Alumni
-
భారత్‌కు మించింది లేదు: యూట్యూబ్ ఎండీ
ప్రతిభావంతులైన, ఔత్సాహికులైన యువతకు ప్రస్తుతం భారత్‌కు మించిన మెరుగైన ప్రదేశం మరొకటి లేదు. ఈ మాట అంటున్నది ఎవరో కాదు.. యూట్యూబ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఇషాన్ ఛటర్జీ. ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థి అయిన ఇషాన్ ఛటర్జీ గత సంవత్సరం యూఎస్ నుంచి భారత్‌కు తిరిగి వచ్చారు. హెచ్‌పీఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇటీవల హైదరాబాద్ వచ్చారు. ఎన్డీటీవీతో పలు విషయాలు వెల్లడించారు. భారత్‌లో రాబోయే 10 సంవత్సరాలు అద్భుతంగా ఉండబోతున్నాయన్నారు. భారత్ అత్యంత వైవిధ్యమైన, డైనమిక్ ఉత్తేజకరమైన మార్కెట్ అని పేర్కొన్నారు. భాషతో సంబంధం లేకుండా దేశంలోని మారుమూల ప్రాంతాలకు చెందిన కంటెంట్ క్రియేటర్లకు సైతం యూట్యూబ్ వేదికను కల్పించిందన్నారు. ఇషాన్ ఛటర్జీ పాఠశాల విద్యాభ్యాసం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో సాగింది. ఢిల్లీలోని సెయింట్ స్టీపెన్స్ కాలేజీ నుంచి డిగ్రీ చేసిన ఆయన అమెరికాలోని వార్టన్ స్కూల్ యూనివర్సిటీ నంచి ఎంబీఏ పూర్తి చేశారు. యూట్యూబ్‌కు ముందు ఇషాన్ ఛటర్జీ గూగుల్, మెకెన్సీ కంపెనీల్లో పనిచేశారు. -
కేసీఆర్ పాలన స్వర్ణయుగం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేసీఆర్‌పాలన స్వర్ణయుగాన్ని తీసుకొచ్చిందని, అన్నిరంగాల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలబడిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. లండన్ పర్యటనలో ఉన్న ఆమె నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అలుమిని అసోసియేషన్ –యూకే (ఎన్ఐఎస్ఏయూ) సభ్యులతో సంభాషించారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు కవిత సమాధానాలు ఇచ్చారు. మహిళారిజర్వేషన్లు, తెలంగాణ అభివృద్ధి, తన రాజకీయ జీవితం తదితర అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. రాష్ట్రం ఏర్పడిన వెంటనే సకలజనుల సర్వే నిర్వహించి, ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతుల వివరాలు సేకరించడం ద్వారా, వారి జీవితాల్లో మార్పు తెచ్చారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం కులవృత్తుల వారిని ప్రోత్సహించేందుకు కృషి చేసిన వివరాలు వెల్లడించారు. మైనారిటీలకు ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలల్లో నెలకొల్పడంతో వారిలో విద్య పట్ల ఆసక్తి పెరిగిందని, గతంలో ఎన్నడూ లేనంతగా పాఠశాలలకు హాజరుశాతం పెరిగిందన్నారు. సీఎం కృషి వల్ల తెలంగాణ ప్రగతిపథంలో నడుస్తోందని, సంపద సృష్టించి గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పరిపుష్టి చేయాలన్నది తమ అధినేత కేసీఆర్ ఆలోచన అని తెలిపారు. మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటం తాను ప్రజాజీవితంలోకి వచ్చిన తర్వాత తరచూ లేవనెత్తిన అంశాల్లో మహిళా రిజర్వేషన్ల అంశం ఒకటని తెలిపారు. మహిళా రిజర్వేషన్ల చట్టం అమలును డీలిమిటేషన్‌కు ముడిపెట్టడం సరికాదన్నారు. మహిళా రిజర్వేషన్లపై ప్రజల్లో అవగాహన వస్తోందని.. తెలంగాణ స్థానిక సంస్థల్లో 55–57 శాతం మహిళా ప్రజాప్రతినిధులు ఉన్నా, సమావేశాలు నిర్వహిస్తే ఎక్కువ పురుషులు కనిపిస్తారని, ఆ పరిస్థితి మారాలని చెప్పారు. ప్రజల జీవితాల్లో మార్పు కోసమే రాజకీయాల్లోకి.. తెలంగాణ కోసం కరీంనగర్ ఎంపీ పదవికి రాజీనామా చేసి తిరిగి కేసీఆర్ పోటీ చేసినప్పుడు మొదటిసారి రాజకీయ ప్రచారం చేశానని కవిత గుర్తు చేశారు. ఓ గ్రామీణ మహిళ తనకు రూ. వెయ్యి ఆదాయం ఎక్కువగా వస్తే పిల్లలను చదివించుకోగలనని అన్నారని, ఆ సమయంలోనే ప్రజాజీవితంలోకి వచ్చి ప్రజల జీవితాల్లో మార్పు తేవడానికి కృషి చేయాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానన్నారు. -
ఘనాపాఠీల చదువులకు కేరాఫ్ బేగంపేట ‘హెచ్‌పీఎస్’
హైదరాబాద్: ప్రపంచ సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి.. మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి.. సినీనటులు అక్కినేని నాగార్జున, రామ్‌చరణ్.. ప్రస్తుత నగర కమిషనర్ సీవీ ఆనంద్.. ప్రఖ్యాత క్రికెట్ వ్యాఖ్యత హర్షభోగ్లే.. ఇలా ఏ రంగాన్ని తట్టినా మేటి స్థానాల్లో నిలబడిన వారెందరో. వారందరికీ అది పునాది రాయి.. ఇదే వారి ప్రఖ్యాతికి మైలు రాయి. రాష్ట్ర, దేశ ఖ్యాతిని ఖండాంతరాలకు తీసుకువెళ్లింది. అక్కడ విద్యాభ్యాసం చేసిన ఎందరో ప్రస్తుతం ఉన్నత శిఖరాలను అధిరోహించి భరతమాత ముద్దు బిడ్డలుగా ఎదిగారు. వారంతా ఓనమాలు నేర్చుకున్న ఆ సరస్వతీ నిలయానికి అక్షరాలా నూరేళ్లు. అదే బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్). నేటి నుంచి శతాబ్ది ఉత్సవాలు జరుపుకొంటున్న హెచ్‌పీఎస్‌పై ప్రత్యేక కథనం. అవతరణ ఇలా.. ఉన్నత వర్గాల వారి కోసం ముఖ్యంగా నవాబులు, జాగీర్దార్లు, బ్రిటిష్ అధికారుల పిల్లల చదువుల కోసం 1923లో బేగంపేటలో ‘జాగీర్దార్ కాలేజ్’ పేరుతో ఈ స్కూల్ షురువైంది. దీర్ఘకాలిక లీజు ప్రాతిపదికన పాఠశాలకు స్థలాన్ని కేటాయించారు. బ్రిటిష్ విద్యావేత్త షాక్రాస్ మొదటి ప్రిన్సిపాల్‌గా ముగ్గురు విద్యార్థులతో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో ప్రారంభమైంది. 1950లో ప్రభుత్వం జమీందారీ వ్యవస్థకు స్వస్తి చెప్పడంతో అప్పటివరకు కేవలం ప్రముఖుల పిల్లలకే పరిమితమైన జాగీర్దార్ స్కూల్ 1951లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌గా అవతరించింది. నాటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ మొదటి అధ్యక్షుడిగా హెచ్‌పీఎస్ సొసైటీ ఏర్పడింది. 1988 వరకు బాలురకు మాత్రమే పరిమితమైన హెచ్‌పీఎస్‌లో ఆ తర్వాత బాలికలకు కూడా ప్రవేశాలు కల్పించారు. దాదాపు 122 ఎకరాల సువిశాల ప్రాంగణం.. పెద్ద క్రీడా మైదానం.. ఎటుచూసినా పచ్చదనం.. లైబ్రరీ, ఇ–లైబ్రరీ, డైనింగ్‌హాల్, ఆధునిక లేబరేటరీలు, హాస్పిటల్, అన్ని రకాల క్రీడా కోర్టులు, గుర్రపు స్వారీ.. ఇలా అత్యాధునిక వసతులతో హెచ్‌పీఎస్ అలరారుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు 3,200 మంది పైచిలుకు విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. అప్పట్లోనే అద్భుతమైన ఆర్కిటెక్చర్‌తో ఇండో– సారాసెనిక్ శైలిలో పాఠశాల భవనాన్ని నిర్మించారు. హెచ్‌పీఎస్‌కు విద్యారంగంలోని దాదాపు అన్ని రకాల ఉన్నత స్థాయి అవార్డులు వరించాయి. ఎడ్యుకేషన్ వరల్డ్, ఫ్యూచర్ 50 అవార్డు, ఎడ్యుకేషన్ టుడేస్ ఇండియా స్కూల్ మెరిట్ అవార్డ్, బెస్ట్ ఇన్నోవేటివ్ కే–12 స్కూల్ అవార్డులను సొంతం చేసుకుంది. ప్రస్తుతం పాఠశాల ప్రిన్సిపాల్‌గా డాక్టర్ మాధవ్‌దేవ్ సరస్వత్ కొనసాగుతున్నారు. అతిపెద్ద ఎడ్యుకేషన్ సైన్స్ ఫెస్టివల్.. హెచ్‌పీఎస్ శతాబ్ది ఉత్సవాలు ఏడాది పొడవునా నిర్వహించాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు పలు ప్రతిష్టాత్మక కార్యక్రమాల నిర్వహణను చేపట్టింది. అందులో భాగంగా మొదటి దఫాగా ఈ నెల 20 నుంచి 27 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 20 నుంచి 22 వరకు మూడు రోజుల పాటు ఇండియా సైన్స్ ఫెస్టివల్ (ఐఎస్ఎఫ్)తో శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 22న సింఫనీ ఆర్కెస్ట్రా ఆఫ్ ఇండియా ప్రదర్శన ఉంటుంది. 22 నుంచి 27 మధ్యన రౌండ్ స్క్వేర్ కాన్ఫరెన్స్‌లు నిర్వహించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్‌రంజన్‌లు హాజరుకానున్నారు. (క్లిక్ చేయండి: వైద్య విద్యార్థుల గోస.. టీఆర్ఆర్ మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు రద్దు) సమాజానికి అమూల్యమైన సేవ.. విద్య ద్వారా సమాజానికి అమూల్యమైన సేవను హెచ్‌పీఎస్ అందిస్తోంది. సైన్స్, ఆర్ట్, మ్యూజిక్, డ్యాన్స్, అడ్వంచర్, ఇన్నోవేషన్, ఎక్స్పోజర్, సహకారం, నెట్వర్కింగ్, కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్‌పరంగా ప్రయోజనం చేకూర్చేలా శతాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నాం. – డాక్టర్ మాధవ్‌దేవ్ సరస్వత్, ప్రిన్సిపాల్ -
PDSU: ‘ప్రగతిశీల’ శక్తులన్నీ ఒక్కటి కావాలి!
హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం కేంద్రంగా 1974లో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) ఏర్పడి మరో ఏడాదికి 50 ఏళ్లు నిండనున్నాయి. అసమానమైన పోరాటాలతో, త్యాగాలతో ఇరు రాష్ట్రాల ప్రజలపై పీడీఎస్‌యూ చూపిన ప్రభావం ఎవ్వరూ చెరపలేనిది. ఈ సంస్థకు రాష్ట్ర ఉపాధ్యక్షునిగా 1980 దశకం నాటికే నా ప్రత్యక్ష నిర్మాణ సంబంధం ముగిసిపోయింది. కానీ సోదరుడు కామ్రేడ్ కూర రాజన్న ద్వారా మా ఇంటి తలుపు తట్టిన అమరుడు కామ్రేడ్ జార్జిరెడ్డి జ్ఞాపకం, ఎంతోమంది గుండెల్ని రగిలించిన ఆయన ప్రస్థానం.. నేను పుట్టి పెరిగిన సిరిసిల్ల ప్రాంత రైతాంగ పోరాటాల వెల్లువతో పెనవేసుకుపోయింది. అదే విప్లవోద్యమంతో ముడిపడి పోయి రెండు తరాల విప్లవ విద్యార్థులతో నా ఇన్నేండ్ల ప్రయాణాన్ని నిర్దేశిస్తూ వస్తోంది. అందుకే నాకిది జ్ఞాపకం మూత్రమే కాదు, వర్తమాన నిజం. అలాంటి జ్ఞాపకాలన్నింటినీ తట్టిలేపుతూ, గతం–వర్తమాన పరిస్థితులను బేరీజు వేసుకుంటూ 2023 జనవరి 21న, పీడీఎస్‌యూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరగడం అపూర్వమనే భావించాలి. కామ్రేడ్ జార్జిరెడ్డి ఆధ్వర్యాన ఏర్పడిన పీడీఎస్‌యూ, ఆయన అమరుడైన ఏప్రిల్ 14 (1974)ననే పీడీఎస్‌యూగా ఆవిర్భవించింది. అది మొదలు అధిక ధరలపై, పలు సమస్యల సాధనకై పోరాడింది. కామ్రేడ్స్ భూమయ్య, కిష్టాగౌడ్‌ల ఉరిశిక్షల రద్దుకై ఉద్యమించింది. రైల్వే కార్మికుల సమ్మెకు మద్దతుగా నడిచింది. శ్రీకాకుళ గోదావరి లోయ పోరాటాలకు సంఘీభావంగా నిలిచింది. శ్రామికవర్గ అంతర్జాతీయతను ఎలుగెత్తి చాటి, ప్రపంచ పౌరుడిగా అవతరించిన చేగువేరా త్యాగనిరతిని పునికి పుచ్చుకుంది. అందుకే మతోన్మాదుల చేతుల్లో జార్జ్, చాంద్ పాషాల హత్యలు మొదలు... రాజ్యమే యుద్ధం ప్రకటించడంతో జంపాల, శ్రీపాద శ్రీహరిల నుండి చంద్రశేఖర్, రియాజ్‌ల వరకూ డజనుల కొలది విద్యార్థి వీరులు అమరు లైనారు. మరి ఎంతోమంది విద్యాలయాల నుండి పయనమై సమాజపు విముక్తిలో అంతర్భాగమైనారు. ఇందులో కొందరు తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో నిలబడి బూర్జువా పార్లమెంటరీ రాజకీయాల్లో కీలకంగా ఎదిగారు. ఈనాడు విప్లవ విద్యార్థి ఉద్యమం ఎదుర్కొంటున్న సమస్యల ప్రత్యేక సందర్భంలో పలు పీడీఎస్యూలన్నీ ఒకే తాటి మీదకు రావడమనేది, ప్రధాన ఎజెండా కావాలనేది నా అభిప్రాయం. ఇప్పుడు గతం కంటే తీవ్రంగా యావద్దేశం హిందుత్వ రాజకీయాల ఫాసిస్టు దాడికి గురవుతోంది. ప్రారంభం నుండీ ఇలాంటి ఉన్మాద దాడుల్లోనే రక్తసిక్త పసిగుడ్డుగా పుట్టిన పీడీఎస్‌యూ అనతి కాలంలోనే ఎమర్జెన్సీ ఫాసిస్టు దాడికి గురయ్యింది. చితాభస్మంలోంచి లేచిన ఫినిక్స్ పక్షిలాగా మారిన పీడీఎస్‌యూ నేడు అప్రకటిత ఎమర్జెన్సీని ఎదుర్కొంటూనే మునుముందుకు సాగుతోంది. అయితే పీడీఎస్‌యూలో సంభవించిన చీలికలు ఉద్యమ గమనం మందగించడానికి కారణమయ్యాయి. నాకు సమకాలికులుగా ఉన్న చాలామంది కామ్రేడ్స్ ప్రత్యక్షంగా ఎదుర్కొన్న 1984 నాటి చీలికను చూసి కొందరు పీడ విరగడయిందని (గుడ్ రిడెన్స్) భావించిన వాళ్లున్నారు. కానీ అసలు పీడ అక్కడ నుండే మొదలయ్యింది. ఆ తర్వాతి 45 ఏళ్లలో 1986 రాజీవ్‌గాంధీ నూతన విద్యా విధానం, రిజర్వేషన్లు, ఎల్పీజీ, విద్యా కాషాయీకరణ – కార్పొరేటీకరణ లాంటి ఎన్నో పరిణామాలు వచ్చాయి. విద్యాహక్కు చట్టం తర్వాత కూడా ఎన్నో పాఠశాలలు మూసివేయబడి, సార్వజనీన విద్య (కామన్ స్కూల్ ఎడ్యుకేషన్) అనేది కనుమరుగై పోయింది. వాటన్నిటిపై ప్రగతిశీల విద్యార్థి ఉద్యమం బలాబలాలు మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. రెండు తరాలూ... అధిక ధరలు, ఆకలి చావులు, అన్నార్థుల ఆవేదనలు, దేశ సంపదను దోచుకెళ్తున్న పిడికెడు మంది బడా దోపిడీ దారులకు వ్యతిరేకంగా సాగే పోరాటాలతో మమేకం కావాలని కోరుకోవడం ఆహ్వానించతగ్గది. సమ్మేళనం బాధ్యతను నెత్తికెత్తుకున్న నిర్వాహకులకు విప్లవాభినందనలు. ఇది బయటి వ్యక్తి మాటగా కాకుండా మీతో నేను, నాతో మీరుగానే స్వీకరించాలని నా విజ్ఞప్తి. – అమర్ (జనవరి 21 పీడీఎస్‌యూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం సందర్భంగా) -
Bapatla Agricultural College: తల్లీ! నీ కీర్తి అజరామరం
తల్లీ... నీకు 75 సంవత్సరాలు. నీ ఒడిలో అక్షరాలు దిద్దుకున్న ఎందరో నీ కీర్తి పతాకను వినువీధుల్లో ఎగురవేశారు. అంతర్జాతీయ వ్యవసాయరంగ చిత్ర పటంలో నిన్ను నిలిపారు. సముచిత స్థానం కల్పించి నిన్ను గర్వపడేలా చేశారు. వరిలో జయ, హంసలతో శాస్త్రి, సాంబ మాషూరితో ఎం.వి. రెడ్డి; స్వర్ణతో రామచంద్రరావులు సుపరిచితులు. జొన్న పంటకు జీవం తెచ్చిన గంగా ప్రసాదరావు, చిరుధాన్యాలను ఇంటి పేరు చేసుకున్న హరి నారాయణలు నీ బిడ్డలే. మీ పిల్లలు మామూలు వాళ్ళు కారు. కాలాన్ని బట్టి, పంటలను శాసించి, వాటిలో మార్పులు తెచ్చి రైతుకు భరోసా ఇచ్చారు. చెరకును పీల్చి పిప్పి చేసి రైతుకు తియ్యని రసం అందించిన కోటికలపూడి నుంచి జరుగుల దాకా అందరూ నీ చనుబాలు తాగిన వారే. నరసింహ, బ్రహ్మ, ప్రత్తి రవీంద్ర నాథ్ నుండి జెన్నీ జాదు జాక్పొట్ వరకు... ఇలా చెప్పుకుంటూ పోతే నీ పిల్లల ఘన చరిత అనంతం. నేర్పిన విద్య, సంపద అంతా సమాజానికి సమంగా చెందాలనే ఉన్నత ఆశయంతో వెన్నెల పంచిన వేమూరి చంద్ర శేఖరుడు, ప్రాణత్యాగం చేసిన గోపబోయిన ప్రసాద్‌లు కూడా నీ ఒడిలో అక్షరాలు దిద్దినవారే. నీ 50 ఏళ్ల ప్రస్థానాన్ని ఒక కమనీయ దృశ్య రూపకంగా మలచి దూరదర్శన్ ద్వారా ప్రసారం చేసిన బొగ్గవరపు, హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం ద్వారా ఒక సంవత్సర కాలం పాటు నీ స్వర్ణోత్సవ గీతం ఆలపించిన ఈలప్రోలు, వాతావరణ మార్పులకు సంబంధించి విశ్వానికంతటికీ సలహాలు, సూచనలు ఇస్తున్న శివుడూ, శ్రీనివాసుడూ ఇద్దరూ నీ పిల్లలే కావటం ఒకింత గర్వకారణమే కదా! కనుచూపు మేర పరిపాలన, శాంతి భద్రతలు, పర్యా వరణం, అడవులు, రైల్వేలు, గనులు, మీడియా, కస్టమ్స్, ఆదాయ పన్ను, బ్యాంకింగ్, ఆర్థిక, వాణిజ్య, వ్యాపార, రాజకీయ, పారిశ్రామిక, సామాజిక, సేవారంగాలలో ఆరితేరిన మెరికలుగా గుర్తింపు పొందిన వారంతా నీ ఒడిలో పెరిగిన పిల్లలే. అయ్యంగార్ ఇండోర్ స్టేడియం ఇచ్చారు. గోవింద రాజులు నాబార్డ్ తరపున ఓ పెద్ద భవనం ఇచ్చారు. కరోనా ప్రభావం తగ్గాక నీ పిల్లలు ప్రత్యేక రీతిలో సావనీర్లు తెస్తున్నారు. 1962, 1969, 1972, 1997, 1977, 1978 బ్యాచ్‌లు వారి వారి అనుభవాలను కలబోసుకున్నారు. అంతకుముందే 1964 వారు ప్రచురించిన సావనీర్ అందరికీ రోల్ మోడల్ అయింది కూడా. కరోనా అంటే నీ కెందుకు భయం. కరోనాకు చెక్ పెట్టేందుకు సీసీఎంబీ తయారు చేసిన ఎంఆర్ఎన్ఏ టీకా శాస్త్రవేత్తల బృంద నాయకులు నాళం మధు... బాపట్ల ఒడిలో నీవు లాలించిన బిడ్డే కదమ్మా. పిల్లలు అంతా ఇలా ఒకరిని చూసి మరొకరు గుంపులు గుంపులుగా కలుస్తూ ప్రస్తుతం కళాశాలలో ఉన్న నాలుగు బ్యాచ్‌లకూ స్ఫూర్తినిచ్చేందుకు ప్లాటినం జూబిలీ ముగింపునకు తరలి వస్తున్నారు. గత వైభవం అంతా ఈ తరానికి అందించి, వారూ స్ఫూర్తి పొంది, మంచి భవిష్యత్‌కు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకు సాగుతారని. అందుకే అమ్మా... నీ బిడ్డలు వారి వారి బ్యాచ్‌ల పేరుతో గోల్డ్ మెడల్స్ ఏర్పాటు చేసింది. తప్పులుంటే మమ్ము క్షమించు తల్లీ! – వలేటి గోపీచంద్, 1980 బ్యాచ్ విద్యార్థి (రేపు బాపట్ల వ్యవసాయ కళాశాల ప్లాటినం జూబిలీ ఉత్సవాల ముగింపు వేడుక) -
Osmania University: ఉస్మానియా అలాయ్ బలాయ్!
వందేళ్ళకు పైగా ఘన చరిత్ర, కీర్తి గల ఉస్మానియా యూనివర్సిటీ మరొక అద్భుతమైన ఘట్టానికి తెరలేపుతోంది. గ్లోబల్ అలుమ్నయి మీట్ (జీఏఎమ్–23)ను జనవరి మూడు, నాలుగు తేదీలలో నిర్వహిస్తోంది. స్వాతంత్య్ర ఉద్యమ కాలంనాటి వందేమాతరం ఉద్యమం నుండి తొలి, మలి తెలంగాణ ఉద్యమాల వరకూ ఎన్నో ప్రజా యుద్ధాలకూ, తెలంగాణ ప్రజల అస్తిత్వానికీ, ఆత్మగౌరవానికీ చిహ్నంగా నిలిచింది ఉస్మానియా. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల 57వ రూమ్ ఎన్నో సామాజిక, రాజకీయ, అస్తిత్వ ఉద్యమాలకూ, మేధో చర్చలకూ వేదిక అయింది. హైదరాబాద్‌కు మణిహారం లాంటి ఆర్ట్స్ కళాశాల నుండి ప్రపంచాన్ని ప్రభావితం చేసిన మేధావులు, పాత్రికేయులు, రాజ కీయ నాయకులు, కళాకారులు, సాహితీ వేత్తలు, వ్యాపారవేత్తలు, సినీ, క్రీడా ప్రముఖులు తయారయ్యారు. మిగతా కళాశాలల నుంచి గొప్ప ఇంజినీరింగ్, శాస్త్త్ర సాంకేతిక నిపుణులూ, సైంటి స్టులూ తలెత్తారు. ఈ దేశానికి ప్రధాన మంత్రి అయిన పీవీ నర్సింహారావు, పార్లమెంట్లో గొప్ప వక్తగా, విమర్శకునిగా పేరున్న ఎస్. జైపాల్ రెడ్డి, లోక్ సభ మాజీ స్పీకర్ శివరాజ్ పాటిల్, వామపక్ష ఉద్యమాలకు ఊపిరులూదిన జార్జిరెడ్డి; గొప్ప కవి, రచయిత, టీచర్‌గా పేరున్న సి. నారాయణ రెడ్డి, సినీ దిగ్గజం శ్యాంబెనెగల్, ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవీ రెడ్డి... ఇలా చెప్పుకుంటూపోతే ఉస్మానియా ఉత్పత్తి చేసిన మహామహుల పేర్లకు అంతుండదు. నిజానికి ఉస్మానియా చరిత్ర రాస్తే ఒక ఉద్గ్రంథమే అవుతుంది. కడుపు చేత పట్టుకొని వచ్చిన వేలాది మంది విద్యార్థులను అమ్మలాగా ఆదరించి అక్కున చేర్చుకొని వారికి సుందరమైన భవిష్యత్తును తీర్చిదిద్ది దేశ సేవ కోసం బయటికి పంపింది ఉస్మానియా. (క్లిక్ చేయండి: నూతన సంవత్సర తీర్మానాలు) ‘ఎన్సీసీ’ నుండి యూనివర్సిటీ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే ఏదో తెలియని అనుభూతి అనుభవిస్తే గాని మనసు కుదుటపడదు. పచ్చని చెట్లు, పిట్టల కిలకిలా రావాలతో జీవ వైవిధ్యం ఉట్టిపడే క్యాంపస్‌లో అడుగుపెడితే ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు! యూనివర్సిటీ లైబ్రరీలో రేయింబవళ్లూ కూర్చొని చదువుకోవడం, ఇంజనీరింగ్ కాలేజీ క్యాంటీన్ కబుర్లూ; అబ్బాయిలూ, అమ్మాయిలూ కలిసి చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగే దృశ్యాలూ, ఎల్లమ్మ తల్లి గుడి దగ్గర జరుపుకొన్న వేడుకలూ, యూనివర్సిటీలోని చాయ్ కొట్టుల దగ్గర జరిపిన సుదీర్ఘమైన సామాజిక, రాజకీయ చర్చలూ, సరదా సంభాషణలూ... ఎన్ని జ్ఞాపకాలు! మన యూనివర్సిటీ క్యాంపస్‌లో ఆత్మీయ ఆలింగనాలు చేసుకుని మరోసారి పలకరించుకుందాం రండి. సుదీర్ఘకాలం తర్వాత మళ్లీ ఒకసారి అందరం ఒక దగ్గర కూడి ఆనాటి మధుర జ్ఞాపకాలను తలుచుకుని తరించే అవకాశం యూనివర్సిటీ కల్పిస్తోంది. ఇలాంటి అవకాశాలు, సందర్భాలు రావడం బహు అరుదు. అన్ని విధాలా అభివృద్ధి చెందిన మన పాత విద్యార్థులు యూనివర్సిటీ అభివృద్ధికి తమ వంతు సాయం అందించడానికి తగిన సందర్భమూ ఇదే! – వలిగొండ నరసింహ, రీసెర్చ్ స్కాలర్, ఓయూ (జనవరి 3, 4 తేదీలలో ఓయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం) -
Osmania University: గ్లోబల్ ఓయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం.. ఎప్పుడంటే..
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని జనవరి 3, 4 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు ఓయూ ఉపకులపతి ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ వెల్లడించారు. గురువారం ఓయూ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేళంలో ఆయన మట్లాడారు. ఓయూ క్యాంపస్ ఠాగూర్ ఆడిటోరియంలో జరిగే ఉస్మానియా గ్లోబల్ అలుమ్నీ మీట్–23లో హాజరయ్యేందుకు ఇప్పటికే వెయ్యి మంది పూర్వ విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని తెలిపారు. విశ్వవిద్యాలయం చరిత్రలో విభాగాల వారీగా పూర్వ విద్యార్థుల సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారని వివరించారు. రెండు రోజుల పాటు సమ్మేళనం ఇలా.. గ్లోబల్ అలుమ్ని మీట్ జనవరి 3న మధ్యాహ్నం ప్రారంభమవుతుందన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ అభివృద్ధి, ఇతర అంశాలపై విశిష్ట పూర్వ విద్యార్థులతో పలు బృందలతో చర్చలు ఉంటాయన్నారు. సాయంత్రం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లోని లాన్లో సాంస్కతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. రెండో రోజున పూర్వ విద్యార్థులు ఆయా విభాగాలను సందర్శించి, అధ్యాపకులు, విద్యార్థులతో కలిసి చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకుంటారన్నారు. మధ్యాహ్నం వివిధ అంశాలపై ఉపన్యాసాలుంటాయని వివరించారు. (క్లిక్ చేయండి: ప్రయాణికులకు ఊరట.. పోలీసుల కీలక ఆదేశాలు) -
నాకు కొంచెం కొంచెం తెలుగు వచ్చు.. బాగున్నారా..
సాక్షి, విశాఖపట్నం: ‘బాగున్నారా.. కాఫీ చాలా చాలా బాగుంది.. నాకు కొంచెం కొంచెం తెలుగు వచ్చు’ అంటూ ఇథియోపియా కేంద్ర మంత్రి ఎర్గోగి టిస్‌ఫాయే తెలుగులో మాట్లాడి అబ్బురపరిచారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆంత్రపాలజీ విభాగంలో పీహెచ్డీ చేశానని, ఆ సమయంలో విశాఖలో ఉన్నప్పుడు కొన్ని తెలుగు పదాలను నేర్చుకున్నానని చెప్పారు. పూర్తిగా తెలుగులో మాట్లాడలేకపోయినా, అర్థం చేసుకోగలనన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ తనకు తల్లితో సమానమని, వర్సిటీతో కలిసి పనిచేస్తామని చెప్పారు. శుక్రవారం ఏయూకు విచ్చేసిన ఆమె ఇష్టాగోష్టిలో పలు విషయాలను పంచుకున్నారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. ఐసీసీఆర్ నుంచి విశిష్ట పూర్వవిద్యార్థి పురస్కారం నేను ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్(ఐసీసీఆర్) అందించిన స్కాలర్‌షిప్‌తో చదువుకున్నాను. ఏయూలో ప్రొఫెసర్ల బోధన నాకు ఎంతో నచ్చింది, ఉపకరించింది. మానవ అధ్యయనానికి భారత్ సరైన వేదిక అని నాకు అనిపించింది. ఇక్కడ విభిన్న సంస్కృతులు, భాషలు, వైవిధ్యాల సమ్మేళనం దర్శనమిస్తుంది. ఐసీసీఆర్ నుంచి విశిష్ట పూర్వ విద్యార్థి పురస్కారం అందుకోవడం ఆనందాన్ని ఇచ్చింది. ఏయూ విద్యార్థిగా నేను గర్విస్తాను. భారత్‌ను ఎంచుకోమంటాను ప్రతీ సంవత్సరం ఇథియోపియా నుంచి పెద్దసంఖ్యలో విద్యార్థులు విదేశాలకు వెళుతున్నారు. వీరికి భారత్‌కు వెళ్లాలని నేను సూచిస్తున్నాను. ముఖ్యంగా ఏయూలో చదువుకోవాలని, ఇక్కడ వాతావరణం, ప్రజలు బాగుంటారని వారికి పలు సందర్భాలలో తెలియజేస్తున్నా. వాతావరణం, ఆహారం, ప్రజలు తదితర అంశాల్లో భారత్, ఇథియోపియా దేశాల మధ్య సారూప్యత అధికంగా ఉంటుంది. ఏయూతో కలసి పని చేస్తాం నాకు తల్లితో సమానమైన ఆంధ్ర విశ్వవిద్యాలయంతో కలసి పనిచేస్తాం. స్టార్టప్ రంగంలో ఇథియోపియాకు కొంత సహకారం, మార్గదర్శకత్వం అవసరం. ఏయూ ఇప్పటికే ఈ రంగంలో మంచి ప్రగతిని సాధించింది. ఈ దిశగా ఏయూ సహకారం తీసుకుంటాం. డ్యూయల్ డిగ్రీ కోర్సులను సైతం నిర్వహించే ప్రదిపాదన ఉంది. తెలుగు ప్రజలు మంచివారు నా పీహెచ్డీ పూర్తిచేసే క్రమంలో తెలుగు ప్రజలతో ఉండే అవకాశం లభించింది. ఇక్కడి ప్రజలు చాలా మంచివారు. విశాఖ సుందరమైన నగరం. ఇక్కడ ఉన్న సమయంలో కొన్ని తెలుగు పదాలను నేర్చుకున్నారు. ఎవరు, ఎంత.. ఇలా అనేక పదాలను నేను ఇప్పటికీ మరచిపోలేదు. ఉన్నతంగా ఎదిగారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించిన ఇథియోపియా దేశస్తులు ఉన్నత స్థితిలో రాణిస్తున్నారు. విభిన్న శాఖల్లో మంత్రులుగా, విశ్వవిద్యాలయాల ఉపకులపతులుగా సేవలు అందిస్తున్నారు. వీరంతా ఏయూ పూర్వవిద్యార్థులే అనే విషయం మరువలేదు. ఇథియోపియాలో భారత్ పెట్టుబడులు ఇథియోపియా దేశంలో అనేకమంది భారతీయులు పెట్టుబడులు పెడుతున్నారు. వాటిని స్వాగతిస్తున్నాం. అదే విధంగా పెద్దసంఖ్యలో భారతీయులు ఇథియోపియా విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్నారు. మా దేశంలో శాంతిని కాంక్షిస్తాం. ఇండియా ఇన్క్రెడిబుల్ నేను తొలిసారిగా విద్యార్థిగా ఇథియోపియా నుంచి భారత్‌కు వచ్చే సమయంలో విమానాశ్రయంలో ‘ఇన్క్రెడిబుల్ ఇండియా’ అనే పదాన్ని చూశాను. ఇది నిజమా అనే భావన నాకు కలిగింది. తరువాత నేను భారత్‌లో ఉన్న కాలంలో చూసిన పరిస్థితులు, అనుభవాల తరువాత ఇది సరిగ్గా సరిపోతుందనే భావన నాకు కలిగింది. ఇథియోపియాలో ఏయూ ముద్ర ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చేపట్టే సంస్కరణలు, అభివృద్ధి ఆలోచనలు ఇథియోపియాపై ప్రభావం చూపుతాయి. ఇక్కడ అధికారులు చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు విద్యార్థుల నుంచి ఇథియోపియాకు చేరతాయి. పరోక్షంగా ఇథియోపియా విద్యా వ్యవస్థను ఏయూ ప్రభావితం చేస్తుందని చెప్పవచ్చు. (క్లిక్: పెంపుడు కుక్కతో ‘టెక్కీ’ లవ్ జర్నీ.. ఎందుకో తెలుసా..?) -
పూర్వ విద్యార్థులతో సినిమాలు
రామానాయుడు ఫిల్మ్ స్కూల్ పూర్వ విద్యార్థులతో నిర్మాత డి. సురేష్ బాబు రెండు కొత్త చిత్రాలను నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఫిల్మ్ స్కూల్లో శిక్షణ తీసుకున్న సతీష్ త్రిపుర, అశ్విన్ గంగరాజు ఈ చిత్రాలకు దర్శకత్వం వహించనున్నారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ– ‘‘సతీష్ త్రిపుర తెరకెక్కించనున్న చిత్రం ఒక ఉత్కంఠభరితమైన క్రైమ్ థ్రిల్లర్‌గా ఉంటుంది. అదే విధంగా అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహించనున్న సినిమా ఒక ప్రముఖ వ్యాపారవేత్త హత్య చుట్టూ అల్లుకున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. రామానాయుడు ఫిల్మ్ స్కూల్ పూర్వ విద్యార్థులను తెలుగు చిత్ర పరిశ్రమలోనికి తీసుకురావటంలో ఇదో మైలురాయిగా అభివర్ణించవచ్చు. ఈ రెండు చిత్రాల నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తాం’’ అన్నారు. -
53 ఏళ్ల తర్వాత అపూర్వ కలయిక
సాక్షి, ప్యాపిలి: కర్నూలు జిల్లా ప్యాపిలి బాలుర ఉన్నత పాఠశాలలో 1966–67 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు ఆదివారం అదే పాఠశాలలో కలుసుకున్నారు. ఏడు పదుల వయసుకు దగ్గర పడిన వారంతా ఎంతో ఉత్సాహంగా ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. దాదాపు 50 మంది పూర్వ విద్యార్థులు హాజరుకావడంతో పాఠశాలలో సందడి వాతావరణం నెలకొంది. ప్రస్తుత హెచ్ఎం చంద్రలీలమ్మ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఆనాటి ఉపాధ్యాయులు బాలసంజీవయ్య, రాణిరెడ్డి, హనీఫ్, ప్రసాద్, శివరామిరెడ్డి, ప్రసాద్, మహమ్మద్ సాహెబ్, శ్రీరాంశెట్టి, రమణ తదితరులను ఘనంగా సన్మానించారు. పాఠశాలకు రూ.24 వేల విలువైన బీరువాలను అందజేశారు. 53 ఏళ్ల తర్వాత తామంతా ఇలా కలుసుకోవడం ఆనందంగా ఉందని వైద్య, ఆరోగ్య శాఖలో ఏఎస్ఓగా పనిచేసి, రిటైర్ అయిన రాముడు అన్నారు. ఇలాంటి సందర్భాలు జీవితంలో అరుదుగా వస్తాయని మహబూబ్ సాహెబ్ అన్నారు. (చదవండి: విమానం దిగింది.. ఎగిరింది..! ) -
విద్యను సమాజ సేవకు ఉపయోగించాలి
రాజేంద్రనగర్: మనిషి ఆలోచనలకు మార్గం చూపించే శిక్షణ అవసరమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ పేర్కొన్నారు. విద్యను స్వార్థం కోసం కాకుండా దేశ రక్షణ, సమాజ సేవ కోసం ఉపయోగించాలని సూచించారు. ఆదివారం బండ్లగూడ జాగీరులోని శారదా ధామంలో శ్రీ సరస్వతి విద్యాపీఠం పూర్వ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థుల మహా సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మానవ జాతి అభివృద్ధి కోసం పర్యావరణానికి కీడు చేయవద్దని సూచించారు. నాణ్యమైన విద్య ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యమని అభిప్రాయపడ్డారు. సరస్వతి విద్యా మందిరాలు వ్యాపార ధోరణితో విద్యను బోధించడం లేదని.. సమాజ, దేశ సేవ కోసం బోధిస్తున్నాయని వెల్లడించారు. సంస్కృతి, సంప్రదాయాల విషయంలో భారతదేశం అన్ని దేశాలకు దిక్సూచిగా ఉందని కొనియాడారు. దేశంలోని 130 కోట్ల మందిలో 30 కోట్ల మంది సేవ చేసినా దేశం ఉన్నతంగా ఉంటుందని పేర్కొన్నారు. పిల్లలకు ఇంట్లోనే మన సంస్కృతి, సంప్రదాయాలను బోధించాలని.. వారితో మాతృభాషలోనే మాట్లాడాలని తల్లిదండ్రులకు సూచించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశ సంస్కృతిని ప్రపంచదేశాలకు చాటాల్సిన అవసరం ఉందన్నారు. సరస్వతి విద్యా పీఠం ఇందుకు ఎంతగానో పాటుపడుతోందని కొనియాడారు. అనంతరం సరస్వతి విద్యా పీఠం ఆధ్వర్యంలో రాబోయే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్న శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్ భవనానికి శంకుస్థాపన చేశారు. విద్యారణ్య స్కూల్ భవనానికి విజయవాడకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సీబీఆర్ ప్రసాద్ రూ.కోటి విరాళం అందిస్తున్నట్లు ప్రకటించారు. విజయవాడలో నిర్మించనున్న పాఠశాలకు రూ.12.5 కోట్ల విలువైన భవనాన్ని ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బండి సంజయ్, విద్యాభారతి అధ్యక్షుడు రామకృష్ణారావు, దక్షిణ మధ్య క్షేత్ర విద్యా భారతి అధ్యక్షుడు ఉమామహేశ్వర్, పారిశ్రామికవేత్త ఎంఎస్ఆర్వీ ప్రసాద్, సేవిక సమితి ప్రధాన కార్య దర్శి అన్నదాన సీతక్క తదితరులు పాల్గొన్నారు. పూర్వ విద్యార్థి సమ్మేళనం రికార్డులు.. సరస్వతి విద్యాపీఠం రాష్ట్రస్థాయి పూర్వ విద్యార్థి మహా సమ్మేళనం పలు రికార్డులను సాధించింది. ఈ సమ్మేళనానికి తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, అమెరికా, దుబాయ్ నుంచి 15 వేల మంది విద్యార్థులు హాజరైనట్లు రాయల్ సక్సెస్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డు నిర్వాహకులు వెల్లడించారు. భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరవ్వడంతో పలు రికార్డులు సాధించిందని తెలిపారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి పరిషత్ సభ్యులకు రికార్డు పత్రాన్ని అందజేశారు. ఈ సమ్మేళనానికి సంబంధించిన పూర్తి నివేదికను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు, లింకా బుక్ ఆఫ్ రికార్డు నిర్వహకులకు అందిస్తున్నట్లు విద్యార్థి సమ్మేళనం సభ్యులు వెల్లడించారు. -
ప్రభుత్వాసుపత్రికి 20 కోట్లు ఇచ్చిన పూర్వవిద్యార్థులు
సాక్షి, అమరావతి: అమెరికాలో స్థిరపడిన రంగరాయ వైద్యకళాశాల పూర్వ విద్యార్థులు (రంగరాయ మెడికల్ కాలేజీ అలుమిని ఆఫ్ నార్త్ అమెరికా–రాంకానా) రూ.20 కోట్లతో మాతాశిశు ఆరోగ్యకేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సోమవారం సచివాలయంలోని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) సమక్షంలో ఎంవోయూ కుదిరింది. దాదాపు రూ.20 కోట్లతో నిర్మించే మూడంతస్తుల నిర్మాణాలను 2020 డిసెంబర్ నాటికి పూర్తి చేయనున్నట్టు ఆర్ఎంసీఏఎన్ఏ ప్రతినిధులు వెల్లడించారు. ఇప్పటికే ఈ కేంద్రంలో జీ ఫ్లస్ 1 నిర్మాణం దాదాపు పూర్తయింది. దీన్ని నిర్మించేందుకు గతంలోనే ఆర్ఎంసీఏఎన్ఏ ప్రతినిధులు వైద్య ఆరోగ్య శాఖకు ప్రతిపాదనలు పెట్టుకున్నారు. ఆర్ఎంసీఏఎన్ఏ ప్రతిపాదనలో భాగంగా 2,3,4 అంతస్తుల నిర్మాణానికి తాజాగా ప్రభుత్వంతో ఒప్పందం జరిగింది. ఇక్కడ 2, 3, 4 అంతస్తుల్లో ప్రసూతి, చిన్నారుల పడకలు, ఎన్ఐసీయూ, ఫ్యాకల్టీ రూమ్‌లు, కాన్ఫరెన్స్ హాల్స్ నిర్మిస్తారు. కార్యక్రమంలో ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి డా. కేఎస్ జవహర్‌రెడ్డి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ కార్తికేయ మిశ్రా, డీఎంఈ డాక్టర్ వెంకటేష్, ఆర్ఎంసీఏఎన్ఏ యాక్టింగ్ ప్రెసిడెంట్ ఏవీ సుబ్బారాయ చౌదరి, ముఖ్య దాత నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్, ఓ.కృష్ణమూర్తి తదితరులున్నారు. -
విలాసవంతమైన ఉద్యోగాలను వదిలి మరీ..
సాక్షి, న్యూఢిల్లీ : ఐఐటీల్లో చదివి, ఆరంకెల జీతం అందుకుంటూ సమాజంలో పేరు ప్రఖ్యాతులు గడించినా వారికి అవి తృణప్రాయంగా తోచాయి. ఎస్సీ, ఎస్టీలు, ఇతర వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం వారు ఖరీదైన ఉద్యోగాలను వదిలివేసి బహుజన్ ఆజాద్ పార్టీ (బీఏపీ) పేరిట రాజకీయ వేదికను ఏర్పాటు చేశారు. దాదాపు 50 మంది ఐఐటియన్లు వైట్‌కాలర్ ఉద్యోగాలను వదిలి రాజకీయ వేదికగా ఏర్పాటు చేసిన బీఏపీ ప్రస్తుతం ఈసీ అనుమతి కోసం వేచిచూస్తోంది. సమాజంలో అట్టడుగు వర్గంగా అణిచివేయబడ్డ దళితుల ప్రయోజనాలను కాపాడేందుకే తమ పార్టీ ఉనికిలోకి వచ్చిందని బీఏపీ నేతలు చెబుతున్నారు. బ్రాహ్మణులను ఆర్థిక బహిష్కరణకు గురిచేయాలని ఓ బీఏపీ నేత పిలుపు ఇవ్వడం చర్చకు తావిచ్చింది. ఇక బీఏపీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోదని, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తలపడుతుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, ఐఐటియన్లు రాజకీయ పార్టీలు ఏర్పాటు చేయడం, ఆయా పార్టీల్లో కీలక పాత్ర పోషించడం ఇదే తొలిసారి కాదు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, గోవా సీఎం మనోహర్ పరికర్ వంటి నేతలు ఐఐటీల్లో చదివినవారే. -
కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురి మృతి
► మృతుల్లో ఇద్దరు యువతులు, ఓ యువకుడు ► భద్రాద్రికి వెళ్లివస్తూ మృత్యువాత ► అతివేగమే ప్రమాదానికి కారణం కట్టంగూర్: నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం అయిటిపాముల శివారు చెర్వుఅన్నారం బస్టాప్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి కారు అదుపుతప్పి పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందారు. మెదక్ జిల్లా ఇందు ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ఆరుగురు పూర్వ విద్యార్థులు (ముగ్గురు యువకులు, ముగ్గురు యువతులు) దైవదర్శనం కోసం శుక్రవారం భద్రాచలం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మార్గమధ్యంలో పాల్వంచలోని స్నేహితుని ఇంటివద్ద సాయంత్రం వరకు కాలక్షేపం చేశారు. తిరిగి రాత్రి 7 గంటలకు హైదరాబాద్ కు బయలుదేరారు. ఈ క్రమంలో చెర్వుఅన్నా రం బస్‌స్టాప్ సమీపంలోకి కారు అతివేగంగా వచ్చి అదుపు తప్పింది. కల్వర్టును ఢీకొట్టి కాల్వలోకి దూసుకెళ్లి నీటిలో మునిగింది. అందులో ముగ్గురు అతికష్టంమీద డోరు తీసుకొని బయటకు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కారుకు తాడు కట్టి క్రేన్ సహాయంతో బయటకు తీశారు. కానీ, కారులోనే ఉన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిన్న చీకోడుకు చెందిన చర్లపల్లి శృతిరెడ్డి(23), ఇదే జిల్లా జిల్లేడకి చెందిన హాసాన్పల్లి రత్నమాల(24) నీటిలో ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌కు చెందిన ప్రశాంత్ (23) కారు నడుపుతూ తీవ్ర గాయాలపాలయ్యాడు. అతడిని నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి 108 లో తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెం దాడు. శృతిరెడ్డి హైదరాబాద్‌లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్ కాగా, రత్నమాల ఎంటెక్ ఫస్టియర్ చదువుతోంది. ప్రశాంత్ బీటెక్ పూర్తిచేసి వ్యాపారం చేస్తున్నాడు. ముగ్గురు మృత్యుంజయులు.. ఈ ప్రమాదంలో వరంగల్‌కు చెందిన ఐలేన్ వినోద్‌రెడ్డి, హైదరాబాద్‌లోని జీడిమెట్లకు చెందిన గోపిరెడ్డి దిలీప్ కుమార్‌రెడ్డి, సిద్దిపేటకు చెందిన జెట్టి శ్వేతలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. -
ఈ వర్శిటీల పూర్వ విద్యార్థులే నేడు బిలియనీర్లు
న్యూయార్క్: అమెరికాలో ‘ఫోర్బ్స్’ మాగజైన్ ఎంపిక చేసిన 400 మంది టాప్ బిలియనీర్లలో ఎవరు ఏ యూనివర్శిటీ పూర్వ విద్యార్థులు, ఎవరు ఏ కాలేజీ నుంచి డిగ్రీ పట్టాలను పొందారన్న విషయాన్ని విశ్లేషించగా పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికాలో 660 యూనివర్శిటీ కాలేజీలు ఉండగా, వాటిలో కేవలం 28 కాలీజీల నుంచి డిగ్రీ పట్టాలు పొందిన వాళ్లు ఈ 400 మంది బిలియనీర్లలో ఉన్నారు. హార్వర్డ్ యూనివర్శిటీలో చదువుకున్న వారే ఎక్కువ మంది బిలియనీర్లు ఉంటారన్నది ఒక అభిప్రాయం. ఇప్పుడు ఆ అభిప్రాయం తప్పదని, అది అపోహ మాత్రమేనని ఫోర్బ్స్ విశ్లేషణలో తేలింది. 400 మంది బిలియనీర్లలో అత్యధికంగా 21 మంది (మొత్తంలో ఐదు శాతం) పెన్సిల్వేనియాలో చదువుకున్నవారే కావడం విశేషం. రెండో స్థానంలో హార్వర్డ్ యూనివర్శిటీ, యేలే యూనివర్శిటీలు ఉన్నాయి. బిలియనీర్లలో ఈ రెండు యూనివర్శిటీల నుంచి డిగ్రీ పట్టాలు పొందిన వారు 14 మంది చొప్పున ఉన్నారు. ఈ బిలియనీర్లలో అమెరికా ప్రైవేటు యూనివర్శిటీ కాలేజీలోనే కాకుండా ప్రభుత్వ కాలేజీల్లో చదువుకున్న వాళ్లు, చదువును అర్ధాంతరంగా ఆపేసిన వాళ్లు ఉన్నారు. అమెరికా వెలుపల, అంటే ‘లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్’లో చదువుకున్న వారు కూడా ఉన్నారు. ‘పే పాల్’ సహ వ్యవస్థాపకుడు, టెస్లా మోటార్స్, స్పేస్ ఎక్స్ సంస్థల ప్రస్తుత సీఈవో ఎలాన్ మాస్క్ పెన్సిల్వేనియా యూనివర్శిటీలో ‘గ్రాడ్యువేట్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్’లో చదువున్నారు. ఆయన కెనడాలోని క్వీన్స్ యూనివర్శిటీ నుంచి ఈ యూనివర్శిటీకి బదిలీపై వచ్చారు. పెన్సిల్వేనియా యూనివర్శిటీలో ఎకనామిక్స్, ఫిజిక్స్‌లలో డిగ్రీ పట్టాలు పొందిన ఆయన తన స్టార్టప్ కంపెనీ కోసం పీహెడ్డీని మధ్యలో