కోవిడ్ మహమ్మారి తగ్గుముఖం పట్టాక దేశంలో పర్యాటకరంగంలో ఉపాధి అవకాశాలు విపరీతంగా పెరిగాయి. 2033 నాటికి అంటే రాబోయే తొమ్మిదేళ్లలో ట్రావెల్ అండ్ టూరిజం రంగంలో దేశంలో 5.82 కోట్ల మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. కరోనా సమయంలో అంటే 2020లో పర్యాటక రంగంలో 3.9 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇది దేశంలోని మొత్తం ఉపాధిలో 8 శాతం.
తాజాగా ఎన్‌ఎల్‌బి సర్వీసెస్ నివేదిక ప్రకారం మహమ్మారి నుండి కోలుకున్న తర్వాత పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందింది. ఈ రంగం 2023 క్యాలెండర్ సంవత్సరంలో 16 లక్షల అదనపు ఉద్యోగాలను అందించింది. జనవరి 2023 నుండి ప్రయాణ, పర్యాటక రంగంలో రోజువారీ వేతన ఉద్యోగాలు 14 శాతం మేరకు పెరిగాయి. అనువాదకులు, ఫోటోగ్రాఫర్లు, టూర్ గైడ్‌లకు ఉద్యోగావకాశాలు ఏర్పడ్డాయి. వచ్చే రెండేళ్లలో పర్యాటక రంగంలో ఉద్యోగాలు 20 శాతం మేరకు పెరుగుతాయని అంచనా.
ఎన్‌ఎల్‌బి సర్వీసెస్ నివేదికలోని డేటా ప్రకారం పర్యాటక రంగం 2022లో భారతదేశ జీడీపీకి 15.9 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని అందించింది. అదే సమయంలో ఇది విదేశీ మారకద్రవ్యానికి ముఖ్య వనరుగా నిలిచింది. ఎన్‌ఎల్‌బి సర్వీసెస్ సీఈఓ సచిన్ అలగ్ మీడియాతో మాట్లాడుతూ పర్యాటకరంగంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూణె, కొచ్చి, జైపూర్, అహ్మదాబాద్, చండీగఢ్‌లో ఉపాధి అవకాశాలు మరింతగా పెరిగాయి.
పర్యాటకరంగంలో సేల్స్ లో18 శాతం, బిజినెస్ డెవలప్‌మెంట్‌లో 17 శాతం, చెఫ్ విభాగంలో15 శాతం, ట్రావెల్ కన్సల్టెంట్‌లో 15 శాతం మేరకు ఉపాధి పెరగవచ్చనే అంచనాలున్నాయి. అలాగే టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లు, హోటళ్లు, గైడ్‌లు , వన్యప్రాణి నిపుణులకు కూడా మంచి డిమాండ్ ఏర్పడే అవకాశాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment