెప్టెంబర్) వృద్ధి రేటు 4.8%గా నమోదయ్యింది. 2018–19 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వృద్ధి రేటు 7.5%. - ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తంగా జీడీపీ వృద్ధి రేటు 6.1% ఉంటుందన్నది రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) అంచనా. తాజా గణాంకాలు చూస్తే, ఆ స్థాయి వృద్ధి రేటయినా సాధ్యమేనా అన్న సందేహం కలుగుతోంది. - క్యూ2లో వృద్ధిరేటు కనీసం 4.7 శాతమే ఉంటుందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ ఫిచ్ దేశీయ విభాగం ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ఇటీవలే విశ్లేషించింది. అంతకన్నా తక్కువ రేటు నమోదుకావడం గమనార్హం. - 2018–19 మొదటి త్రైమాసికంలో 8 శాతం వృద్ధి రేటు నుంచీ చూస్తే, వరుసగా ఆరు త్రైమాసికాల నుంచీ భారత్ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో కొనసాగుతోంది. అంటే ఎప్పటికప్పుడు తగ్గుతూ వస్తోంది. 2012 తరువాత ఇలాంటి పరిస్థితి ఇదే మొదటిసారి. - ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న దేశం హోదాను గత ఆర్థిక సంవత్సరం (5 శాతం) వరకూ భారత్ పొందుతోంది. అయితే ప్రస్తుత జూలై–సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి 7.3 శాతం వృద్ధి రేటుతో వియత్నాం మొదటిస్థానంలో ఉంది. చైనా వృద్ధి రేటు 6 శాతంగా (27 సంవత్సరాల కనిష్టం) ఉంది. తరువాత వరుసలో ఈజిఫ్ట్ (5.6 శాతం), ఇండోనేషియా (5 శాతం)లు ఉన్నాయి. దీనితో క్యూ2కు సంబంధించి ‘వేగవంతమైన వృద్ధి’ హోదాను వియత్నాం దక్కించుకున్నట్లు అయ్యింది. కాగా అమెరికా వృద్ధి రేటు ఈ కాలంలో 2.1 శాతం. రంగాల వారీగా చూస్తే... - జీడీపీలో దాదాపు 16 శాతం వెయిటేజ్ ఉన్న తయారీ రంగంలో అసలు వృద్ధిలేకపోగా క్యూ2లో ఒకశాతం క్షీణతను (మైనస్) నమోదుచేసుకుంది. 2018 ఇదే కాలంలో ఈ రంగంలో 6.9 శాతం వృద్ధిని సాధించింది. 2019–20 క్యూ1లో కనీసం 0.6 శాతం వృద్ధి నమోదయ్యింది. - వ్యవసాయ రంగంలో 4.9% వృద్ధి రేటు 2.1%కి పడిపోయింది. అయితే క్యూ1కన్నా (2%) కొంచెం మెరుగుపడ్డం గమనార్హం. - ఇక నిర్మాణ రంగం విషయానికి వస్తే, వృద్ధి రేటు 8.5% నుంచి 3.3%కి పడిపోయింది. - మైనింగ్ అండ్ క్వారీయింగ్ కొంత బాగుంది. 2018–19 క్యూ2లో వృద్ధిలేకపోగా –2.2 శాతం క్షీణత నమోదయితే, తాజా గణాంకాల్లో కొద్దిపాటి మెరుగుదలతో 0.1 శాతం వృద్ధిలోకి మళ్లింది. అయితే క్యూ1 కన్నా (2.7 శాతం) వృద్ధి భారీగా పడిపోవడం గమనార్హం. - విద్యుత్, గ్యాస్, నీటి పారుదల ఇతర యుటిలిటీ సర్వీసుల విషయంలో వృద్ధి రేటు 8.7% నుంచి 3.6%కి పడిపోయింది. క్యూ1లో ఈ వృద్ధి మరింత మెరుగైన స్థితిలో 8.6%గా ఉంది. - వాణిజ్యం, హోటెల్స్, రవాణా, కమ్యూనికేషన్లు, సేవల రంగంలో వృద్ధి రేటు 6.9 శాతం నుంచి 4.8 శాతానికి పడిపోయింది. - ఫైనాన్షియల్, రియల్టీ, బీమా ప్రొఫెషనల్ సర్వీసెస్ విషయంలో వృద్ధి రేటు 7 శాతం నుంచి 5.8 శాతానికి తగ్గింది. ఆందోళనకరం... జీడీపీ వృద్ధి రేటు 4.5%గా నమోదుకావడం ఆందోళనకరం. ఆమోదనీయంకాని అంశం. వృద్ధిరేటు 8 నుంచి 9 శాతం మేర వృద్ధి చెందాలని భారత్ ఆకాంక్షిస్తోంది. కేవలం ఆర్థిక విధానాల్లో మార్పు వల్ల ఆర్థిక పునరుత్తేజం జరగదు. ముందు వ్యవస్థను భయాందోళనల నుంచి విశ్వాసం వైపునకు నడిపించాలి. అలాంటప్పుడే అధిక వృద్ధి రేటు బాటకు మళ్లుతాం. ఇప్పుడు జరగాల్సింది ఇదే. – మన్మోహన్ సింగ్, మాజీ ప్రధాని ఆర్థిక మూలాలు పటిష్టం... భారత్ ఆర్థిక మూలాలు పటిష్టంగానే ఉన్నాయి. 2019–20 మూడవ త్రైమాసికం నుంచీ వృద్ధి పుంజుకుంటుంది. వృద్ధి రేటు 2019–20లో 6.1 శాతం, 2020–21లో 7 శాతం ఉంటుందని తన అక్టోబర్ వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్‌లో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) పేర్కొనడం ఇక్కడ గమనార్హం. – అతనూ చక్రవర్తి, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి పతనానికి ఇక అడ్డుకట్టే ప్రస్తుత గణాంకాలు కొంత నిరాశపరుస్తున్నప్పటికీ, ఆర్థిక వ్యవస్థ మందగమనానికి ఇక ముగింపు పడినట్లేనని భావిస్తున్నాం. ప్రైవేటు వినియోగం పెరుగుతోంది. ప్రభుత్వం తీసుకుంటున్న పలు ప్రగతిశీల చర్యలు ఫలితాలను ఇస్తాయని విశ్వసించవచ్చు. రానున్న త్రైమాసికాల్లో గణాంకాలు వృద్ధి బాటలో ఉండే వీలుంది. – పారిశ్రామికవర్గాలు కట్టుతప్పిన ద్రవ్యలోటు... ద్రవ్యలోటు విషయానికొస్తే, 2019–20 ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఈ పరిమాణం రూ.7.03 లక్షల కోట్లుగా ఉండాలన్నది (జీడీపీలో 3.3 శాతం) బడ్జెట్ లక్ష్యం. కానీ అక్టోబర్ ముగిసే నాటికే ఈ మొత్తం రూ.7,20,445 కోట్లకు చేరింది. అంటే బడ్జెట్ అంచనాల్లో 102.4 శాతానికి చేరిందన్నమాట. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ శుక్రవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. సెప్టెంబర్‌లో కేంద్రం కార్పొరేట్ పన్నులను తగ్గించడంతో మొత్తం వసూళ్ల అంచనాలపై రూ.1.45 లక్షల కోట్లమేర ప్రతికూల ప్రభావం పడుతుందనేది అంచనా. మౌలిక రంగం నేలచూపు... పారిశ్రామిక ఉత్పత్తి(ఐఐపీ)లో దాదాపు 44 శాతం వాటా ఉన్న ఎనిమిది కీలక మౌలిక పారిశ్రామిక రంగాల గ్రూప్ అక్టోబర్‌లో అసలు వృద్ధి నమోదుచేసుకోకపోగా –5.8 శాతం క్షీణతకు పడింది. ఎనిమిది రంగాల్లో ఎరువులు, రిఫైనరీ ప్రొడక్టుల మినహా మిగిలిన ఆరు మైనస్‌లోనే ఉండడం గమనార్హం. 2018 ఇదే నెలలో ఈ గ్రూప్ వృద్ధి రేటు 4.8 శాతం. ఈ ఏడాది సెప్టెంబర్‌లోనూ ఈ గ్రూప్ క్షీణతనే (–5.1 శాతం) నమోదు చేసుకుంది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య ఈ గ్రూప్ వృద్ధి రేటు 5.4 శాతం నుంచి 0.2 శాతానికి పడిపోయింది. -
వృద్ధి మళ్ళీ 5 % లోపే.......
న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు గడచిన ఆర్థిక సంవత్సరం (2013-14)లోనూ నిరాశనే మిగిల్చింది. 2012-13కన్నా కాస్త బాగున్నప్పటికీ, 5 శాతం దిగువనే కొనసాగింది. 4.7 శాతంగా నమోదయ్యింది. సీఎస్ఓ తొలి అంచనాలు 4.9 శాతం కన్నా ఇది తక్కువ. మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో వృద్ధి రేటు 4.6 శాతంగా ఉంది. కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్ఓ) శుక్రవారం తాజా ఫలితాలను విడుదల చేసింది. 2012-13లో వృద్ధి రేటు దశాబ్దపు కనిష్ట స్థాయి 4.5%. అంటే వరుసగా రెండేళ్లు జీడీపీ వృద్ధి రేటు 5 శాతం దిగువన ఉంది. ఇలాంటి పరిస్థితి చోటుచేసుకోవడం 25 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 2013-14 నాలుగు త్రైమాసికాల్లో వృద్ధి రేట్లు వరుసగా... 4.7%, 5.2%, 4.6%, 4.6%గా నమోదయ్యాయి. 2012-13లో ఈ రేట్లు వరుసగా 4.5 శాతం, 4.6 శాతం, 4.4 శాతం, 4.4 శాతంగా ఉన్నాయి. రంగాల వారీగా... తయారీ: గడచిన ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో అసలు వృద్ధి నమోదుచేసుకోలేదు. ఈ రంగం రేటు క్షీణతలో 1.4 శాతంగా నమోదయ్యింది. 2012-13లో ఈ రంగం వృద్ధి రేటు 3 శాతం. ఇక మొత్తం ఆర్థిక సంవత్సరాన్ని చూసుకుంటే కూడా ఈ రంగం 1.1% వృద్ధి నుంచి క్షీణతలో మైనస్ (-) 0.7 శాతంగా నమోదయ్యింది. మొత్తం జీడీపీలో తయారీ రంగం వాటా దాదాపు 14%. మైనింగ్, క్వారీయింగ్: మార్చి క్వార్టర్లో క్షీణతలోనే కొనసాగింది. అయితే ఈ క్షీణత మైనస్ 4.8 శాతం నుంచి మైనస్ 0.4 శాతానికి తగ్గింది. ఆర్థిక సంవత్సరం మొత్తంమీద కూడా ఈ రంగం క్షీణత 2.2 శాతం నుంచి 1.4 శాతానికి పరిమితమయ్యింది. వ్యవసాయం: వృద్ధి రేటు నాల్గవ త్రైమాసికంలో భారీగా 1.6 శాతం నుంచి 6.3 శాతానికి చేరింది. ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 1.4 శాతం నుంచి 4.7 శాతానికి చేరింది. జీడీపీలో ఈ రంగం వాటా దాదాపు 13 శాతం. నిర్మాణం: జనవరి-మార్చి తైమాసికంలో ఈ రంగంలో వృద్ధి రేటు 2.4 శాతం నుంచి 0.7 శాతానికి పడిపోయింది. ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 1.1 శాతం నుంచి 1.6 శాతానికి ఎగసింది. వాణిజ్యం, హోటెల్స్, రవాణా, కమ్యూనికేషన్లు: ఈ విభాగం వృద్ధి క్యూ4లో 4.8 శాతం నుంచి 3.9 శాతానికి మందగించింది. ఆర్థిక సంవత్సరంలో కూడా 5.1 శాతం 3 శాతానికి జారింది. సేవలు (ఫైనాన్షింగ్, బీమా, రియల్టీ): క్యూ4లో వృద్ధి రేటు 11.2 శాతం నుంచి 12.4 శాతానికి చేరింది. ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 10.9 శాతం నుంచి 12.9 శాతానికి ఎగసింది. మొత్తం జీడీపీలో ఈ రంగం వాటా దాదాపు 55 శాతం. కమ్యూనిటీ, సామాజిక, వ్యక్తిగత సేవలు: క్యూ4లో ఈ రంగం వాటా 2.8 శాతం నుంచి 3.3 శాతానికి చేరింది. ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 5.3 శాతం నుంచి 5.6 శాతానికి చేరింది. విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా: మార్చి క్వార్టర్లో వృద్ధి రేటు భారీగా 0.9% నుంచి 7.2 శాతానికి చేరింది. ఆర్థిక సంవత్సరం మొత్తంలో కూడా ఈ రేటు 2.3% నుంచి 5.9 శాతానికి ఎగసింది. తలసరి ఆదాయం ఇలా... జాతీయ నికర తలసరి ఆదాయం (2004-05 ధరలను ప్రాతిపదికగా తీసుకుని) గడచిన రెండు ఆర్థిక సంవత్సరాల కాలంలో రూ.38,856 నుంచి రూ. 39,904 కు పెరిగింది. అంటే 2.7 శాతం వృద్ధి నమోదయ్యిందన్నమాట. 2012-13లో ఈ వృద్ధి రేటు 2.1 శాతమే. ప్రస్తుత ధరల ప్రాతిపదికగా తీసుకుంటే జాతీయ తలసరి ఆదాయం రూ.67,839 నుంచి రూ.74,380 కి చేరింది. -
భారత పునాదులు పటిష్టం
న్యూయార్క్: భారత ఆర్థిక వ్యవస్థ పునాదులు పటిష్టంగా ఉన్నాయని, వృద్ధిరేటు కూడా మెరుగుపడుతుందని ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో జీడీపీ వృద్ధి మెరుగుపడుతుందంటూ... 8-9 శాతం ఆర్థిక వృద్ధి సాధించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టంచేశారు. శనివారమిక్కడ అమెరికా కంపెనీల సీఈఓల ఫోరమ్‌ను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది ద్రవ్యలోటును 4.8 శాతానికే కట్టడి చేస్తామని, కరంట్ అకౌంట్ లోటు(క్యాడ్)ను జీడీపీలో 2.5 శాతానికి తగ్గించగలమని ధీమా వ్యక్తం చేశారు. ఆందోళన అనవసరం దేశ మౌలిక, రక్షణ రంగాల్లో దీర్ఘకాలిక అవకాశాలు అపారంగా ఉన్నాయంటూ... పెట్టుబడులకు ఇది మంచి తరుణమని ప్రధాని చెప్పారు. భారత వృద్ధి అవకాశాలు, ఆర్థిక సంస్కరణలపై అపోహలు అవసరం లేదంటూ... పెట్టుబడులతో రావాలని అమెరికా కంపెనీలను ఆహ్వానించారు. ‘‘ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో వృద్ధి పుంజుకుంటుందనే నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఇటీవల కొన్ని చర్యలు తీసుకుంది. దీనికితోడు వర్షాలు బాగా పడుతున్నాయి. అందుకే ఆర్థిక వృద్ధిపై ఆందోళన చెందాల్సిన పనిలేదు’’ అని అభయమిచ్చారాయన. వృద్ధి కొనసాగించడానికి పలు సంస్కరణలు తెచ్చాం. రిటైల్, టెలికాం రంగాలతో పాటు వివిధ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) పరిమితిని పెంచాం. పెట్టుబడులకు అనుకూలంగా ఉండేలా, పారదర్శకంగా వ్యవహరిస్తున్నాం’’ అని తెలియజేశారు. తమ చర్యల ఫలితాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో ప్రతిఫలిస్తాయని చెప్పారాయన. గతేడాది కన్నా ఈ ఆర్థిక సంవత్సరంలోనే అధిక వృద్ధి సాధిస్తామని చెప్పారు.