Central Department of Tourism
-
పర్యాటకులకు వేసవి విడిది ప్రాంతాలు
సాక్షి, అమరావతి: వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం వివిధ దేశాలకు వెళ్లే పర్యాటకులను ఆకర్షించేందుకు కేంద్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. వేసవి విడిదికి అనుకూలమైన దేశంలోని 50 ప్రదేశాలను గుర్తించి ప్రత్యేక జాబితా రూపొందించింది. ఇన్ క్రెడిబుల్ ఇండియాలో భాగంగా సోషల్ మీడియా వేదికగా ‘కూల్ సమ్మర్స్ ఆఫ్ ఇండియా’ అంటూ విస్తృత ప్రచారం చేపట్టింది. మండు వేసవిలో శీతల భారతాన్ని ప్రపంచానికి పరిచయం చేసే దిశగా అడుగులు వేస్తోంది. 6న దుబాయ్‌లో అరేబియన్ ట్రావెల్ మార్ట్‌లో కూడా ప్రచార చిత్రాన్ని ప్రదర్శించనుంది. చల్లని వాతావరణం ఉండే ప్రాంతాలు.. కేంద్ర పర్యాటక శాఖ 50కిపైగా వేసవి విడిది ప్రదేశాలతో జాబితాను రూపొందించింది. ఇందులో జమ్మూ, కశ్మీర్‌లోని గుల్మార్గ్, పట్నిటాప్, గ్రెజ్–మనస్బాల్, పితోర్‌ఘర్, ఔలి–చోప్తా, కిన్నౌర్, తీర్థన్, కేరళలోని వాయనాడ్–వాగమోన్, మిజోరంలోని ఐజ్వాల్, థెన్‌జాల్, సిక్కింలో లాచుంగ్–యుమ్తాంగ్, అస్సాంలోని హఫ్లాంగ్, పశ్చిమ బెంగాల్‌లోని కుర్సియోంగ్ తదితర ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రదేశాలు వేసవి అనుకూల గమ్యస్థానాలుగా ఉంటాయని ఆ శాఖ అభిప్రాయం. -
కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ‘ట్రావెల్ ఫర్ లైఫ్’
సాక్షి, అమరావతి : భారతదేశంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా పర్యాటక విధానాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే “ట్రావెల్ ఫర్ లైఫ్’ పేరిట కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయి పోటీలు నిర్వహిస్తోంది. దేశంలో పర్యావరణహిత, అంతర్జాతీయ స్థాయి టూరిజం ప్రమాణాల అభివృద్ధిలో భాగంగా జీ–20 ప్రెసిడెన్సీ రోడ్‌మ్యాప్ అమలుకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ఐదు కేటగిరీల్లో ‘టూరిజం ఫర్ టుమారో కేస్ స్టడీ’లను పోటీలకు ఆహ్వానిస్తోంది. పర్యాటక రంగంలో ఆహ్లాదాన్ని అందించడంతో పాటు పర్యావరణ సుస్థిరత, జీవ వైవిధ్యం పెంపు–రక్షణ, సామాజిక ఆర్థిక, సాంస్కృతిక స్థిరత్వాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. స్థానిక సంఘాలు, ప్రభుత్వాలు, వ్యాపారులు, ఎన్జీవోలు, ఇతర స్టేక్హోల్డర్లను భాగస్వాములను చేయనుంది. అందుకే ‘ట్రావెల్ ఫర్ లైఫ్’ కింద గ్రీన్ టూరిజం, డిజిటలైజేషన్, స్కిల్స్, పర్యాటక ఎంఎస్ఎంఈ, డెస్టినేషన్ మేనేజ్మెంట్ వంటి ఐదు కీలక ప్రాధాన్యతలను ఎంపిక చేసింది. వీటిని పర్యాటక రంగంలో అమలు చేస్తున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వ రంగ, ప్రైవేటు సంస్థలు, విశ్వవిద్యాలయాల నుంచి కేస్ స్టడీల పోటీలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం అమలవుతున్న లక్ష్యాల ప్రక్రియ, ఫలితాలు, వీడియో/ఫొటోలతో కూడిన సమగ్ర సమాచారాన్ని ఆన్లైన్లో పంపించాల్సి ఉంటుంది. నామినేషన్లకు జనవరి 15వ తేదీ వరకు అవకాశం కల్పించింది. ఏపీ పర్యాటకంలో సుస్థిరాభివృద్ధి వెలుగులు.. ప్రపంచ వ్యాప్తంగా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో పర్యాటక రంగాన్ని ప్రత్యేక వాహకంగా ఉపయోగిస్తున్నారు. అందుకే ‘సెంట్రల్ నోడల్ ఏజెన్సీ ఫర్ సస్టైయినబుల్ టూరిజం’ దేశంలో సుస్థిరాభివృద్ధి ఆధారిత ప్రాజెక్టులను గుర్తించి మద్దతిస్తోంది. వినూత్న, ప్రభావవంతమైన కార్యక్రమాలను విశ్లేషించి, ప్రదర్శించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించనుంది. కాగా, ఆంధ్రప్రదేశ్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో కీలక పురోగతిని కనబరుస్తోంది. సామాజిక, ఆర్థిక, విద్య, వైద్యం, పేదరిక నిర్మూలనలో విప్లవాత్మక మార్పులు చర్యలు చేపట్టింది. ఇక పర్యాటక రంగంలోనూ ఉద్యోగ, ఉపాధి కల్పన దిశగా అడుగులేస్తోంది. ఇప్పటికే ప్రపంచ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం టీటీడీలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించింది. పునరుత్పాదక శక్తిని సమర్థంగా వినియోగించుకునేలా పవన విద్యుత్‌ను ప్రవేశపెట్టింది. జీవ వైవిధ్యాన్ని కాపాడటంతో పాటుగా ప్రజలకు అటవీ జంతువుల రక్షణపై అవగాహన కల్పిస్తూ ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తోంది. తద్వారా స్థానిక గిరిజనులు, చెంచుల ప్రత్యేక శిక్షణనిస్తూ పర్యాటకుల రూపంలో జీవనోపాధిని పెంపొందిస్తోంది. చారిత్రక, వారసత్వ సంపదకు నిలయమైన మ్యూజియాల్లో అగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, కియోస్క్‌లు, డిజిటల్ యాప్స్ సాయంతో సందర్శకులకు సులభంగా, అర్థమయ్యేలా సమాచారాన్ని అందిస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ ‘పర్యాటక పోలీస్ స్టేషన్లు’ నెలకొల్పింది. ఇంధన శాఖ పరిధిలో అనేక రెన్యువబుల్ ఎనర్జీ, వ్యవసాయ పర్యాటకంగా మారుతున్న సేంద్రియ సాగు విధానాలు, ఆన్లైన్ విక్రయాల్లో ఏటికొప్పాక, కొండపల్లి కళాకృతులు, చేనేత, కలంకారి, సంస్కృతి, వారసత్వ వేదికల పునర్నిర్మాణం.. ఇలాంటి పర్యావరణ, సామాజికహిత కార్యక్రమాలతో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు బాటలు వేస్తోంది. ఇవన్నీ ‘టూరిజం ఫర్ టుమారో కేస్ స్టడీ’లను ఏమాత్రం తీసిపోని విధానాలు కావడం విశేషం. -
పర్యాటక శాఖతో ఎయిర్‌బీఎన్‌బీ ఎంవోయూ
న్యూఢిల్లీ: సాంస్కృతిక వారసత్వ పర్యాటక ప్రాంతాలకు మరింత ప్రాచుర్యం తెచ్చే దిశగా కేంద్ర టూరిజం శాఖతో ఎయిర్‌బీఎన్‌బీ జట్టు కట్టింది. తాము చేపట్టిన ’విజిట్ ఇండియా 2023’ కార్యక్రమంలో భాగంగా కేంద్రంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు సంస్థ తెలిపింది. భారతదేశ సుసంపన్న సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసే దిశగా ఈ ఎంవోయూ కింద ’సోల్ ఆఫ్ ఇండియా’ పేరిట ప్రత్యేక మైక్రోసైట్‌ను ఆవిష్కరించనున్నట్లు వివరించింది. టూరిస్టులకు పెద్దగా తెలియని పర్యాటకప్రాంతాల్లో ఆతిథ్యం కలి్పంచేవారికి అవసరమైన తోడ్పా టు అందించడం, హోమ్‌స్టేలకు ప్రాచుర్యం కలి్పంచడం వంటి సేవలు అందించనుంది. విదేశీ పర్యాటకులను భారత్ వైపు ఆకర్షించేందుకు, స్థానికంగా ఉపాధి అవకాశాలు కలి్పంచేందుకు, అంతర్జాతీయ టూరిజం మ్యాప్‌లో భారత్ మరింత విశిష్ట స్థానం దక్కించుకునేందుకు ఈ ఎంవోయూ ఉపయోగపడగలదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. -
‘మాస్ టూరిజం’ను కట్టడిచేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: మాస్ టూరిజం కారణంగా ఫైవ్ స్టార్ హోటళ్లు, భారీ భవంతులు నిర్మించడంతో లేహ్–లద్ధాఖ్ వంటి పర్యాటక ప్రాంతాల్లో జీవావరణ పరిస్థితులు దెబ్బతింటాయని కేంద్ర టూరిజం శాఖ డైరెక్టర్ జనరల్ గంజి కమలవర్ధనరావు అభిప్రాయపడ్డారు. లేహ్, కార్గిల్, నుమ్రా లోయ, లద్ధాఖ్‌లలో మాస్ టూరిజంతో జీవావరణ సమస్యలు తలెత్తకుండానే అభివృద్ధి సాధ్యమయ్యేలా పరిష్కారాలు కనుగొనాలన్నారు. కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో లేహ్‌లో ‘లద్ధాఖ్: నూతన ప్రారంభం, కొత్త లక్ష్యాలు’ పేరిట జరుగుతున్న మెగా టూరిజం ఈవెంట్లో గురువారం ఆయన పాల్గొని ప్రసంగించారు. లేహ్–లద్ధాఖ్ వంటి ప్రాంతాల్లో పర్యాటక రంగాన్ని వృద్ధి చేస్తూనే మాస్ టూరిజంను కట్టడి చేయాలన్నారు. ఆధునిక హోటళ్ల కోసం కాంక్రీట్ భవనాలు నిర్మించే కన్నా స్థానికుల ఇళ్లలో పర్యాటకులు బస చేస్తే స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. పర్యాటకులకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఫైవ్‌స్టార్ హోటల్ స్థాయిలో ఆహారం, ఆతిథ్యం అందించేలా భాషా, తదితరాల్లో స్థానికులకు పర్యాటక శాఖ శిక్షణ ఇస్తోందన్నారు. లేహ్–లద్ధాఖ్ వంటి ప్రాంతాల్లో ఎయిర్‌పోర్టుల కంటే ఎక్కువగా హెలిప్యాడ్ల నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. యూరప్‌లోని ఆల్ప్స్ పర్వతాల్లో 10వేలకుపైగా ప్రాంతాల్లో స్కీయింగ్ క్రీడా వేదికలున్నాయని, దాంతో కోట్లాది మంది పర్యాటకుల రద్దీ కారణంగా మంచు కరిగి, ఉష్ణోగ్రతలు పెరగడం వంటి జీవావరణ మార్పులు కొనసాగుతున్నాయని చెప్పారు. భారత్‌లోనూ ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా చూడాలన్నారు. కులూ మనాలీ, ఊటీ, మున్నార్ వంటి పర్యాటక ప్రాంతాల్లో గత 20 ఏళ్లలో వాతావరణ పరిస్థితులు చాలా మారాయన్నారు. లేహ్‌లోని వందలాది ట్యాక్సీల్లో చాలావరకు 10ఏళ్ల పాతవని, కర్భన ఉద్గారాల కట్టడిపై పటిష్టమైన విజన్ డాక్యుమెంట్ అవసరమన్నారు. కోలుకుంటున్న పర్యాటక రంగం కోవిడ్ కారణంగా పర్యాటకరంగం కుదేలైందని, అయితే గత రెండు నెలలుగా దేశీయ పర్యాటకం మెరుగుపడుతుండటం కాస్త ఊరటనిచ్చే అంశమని కమలవర్ధనరావు వ్యాఖ్యానించారు. ఇప్పటికే సుమారు 1.2కోట్ల మంది విదేశీ పర్యాటకులు భారత్‌కు వచ్చారని, అభయారణ్యాలు, తీరప్రాంతాలు, పుణ్యక్షేత్రాల్లో సందడి కనిపిస్తోందని తెలిపారు. హిమాలయ పర్వత శ్రేణుల్లో పర్యాటకం అభివృద్ధిపై శ్రద్ధవహించాలన్నారు. చారిత్రక కట్టడాల పరిరక్షణ, గ్రామీణ పర్యాటక రంగాన్ని ఏవిధంగా అభివృద్ధి చేయాలన్న అంశంపై రాష్ట్రాలు, పర్యాటకశాఖ దృష్టిసారించాలని కమలవర్ధన రావు సూచించారు. ఈ రంగం వృద్ధి కోసం మీడియాలో ప్రచారం కల్పించడంతో పాటు ప్రజల్లో అవగాహన మరింత పెంచాలన్నారు. సినిమా టూరిజంను పెంచేందుకు ప్రణాళికలు సిద్ధంచేశామన్నారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి కశ్మీర్, లేహ్–లద్ధాఖ్, ఈశాన్య రాష్ట్రాలకు పర్యాటకుల తాకిడి పెరుగుతోందని పేర్కొన్నారు. స్థానిక భాగస్వామ్యం ఎంతో కీలకం: కిషన్‌రెడ్డి గత 40 ఏళ్లలో లద్దాఖ్‌లో పర్యాటక రంగం గణనీయమైన అభివృద్ధి సాధించిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ట్రెక్కర్లు, బైకర్లు, సైక్లిస్టులు, అధిరోహకులు మొదలైన వారికి లద్ధాఖ్ ఒక మంచి అనుభూతిని ఇస్తుందన్నారు. ఈ మెగా టూరిజం ఈవెంట్లో కిషన్‌రెడ్డి వర్చువల్ వేదికగా పాల్గొని ప్రసంగించారు. ‘లద్దాఖ్ అభివృద్ధికి దేశంలోని వేరే రాష్ట్రాల టూర్ ఆపరేటర్లు, స్థానికులతో చర్చలు జరిపేందుకు ఈవెంట్ మంచి వేదిక’ అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. లద్దాఖ్ పర్యాటక అభివృద్ధిపై చర్చించేందుకు ‘లద్దాఖ్ విజన్ డాక్యుమెంట్’ను కేంద్ర పర్యాటక శాఖ సిద్ధం చేసిందన్నారు. టూరిస్ట్ వాటర్ స్క్రీన్ ప్రొజెక్షన్ మల్టీమీడియా షోతో పాటు ఇతర పర్యాటక ఆకర్షణల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.23.21 కోట్లను లద్దాఖ్‌కు అందించిందన్నారు. ఈవెంట్లో లద్దాఖ్ టూరిజం సౌకర్యాలు, ఉత్పత్తుల ఎగ్జిబిషన్, చర్చా గోష్టిలు జరుగుతున్నాయి. ఈ రంగంలోని నిపుణులు, టూర్ ఆపరేటర్లు, హోటల్ యజమాన్యాలు, దౌత్యవేత్తలు, ‘హోం స్టే’ యజమానులు సహా 150 మంది ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
మన తీరాన ‘మరో చరిత్ర’
సాక్షి, హైదరాబాద్ : మన భూపాలపల్లికి కంబోడియాతో ఉన్న సంబంధం ఏంటి? భూపాలపల్లి జిల్లా దేవునిగుట్టపై ఉన్న బౌద్ధమందిరం అచ్చుగుద్దినట్టు ప్రపంచ ప్రఖ్యాత అంకోర్వాట్ దేవాలయ నిర్మాణ శైలిని పోలి ఉంటుంది. కంబోడియా నిర్మాణ విధానం భూపాలపల్లిలో ఎలా ప్రత్యక్షమైంది? చారి త్రక ఆధారాలు ఇప్పటికీ వెలికితీయలేదు. శ్రీకాకుళం జిల్లాలోని దంతపురానికి శ్రీలంకకు ఉన్న లింకేమిటి?. కళింగరాజుల హయాంలో దంతపురంలో బౌద్ధస్తూపం నిర్మితమైంది. ఆ స్తూపం కింద బుద్ధుడి అస్థికగా ఆయన దంతం ఉండేది. కానీ, ప్రస్తుతం ఆ దంతం శ్రీలంకలోని క్యాండీ సమీపంలోని ప్రముఖ బౌద్ధక్షేత్రం దవల మళిగవిలలో ఉంది. ఇక్కడి నుంచి అటెందుకు తరలింది? శ్రీకాకుళానికి శ్రీలంక దేశానికి మధ్య సంబంధం ఎలా కుదిరింది?.వేల కిలోమీటర్ల దూరంలోని దేశాల్లో తెలుగు వారు వందల ఏళ్లుగా ఎందుకుంటున్నారు? చరిత్రలో కచ్చితమైన సమాధానాల్లేని ప్రశ్నలెన్నో. కానీ వీటి వెనుక సహేతుక చారిత్రక కారణాలున్నాయి. వాటి తీగలాగితే మన దేశానికి–ఇతర దేశాలకు మధ్య వాణిజ్య, సాంస్కృతిక, విజ్ఞాన సంబంధ బాంధవ్యాల డొంక ఇప్పుడు కదులుతుంది. నాటి ఆధారాలు వెలికి తీస్తే ఇప్పుడు ఆయా దేశాలతో కొత్త మైత్రికి బాటలు వేయొచ్చు. ఇది వాణిజ్యపరంగా మన దేశానికి ఉపయోగపడొచ్చు. ఇప్పుడిలాంటి ఆలోచనలే కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. అందుకే సముద్ర మార్గం ఆధారంగా మన దేశం ఏయే దేశాలతో సంబంధాలు నెరిపిందో చారిత్రక ఆధారాలను వెలికితీయాలని నిర్ణయించింది. సముద్ర తీరం ఉన్న ప్రాంతాల్లో ‘ప్రాజెక్ట్ మౌసమ్’పేరుతో బృహత్తర అధ్యయనాన్ని నిర్వహించనుంది. ఈ బాధ్యతల్ని ప్రాంతాల వారీగా విభజించి కొందరు నిష్ణాతులకు అప్పగించింది. అందులో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అధ్యయన బాధ్యతను హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం చరిత్ర విభాగాధిపతి ప్రొఫెసర్ కె.పి.రావుకు అప్పగించింది. దేశాలతో కొత్త బాంధవ్యాలు ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఓడరేవు బందరు నుంచి కాకతీయ రాజులు ఇతర దేశాలతో వాణిజ్యపరమైన సంబంధాలు కొనసాగించారు. ప్రస్తుత తెలంగాణ ప్రాంతం నుంచి కూడా ఈ రేవు మీదుగా వస్తువుల ఎగుమతి, దిగుమతులు కొనసాగాయి. దాన్ని రూఢీచేసే శాసనాలు వెలుగు చూశాయి. అందుకే కాకతీయ శాసనాలు ఇప్పటికీ ఆంధ్ర సముద్ర తీరప్రాంతాల్లో కనిపిస్తాయి. ఇలా ఆసియా నుంచి ఆఫ్రికా వరకు ఎన్నో దేశాలతో కాకతీయుల కంటే ముందు, కాకతీయుల తర్వాత కూడా వాణిజ్య సంబంధాలు కొనసాగాయి. మన ప్రాంతాన్ని పాలించిన అన్ని సామ్రాజ్యాలు ఈ సంబంధాల్ని కొనసాగించాయి. వ్యాపార వాణిజ్యాలనే ప్రధాన లక్ష్యంతో మొదలైన ఈ సంబంధ బాంధవ్యాలు సంస్కృతీ సంప్రదాయాలతోనూ పెనవేసుకున్నాయి. మన దేశంలోని చాలా ప్రాంతాల్లో అలనాటి చారిత్రక నిర్మాణాల్లో విదేశీశైలి దీనికి నిదర్శనం. అప్పట్లోనే తెలంగాణ ప్రాంతం నుంచి నల్లరాయి ఆఫ్రికా, యూరప్‌లకు చేరింది. ఇప్పటికీ చాలా దేశాల్లో అక్కడ మన శైలి నిర్మాణాలు కనిపిస్తాయి. ఇక్కడి నుంచి ఇంజినీర్లు ఆయా దేశాలకు వెళ్లి నిర్మాణాల్లో పాలుపంచుకున్న దాఖలాలున్నాయి. ఇవి దేశాల మధ్య మైత్రికి దోహదం చేశాయి. క్రమంగా అవి కనుమరుగయ్యాయి. కానీ నాటి దోస్తీకి గుర్తుగా ఇప్పటికీ ఎన్నో చారిత్రక నిర్మాణాలు అలరారుతున్నాయి. ఆయా నిర్మాణాల ఆధారంగా నాటి మైత్రీజాడలను వెలికితీయాలని కేంద్రం నిర్ణయించింది. కొత్త వాణిజ్యానికి, స్నేహాలకు బాటలు ‘ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్’నోడల్ ఏజెన్సీగా కేంద్ర పర్యాటక శాఖ ఓ బృహత్తర కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఇది సముద్ర మార్గం ద్వారా మన దేశంలోని ఏయే ప్రాంతాలు ఏయే దేశాలతో సంబంధాన్ని కలిగి ఉండేవో వెలికితీయబోతోంది. వాటిని ప్రతిఫలించే నిర్మాణాలు, చారిత్రక స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి ప్రాధాన్యం ఏంటి, దానితో ఏయే దేశాలు సంబంధం కలిగి ఉన్నాయి, ఆ స్నేహానికి కారణంగా అసలు రెండు ప్రాంతాల మధ్య జరిగిన రవాణా ఏంటి, నాటి వాణిజ్యం, ఆర్థిక అంశాలు తదితర అన్ని వివరాలూ ఈ అధ్యయనంలో తేలనున్నాయి. ఆయా వివరాల ఆధారంగా ఆయా దేశాలతో ఇప్పుడు మనదేశం కొత్త మైత్రిని ఎలా పెంపొందించుకోవచ్చో ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఇది మళ్లీ కొత్త వాణిజ్యానికి బాటలు వేస్తుందని కేంద్రం నమ్ముతోంది. యునెస్కో గుర్తింపునకు అవకాశం మన తీరప్రాంతాల్లో విలసిల్లిన సంస్కృతి, దానికి గుర్తుగా ఉన్న నిర్మాణాలు, అవి ఇతర దేశాల మైత్రిని ప్రతిఫలించే తీరును వెలికితీసి యునెస్కో ముందు నిలపవచ్చన్న మరో ప్రయత్నాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. ప్రపంచ వారసత్వ జాబితాలో మనదేశంలోని కట్టడాలకు చోటు తక్కువే. ఆ గుర్తింపు పొందదగిన చరిత్ర ఉండి కూడా కొన్ని మరుగునపడ్డాయి. ఇప్పుడు చేపట్టబోయే కొత్త అన్వేషణ దానికి ప్రాణం పోస్తుందన్న ఆలోచన కేంద్రం మదిలో ఉంది. ఇది గొప్ప అధ్యయనం ‘ప్రాజెక్టు మౌసమ్’పేరుతో కేంద్ర పర్యాటక శాఖ నిర్వహించనున్న అధ్యయనం బృహత్తరమైంది. ఇది తీరప్రాంతాలతో గల విదేశీ సంబంధాల చరిత్రను వెలుగులోకి తెస్తుంది. మళ్లీ దేశాల మధ్య కొత్త సంబంధాలకు బాటలు వేయటమే కాక మన చరిత్ర యునెస్కో ముంగిట మెరిసేందుకు కారణం కానుంది. ఇందులో పాలుపంచుకునే అవకాశం నాకు దక్కడం గర్వంగా ఉంది. – ప్రొఫెసర్ కె.పి.రావు -
టొరంటోలో టూరిజం రోడ్ షో
సాక్షి, హైదరాబాద్: కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కెనెడాలోని టొరంటోలో గురువారం రోడ్‌షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి బీపీ ఆచార్య పాల్గొన్నారు. టొరంటోకు చెందిన సుమారు 100 మందికి పైగా ప్రముఖ టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లు ఈ రోడ్‌షోకు హాజరయ్యారు. ఉత్తర అమెరికా నుంచి హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు పర్యాటకులను పంపేందుకు ఆపరేటర్లు, ఏజెంట్లు ఆసక్తి చూపారు. టొరంటోలోని ఇండియన్ కాన్సుల్ జనరల్ అఖిలేశ్ మిశ్రాతో పాటు భారత పర్యాటక శాఖకు చెందిన సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.