PDSU Meeting
-
PDSU: ‘ప్రగతిశీల’ శక్తులన్నీ ఒక్కటి కావాలి!
హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం కేంద్రంగా 1974లో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) ఏర్పడి మరో ఏడాదికి 50 ఏళ్లు నిండనున్నాయి. అసమానమైన పోరాటాలతో, త్యాగాలతో ఇరు రాష్ట్రాల ప్రజలపై పీడీఎస్‌యూ చూపిన ప్రభావం ఎవ్వరూ చెరపలేనిది. ఈ సంస్థకు రాష్ట్ర ఉపాధ్యక్షునిగా 1980 దశకం నాటికే నా ప్రత్యక్ష నిర్మాణ సంబంధం ముగిసిపోయింది. కానీ సోదరుడు కామ్రేడ్ కూర రాజన్న ద్వారా మా ఇంటి తలుపు తట్టిన అమరుడు కామ్రేడ్ జార్జిరెడ్డి జ్ఞాపకం, ఎంతోమంది గుండెల్ని రగిలించిన ఆయన ప్రస్థానం.. నేను పుట్టి పెరిగిన సిరిసిల్ల ప్రాంత రైతాంగ పోరాటాల వెల్లువతో పెనవేసుకుపోయింది. అదే విప్లవోద్యమంతో ముడిపడి పోయి రెండు తరాల విప్లవ విద్యార్థులతో నా ఇన్నేండ్ల ప్రయాణాన్ని నిర్దేశిస్తూ వస్తోంది. అందుకే నాకిది జ్ఞాపకం మూత్రమే కాదు, వర్తమాన నిజం. అలాంటి జ్ఞాపకాలన్నింటినీ తట్టిలేపుతూ, గతం–వర్తమాన పరిస్థితులను బేరీజు వేసుకుంటూ 2023 జనవరి 21న, పీడీఎస్‌యూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరగడం అపూర్వమనే భావించాలి. కామ్రేడ్ జార్జిరెడ్డి ఆధ్వర్యాన ఏర్పడిన పీడీఎస్‌యూ, ఆయన అమరుడైన ఏప్రిల్ 14 (1974)ననే పీడీఎస్‌యూగా ఆవిర్భవించింది. అది మొదలు అధిక ధరలపై, పలు సమస్యల సాధనకై పోరాడింది. కామ్రేడ్స్ భూమయ్య, కిష్టాగౌడ్‌ల ఉరిశిక్షల రద్దుకై ఉద్యమించింది. రైల్వే కార్మికుల సమ్మెకు మద్దతుగా నడిచింది. శ్రీకాకుళ గోదావరి లోయ పోరాటాలకు సంఘీభావంగా నిలిచింది. శ్రామికవర్గ అంతర్జాతీయతను ఎలుగెత్తి చాటి, ప్రపంచ పౌరుడిగా అవతరించిన చేగువేరా త్యాగనిరతిని పునికి పుచ్చుకుంది. అందుకే మతోన్మాదుల చేతుల్లో జార్జ్, చాంద్ పాషాల హత్యలు మొదలు... రాజ్యమే యుద్ధం ప్రకటించడంతో జంపాల, శ్రీపాద శ్రీహరిల నుండి చంద్రశేఖర్, రియాజ్‌ల వరకూ డజనుల కొలది విద్యార్థి వీరులు అమరు లైనారు. మరి ఎంతోమంది విద్యాలయాల నుండి పయనమై సమాజపు విముక్తిలో అంతర్భాగమైనారు. ఇందులో కొందరు తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో నిలబడి బూర్జువా పార్లమెంటరీ రాజకీయాల్లో కీలకంగా ఎదిగారు. ఈనాడు విప్లవ విద్యార్థి ఉద్యమం ఎదుర్కొంటున్న సమస్యల ప్రత్యేక సందర్భంలో పలు పీడీఎస్యూలన్నీ ఒకే తాటి మీదకు రావడమనేది, ప్రధాన ఎజెండా కావాలనేది నా అభిప్రాయం. ఇప్పుడు గతం కంటే తీవ్రంగా యావద్దేశం హిందుత్వ రాజకీయాల ఫాసిస్టు దాడికి గురవుతోంది. ప్రారంభం నుండీ ఇలాంటి ఉన్మాద దాడుల్లోనే రక్తసిక్త పసిగుడ్డుగా పుట్టిన పీడీఎస్‌యూ అనతి కాలంలోనే ఎమర్జెన్సీ ఫాసిస్టు దాడికి గురయ్యింది. చితాభస్మంలోంచి లేచిన ఫినిక్స్ పక్షిలాగా మారిన పీడీఎస్‌యూ నేడు అప్రకటిత ఎమర్జెన్సీని ఎదుర్కొంటూనే మునుముందుకు సాగుతోంది. అయితే పీడీఎస్‌యూలో సంభవించిన చీలికలు ఉద్యమ గమనం మందగించడానికి కారణమయ్యాయి. నాకు సమకాలికులుగా ఉన్న చాలామంది కామ్రేడ్స్ ప్రత్యక్షంగా ఎదుర్కొన్న 1984 నాటి చీలికను చూసి కొందరు పీడ విరగడయిందని (గుడ్ రిడెన్స్) భావించిన వాళ్లున్నారు. కానీ అసలు పీడ అక్కడ నుండే మొదలయ్యింది. ఆ తర్వాతి 45 ఏళ్లలో 1986 రాజీవ్‌గాంధీ నూతన విద్యా విధానం, రిజర్వేషన్లు, ఎల్పీజీ, విద్యా కాషాయీకరణ – కార్పొరేటీకరణ లాంటి ఎన్నో పరిణామాలు వచ్చాయి. విద్యాహక్కు చట్టం తర్వాత కూడా ఎన్నో పాఠశాలలు మూసివేయబడి, సార్వజనీన విద్య (కామన్ స్కూల్ ఎడ్యుకేషన్) అనేది కనుమరుగై పోయింది. వాటన్నిటిపై ప్రగతిశీల విద్యార్థి ఉద్యమం బలాబలాలు మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. రెండు తరాలూ... అధిక ధరలు, ఆకలి చావులు, అన్నార్థుల ఆవేదనలు, దేశ సంపదను దోచుకెళ్తున్న పిడికెడు మంది బడా దోపిడీ దారులకు వ్యతిరేకంగా సాగే పోరాటాలతో మమేకం కావాలని కోరుకోవడం ఆహ్వానించతగ్గది. సమ్మేళనం బాధ్యతను నెత్తికెత్తుకున్న నిర్వాహకులకు విప్లవాభినందనలు. ఇది బయటి వ్యక్తి మాటగా కాకుండా మీతో నేను, నాతో మీరుగానే స్వీకరించాలని నా విజ్ఞప్తి. – అమర్ (జనవరి 21 పీడీఎస్‌యూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం సందర్భంగా) -
నిజాలను వక్రీకరిస్తే ‘జార్జిరెడ్డి’ను అడ్డుకుంటాం
సాక్షి, హైదరాబాద్: పీడీఎస్‌యూ నిర్మాత జార్జిరెడ్డిపై నిర్మించిన సినిమాలో నిజాలను వక్రీకరిస్తే... ‘జార్జిరెడ్డి’ మూవీని అడ్డుకుంటామని పీడీఎస్‌యూ జాతీయ అధ్యక్షుడు ఎం.రామకృష్ణ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.పరశురాం హెచ్చరించారు. సినిమా జార్జిరెడ్డి ఆశయాలు, లక్ష్యాలకు వ్యతిరేకంగా ఉంటే సహించబోమన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ... కామ్రేడ్ జార్జిరెడ్డి తన ఆశయాలు, సిద్ధాంతాల కోసం నిలబడి, కలబడిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. విద్యార్థి లోకానికి మరో చేగువేరా అన్నారు. ఆయన ప్రగతిశీల విద్యార్థులను ఏకతాటిపైకి తీసుకొచ్చి ఉస్మానియా క్యాంపస్‌లో జరిగిన అరాచకాలను అడ్డుకున్నాడన్నారు. మతోన్మాదాన్ని, కులోన్మాదాన్ని ఎదిరించాడన్నారు. అంతేకాకుండా ఆయన అణు భౌతికశాస్త్రంలో గోల్డ్‌మెడల్ సాధించాడని గుర్తుచేశారు. చదువుతో పాటు సమాజాన్ని అధ్యయనం చేసిన గొప్ప మేధావి అని కొనియాడారు. అలాంటి జార్జిరెడ్డి జీవితంలోని ముఖ్య సంఘటనలను వ్యాపార దృక్పథంతో సినిమాగా రూపొందించడం సరికాదన్నారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయకన్న తదితరులు పాల్గొన్నారు. -
'ఫీజు బకాయిలతో చదువులు దూరం'
హైదరాబాద్: పోస్టు మెట్రిక్ చదివే విద్యార్థుల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని రాజకీయ జేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించక పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. పీడీఎస్‌యూ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా శాఖల ఆధ్వర్యంలో మంగళవారం నగరంలో జరిగిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ కళాశాలల సంఖ్య తగ్గి, ప్రైవేటు రంగంలో పెరిగాయని గుర్తుచేశారు. 1980 తరువాత ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రైవేటు కళాశాలలను ఆహ్వానించారని, బతుకు దెరువు కోసం విద్యావంతులైన యువకులు అప్పట్లో కళాశాలలు ప్రారంభించుకున్నారని అన్నారు. తరువాత కాలంలో కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రవేశించి విద్యా వ్యవస్థను గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. పేద ప్రజలు తమకు స్థోమత లేకున్నా ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివించుకుంటున్న పరిస్థితుల్లో ఫీజు రీయింబర్స్మెంట్ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. లేకపోతే ప్రైవేటు కాలేజీలు కూడా మూతపడి కార్పొరేట్ విద్యాసంస్థల జులుం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫీజు బకాయిలను చెల్లించాలని, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీలను పూరించి, మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల సంఘం అధ్యక్షుడు గౌతం రావు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ. 2500 కోట్లను సరైన సమయంలో చెల్లిస్తే పేద విద్యార్థులకు చదువు దూరం కాదన్నారు. 2015-16 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఇప్పటి వరకు ఒక్కపైసా విడుదల కాలేదని అన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలను మూసివేసే పరిస్థితి ఏర్పడితే డీమ్డ్ యూనివర్సిటీలు, కార్పొరేట్ విద్యాసంస్థలు రాజ్యమేలుతాయని, అదే జరిగితే పేదపిల్లలు ఉన్నత విద్యకు దూరమవుతారని అన్నారు. ప్రొఫెసర్ పి.ఎల్ విశ్వేశ్వర్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత కార్పొరేట్ కళాశాల సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో సౌకర్యాలు మెరుగుపరచలేని పరిస్థితి ఉందని, ప్రభుత్వం నిర్బంధ ఉచిత విద్య అందిస్తే కార్పొరేట్ రంగం వెనక్కుపోతుందని అన్నారు. ఫార్మసీ కళాశాలల అధ్యక్షుడు కె. రామ్‌దాస్ మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. ప్రభుత్వ విధానంతో ఇప్పటికే కళాశాలల సంఖ్య సగానికి తగ్గిందని, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కాకపోతే పేద విద్యార్థులకు చదువు దొరకదని అన్నారు. ఈ సదస్సుకు పీడీఎస్‌యూ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షుడు వి.రియాజ్ అధ్యక్షత వహించగా, ప్రొఫెషనల్ కళాశాలల ప్రతినిధి కె. ప్రభాకర్ రెడ్డి, ప్రైవేటు డిగ్రీ కాలేజీల సంఘం అధ్యక్షుడు రమణారెడ్డి, ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం.శ్రీనివాస్, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.డి. రాము పాల్గొన్నారు.