వదిలేశారు. స్టీవ్ జాబ్స్ వితంతు భార్య లారెన్ పావెల్ జాబ్స్, కాసినో మ్యాగ్నెట్ స్టీవ్ వ్యాన్లు కూడా పెన్సిల్వేనియా యూనివ ర్శిటీలోనే చదువుకున్నారు. అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ల అభ్యర్థిగా పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ పెన్సిల్వేనియా యూనివర్శిటీ నుంచి ఎకనామిక్స్‌లో డిగ్రీ పట్టా పొందారు, ఆయన కుమారుడు, కుమార్తె కూడా కొంతకాలం ఇదే యూనివర్శిటీలో చదువుకున్నారు. అమెరికాలో యంగెస్ట్ బిలియనీర్, ఎయిర్బన్బ్ సహ వ్యవస్థాపకుడు నాథన్ బెచార్క్జిక్ (32) హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రి చదివారు. లాస్ ఏంజెలిస్ క్లిప్పర్స్ యజమాని, మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో స్టీవ్ బాల్మర్, ఆయిల్ టైకూన్ జాన్ డీ రాక్ఫెల్లర్ మనవడు డేవిడ్ రాక్ఫెల్లర్ హార్వర్డ్ యూనివర్శిటీ గ్రాడ్యువేట్లే. డ్రాపవుట్లకు కూడా ఈ యూనివర్శిటీ ఫేమే. ఫేస్బుక్ చీఫ్ జుకర్ బర్గ్, ప్రపంచ సంపన్నుడు బిల్ గేట్స్ అర్దంతరంగా ఇక్కడ చదువుకు స్వస్తి చెప్పిన వాళ్లే. బ్లాక్‌స్టోన్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు స్టీఫెన్ స్క్వార్జ్‌మన్ హార్వర్డ్ యూనివర్శిటీలో చేరుదామనుకొని అడ్మిషన్ లభించక పోవడంతో యేలే యూనివర్శిటీలో డిగ్రీ చదివారు. ఆ తర్వాత ‘హార్వర్డ్ స్కూల్ ఆఫ్ బిజినెస్’లో ఎంబీయే చేశారు. ఫెడెక్స్ వ్యవస్థాపకుడు ఫ్రెడ్ స్మిత్, మార్స్ క్యాండీ కంపెనీ కుటుంబ సభ్యులు జాన్, ఫారెస్ట్ మార్స్ యేలే యూనివర్శిటీలోనే డిగ్రీ చేశారు. బిలియనీర్లను ఇచ్చిన యూనివర్శిటీల్లో స్టాన్‌ఫర్డ్ నాలుగవ స్థానంలో ఉంది. 400 మంది బిలియనీర్లలో 13 మంది బిలియనీర్లు ఈ యూనివర్శిటీలో చదువుకున్న వారే. వీరిలో ఎక్కువ మంది టెక్ బిలియనీర్లు ఉన్నారు. స్నాప్‌చాట్ వ్యవస్థాపకులు ఎవాన్ స్పీగల్, బాబీ మర్ఫీ, వాట్సాప్ సహ వ్యవస్థాపకుడు బ్రియాన్ ఆక్టన్, లింక్డ్ఇన్కు చెందిన రీడ్ హాఫ్మన్ స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీలో డిగ్రీలు చేసిన వారే. టాప్ యూనివర్శిటీలో చదువుకున్న వారే బిలియనీర్లు అవుతారనుకుంటే పొరపాటే. టాప్ 400 మంది బిలియనీర్లలో 108 మంది డిగ్రీలు చదవనివారే. వారిలో 28 మంది హైస్కూల్ విద్య కూడా పూర్తి చేయలేదు. డోల్ ఫుడ్స్ సీఈవో డేవిడ్ ముర్డోక్ తొమ్మిదవ తరగతిలోనే చదువుకు స్వస్తి చెప్పారు. ఆయనకు ఒకప్పుడు ఇల్లు వాకిలి కూడా లేదు. పార్కుల్లో పడుకునే వాడు. కొద్దికాలం పెట్రోల్ బంకులో కూడా పనిచేశారు. 1200 డాలర్ల రుణంతో రోడ్డు పక్కన తినుబండారాల విక్రయాలను మొదలుపెట్టి ఇప్పుడు శతకోటీశ్వరుడయ్యారు. -
అరవయ్యేళ్లకు కలిశారు!
చందర్లపాడు: పూర్వ విద్యార్థుల కలయికతో కృష్ణాజిల్లా చందర్లపాడు పులకించిపోయింది. ఆరు దశాబ్దాల క్రితం విడిపోయిన మిత్రుల కలయికకు స్థానిక యార్లగడ్డ సుబ్బారావు స్వగృహం వేదికగా మారింది. 1956లో స్థానిక వాసిరెడ్డి కోటయ్య మెమోరియల్ ఉన్నత పాఠశాలలో ఎస్ఎస్ఎల్సీ చదివిన విద్యార్థులు కలుసుకొని మధురానుభూతులు పంచుకున్నారు. వారి ఆప్తమిత్రుడు సుబ్బారావు 11వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన కుమారులు వెంకట్రావు, బాపయ్య, చంటి, బుల్లబ్బాయి, సత్యనారాయణప్రసాద్‌ల నుంచి ఆహ్వానం అందుకున్న పూర్వ విద్యార్థులు తమ మిత్రుడికి అంజలి ఘటించేందుకు సామూహికంగా తరలివచ్చారు. ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర వ్యాపకాల నిమిత్తం వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా ఒక్కటిగా కలుసుకొని నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. -
స్నేహ గీతం
విశాఖలో కలిసిన పెద్దాపురం పూర్వ విద్యార్థులు మధుర స్మృతులను నెమరేసుకొని కేరింతలు విశాఖపట్నం: మూడున్నర దశాబ్దాలక్రితంనాటి మాట.... పెద్దాపురం ఎస్‌ఆర్‌వీబీఎస్‌జేబీ మహారాణి కళాశాలలో అందరూ కలిసి చదువుకున్నారు....ఆడుకున్నారు...పోటీపడ్డారు...కొండొకచో తలపడ్డారు. ఇన్నాళ్లకు మళ్లీ అందరూ ఒక్కటయ్యారు. గత స్మృతులను నెమరేసుకున్నారు. గొడవలను గుర్తు చేసుకుని మనసారా నవ్వుకున్నారు. అల్లరి ఉదంతాలు మళ్లీ అలరించాయి. వేదికపై రక్తికట్టాయి. భవిష్యత్తుపై ఆనాడు ఏమనుకున్నారో... ఇప్పుడు ఏమైందో లెక్కలు వేసుకున్నారు. తమ లెక్క ఎక్కడ తప్పిందో ఏకరువు పెట్టినవారు కొందరైతే... ఏంచేసి దూసుకుపోయామో వివరించినవారు మరికొందరు. తమ జీవన ప్రయాణంలోని మేలిమలుపులను వెల్లడించారు ఇంకొందరు. ఇదంతా విశాఖ డాబాగార్డెన్స్‌లోని హోటల్ చంద్ర (నెల్లూరు మెస్)లో చోటుచేసుకున్న పండగ. సహ విద్యార్థులుగా ఉండి కనుమూసిన ఏడుగురి స్మృతికి ఈ సమావేశంలో ఘనంగా నివాళులర్పించారు. మహారాణి కళాశాలలో చదువు చెప్పిన గురువుల గురించి... పాఠ్యాంశాల బోధనలో వారు పాటించిన మెలకువల గురించి గుర్తుచేసుకున్నారు. ఆనాటి ప్రిన్సిపాల్ శేషగిరిరావు, ల్ఛ్చెరర్లు తమ ఉన్నతి కోసం ఎంతగా తపించారో మననం చేసుకున్నారు. పేరుపేరునా స్మరించారు. మనలో సమస్యలెదురై ఇబ్బందులు పడుతున్నవారికి అందరం కలిసి ఆసరాగా నిలుద్దామని ఇప్పుడు విశాఖలో ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్‌గా ఉన్న విద్యావేత్త బి.తిరుపతిరాజు ప్రతిపాదించారు. పారిశ్రామికవేత్తగా ఉన్న యార్లగడ్డ సూర్యారావు సై అన్నారు. తన వంతు సాయం ఏ రూపంలోనైనా ఉంటుందని భరోసా ఇచ్చారు సీబీ సీఐడీ డీఎస్పీ (రాజమండ్రి) రాజగోపాల్. ఎవరమూ ఒంటరి అనుకోవద్దన్నారు శేరు వీరభద్రరావు. ఇకపై తరచు కలుద్దామని ప్రతిపాదించారు.