Indian Bank Association
-
బ్యాంకుల్లో అప్రెంటిస్‌లుగా గ్రాడ్యుయేట్లు
ముంబై: గ్రాడ్యుయేట్ల సంఖ్య పెరుగుతోంది. ఉద్యోగావకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ సునీల్ మెహతా కీలక ప్రకటన చేశారు.అప్రెంటిస్‌లుగా 25 ఏళ్లలోపు గ్రాడ్యుయేట్లను నియమించుకోవడానికి బ్యాంకులు యోచిస్తున్నాయని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ సునీల్ మెహతా శుక్రవారం తెలిపారు. 12 నెలల అప్రెంటిస్‌షిప్‌లో భాగంగా అభ్యర్థులకు ప్రత్యేక నైపుణ్యంపై శిక్షణ ఇస్తారు. వీరికి నెలకు రూ.5,000 స్టైపెండ్‌ను బ్యాంకులు చెల్లిస్తాయని మెహతా వెల్లడించారు.‘నైపుణ్యం కలిగిన మానవ వనరులు అవసరం లేని మార్కెటింగ్, రికవరీ వంటి అనేక విభాగాలు ఉన్నాయి. వారికి ఆయా విభాగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తాము. 21–25 ఏళ్ల వయసున్న గ్రాడ్యుయేట్లు అర్హులు. అభ్యర్థి పన్ను చెల్లింపుదారు కాకూడదు. అలాగే ఐఐటీ, ఐఐఎం వంటి అగ్రశ్రేణి సంస్థల నుంచి డిగ్రీని కలిగి ఉండకూడదు.బ్యాంకింగ్ సేవలను చివరి మైలు వరకు తీసుకువెళ్లే అప్రెంటిస్‌లను బిజినెస్ కరస్పాండెంట్లుగా కూడా నియమించుకోవచ్చు. శిక్షణ పూర్తి అయ్యాక వారిలో కొందరు ఉద్యోగులుగా చేరే అవకాశమూ ఉంది. అన్ని బ్యాంకులు నెలరోజుల్లోగా అప్రెంటిస్‌లను నియమించుకోనున్నాయి. ఈ స్కీమ్ అమలుకు ప్రభుత్వ మద్దతు కూడా ఉంది’ అని చెప్పారు. అయితే ఎంత మందిని అప్రెంటిస్‌లుగా చేర్చుకుంటారనేది వెల్లడి కాలేదు. ఐబీఏ ఈ స్కీమ్‌పై కార్పొరేట్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ సెక్రటరీతో గురువారం చర్చించింది. -
ఎకానమీ పునరుద్ధరణలో కీలకం కావాలి!
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక పునరుద్ధరణలో కీలక పాత్ర పోషించాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)కు ఆర్థికశాఖ బుధవారం పిలుపునిచ్చింది. ‘‘మూలధనం, సమర్థవంతమైన వనరులు, సాంకేతిక పరిజ్ఞానం వంటి విషయాల్లో కీలక పాత్ర పోషించాలని నేను ఐబీఏ చైర్మన్‌ను కోరుతున్నాను. ఐబీఏ కేవలం బ్యాంకింగ్ సమస్యలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు నివేదించే సంఘం మాత్రమే కాదు, వృద్ధిని పెంచడానికి ఆర్థిక సంస్కరణలతో బ్యాంకింగ్ వ్యవస్థను అనుసంధానం చేయడానికి ప్రయత్నించాలి’’ అని ఫైనాన్షియల్ సేవల కార్యదర్శి దేబాషిష్ పాండా పేర్కొన్నారు. ఐబీఐ ఢిల్లీ కార్యాలయం ప్రారంభం అంతకుమందు దేబాషిస్ పాండా ఢిల్లీలో ఐబీఏ కార్యాలయాన్ని ప్రారంభించారు. నిర్వహణ విషయంలో మధ్య శ్రేణి బ్యాంకింగ్ నిపుణులకు శిక్షణను ఇవ్వడానికి, వారిలో నైపుణ్యాన్ని పెంపొందించడానికి కూడా ఐబీఏ తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. దీనివల్ల బ్యాంకులకు ఈ విషయంలో భారం తగ్గిపోతుందని విశ్లేషించారు. కస్టమర్ సేవలపై దృష్టి: రాజ్‌కిరణ్ రాయ్ ఈ సందర్భంగా ఐబీఐ చైర్మన్ రాజ్‌కిరణ్ రాయ్ మాట్లాడుతూ, ఐబీఏలో పరివర్తన 2018 లో ప్రారంభమైందని పేర్కొన్నారు. ప్రస్తుతం కేవలం సలహాలు, సమస్యల పరిష్కారంపైనే దృష్టి సారించకుండా, బ్యాంకింగ్ వ్యాపారం, సేవల పరంగా కార్యకలాపాలలో మరింత నిమగ్నమైందని అన్నారు. కాగా, మహమ్మారి కోవిడ్ సమయంలో కస్టమర్లకు సేవలు అందించే విషయంలో వినూత్న విధానాలు రూపొందించడంపై దృష్టి సారించినట్లు ఐబీఏ సీఈఓ సునిల్ మెహతా ఈ సందర్భంగా తెలిపారు. అలాగే మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ సమన్వయ పనితీరు కోసం మార్గదర్శకాలను రూపొందించిందని వివరించారు. రుణాల మంజూరు, పంపిణీల్లో ఎటువంటి అవకతవకలకూ చోటులేని విధంగా కార్పొరేట్ రుణ వ్యవస్థసహా పలు సంస్కరణలను తీసుకువచ్చినట్లు వెల్లడించారు. రూ.6,000 కోట్ల బ్యాంక్ బ్యాంక్ (నేషనల్ అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్– ఎన్ఏఆర్సీఎల్) ఏర్పాటుకు లైసెన్స్ జారీ చేయాలని కోరుతూ ఇటీవలే ఆర్బీఐకి ఐబీఏ దరఖాస్తు దాఖలు చేసింది, వ్యవస్థల పట్ల పట్టింపులేకపోవడమే బ్యాంకు మోసాలపై సీవీసీ పరిశీలన రుణాల మంజూరులో, ఇతర కార్యకలాపాల విషయంలో వ్యవస్థలను, విధానాలను పట్టించుకోకపోవడమే బ్యాంకింగ్ రంగంలో పెద్ద ఎత్తున మోసాలకు కారణంగా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) గుర్తించింది. అవినీతికి చెక్ పెట్టేందుకు సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ప్రతీ దశలోనూ మోసాల నివారణకు ప్రాధాన్యం ఇవ్వాలని చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్లను సీవీసీ కోరింది. అలాగే, విదేశీ శాఖల్లో చోటుచేసుకున్న పెద్ద మోసాల్లో అంతర్గతంగా ఉన్న అంశాలను విశ్లేషించాలని కూడా సూచించింది. ప్రభుత్వరంగ బ్యాంకుల చీఫ్‌లతో నిర్వహించిన సమావేశంలో ఈ అంశాలు చర్చకు వచ్చినట్టు సీవీసీ తెలిపింది. విజిలెన్స్ కేసులు, వాటి పురోగతి, నివారణ చర్యలను బ్యాంకుల చీఫ్‌లు సీవీసీకి ఇదే సమావేశంలో వివరించారు. చదవండి : బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటులో కీలక అడుగు -
కంపెనీలకు ఊరటపై ఆర్బీఐ కసరత్తు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ పరిణామాలతో తీవ్రంగా దెబ్బతిన్న నిర్దిష్ట రంగాల సంస్థలకు వన్ టైమ్ ప్రాతిపదికన రుణాల పునర్వ్యవస్థీకరణ పథకాన్ని ప్రకటించడంపై రిజర్వ్ బ్యాంక్ కసరత్తు చేస్తోంది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)తో పాటు పలు వ్యాపార సంస్థల సమాఖ్యలు కేంద్రం, రిజర్వ్ బ్యాంక్‌లకు విజ్ఞప్తులు చేసిన నేపథ్యంలో ఆర్బీఐ ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వివిధ వర్గాల సూచనలన్నీ పరిగణనలోకి తీసుకున్న ఆర్బీఐ.. రుణాల పునర్వ్యవస్థీకరణకు అర్హత ఉన్న రంగాలకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందించే ప్రయత్నాల్లో ఉన్నట్లు వివరించాయి. ఆగస్టు ఆఖరు నాటికి దీనిపై నిర్ణయం వెలువరించవచ్చని పేర్కొన్నాయి. ప్రస్తుతం అమలవుతున్న ఆరు నెలల మారటోరియం వ్యవధి అప్పటితో ముగిసిపోనుంది. (చైనా దిగుమతులు ఇప్పట్లో తగ్గవు!) ఆతిథ్య, టూరిజం, ఏవియేషన్, నిర్మాణం మొదలైన రంగాలకు రుణ పునర్వ్యవస్థీకరణ స్కీమ్ వెసులుబాటు లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒత్తిడిలో ఉన్న కంపెనీలకు తోడ్పాటు అందించేలా వన్–టైమ్ ప్రాతిపదికన రుణాల పునర్వ్యవస్థీకరణ అంశంపై ఆర్బీఐ, ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత వారమే వెల్లడించారు. 2008 అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లో సంక్షోభం నుంచి బైటపడేందుకు పలు రంగాల సంస్థలకు ఆర్బీఐ వన్–టైమ్ రుణ రీస్ట్రక్చరింగ్ అవకాశం కల్పించింది. అయితే, దాన్ని కార్పొరేట్లు దుర్వినియోగం చేయడంతో 2015లో నిబంధనలను కఠినతరం చేసింది. -
బ్యాంకింగ్ ‘బాండ్’!
న్యూఢిల్లీ: రుణాల విషయంలో కార్పొరేట్ సంస్థలు మోసాలకు పాల్పడుతున్న ఘటనల నేపథ్యంలో బ్యాంకులు రూటు మార్చుకుంటున్నాయి. కేవలం రుణాలు జారీ చేయడానికే పరిమితమై పోకుండా, తీసుకున్న రుణాలను కంపెనీలు ఏ విధంగా వినియోగిస్తున్నాయనేది పర్యవేక్షించేందుకు వెలుపలి ఏజెన్సీల సాయం తీసుకోవాలని భావిస్తున్నాయి. ముఖ్యంగా ఇతర బ్యాంకులతో కలసి కన్సార్షియం కింద జారీ చేసే రూ.250 కోట్లకు మించిన రుణాల విషయంలో ఏజెన్సీ సేవలను వినియోగించుకోవాలని అనుకుంటున్నాయి. భూషణ్ పవర్ అండ్ స్టీల్ రుణం రూపంలో మోసం చేసినట్టు వెలుగు చూడడం, కంపెనీల ఆర్థిక అంశాలపై కచ్చితమైన సమాచారం విషయంలో రేటింగ్ ఏజెన్సీలు విఫలమవుతున్న నేపథ్యంలో... ఫోరెన్సిక్ ఆడిట్ తరహాలో కంపెనీల ఖాతాలపై సర్వే కోసం ఏజెన్సీలను నియమించుకోవాల్సిన అవసరం ఉందని రెండు అగ్ర స్థాయి ప్రభుత్వరంగ బ్యాంకర్లు తెలిపారు. ప్రస్తుతం అయితే కన్సార్షియం కింద రుణాలను జారీ చేసిన తర్వాత బ్యాంకులు... ప్రధానంగా రేటింగ్ ఏజెన్సీలు ఇచ్చే రేటింగ్‌లు, కంపెనీలు ఇచ్చే సమాచారానికే పరిమితం అవుతున్నాయి. వీటి ఆధారంగానే ఆయా కంపెనీల ఆర్థిక ఆరోగ్యాన్ని అంచనా వేస్తున్నాయి. ఈ ప్రతిపాదనపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) స్థాయిలో చర్చ జరిగిందని, అకౌంటింగ్ సంస్థలను నియమించుకోవడం ఈ ప్రతిపాదనలో భాగమని బ్యాంకరు తెలిపారు. ఇప్పటికే ఐబీఏ 75 సంస్థలను కూడా గుర్తించి బ్యాంకుల స్థాయిలో పంపిణీ చేయడం జరిగినట్టు చెప్పారు. ఎప్పటికప్పుడు నివేదికల రూపంలో... ‘‘ఇది నూతన యంత్రాంగం. ఇప్పటికే అకౌంటింగ్ సంస్థలను గుర్తించాం. తీసుకున్న రుణాలను కంపెనీలు వినియోగించే తీరుపై ఎప్పటికప్పుడు ఇవి పర్యవేక్షణ నిర్వహిస్తాయి. అలాగే, క్రమం తప్పకుండా బ్యాంకులకు నివేదికల రూపంలో తెలియజేస్తాయి’’ అని యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ, సీఈవో అశోక్ కుమార్ ప్రధాన్ తెలిపారు. ఇప్పటికైతే తాము అందుకున్న స్టేట్మెంట్స్పై ఎక్కువగా వివరాలు వెల్లడించలేమంటూ... సంబంధిత ఆడిటింగ్ సంస్థలు కంపెనీల పుస్తకాలను పరీక్షిస్తాయని, ఇది ఫోరెన్సిక్ ఆడిట్ తరహాలో ఉంటుందన్నారు. కంపెనీల పుస్తకాల్లోని లోపాలను గుర్తించే విషయంలో రేటింగ్ ఏజెన్సీలు సమర్థవంతంగా వ్యవహరించడం లేదని గతేడాది సెప్టెంబర్‌లో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ పరిణామంతో వెలుగు చూసింది. రుణాల చెల్లింపుల్లో ఈ సంస్థ వరుసగా విఫలం కావడం, రేటింగ్ ఏజెన్సీలు ముందుగా ఈ విషయాలను గుర్తించలేకపోయిన విషయం తెలిసిందే. ఖాతాల్లోని ఆర్థిక ఇబ్బందులు రేటింగ్‌ల్లో ప్రతిఫలించకుండా ఉండేందుకు ఐఎల్ఎఫ్ఎస్ సీనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగులు, రేటింగ్ ఏజెన్సీల ఉద్యోగులను ప్రలోభపెట్టినట్టు గ్రాంట్ థార్న్టన్ ఫోరెన్సిక్ ఆడిట్లో ప్రాథమికంగా వెలుగు చూసింది. ‘‘పర్యవేక్షణ బాధ్యత అన్నది రేటింగ్ ఏజెన్సీలు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాటి రేటింగ్‌లు బ్యాంకులతోపాటు వాటాదారులకూ ఎంతో ముఖ్యమైనవి. కానీ, ఇప్పుడున్న విధానంలో ఇది ఫలితాలను ఇవ్వడం లేదు. ఎక్స్టర్నల్ ఏజెన్సీలను నియమించుకోవాలని ఐబీఏ యోచిస్తుండడం వెనుక కారణం ఇదే. భూషణ్ పవర్ మోసం వెలుగు చూడడంతో ఈ విధానాన్ని వెంటనే అమల్లో పెట్టాల్సిన అవసరం ఉంది’’ అని సిండికేట్ బ్యాంకు ఎండీ, సీఈవో మృత్యుంజయ మహపాత్ర పేర్కొన్నారు. -
కరెన్సీ సమస్యపై స్పందించరేం?
చెన్నై: నగదు కొరతను సత్వరం పరిష్కరించేందుకు ఆర్బీఐ చర్యలు తీసుకోవాలని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) డిమాండ్ చేసింది. బ్యాంకు శాఖలు, ఏటీఎంలు నగదు లేక వెలవెలబోతున్న నేపథ్యంలో ఉత్తుత్తి ప్రకటనలు సరిపోవని, పరిస్థితిని చక్కదిద్దడానికి నిర్మాణాత్మక చర్యలు అవసరమని ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం చెప్పారు. దేశవ్యాప్తంగా నగదులేని ఏటీఎంలు సహా ఎన్నో అంశాల్లో ఆర్బీఐ వైఫల్యం ఉందని, తక్షణమే ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నగదు సరఫరాను వెంటనే పెంచకపోతే తాము దేశవ్యాప్త ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. తొమ్మిది ఉద్యోగ సంఘాలతో కూడిన యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్‌లో ఏఐబీఈఏ కూడా భాగం. కొన్ని రాష్ట్రాల్లో నగదు కొరత చాలా తీవ్రంగా ఉందని వెంకటాచలం అంగీకరించారు. ‘‘కస్టమర్ల విత్‌డ్రాయెల్స్‌కు తగ్గ నగదు సర్దుబాటు చేసే పరిస్థితి కొన్ని శాఖల్లో లేదు. ఆర్బీఐ, ప్రభుత్వం కారణంగా ఏర్పడిన ఈ పరిస్థితికి బ్యాంకు ఉద్యోగుల పాత్ర లేకపోయినా కస్టమర్ల ఆగ్రహాన్ని ఉద్యోగులు చవిచూడాల్సి వస్తోంది. మా తప్పేమీ లేకపోయినా కస్టమర్లు మమ్మల్ని తిడుతున్నారు. కాబట్టి ప్రకటనలు చేస్తే సరిపోదు. సత్వర చర్యలు చేపట్టడం ద్వారా నగదు సరఫరాను పెంచాలి’’ అని వెంకటాచలం కోరారు. కొన్ని వారాలుగా ఏపీ, తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో తీవ్ర నగదు కొరత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే, వ్యవస్థలో అవసరానికి మించి నగదు ఉందంటూ ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటించడం గమనార్హం. రూ.2,000 నోట్లతోనే సమస్య: రూ.500, రూ.1,000 నోట్ల రద్దు తర్వాత రూ.2,000నోట్లను ప్రవేశపెట్టాలన్న నిర్ణయంతోనే సమస్య మొదలైందని వెంకటాచలం పేర్కొన్నారు. నోట్ల రద్దు జరిగి 16 నెలలవుతున్నా కొత్త నోట్లకు అనుగుణంగా కొన్ని ఏటీఎంల్లో ఇప్పటికీ మార్పులు జరగలేదన్నారు. పార్లమెంట్ అనుమతి కోసం పెండిం గ్లో ఉన్న ఎఫ్ఆర్డీఐ బిల్లు కూడా సమస్యకు కారణమేనని పేర్కొన్నారు. ఈ బిల్లును తక్షణం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఉర్జిత్ పటేల్ తప్పుకోవాలి ‘‘ఆర్బీఐ స్వతంత్రంగా పనిచేయడం లేదు. ప్రస్తుత కరెన్సీ సమస్యకు ఆర్బీఐ గవర్నర్ బాధ్యత వహించి రాజీనామా చేయాలి. లేదా ఆయన్ను తప్పించాలి. ఇందులో ఆర్బీఐ పూర్తి నిర్లక్ష్యం ఉంది’’ అని వెంకటాచలం చెప్పారు. -
బ్యాంకుల సమ్మె వాయిదా
* ఫిబ్రవరి మొదటి వారంలో చర్చలు * తేలకుంటే నెలాఖరులో మళ్లీ సమ్మె * ఉద్యోగ సంఘాల ప్రకటన హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బుధవారం నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు తలపెట్టిన సమ్మెను వాయిదా వేస్తున్నట్లు యునెటైడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ప్రకటించింది. వేతనాల పెంపుపై ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ (ఐబీఏ)తో జరుపుతున్న చర్చలు ఇంకా కొలిక్కి రాకపోవడంతో జనవరి 21 నుంచి తలపెట్టిన సమ్మెను ఫిబ్రవరి మాసాంతానికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు యూఎఫ్‌బీయూ ప్రతినిధులు తెలిపారు. సమ్మె చేయాలా వద్దా అన్న విషయంలో యూనియన్ల మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు వచ్చినప్పటికీ అంతిమంగా వాయిదా వేయడానికే మొగ్గు చూపినట్లు తెలిసింది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటన సందర్భంగా సమ్మె చేయడం ద్వారా ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచవచ్చని రెండు మూడు యూనియన్లు వాదించాయి. అయితే, చర్చలు జరుగుతున్న సమయంలో సమ్మె చేయడం సరికాదని మరికొన్ని యూనియన్లు వాదించాయి. చివరకు తొమ్మిది ప్రధాన యూనియన్లతో ఏర్పడిన యూఎఫ్‌బీయూ సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఐబీఏతో జరిగిన చర్చల్లో ఎటువంటి పురోగతి లేదని, ఫిబ్రవరి మొదటి వారంలో జరిగే సమావేశంలో సమస్యను పరిష్కరిస్తామని ఐబీఏ హామీ ఇవ్వడంతో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు యూనియన్ నేతలు తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగుల వేతన సవరణ 2012 ఏడాది నుంచి పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. గత చర్చల్లో యూనియన్లు 23 శాతం పెంపు డిమాండ్ నుంచి 19.5 శాతానికి దిగిరాగా, ఐబీఏ 11 నుంచి 12.5 శాతానికి వచ్చింది.