PDSU: ‘ప్రగతిశీల’ శక్తులన్నీ ఒక్కటి కావాలి! | Amar Write on Progressive Democratic Students Union Alumni Meet | Sakshi
Sakshi News home page

PDSU: ‘ప్రగతిశీల’ శక్తులన్నీ ఒక్కటి కావాలి!

Published Fri, Jan 20 2023 4:42 PM | Last Updated on Fri, Jan 20 2023 4:42 PM

Amar Write on Progressive Democratic Students Union Alumni Meet - Sakshi

ఫైల్ ఫోటో

హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం కేంద్రంగా 1974లో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) ఏర్పడి మరో ఏడాదికి 50 ఏళ్లు నిండనున్నాయి. అసమానమైన పోరాటాలతో, త్యాగాలతో ఇరు రాష్ట్రాల ప్రజలపై పీడీఎస్‌యూ చూపిన ప్రభావం ఎవ్వరూ చెరపలేనిది. ఈ సంస్థకు రాష్ట్ర ఉపాధ్యక్షునిగా 1980 దశకం నాటికే నా ప్రత్యక్ష నిర్మాణ సంబంధం ముగిసిపోయింది. కానీ సోదరుడు కామ్రేడ్‌ కూర రాజన్న ద్వారా మా ఇంటి తలుపు తట్టిన అమరుడు కామ్రేడ్‌ జార్జిరెడ్డి జ్ఞాపకం, ఎంతోమంది గుండెల్ని రగిలించిన ఆయన ప్రస్థానం.. నేను పుట్టి పెరిగిన సిరిసిల్ల ప్రాంత రైతాంగ పోరాటాల వెల్లువతో పెనవేసుకుపోయింది. అదే విప్లవోద్యమంతో ముడిపడి పోయి రెండు తరాల విప్లవ విద్యార్థులతో నా ఇన్నేండ్ల ప్రయాణాన్ని నిర్దేశిస్తూ వస్తోంది. అందుకే నాకిది జ్ఞాపకం మూత్రమే కాదు, వర్తమాన నిజం. అలాంటి జ్ఞాపకాలన్నింటినీ తట్టిలేపుతూ, గతం–వర్తమాన పరిస్థితులను బేరీజు వేసుకుంటూ 2023 జనవరి 21న, పీడీఎస్‌యూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరగడం అపూర్వమనే భావించాలి.  

కామ్రేడ్‌ జార్జిరెడ్డి ఆధ్వర్యాన ఏర్పడిన పీడీఎస్‌యూ, ఆయన అమరుడైన ఏప్రిల్‌ 14 (1974)ననే పీడీఎస్‌యూగా ఆవిర్భవించింది. అది మొదలు అధిక ధరలపై, పలు సమస్యల సాధనకై పోరాడింది. కామ్రేడ్స్‌ భూమయ్య, కిష్టాగౌడ్‌ల ఉరిశిక్షల రద్దుకై ఉద్యమించింది. రైల్వే కార్మికుల సమ్మెకు మద్దతుగా నడిచింది. శ్రీకాకుళ గోదావరి లోయ పోరాటాలకు సంఘీభావంగా నిలిచింది. శ్రామికవర్గ అంతర్జాతీయతను ఎలుగెత్తి చాటి, ప్రపంచ పౌరుడిగా అవతరించిన చేగువేరా త్యాగనిరతిని పునికి పుచ్చుకుంది. అందుకే మతోన్మాదుల చేతుల్లో జార్జ్, చాంద్‌ పాషాల హత్యలు మొదలు... రాజ్యమే యుద్ధం ప్రకటించడంతో జంపాల, శ్రీపాద శ్రీహరిల నుండి చంద్రశేఖర్, రియాజ్‌ల వరకూ డజనుల కొలది విద్యార్థి వీరులు అమరు లైనారు. మరి ఎంతోమంది విద్యాలయాల నుండి పయనమై సమాజపు విముక్తిలో అంతర్భాగమైనారు. ఇందులో కొందరు తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో నిలబడి బూర్జువా పార్లమెంటరీ రాజకీయాల్లో కీలకంగా ఎదిగారు. ఈనాడు విప్లవ విద్యార్థి ఉద్యమం ఎదుర్కొంటున్న సమస్యల ప్రత్యేక సందర్భంలో పలు పీడీఎస్‌యూలన్నీ ఒకే తాటి మీదకు రావడమనేది, ప్రధాన ఎజెండా కావాలనేది నా అభిప్రాయం. 

ఇప్పుడు గతం కంటే తీవ్రంగా యావద్దేశం హిందుత్వ రాజకీయాల ఫాసిస్టు దాడికి గురవుతోంది. ప్రారంభం నుండీ ఇలాంటి ఉన్మాద దాడుల్లోనే రక్తసిక్త పసిగుడ్డుగా పుట్టిన పీడీఎస్‌యూ అనతి కాలంలోనే ఎమర్జెన్సీ ఫాసిస్టు దాడికి గురయ్యింది. చితాభస్మంలోంచి లేచిన ఫినిక్స్‌ పక్షిలాగా మారిన పీడీఎస్‌యూ నేడు అప్రకటిత ఎమర్జెన్సీని ఎదుర్కొంటూనే మునుముందుకు సాగుతోంది. అయితే పీడీఎస్‌యూలో సంభవించిన చీలికలు ఉద్యమ గమనం మందగించడానికి కారణమయ్యాయి.

నాకు సమకాలికులుగా ఉన్న చాలామంది కామ్రేడ్స్‌ ప్రత్యక్షంగా ఎదుర్కొన్న 1984 నాటి చీలికను చూసి కొందరు పీడ విరగడయిందని (గుడ్‌ రిడెన్స్‌) భావించిన వాళ్లున్నారు. కానీ అసలు పీడ అక్కడ నుండే మొదలయ్యింది. ఆ తర్వాతి 45 ఏళ్లలో 1986 రాజీవ్‌గాంధీ నూతన విద్యా విధానం, రిజర్వేషన్లు, ఎల్పీజీ, విద్యా కాషాయీకరణ – కార్పొరేటీకరణ లాంటి ఎన్నో పరిణామాలు వచ్చాయి. విద్యాహక్కు చట్టం తర్వాత కూడా ఎన్నో పాఠశాలలు మూసివేయబడి, సార్వజనీన విద్య (కామన్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌) అనేది కనుమరుగై పోయింది. వాటన్నిటిపై ప్రగతిశీల విద్యార్థి ఉద్యమం బలాబలాలు మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. 

రెండు తరాలూ... అధిక ధరలు, ఆకలి చావులు, అన్నార్థుల ఆవేదనలు, దేశ సంపదను దోచుకెళ్తున్న పిడికెడు మంది బడా దోపిడీ దారులకు వ్యతిరేకంగా సాగే పోరాటాలతో మమేకం కావాలని కోరుకోవడం ఆహ్వానించతగ్గది. సమ్మేళనం బాధ్యతను నెత్తికెత్తుకున్న నిర్వాహకులకు విప్లవాభినందనలు. ఇది బయటి వ్యక్తి మాటగా కాకుండా మీతో నేను, నాతో మీరుగానే స్వీకరించాలని నా విజ్ఞప్తి. 

– అమర్‌
(జనవరి 21 పీడీఎస్‌యూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం సందర్భంగా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement