లండన్‌లో ఎన్‌ఐఎస్‌ఏయూ సభ్యులతో ఎమ్మెల్సీ కవిత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేసీఆర్‌పాలన స్వర్ణయుగాన్ని తీసుకొచ్చిందని, అన్నిరంగాల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలబడిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. లండన్ పర్యటనలో ఉన్న ఆమె నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అలుమిని అసోసియేషన్ –యూకే (ఎన్‌ఐఎస్‌ఏయూ) సభ్యులతో సంభాషించారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు కవిత సమాధానాలు ఇచ్చారు.
మహిళారిజర్వేషన్లు, తెలంగాణ అభివృద్ధి, తన రాజకీయ జీవితం తదితర అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. రాష్ట్రం ఏర్పడిన వెంటనే సకలజనుల సర్వే నిర్వహించి, ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతుల వివరాలు సేకరించడం ద్వారా, వారి జీవితాల్లో మార్పు తెచ్చారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం కులవృత్తుల వారిని ప్రోత్సహించేందుకు కృషి చేసిన వివరాలు వెల్లడించారు.
మైనారిటీలకు ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలల్లో నెలకొల్పడంతో వారిలో విద్య పట్ల ఆసక్తి పెరిగిందని, గతంలో ఎన్నడూ లేనంతగా పాఠశాలలకు హాజరుశాతం పెరిగిందన్నారు. సీఎం కృషి వల్ల తెలంగాణ ప్రగతిపథంలో నడుస్తోందని, సంపద సృష్టించి గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పరిపుష్టి చేయాలన్నది తమ అధినేత కేసీఆర్ ఆలోచన అని తెలిపారు.
మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటం
తాను ప్రజాజీవితంలోకి వచ్చిన తర్వాత తరచూ లేవనెత్తిన అంశాల్లో మహిళా రిజర్వేషన్ల అంశం ఒకటని తెలిపారు. మహిళా రిజర్వేషన్ల చట్టం అమలును డీలిమిటేషన్‌కు ముడిపెట్టడం సరికాదన్నారు. మహిళా రిజర్వేషన్లపై ప్రజల్లో అవగాహన వస్తోందని.. తెలంగాణ స్థానిక సంస్థల్లో 55–57 శాతం మహిళా ప్రజాప్రతినిధులు ఉన్నా, సమావేశాలు నిర్వహిస్తే ఎక్కువ పురుషులు కనిపిస్తారని, ఆ పరిస్థితి మారాలని చెప్పారు.
ప్రజల జీవితాల్లో మార్పు కోసమే రాజకీయాల్లోకి..
తెలంగాణ కోసం కరీంనగర్ ఎంపీ పదవికి రాజీనామా చేసి తిరిగి కేసీఆర్ పోటీ చేసినప్పుడు మొదటిసారి రాజకీయ ప్రచారం చేశానని కవిత గుర్తు చేశారు. ఓ గ్రామీణ మహిళ తనకు రూ. వెయ్యి ఆదాయం ఎక్కువగా వస్తే పిల్లలను చదివించుకోగలనని అన్నారని, ఆ సమయంలోనే ప్రజాజీవితంలోకి వచ్చి ప్రజల జీవితాల్లో మార్పు తేవడానికి కృషి చేయాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment