‘మాస్‌ టూరిజం’ను కట్టడిచేయాలి | Mass tourism should be curtailed | Sakshi
Sakshi News home page

‘మాస్‌ టూరిజం’ను కట్టడిచేయాలి

Published Fri, Aug 27 2021 4:43 AM | Last Updated on Fri, Aug 27 2021 4:43 AM

Mass tourism should be curtailed - Sakshi

వర్చువల్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న మంత్రి కిషన్‌రెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ: మాస్‌ టూరిజం కారణంగా ఫైవ్‌ స్టార్‌ హోటళ్లు, భారీ భవంతులు నిర్మించడంతో లేహ్‌–లద్ధాఖ్‌ వంటి పర్యాటక ప్రాంతాల్లో జీవావరణ పరిస్థితులు దెబ్బతింటాయని కేంద్ర టూరిజం శాఖ డైరెక్టర్‌ జనరల్‌ గంజి కమలవర్ధనరావు అభిప్రాయపడ్డారు. లేహ్, కార్గిల్, నుమ్రా లోయ, లద్ధాఖ్‌లలో మాస్‌ టూరిజంతో జీవావరణ సమస్యలు తలెత్తకుండానే అభివృద్ధి సాధ్యమయ్యేలా పరిష్కారాలు కనుగొనాలన్నారు. కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో లేహ్‌లో ‘లద్ధాఖ్‌: నూతన ప్రారంభం, కొత్త లక్ష్యాలు’ పేరిట జరుగుతున్న మెగా టూరిజం ఈవెంట్‌లో గురువారం ఆయన పాల్గొని ప్రసంగించారు.

లేహ్‌–లద్ధాఖ్‌ వంటి ప్రాంతాల్లో పర్యాటక రంగాన్ని వృద్ధి చేస్తూనే మాస్‌ టూరిజంను కట్టడి చేయాలన్నారు. ఆధునిక హోటళ్ల కోసం కాంక్రీట్‌ భవనాలు నిర్మించే కన్నా స్థానికుల ఇళ్లలో పర్యాటకులు బస చేస్తే స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. పర్యాటకులకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఫైవ్‌స్టార్‌ హోటల్‌ స్థాయిలో ఆహారం, ఆతిథ్యం అందించేలా భాషా, తదితరాల్లో స్థానికులకు పర్యాటక శాఖ శిక్షణ ఇస్తోందన్నారు.

లేహ్‌–లద్ధాఖ్‌ వంటి ప్రాంతాల్లో ఎయిర్‌పోర్టుల కంటే ఎక్కువగా హెలిప్యాడ్ల నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. యూరప్‌లోని ఆల్ప్స్‌ పర్వతాల్లో 10వేలకుపైగా ప్రాంతాల్లో స్కీయింగ్‌ క్రీడా వేదికలున్నాయని, దాంతో కోట్లాది మంది పర్యాటకుల రద్దీ కారణంగా మంచు కరిగి, ఉష్ణోగ్రతలు పెరగడం వంటి జీవావరణ మార్పులు కొనసాగుతున్నాయని చెప్పారు. భారత్‌లోనూ ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా చూడాలన్నారు. కులూ మనాలీ, ఊటీ, మున్నార్‌ వంటి పర్యాటక ప్రాంతాల్లో గత 20 ఏళ్లలో వాతావరణ పరిస్థితులు చాలా మారాయన్నారు. లేహ్‌లోని వందలాది ట్యాక్సీల్లో చాలావరకు 10ఏళ్ల పాతవని, కర్భన ఉద్గారాల కట్టడిపై పటిష్టమైన విజన్‌ డాక్యుమెంట్‌ అవసరమన్నారు.  

కోలుకుంటున్న పర్యాటక రంగం
కోవిడ్‌ కారణంగా పర్యాటకరంగం కుదేలైందని, అయితే గత రెండు నెలలుగా దేశీయ పర్యాటకం మెరుగుపడుతుండటం కాస్త ఊరటనిచ్చే అంశమని  కమలవర్ధనరావు వ్యాఖ్యానించారు. ఇప్పటికే సుమారు 1.2కోట్ల మంది విదేశీ పర్యాటకులు భారత్‌కు వచ్చారని, అభయారణ్యాలు, తీరప్రాంతాలు, పుణ్యక్షేత్రాల్లో సందడి కనిపిస్తోందని తెలిపారు. హిమాలయ పర్వత శ్రేణుల్లో పర్యాటకం అభివృద్ధిపై శ్రద్ధవహించాలన్నారు. చారిత్రక కట్టడాల పరిరక్షణ, గ్రామీణ పర్యాటక రంగాన్ని ఏవిధంగా అభివృద్ధి చేయాలన్న అంశంపై రాష్ట్రాలు, పర్యాటకశాఖ దృష్టిసారించాలని కమలవర్ధన రావు సూచించారు. ఈ రంగం వృద్ధి కోసం మీడియాలో ప్రచారం కల్పించడంతో పాటు ప్రజల్లో అవగాహన మరింత పెంచాలన్నారు. సినిమా టూరిజంను పెంచేందుకు ప్రణాళికలు సిద్ధంచేశామన్నారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి కశ్మీర్, లేహ్‌–లద్ధాఖ్, ఈశాన్య రాష్ట్రాలకు పర్యాటకుల తాకిడి పెరుగుతోందని పేర్కొన్నారు.  

స్థానిక భాగస్వామ్యం ఎంతో కీలకం: కిషన్‌రెడ్డి
గత 40 ఏళ్లలో లద్దాఖ్‌లో పర్యాటక రంగం గణనీయమైన అభివృద్ధి సాధించిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ట్రెక్కర్లు, బైకర్లు, సైక్లిస్టులు, అధిరోహకులు మొదలైన వారికి లద్ధాఖ్‌ ఒక మంచి అనుభూతిని ఇస్తుందన్నారు. ఈ మెగా టూరిజం ఈవెంట్‌లో కిషన్‌రెడ్డి వర్చువల్‌ వేదికగా పాల్గొని ప్రసంగించారు. ‘లద్దాఖ్‌ అభివృద్ధికి దేశంలోని వేరే రాష్ట్రాల టూర్‌ ఆపరేటర్లు, స్థానికులతో చర్చలు జరిపేందుకు ఈవెంట్‌ మంచి వేదిక’ అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

లద్దాఖ్‌ పర్యాటక అభివృద్ధిపై చర్చించేందుకు ‘లద్దాఖ్‌ విజన్‌ డాక్యుమెంట్‌’ను కేంద్ర పర్యాటక శాఖ సిద్ధం చేసిందన్నారు. టూరిస్ట్‌ వాటర్‌ స్క్రీన్‌ ప్రొజెక్షన్‌ మల్టీమీడియా షోతో పాటు ఇతర పర్యాటక ఆకర్షణల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.23.21 కోట్లను లద్దాఖ్‌కు అందించిందన్నారు. ఈవెంట్‌లో లద్దాఖ్‌ టూరిజం సౌకర్యాలు, ఉత్పత్తుల ఎగ్జిబిషన్, చర్చా గోష్టిలు జరుగుతున్నాయి. ఈ రంగంలోని నిపుణులు, టూర్‌ ఆపరేటర్లు, హోటల్‌ యజమాన్యాలు, దౌత్యవేత్తలు, ‘హోం స్టే’ యజమానులు సహా 150 మంది ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement