
న్యూఢిల్లీ: నీతీ ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియాను 16వ ఆర్థిక సంఘం నూతన చైర్మన్‌గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థికశాఖలో సంయుక్త కార్యదర్శిగా ఉన్న రితి్వక్ రంజనం పాండేను ఆర్థికసంఘం కార్యదర్శిగా నియమించారు. పనగరియా గతంలో కొలంబియా విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా సేవలందించారు.
నూతన ఆర్థిక సంఘం 2026–27 నుంచి 2030–31 కాలానికి సంబంధించిన ఐదేళ్ల నివేదికను 2025 అక్టోబర్ 31వ తేదీకల్లా రాష్ట్రపతికి నివేదించనుంది. 16వ ఆర్థిక సంఘం ఏర్పాటు, విధి విధానాలు, కార్యచరణను నవంబర్ నెలలో ప్రధాని మోదీ నేతృత్వంలోని మంత్రిమండలి ఆమోదించింది. కేంద్ర, రాష్ట్రాల మధ్య పన్నుల పంపకం, రెవిన్యూ వాటా తదితరాలపై ఆర్థిక సంఘం సూచనలు, సలహాలు ఇవ్వనుంది.
విపత్తు నిర్వహణ చట్టం,2005 కింద మంజూరైన నిధులు కేంద్ర, రాష్ట్రాల్లో ఏ మేరకు సది్వనియోగం అవుతున్నాయనే అంశాలపై సంఘం సమీక్ష చేపట్టనుంది. 14వ ఆర్థిక సంఘం సలహా మాదిరే 2021–22 నుంచి 2025–26 ఐదేళ్లకాలానికి కేంద్రం పన్ను రాబడుల్లో 41 శాతం వాటా రాష్ట్రాలకు దక్కాలని ఎన్‌కే సింగ్ నేతృత్వంలోని 15వ ఆర్థిక సంఘం సిఫార్సుచేయడం తెల్సిందే. ఫైనాన్స్ కమిషన్ కేంద్ర,రాష్ట్ర ఆర్థిక సంబంధాలపై సూచనలు ఇచ్చే రాజ్యాంగబద్ధ సంస్థ.