శీతాకాలంలో పర్యాటక ప్రాంతాలకు పయనం
స్నో అడ్వెంచర్లకు కులుమనాలి అనువైన ప్రదేశంగా పేరొందింది. డిసెంబరులో కులుమనాలి చూసేందుకు వేలాది మంది సందర్శకులు వెళుతున్నారట. ఈ ప్రాంతం ప్రపంచంలోనే మంచు క్రీడలకు ప్రత్యేకమైనదిగా ఖ్యాతి గడించింది. అదే సమయంలో ఎన్నో కొత్త జంటలకు మనాలి హనీమూన్ స్పాట్‌గానూ పిలచుకుంటారు. ఉత్తరాఖండ్‌లోని ఔలి ప్రాంతం నుంచి చూస్తే హిమాలయాలు స్పష్టంగా కనిపిస్తాయి. హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లా పర్యాటకుల మనసు దోచుకుంటుంది. అక్కడి ఇళ్లపై మంచు దుప్పటిలా పరుచుకుంటుంది.
లద్దాఖ్‌లో మంచు వర్షం పర్యాటకులను కనువిందు చేస్తుంది. జమ్మూకశ్మీర్‌లో కేబుల్ కార్ ప్రత్యేక ఆకర్షణ. శ్రీనగర్, డార్జిలింగ్, కొడైకెనాల్, ఊటీ తదితర ప్రదేశాలకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేడిని తట్టుకునే బట్టలు వెంట తీసుకోవడంతో పాటు, వైద్యుల సూచనల మేరకు మందులు సిద్ధంగా ఉంచుకోవాలని పేర్కొంటున్నారు. అక్కడి రహదారులపై అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్నారు.
కొత్త అనుభూతినిచ్చింది..
కుటుంబ సభ్యులంతా కలసి మనాలి టూర్ వెళ్లాం. ఎనిమిది రోజుల లాంగ్ టూర్ అది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకూ విమానంలో వెళ్లాం. అక్కడి నుంచి రాత్రంతా బస్సు ప్రయాణం. మనాలిలో ఒక రోజు బస చేశాం. కొత్త ప్రాంతం మంచు కొండలు, ప్రకృతి అందాలు, గ్రీనరీ మనసుకు హాయిగా అనిపించాయి. నదిలో రాప్టింగ్ చేశాం. హోటల్‌లో రాత్రి ఫైర్ క్యాంప్ ఏర్పాటు చేశారు. అక్కడి వాతావరణం, వస్త్రధారణ కొత్త అనుభూతినిచ్చింది.
– విజయ్ కుమార్ జైన్, హైదరాబాద్
ప్రయాణం ఇలా..
హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకూ విమానంలో ప్రయాణించి, అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు రహదారి మార్గంలో చేరుకోవాలి. యువత కార్, మోటారు సైకిళ్లను అద్దెకు తీసుకుని మంచు కొండల్లో రయ్.. రయ్..మంటూ దూసుకుపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment