హైదరాబాద్: ప్రపంచ సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి.. మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి.. సినీనటులు అక్కినేని నాగార్జున, రామ్‌చరణ్.. ప్రస్తుత నగర కమిషనర్ సీవీ ఆనంద్.. ప్రఖ్యాత క్రికెట్ వ్యాఖ్యత హర్షభోగ్లే.. ఇలా ఏ రంగాన్ని తట్టినా మేటి స్థానాల్లో నిలబడిన వారెందరో. వారందరికీ అది పునాది రాయి.. ఇదే వారి ప్రఖ్యాతికి మైలు రాయి. రాష్ట్ర, దేశ ఖ్యాతిని ఖండాంతరాలకు తీసుకువెళ్లింది. అక్కడ విద్యాభ్యాసం చేసిన ఎందరో ప్రస్తుతం ఉన్నత శిఖరాలను అధిరోహించి భరతమాత ముద్దు బిడ్డలుగా ఎదిగారు. వారంతా ఓనమాలు నేర్చుకున్న ఆ సరస్వతీ నిలయానికి అక్షరాలా నూరేళ్లు. అదే బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్). నేటి నుంచి శతాబ్ది ఉత్సవాలు జరుపుకొంటున్న హెచ్‌పీఎస్‌పై ప్రత్యేక కథనం.
అవతరణ ఇలా..
ఉన్నత వర్గాల వారి కోసం ముఖ్యంగా నవాబులు, జాగీర్‌దార్లు, బ్రిటిష్ అధికారుల పిల్లల చదువుల కోసం 1923లో బేగంపేటలో ‘జాగీర్‌దార్ కాలేజ్’ పేరుతో ఈ స్కూల్ షురువైంది. దీర్ఘకాలిక లీజు ప్రాతిపదికన పాఠశాలకు స్థలాన్ని కేటాయించారు. బ్రిటిష్ విద్యావేత్త షాక్రాస్ మొదటి ప్రిన్సిపాల్‌గా ముగ్గురు విద్యార్థులతో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో ప్రారంభమైంది. 1950లో ప్రభుత్వం జమీందారీ వ్యవస్థకు స్వస్తి చెప్పడంతో అప్పటివరకు కేవలం ప్రముఖుల పిల్లలకే పరిమితమైన జాగీర్‌దార్ స్కూల్ 1951లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌గా అవతరించింది.
నాటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ మొదటి అధ్యక్షుడిగా హెచ్‌పీఎస్ సొసైటీ ఏర్పడింది. 1988 వరకు బాలురకు మాత్రమే పరిమితమైన హెచ్‌పీఎస్‌లో ఆ తర్వాత బాలికలకు కూడా ప్రవేశాలు కల్పించారు. దాదాపు 122 ఎకరాల సువిశాల ప్రాంగణం.. పెద్ద క్రీడా మైదానం.. ఎటుచూసినా పచ్చదనం.. లైబ్రరీ, ఇ–లైబ్రరీ, డైనింగ్‌హాల్, ఆధునిక లేబరేటరీలు, హాస్పిటల్, అన్ని రకాల క్రీడా కోర్టులు, గుర్రపు స్వారీ.. ఇలా అత్యాధునిక వసతులతో హెచ్‌పీఎస్ అలరారుతోంది.
ప్రస్తుతం ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు 3,200 మంది పైచిలుకు విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. అప్పట్లోనే అద్భుతమైన ఆర్కిటెక్చర్‌తో ఇండో– సారాసెనిక్ శైలిలో పాఠశాల భవనాన్ని నిర్మించారు. హెచ్‌పీఎస్‌కు విద్యారంగంలోని దాదాపు అన్ని రకాల ఉన్నత స్థాయి అవార్డులు వరించాయి. ఎడ్యుకేషన్ వరల్డ్, ఫ్యూచర్ 50 అవార్డు, ఎడ్యుకేషన్ టుడేస్ ఇండియా స్కూల్ మెరిట్ అవార్డ్, బెస్ట్ ఇన్నోవేటివ్ కే–12 స్కూల్ అవార్డులను సొంతం చేసుకుంది. ప్రస్తుతం పాఠశాల ప్రిన్సిపాల్‌గా డాక్టర్ మాధవ్‌దేవ్ సరస్వత్ కొనసాగుతున్నారు.
అతిపెద్ద ఎడ్యుకేషన్ సైన్స్ ఫెస్టివల్..
హెచ్‌పీఎస్ శతాబ్ది ఉత్సవాలు ఏడాది పొడవునా నిర్వహించాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు పలు ప్రతిష్టాత్మక కార్యక్రమాల నిర్వహణను చేపట్టింది. అందులో భాగంగా మొదటి దఫాగా ఈ నెల 20 నుంచి 27 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 20 నుంచి 22 వరకు మూడు రోజుల పాటు ఇండియా సైన్స్ ఫెస్టివల్ (ఐఎస్‌ఎఫ్)తో శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 22న సింఫనీ ఆర్కెస్ట్రా ఆఫ్ ఇండియా ప్రదర్శన ఉంటుంది. 22 నుంచి 27 మధ్యన రౌండ్ స్క్వేర్ కాన్ఫరెన్స్‌లు నిర్వహించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్‌రంజన్‌లు హాజరుకానున్నారు. (క్లిక్ చేయండి: వైద్య విద్యార్థుల గోస.. టీఆర్‌ఆర్ మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు రద్దు)
సమాజానికి అమూల్యమైన సేవ..
విద్య ద్వారా సమాజానికి అమూల్యమైన సేవను హెచ్‌పీఎస్ అందిస్తోంది. సైన్స్, ఆర్ట్, మ్యూజిక్, డ్యాన్స్, అడ్వంచర్, ఇన్నోవేషన్, ఎక్స్‌పోజర్, సహకారం, నెట్‌వర్కింగ్, కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్‌పరంగా ప్రయోజనం చేకూర్చేలా శతాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నాం.
– డాక్టర్ మాధవ్‌దేవ్ సరస్వత్, ప్రిన్సిపాల్
Comments
Please login to add a commentAdd a comment