
న్యూఢిల్లీ: కరోనా వైరస్ పరిణామాలతో తీవ్రంగా దెబ్బతిన్న నిర్దిష్ట రంగాల సంస్థలకు వన్ టైమ్ ప్రాతిపదికన రుణాల పునర్‌వ్యవస్థీకరణ పథకాన్ని ప్రకటించడంపై రిజర్వ్ బ్యాంక్ కసరత్తు చేస్తోంది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)తో పాటు పలు వ్యాపార సంస్థల సమాఖ్యలు కేంద్రం, రిజర్వ్ బ్యాంక్‌లకు విజ్ఞప్తులు చేసిన నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వివిధ వర్గాల సూచనలన్నీ పరిగణనలోకి తీసుకున్న ఆర్‌బీఐ.. రుణాల పునర్‌వ్యవస్థీకరణకు అర్హత ఉన్న రంగాలకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందించే ప్రయత్నాల్లో ఉన్నట్లు వివరించాయి. ఆగస్టు ఆఖరు నాటికి దీనిపై నిర్ణయం వెలువరించవచ్చని పేర్కొన్నాయి. ప్రస్తుతం అమలవుతున్న ఆరు నెలల మారటోరియం వ్యవధి అప్పటితో ముగిసిపోనుంది. (చైనా దిగుమతులు ఇప్పట్లో తగ్గవు!)
ఆతిథ్య, టూరిజం, ఏవియేషన్, నిర్మాణం మొదలైన రంగాలకు రుణ పునర్‌వ్యవస్థీకరణ స్కీమ్ వెసులుబాటు లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒత్తిడిలో ఉన్న కంపెనీలకు తోడ్పాటు అందించేలా వన్–టైమ్ ప్రాతిపదికన రుణాల పునర్‌వ్యవస్థీకరణ అంశంపై ఆర్‌బీఐ, ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత వారమే వెల్లడించారు. 2008 అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లో సంక్షోభం నుంచి బైటపడేందుకు పలు రంగాల సంస్థలకు ఆర్‌బీఐ వన్–టైమ్ రుణ రీస్ట్రక్చరింగ్ అవకాశం కల్పించింది. అయితే, దాన్ని కార్పొరేట్లు దుర్వినియోగం చేయడంతో 2015లో నిబంధనలను కఠినతరం చేసింది.