ముంబై: గ్రాడ్యుయేట్ల సంఖ్య పెరుగుతోంది. ఉద్యోగావకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ సునీల్ మెహతా కీలక ప్రకటన చేశారు.
అప్రెంటిస్‌లుగా 25 ఏళ్లలోపు గ్రాడ్యుయేట్లను నియమించుకోవడానికి బ్యాంకులు యోచిస్తున్నాయని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ సునీల్ మెహతా శుక్రవారం తెలిపారు. 12 నెలల అప్రెంటిస్‌షిప్‌లో భాగంగా అభ్యర్థులకు ప్రత్యేక నైపుణ్యంపై శిక్షణ ఇస్తారు. వీరికి నెలకు రూ.5,000 స్టైపెండ్‌ను బ్యాంకులు చెల్లిస్తాయని మెహతా వెల్లడించారు.
‘నైపుణ్యం కలిగిన మానవ వనరులు అవసరం లేని మార్కెటింగ్, రికవరీ వంటి అనేక విభాగాలు ఉన్నాయి. వారికి ఆయా విభాగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తాము. 21–25 ఏళ్ల వయసున్న గ్రాడ్యుయేట్లు అర్హులు. అభ్యర్థి పన్ను చెల్లింపుదారు కాకూడదు. అలాగే ఐఐటీ, ఐఐఎం వంటి అగ్రశ్రేణి సంస్థల నుంచి డిగ్రీని కలిగి ఉండకూడదు.
బ్యాంకింగ్ సేవలను చివరి మైలు వరకు తీసుకువెళ్లే అప్రెంటిస్‌లను బిజినెస్ కరస్పాండెంట్లుగా కూడా నియమించుకోవచ్చు. శిక్షణ పూర్తి అయ్యాక వారిలో కొందరు ఉద్యోగులుగా చేరే అవకాశమూ ఉంది. అన్ని బ్యాంకులు నెలరోజుల్లోగా అప్రెంటిస్‌లను నియమించుకోనున్నాయి. ఈ స్కీమ్ అమలుకు ప్రభుత్వ మద్దతు కూడా ఉంది’ అని చెప్పారు. అయితే ఎంత మందిని అప్రెంటిస్‌లుగా చేర్చుకుంటారనేది వెల్లడి కాలేదు. ఐబీఏ ఈ స్కీమ్‌పై కార్పొరేట్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ సెక్రటరీతో గురువారం చర్చించింది.
Comments
Please login to add a commentAdd a comment