Arvind Panagariya Cautions Against Cutting Trade Ties With China - Sakshi
Sakshi News home page

చైనాతో వాణిజ్య బంధం తెంచుకోవాలనడం సరికాదు

Published Fri, Dec 23 2022 4:18 AM | Last Updated on Fri, Dec 23 2022 10:30 AM

Arvind Panagariya cautions against cutting trade ties with China - Sakshi

న్యూఢిల్లీ: సరిహద్దులో అతిక్రమనలకు ప్రతీకారంగా  చైనాతో భారత్‌ వాణిజ్య సంబంధాలు తెగతెంపులు చేసుకోవలన్న డిమాండ్‌ సరికాదని నీతి ఆయోగ్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ పనగారియా స్పష్టం చేశారు. అలాచేయడం వల్ల భారత్‌ ఆర్థిక వృద్ధి వేగమూ మందగిస్తుందని హెచ్చరించారు. అందుకు బదులుగా ముందు భారతదేశం తన వాణిజ్యాన్ని విస్తరించడానికి బ్రిటన్, యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) వంటి దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ)కుదుర్చుకోవడానికి ప్రయత్నించాలని కొలంబియా విశ్వవిద్యాలయంలో ఎకనమిక్స్‌  ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన  సూచించారు.

‘‘ రెండు దేశాలు వాణిజ్య ఆంక్షలు విధించుకోవచ్చు. అయితే 17 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ (చైనా)కు మూడు ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ (భారతదేశం)ని దెబ్బతీసే సామర్థ్యమే అధికంగా ఉంటుంది’’ అని ఆయన విశ్లేషించారు. ‘‘మనం చైనాను శిక్షించాలని ప్రయత్నిస్తే, అది వెనక్కి తగ్గదు. అమెరికా ఆంక్షల విషయంలో చైనా ఎలా ప్రతిస్పందించిందన్న విషయాన్ని, ఇందుకు సంబంధించి అమెరికాలో పరిణామాలను మనం ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి’’ అని ఆయన అన్నారు. ఆంక్షల విధింపు వల్ల లాభంకన్నా నష్టాలే ఎక్కువనే అన్నారు. రష్యాపై ఆంక్షల విధింపు ద్వారా అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌లు ఎలాంటి ప్రతికూల పర్యవసానాలను ఎదుర్కొంటున్నాయో కూడా మనం గమనించాలని అన్నారు.  

చౌక కాబట్టే కొంటున్నాం...
భారతదేశం దిగుమతి చేసుకునే అనేక ఉత్పత్తులకు చైనా చౌకైన సరఫరాదారు కాబట్టే భారత్‌ బీజింగ్‌ నుండి కొనుగోలు చేస్తోందని  పనగారియా చెప్పారు. భారతదేశం ఎగుమతి చేయాలనుకుంటున్న వస్తువులకు చైనా మంచి ధరను అందించబోదని అన్నారు. ఇక్కడే మనం అమెరికా వంటి వాణిజ్య భాగస్వాములకు  మన వస్తువులను భారీగా అమ్మడంపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.  దీని ఫలితంగా చైనాతో వాణిజ్య లోటు– అమెరికాతో వాణిజ్య మిగులుతో భర్తీ అవుతుందని అన్నారు. వెరసి చైనాతో వాణిజ్యలోటు తీవ్రత వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదన్నారు.  

ఏటేటా భారీ వాణిజ్యలోటు
భారత్‌– చైనాల మధ్య వాణిజ్య లోటు (ఎగుమతులు–దిగుమతుల మధ్య వ్యత్యాసం) ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–అక్టోబర్‌ మధ్య కాలంలో  51.5 బిలియన్ల డాలర్లకు చేరుకుంది. 2021–22లో ఈ లోటు 73.31 బిలియన్‌ డాలర్లు. 2020–21లో 44.03 బిలియన్లతో పోల్చితే వాణిజ్యలోటు భారీగా పెరగడం గమనార్హం. తాజా ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌–అక్టోబర్‌ మధ్య చైనా దిగుమతులు 60.27 బిలియన్‌ డాలర్లు. ఎగుమతులు 8.77 బిలియన్‌ డాలర్లు.  

క్యాడ్‌పై ఇప్పటికి ఓకే...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) భారత్‌ కరెంట్‌ ఖాతా లోటు (క్యాడ్‌) 2 నుండి 3 శాతం (జీడీపీ విలువతో పోల్చి) మధ్య ఉండవచ్చని అన్నారు.  ఇది   భారత్‌ తట్టుకునే పరిమితిలో ఉందని పేర్కొన్నారు. ఈ స్థాయి క్యాడ్‌తో స్థూల ఆర్థిక స్థిరత్వానికి ఎటువంటి ముప్పు ఉండబోదని స్పష్టం చేశారు. 2020–21లో భారతదేశం జీడీపీలో 0.9 శాతం కరెంట్‌–ఖాతా మిగులు నమోదయ్యింది. 2021–22లో 1.2 శాతం కరెంట్‌–ఖాతా లోటు ఏర్పడింది.  ఒక నిర్దిష్ట కాలంలో ఒక దేశంలోకి వచ్చీ–దేశంలో నుంచి బయటకు వెళ్లే విదేశీ మారకద్రవ్య విలువ మధ్య నికర వ్యత్యాసాన్ని ‘కరెంట్‌ అకౌంట్‌’ ప్రతిబింబిస్తుంది. దేశానికి సంబంధిత సమీక్షా కాలంలో విదేశీ నిధుల నిల్వలు అధికంగా వస్తే, దానికి కరెంట్‌ అకౌంట్‌ ‘మిగులు’గా, లేదా దేశం చెల్లించాల్సిన మొత్తం అధికంగా ఉంటే ఈ పరిస్థితిని కరెంట్‌ అకౌంట్‌ ‘లోటుగా’ పరిగణిస్తారు. దీనిని సంబంధిత సమీక్షా కాలం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువతో పోల్చి శాతాల్లో పేర్కొంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement