నీతి ఆయోగ్‌కు పనగడియా బై.. బై!!
న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పదవి నుంచి వైదొలగనున్నట్లు అరవింద్ పనగడియా ప్రకటించారు. ఆగస్ట్ 31న బాధ్యతల నుంచి తప్పుకొని తిరిగి కొలంబియా యూనివర్సిటీకి వెళ్లనున్నట్లు తెలిపారు. ఇండో–అమెరికన్ అయిన అరవింద్ పనగడియా 2015 జనవరిలో నీతి ఆయోగ్ తొలి వైస్ చైర్మన్‌గా నియమితులయ్యారు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తర్వాత భారత్‌లో ఒక ఉన్నత స్థాయి పదవిని వదులుకొని మళ్లీ టీచింగ్ ప్రొఫెషన్‌కు వెళుతున్న ఆర్థిక వేత్త పనగడియానే.
కొలంబియా యూనివర్సిటీలో ఇండియన్ పొలిటికల్ ఎకానమీ ప్రొఫెసర్ అయిన ఈయనకు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా నిర్ణీత పదవీ కాలం అంటూ ఏమీ లేదు. ‘యూనివర్సిటీ వారు నాకు పొడిగింపు ఇవ్వలేదు. అందుకే ఆగస్ట్ 31న నీతి ఆయోగ్‌ను వదిలి వెళ్తున్నా. ఈ విషయాన్ని రెండు నెలల ముందే ప్రధాని మోదీకి తెలియజేశాను’ అని పనగడియా తెలిపారు.