కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురి మృతి | road accedent in nalgonda district kattangoor | Sakshi
Sakshi News home page

కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురి మృతి

Published Sun, Oct 16 2016 3:01 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 PM

కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురి మృతి

కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురి మృతి

మృతుల్లో ఇద్దరు   యువతులు, ఓ యువకుడు
భద్రాద్రికి వెళ్లివస్తూ మృత్యువాత
అతివేగమే ప్రమాదానికి కారణం

కట్టంగూర్: నల్లగొండ జిల్లా  కట్టంగూర్ మండలం అయిటిపాముల శివారు చెర్వుఅన్నారం బస్టాప్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి  కారు అదుపుతప్పి పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందారు. మెదక్ జిల్లా ఇందు ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ఆరుగురు పూర్వ విద్యార్థులు (ముగ్గురు యువకులు, ముగ్గురు యువతులు) దైవదర్శనం కోసం శుక్రవారం భద్రాచలం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మార్గమధ్యంలో పాల్వంచలోని  స్నేహితుని ఇంటివద్ద సాయంత్రం వరకు కాలక్షేపం చేశారు.

 తిరిగి రాత్రి 7 గంటలకు హైదరాబాద్ కు బయలుదేరారు. ఈ క్రమంలో చెర్వుఅన్నా రం బస్‌స్టాప్ సమీపంలోకి కారు అతివేగంగా వచ్చి అదుపు తప్పింది. కల్వర్టును ఢీకొట్టి కాల్వలోకి దూసుకెళ్లి నీటిలో మునిగింది. అందులో ముగ్గురు అతికష్టంమీద డోరు తీసుకొని బయటకు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కారుకు తాడు కట్టి క్రేన్ సహాయంతో బయటకు తీశారు. కానీ, కారులోనే ఉన్న  సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిన్న చీకోడుకు చెందిన చర్లపల్లి శృతిరెడ్డి(23), ఇదే జిల్లా జిల్లేడకి చెందిన హాసాన్‌పల్లి రత్నమాల(24) నీటిలో ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందారు.

హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌కు చెందిన ప్రశాంత్ (23) కారు నడుపుతూ తీవ్ర గాయాలపాలయ్యాడు.  అతడిని నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి 108 లో  తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెం దాడు. శృతిరెడ్డి హైదరాబాద్‌లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్ కాగా, రత్నమాల ఎంటెక్ ఫస్టియర్ చదువుతోంది. ప్రశాంత్ బీటెక్ పూర్తిచేసి వ్యాపారం చేస్తున్నాడు.

ముగ్గురు మృత్యుంజయులు..
ఈ ప్రమాదంలో వరంగల్‌కు చెందిన ఐలేన్ వినోద్‌రెడ్డి, హైదరాబాద్‌లోని జీడిమెట్లకు చెందిన గోపిరెడ్డి దిలీప్ కుమార్‌రెడ్డి, సిద్దిపేటకు చెందిన జెట్టి శ్వేతలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement