World Tourism Day: లోకం చుట్టేద్దాం | World Tourism Day 2022: Celebration Rethinking Tourism in the world | Sakshi
Sakshi News home page

World Tourism Day: లోకం చుట్టేద్దాం

Published Tue, Sep 27 2022 5:16 AM | Last Updated on Tue, Sep 27 2022 7:10 AM

World Tourism Day 2022: Celebration Rethinking Tourism in the world - Sakshi

నిత్యం ఒత్తిళ్ల నడుమ బిజీ బిజీగా సాగే రొటీన్‌గా బతుకుల్లో అప్పుడప్పుడూ కాస్త కొత్తదనం నింపేవి టూర్లే. కరోనాతో   కుదేలైన పర్యాటక రంగం కొన్నాళ్లుగా తిరిగి కళకళలాడుతోంది. ప్రపంచ
పర్యాటక దినోత్సవం సందర్భంగా పలు దేశాలు రీ థింకింగ్‌ టూరిజం పేరుతో టూరిస్టులను ఆకర్షించే ప్రయత్నాల్లో ఉన్నాయి...


కరోనాతో తీవ్రంగా నష్టపోయిన ప్రధాన రంగాల్లో పర్యాటకం ఒకటి. రెండేళ్ల పాటు లాక్‌డౌన్లు, అంతర్జాతీయ రాకపోకలపై నిషేధాలతోనే సరిపోయింది. దాంతో పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న శ్రీలంక వంటి దేశాలు ఆర్థికంగా చితికిపోయాయి. సాధారణ పరిస్థితులు నెలకొంటుండటంతో సెప్టెంబర్‌ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ‘రీ థింకింగ్‌ టూరిజం’ థీమ్‌తో పలు దేశాలు ముమ్మరంగా ప్రమోట్‌ చేస్తున్నాయి.

టూరిస్టులు ఇష్టపడే ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేయడం, కాస్త అలా తిరిగి వస్తే నిత్య జీవిత ఒత్తిళ్ల నుంచి బయట పడవచ్చంటూ ప్రచారం చేయడంపై దృష్టి పెట్టాయి. పర్యాటక రంగంలో ప్రపంచ దేశాల్లో ఫ్రాన్స్‌కు తిరుగు లేదని ఎన్నో సర్వేలు తేల్చాయి. 2019లో ఏకంగా 9 కోట్ల మంది అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించింది. దేశ జీడీపీలో 8% వాటా పర్యాటక రంగానిదే. కరోనా వేళ ఫ్రాన్స్‌కు టూరిస్టులు సగానికి సగం తగ్గిపోయారు. మళ్లీ ఈ ఏడాది ఆ దేశానికి టూరిస్టుల తాకిడి పెరిగింది. తర్వాతి స్థానాల్లో స్పెయిన్, అమెరికా, జర్మనీ, స్విట్జర్లాండ్, సింగపూర్‌ తదితరాలున్నాయి. టాప్‌ 10 దేశాల్లో యూరప్, ఆసియా ఫసిఫిక్‌ దేశాలే ఎక్కువగా ఉండటం విశేషం!

ఎటు చూసినా ఎకో టూరిజమే
ఎకో టూరిజం. సింపుల్‌గా చెప్పాలంటే ప్రకృతి సౌందర్యంలో లీనమైపోవడం. కాంక్రీట్‌ అడవుల్లో నిత్యం రణగొణధ్వనుల మధ్య బతికేవారు అప్పుడప్పుడూ ప్రకృతి అందాల మధ్య రిలాక్సవడం. ఉద్యానవనాలు, అడవులు, సముద్ర తీర ప్రాంతాల సందర్శన, కొండలు గుట్టలు ట్రెక్కింగ్, ఆయా ప్రాంతాల సంస్కృతిని తెలుసుకోవడంపైç ప్రజలు ఆసక్తి చూపుతుండటంతో అన్ని దేశాలూ ఎకో టూరిజం అభివృద్ధిపై దృష్టి పెట్టాయి. మారుమూలల్లోని ప్రాకృతిక అందాలని టూరిస్ట్‌ స్పాట్లుగా తీర్చిదిద్దితే ఇటు ఆదాయం రావడంతో పాటు పేదరికంలో మగ్గుతున్న స్థానికుల బతుకులూ బాగుపడతాయి. ఐస్‌ల్యాండ్, కోస్టారికా, పెరు, కెన్యా, అమెజాన్‌ అడవులతో అలరారే బ్రెజిల్‌ వంటివి ఎకో టూరిజానికి పెట్టింది పేరు. ప్రపంచ ఎకో టూరిజం మార్కెట్‌ 2019లో 9 వేల కోట్ల డాలర్లు. 2027 నాటికి 11 వేల కోట్ల డాలర్లకు చేరొచ్చని అంచనా.  

పర్యాటకానిది పెద్ద పాత్ర
► పర్యాటక రంగానికున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ప్రపంచ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 10% వాటా దీనిదే!
► ప్రపంచ ఎగుమతుల్లో 7% పర్యాటకుల కోసమే జరుగుతున్నాయి.
► ప్రతి 10 ఉద్యోగాల్లో ఒకటి పర్యాటక రంగమే కల్పిస్తోంది.
► 2019లో అత్యధికంగా ఫ్రాన్స్‌ను 9 కోట్ల మంది సందర్శించారు. 8.3 కోట్లతో స్పెయిన్, 7.9 కోట్ల పర్యాటకులతో అమెరికా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
► పర్యాటక రంగం 2019లో ప్రపంచవ్యాప్తంగా 33.3 కోట్ల ఉద్యోగాలు కల్పించింది. కరోనా దెబ్బకు 2020లో ఇది ఏకంగా 2.7 కోట్లకు తగ్గిపోయింది.
► 2019లో భారత జీడీపీలో పర్యాటక రంగానిది 6.8% వాటా. 2020 నాటికి 4.7 శాతానికి తగ్గింది.
► 2019లో 1.8 కోట్ల మంది భారత్‌ను సందర్శిస్తే 2020లో 60 లక్షలకు పడిపోయింది.
► 2020 నాటికి దేశ పర్యాటక రంగం 8 కోట్ల ఉద్యోగాల కల్పించింది.


భారత్‌.. పర్యాటక హబ్‌
► పర్యాటక రంగ పురోగతికి భారత్‌ పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
► సుస్థిర, బాధ్యతాయుత పర్యాటకమే లక్ష్యంగా కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి జి.కిషన్‌ రెడ్డి ఇటీవల ధర్మశాల డిక్లరేషన్‌ ఆమోదించారు.
► పర్యాటక రంగ వృద్ధితో విదేశీ మారక నిల్వలు పెరిగి దేశం ఆర్థికంగా సుసంపన్నంగా మారుతుంది.
► 2030 నాటికి పర్యాటక ఆదాయం జీడీపీలో 10 శాతానికి పెంచడం, 2.5 కోట్ల విదేశీ పర్యాటకులను రప్పించడం, 14 కోట్ల ఉద్యోగాలు కల్పించడం లక్ష్యం. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement