సాక్షి, హైదరాబాద్: డిగ్రీ, ఇంజనీరింగ్ వంటివి పూర్తికాగానే ఏదో ఓ ఉద్యోగం కోసం వెతుకులాట తప్పదు. కొందరు పైచదువులకు వెళ్లినా చాలా మంది ఉద్యోగం కోసం చూస్తుంటారు. కానీ ఉద్యోగాలు దొరకని పరిస్థితి. దేశంలో పాతికేళ్ల వయసులోపు పట్టభద్రుల్లో 42శాతం మంది ఇలా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారే.
25 ఏళ్లు దాటినవారిలోనూ 15శాతం మంది నిరుద్యోగులే. కోవిడ్ నాటి పరిస్థితులు దాదాపు చక్కబడినా, భారత్ ఆర్థిక వృద్ధి వేగవంతమైందన్న అంచనాలున్నా.. కొత్తగా ఉద్యోగాల్లో చేరే గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగిత శాతం ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని నిపుణులు అంటున్నారు. అదే 35ఏళ్లు పైబడిన గ్రాడ్యుయేట్లలో 5 శాతమే నిరుద్యోగం ఉందని అంటున్నారు.
‘‘స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2023: సోషల్ ఐడెంటీస్ అండ్ లేబర్ మార్కెట్ ఔట్ కమ్స్’’పేరిట అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ‘జాతీయ గణాంక సంస్థ, జాతీయ ఆర్థిక, కుటుంబ ఆరోగ్య సర్వేలు, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా, ఎంప్లాయ్‌మెంట్–అన్ ఎంప్లాయ్‌మెంట్ తదితర నివేదికల ఆధారంగా ఈ అధ్యయనం చేసినట్టు వర్సిటీ వర్గాలు తెలిపాయి.
ప్రేమ్‌జీ వర్సిటీ నివేదికలో ఏముందంటే..
♦ అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ అధ్యయన నివేదికలో పలు కీలక అంశాలు వెల్లడయ్యాయి. నివేదిక ప్రకారం.. దీర్ఘకాలికంగా చూస్తే భారత్‌లో జీడీపీ వృద్ధికి–ఉద్యోగాల వృద్ధికి సంబంధం లేకుండా పోయింది. వేగంగా జీడీపీ వృద్ధి సాధించేందుకు అనుసరించే విధానాలు వేగంగా ఉద్యోగాల కల్పనకు తోడ్పడటం లేదు.
♦ కరోనా సమయంలో చాలా మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోవడంతో.. జీవనం గడిపేందుకు మళ్లీ వ్యవసాయం, స్వయం ఉపాధి వైపు మళ్లారు. దీనితో ఈ రెండు రంగాల్లో 2020 ఏప్రిల్–జూన్ మధ్య ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఆ తర్వాత పురుషులకు సంబంధించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోవిడ్ ముందటి కాలానికి చేరుకోగా.. మహిళలకు కొంత మేర మాత్రమే అవకాశాలు వచ్చాయి.
♦ వ్యవస్థీకృత మార్పుల ప్రభావంతో.. కరోనా అనంతర కాలంలో వ్యవసాయం నుంచి పురుషులు వైదొలిగినా, నిర్మాణ రంగంలో అవకాశాలు వచ్చాయి.
కానీ మహిళలు మాత్రం వర్క్‌ఫోర్స్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. అయితే 2004 నుంచీ స్తంభించిపోయిన మహిళా ఉద్యోగిత శాతం.. 2019 తర్వాతి నుంచి కొంతమేర పెరిగింది.
♦ 2004లో క్యాజువల్ వేజ్ వర్కర్లతోపాటు వారి వారసులలో 80శాతం మంది అదే ఉపాధిలో ఉండగా.. 2019 నాటికి చాలా వరకు మార్పు వచ్చింది. కానీ ఎస్సీ, ఎస్టీవర్గాల్లో మాత్రం అలాగే కొనసాగుతోంది. అంతేకాదు 20 మందికిపైగా ఉద్యోగులున్న సంస్థల యజమానుల్లో ఎస్సీ, ఎస్టీలు చాలా తక్కువగా ఉన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి..
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కూడా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయి. చాలా రంగాల్లో ఇప్పటికే పనిచేస్తున్న అనుభవజు్ఞలైన ఉద్యోగులనే కొనసాగిస్తున్నారు. చాలా దేశాల్లో ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు కూడా పెంచుతున్నారు. సంస్థల మూసివేతలు పెరుగుతున్నాయి. యువకులకు శిక్షణనిచ్చి, వారి నుంచి ఉత్పాదక పెంచే సేవలు అందుకోవడానికి జాప్యమయ్యే పరిస్థితిలో నైపుణ్యాలున్న పాతవారినే కొనసాగిస్తున్నారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ, కోవిడ్ మహమ్మారి ప్రభావం చిన్న, మధ్యతరహా సంస్థలపై తీవ్రంగా పడింది. వాటిలో ఎస్సీ,ఎస్టీ వర్గాలకు చెందినవారు ఎక్కువగా ఉపాధి కోల్పోవడంతో ఆ వర్గాల్లో నిరుద్యోగం పెరిగింది. – డి.పాపారావు, ఆర్థిక, సామాజిక రంగాల విశ్లేషకులు
నైపుణ్యాల కొరతతోనూ సమస్య
దేశంలోని గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఇంగ్లిష్లో తగిన ప్రావీణ్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. చదువుకుంటూ ఉద్యోగం చేసే అవకాశం, నైపుణ్యాలను పెంచుకునే అవకాశం వారికి తక్కువ. చిన్నదైనా ప్రభుత్వ ఉద్యోగం కావాలని కోరుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు, డిగ్రీ వంటివి పూర్తికాగానే డెలివరీ బాయ్స్, కాల్ సెంటర్ ఉద్యోగాలు వంటివి చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. కానీ చదువుకు తగ్గ ఉద్యోగం కోసం ఎదురుచూడక తప్పడం లేదు. యువతలో నైపుణ్యాల కల్పనతోపాటు బీకామ్, బీఎస్సీ, బీఏ వంటి కోర్సులు చదివిన వారికి కూడా ప్రైవేట్ పరిశ్రమలు, సంస్థలు ఉద్యోగాలు ఇచ్చేలా చర్యలు చేపట్టాలి. – రమణ భూపతి, క్వాలిటీ థాట్‌గ్రూప్ చైర్మన్ , ఎడ్‌టెక్ కంపెనీ
Comments
Please login to add a commentAdd a comment