(వారణాసి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి)
సాంస్కృతిక సంబంధాలు మెరుగుపడటం ద్వారా దేశాల మధ్య ఆర్థిక, దౌత్యపరమైన పురోభివృద్ధి సాధ్యమని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు. భారత్ నుంచి ఎన్నో విలువైన పురాతన విగ్రహాలు, వెలకట్టలేని అతి పురాతన విగ్రహాలు దేశం దాటి వెళ్లాయని, వాటిని తిరిగి భారత్‌కు తేవడానికి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
వారణాసిలో జరుగుతున్న జీ20 సాంస్కృతిక శాఖల మంత్రులు, అధికారుల సదస్సులో పాల్గొన్న అనంతరం ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. 2014 ముందు ప్రభుత్వాలు విదేశాల నుంచి కేవలం 13 పురాతన విగ్రహాలను దేశానికి తిరిగి రప్పిస్తే, మోదీ అధికారంలోకి వచ్చాక దాదాపు 400 పురాతన విగ్రహాలను రప్పించి ఆయా రాష్ట్రాలకు అప్పగించిన విషయాన్ని గుర్తు చేశారు.
జీ20 సభ్య దేశాలు, ఆహ్వనిత దేశాలు, పలు అంతర్జాతీయ సంస్థలు ఈ సదస్సులో పాల్గొన్నాయని, అందరి సమ్మతితో శనివారం వారణాసి జీ20 డిక్లరేషన్ ప్రకటిస్తామని మంత్రి వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్కృతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారం కోసం అధికారుల స్థాయిలో జరిగిన చర్చల్లో సానుకూల స్పందన వచ్చిందన్నారు. విలేకరుల సమావేశంలో ఆ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖీ, ఆ శాఖ కార్యదర్శి గోవింద్ తదితరులు పాల్గొన్నారు.
యూత్ టూరిజం క్లబ్స్‌దే కీలకపాత్ర
విద్యార్థుల్లో వివేకం పెంపొందించేందుకు యూత్ టూరిజం క్లబ్స్ కీలకపాత్ర పోషిస్తాయని కిషన్‌రెడ్డి అన్నారు. ‘సాంస్కృతిక విరాసత్ స్పర్ధ –2023’లో భాగంగా యువ టూరిజం క్లబ్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. భారత భవిష్యత్తు అంతా విద్యార్థులదేనని, అందుకు అధ్యాపకులు, ఉపాధ్యాయులు క్షేత్రస్థాయిలో అందిస్తున్న కృషి ఎనలేనిదన్నారు.
99 శాతం విద్యపై దృష్టి పెడితే.. కనీసం ఒక్క శాతమైనా పాఠ్యేతర అంశాలపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. స్పోర్ట్స్, ఎన్‌సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో గానీ, ఇతర సామాజిక సేవా కార్యక్రమాల్లో గానీ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో సేవా తత్పరతతోపాటు దేశం పట్ల అవగాహన పెంచే లక్ష్యంతోనే ‘యువ టూరిజం క్లబ్స్’ను ప్రారంభించినట్లు తెలిపారు.
ప్రతీ ఇంట్లో కుటుంబసమేతంగా పర్యాటక క్షేత్రాలను సందర్శించాలంటే.. ఎక్కడకు వెళ్లాలో నిర్ణయించేది ఆ కుటుంబంలోని చిన్నారులు, విద్యార్థులేనని అన్నారు. అందుకే వారికి దేశంలోని, సమీపంలోని పర్యాటక క్షేత్రాలపై, ప్లాస్టిక్ రహిత పర్యాటకాన్ని ప్రోత్సహించడంపై అవగాహన కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment