సాక్షి, అమరావతి : భారతదేశంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా పర్యాటక విధానాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే “ట్రావెల్ ఫర్ లైఫ్’ పేరిట కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయి పోటీలు నిర్వహిస్తోంది. దేశంలో పర్యావరణహిత, అంతర్జాతీయ స్థాయి టూరిజం ప్రమాణాల అభివృద్ధిలో భాగంగా జీ–20 ప్రెసిడెన్సీ రోడ్‌మ్యాప్ అమలుకు శ్రీకారం చుట్టింది.
ముఖ్యంగా ఐదు కేటగిరీల్లో ‘టూరిజం ఫర్ టుమారో కేస్ స్టడీ’లను పోటీలకు ఆహ్వానిస్తోంది. పర్యాటక రంగంలో ఆహ్లాదాన్ని అందించడంతో పాటు పర్యావరణ సుస్థిరత, జీవ వైవిధ్యం పెంపు–రక్షణ, సామాజిక ఆర్థిక, సాంస్కృతిక స్థిరత్వాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. స్థానిక సంఘాలు, ప్రభుత్వాలు, వ్యాపారులు, ఎన్జీవోలు, ఇతర స్టేక్‌హోల్డర్లను భాగస్వాములను చేయనుంది.
అందుకే ‘ట్రావెల్ ఫర్ లైఫ్’ కింద గ్రీన్ టూరిజం, డిజిటలైజేషన్, స్కిల్స్, పర్యాటక ఎంఎస్‌ఎంఈ, డెస్టినేషన్ మేనేజ్‌మెంట్ వంటి ఐదు కీలక ప్రాధాన్యతలను ఎంపిక చేసింది. వీటిని పర్యాటక రంగంలో అమలు చేస్తున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వ రంగ, ప్రైవేటు సంస్థలు, విశ్వవిద్యాలయాల నుంచి కేస్ స్టడీల పోటీలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం అమలవుతున్న లక్ష్యాల ప్రక్రియ, ఫలితాలు, వీడియో/ఫొటోలతో కూడిన సమగ్ర సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పంపించాల్సి ఉంటుంది. నామినేషన్లకు జనవరి 15వ తేదీ వరకు అవకాశం కల్పించింది.
ఏపీ పర్యాటకంలో సుస్థిరాభివృద్ధి వెలుగులు..
ప్రపంచ వ్యాప్తంగా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో పర్యాటక రంగాన్ని ప్రత్యేక వాహకంగా ఉపయోగిస్తున్నారు. అందుకే ‘సెంట్రల్ నోడల్ ఏజెన్సీ ఫర్ సస్టైయినబుల్ టూరిజం’ దేశంలో సుస్థిరాభివృద్ధి ఆధారిత ప్రాజెక్టులను గుర్తించి మద్దతిస్తోంది. వినూత్న, ప్రభావవంతమైన కార్యక్రమాలను విశ్లేషించి, ప్రదర్శించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించనుంది. కాగా, ఆంధ్రప్రదేశ్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో కీలక పురోగతిని కనబరుస్తోంది.
సామాజిక, ఆర్థిక, విద్య, వైద్యం, పేదరిక నిర్మూలనలో విప్లవాత్మక మార్పులు చర్యలు చేపట్టింది. ఇక పర్యాటక రంగంలోనూ ఉద్యోగ, ఉపాధి కల్పన దిశగా అడుగులేస్తోంది. ఇప్పటికే ప్రపంచ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం టీటీడీలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించింది. పునరుత్పాదక శక్తిని సమర్థంగా వినియోగించుకునేలా పవన విద్యుత్‌ను ప్రవేశపెట్టింది. జీవ వైవిధ్యాన్ని కాపాడటంతో పాటుగా ప్రజలకు అటవీ జంతువుల రక్షణపై అవగాహన కల్పిస్తూ ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తోంది.
తద్వారా స్థానిక గిరిజనులు, చెంచుల ప్రత్యేక శిక్షణనిస్తూ పర్యాటకుల రూపంలో జీవనోపాధిని పెంపొందిస్తోంది. చారిత్రక, వారసత్వ సంపదకు నిలయమైన మ్యూజియాల్లో అగ్‌మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, కియోస్క్‌లు, డిజిటల్ యాప్స్ సాయంతో సందర్శకులకు సులభంగా, అర్థమయ్యేలా సమాచారాన్ని అందిస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ ‘పర్యాటక పోలీస్ స్టేషన్లు’ నెలకొల్పింది.
ఇంధన శాఖ పరిధిలో అనేక రెన్యువబుల్ ఎనర్జీ, వ్యవసాయ పర్యాటకంగా మారుతున్న సేంద్రియ సాగు విధానాలు, ఆన్‌లైన్ విక్రయాల్లో ఏటికొప్పాక, కొండపల్లి కళాకృతులు, చేనేత, కలంకారి, సంస్కృతి, వారసత్వ వేదికల పునర్నిర్మాణం.. ఇలాంటి పర్యావరణ, సామాజికహిత కార్యక్రమాలతో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు బాటలు వేస్తోంది. ఇవన్నీ ‘టూరిజం ఫర్ టుమారో కేస్ స్టడీ’లను ఏమాత్రం తీసిపోని విధానాలు కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment