George Reddy
-
యోధుడొకరు... విప్లవ వీరుడొకరు
భారతదేశ చరిత్రలో ఏప్రిల్ 14 ఒక మైలురాయి వంటిది. సమాజంలో మార్పు కోసం, సమాజ అభివృద్ధి కోసం మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రీబాయి ఫూలే, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, బాబూ జగ్జీవన్‌రామ్ వంటి ఎందరో మహనీయులు తమ జీవితాలను త్యాగం చేశారు. ఆ కోవకు చెందినవారే అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి ఏప్రిల్ 14. ఈ తేదీకే ఇంకో ప్రాముఖ్యం కూడా ఉంది. యూనివర్సిటీలలోనే సమాజం మార్పుకు నాంది పడాలని విద్యార్థులను చైతన్య పరచిన విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి అమర వీరుడైన రోజు కూడా ఇదే! ఇద్దరి ఆశయం సమాజంలోని అసమానతల్ని నిర్మూలించడమే! అంతరాలు లేని మానవీయ సమాజాన్ని నిర్మించడమే! ప్రయాణించిన మార్గాలు వేరైనా, ఇద్దరూ అడుగడుగునా సమాజ హితం కోసం పోరాడిన వారే! అందుకే ఈ రోజుకు ఇంత ప్రాధాన్యం. చరిత్రపుటల్లో ఇంతటి ప్రత్యేక స్థానం. సమాజంలోని కుల వివక్ష, అంటరాని తనం నిర్మూలనకు అహోరాత్రులు శ్రమించి బడుగు బలహీన వర్గాలకు సమన్యాయం జరిగేందుకు అవసరమైన హక్కులను భారత రాజ్యాంగంలో పొందుపరిచినవారు అంబేడ్కర్. స్వతంత్ర భారతంలో సామాన్య ప్రజలకు స్వేచ్ఛా ఫలాలు అందకుండా పోతున్న సమయంలో సమాజంలోని అపసవ్య ధోరణులను అధ్యయనం చేస్తూ లాటిన్ అమెరికా దేశాల విప్లవ వీరుడు చేగువేరా స్ఫూర్తిగా యూనివర్సిటీలలోనే సమాజ మార్పుకు నాంది పడాలని విద్యార్థులను చైతన్య పరిచే పోరాటంలో మతోన్మాదుల చేతిలో బలి అయిన ఉస్మానియా అరుణతార జార్జిరెడ్డి. నేటి ‘ప్రగతిశీల ప్రజా స్వామిక విద్యార్థి సంఘం’ (పీడీఎస్‌యూ) స్థాపక కారకులు జార్జి రెడ్డి అమరుడైన రోజు, సామాజిక న్యాయం కోసం పరితపించిన రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జన్మదినం ఒకే రోజు కావడం యాదృచ్ఛికమే అయి నప్పటికీ.. స్ఫూర్తి చేతనలను ప్రేరేపించే ఒక ప్రత్యేక సందర్భం ఇది. అంబేడ్కర్ సమసమాజ స్థాపన కోసం పాటు పడితే, జార్జిరెడ్డి సామాజిక న్యాయం కోసం పోరాడిన విప్లవ వీరుడు. అంబే డ్కర్ ఒక ధ్రువతార అయితే, జార్జిరెడ్డి ఒక అరుణతార. ఇద్దరూ చరిత్రపుటల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పచుకున్న వారే. ప్రజల గుండెల్లో నిలిచి పోయినవారే. ఇద్దరి ఆశయాలు సమాజంలోని సమా నత కోసమే, అంతరాలు లేని మానవీయ సమాజం కోసమే. ఇద్దరూ ప్రపంచ స్థాయి మేధావులే. ప్రజల బాగోగుల కోసం, సంక్షేమం కోసం వారి అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచించిన ఆలోచనాపరులే. సమాజ హితం కోసం అడుగడుగునా పోరాడిన వీర యోధులే. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నాలో ఒక సంఘర్షణను రేపుతుంది. ఒక సామాజిక విప్లవకారుని జననం, మరొక విప్లవకారుడు నేల కొరిగిన దినం! ఒకరిది పుట్టుక, ఒకరిది మరణం. ఇద్దరినీ ఒకే రోజు స్మరించుకోవడం సంఘర్షణ కాదా? ‘సమీకరించు, బోధించు, పోరాడు’.. అన్న నినాదంతో చైతన్యం కోసం పాటుపడిన వారు ఒకరు; ‘జీనా హైతో మర్నా సీఖో... కదం కదం పర్ లడ్నా సీఖో’ అనే నినాదం ఇచ్చి విప్లవ ఆదర్శాలను అందించిన సాహసోపేతమైన శక్తి ఒకరు. పుట్టినవారు మరణించక తప్పదు అని తెలిసినా, ఆ ఆలోచనకు ఒకింత బాధ కలుగుతూనే ఉంటుంది. కానీ అమరత్వం రమ్యమైనది. మనిషి తన కోసమే పుట్టి తన కోసమే మరణించడం సహజం. కానీ సమాజం కోసం, సమాజంలోని బాధితుల తరఫున గళమెత్తి, కలమెత్తి పోరాడి, పరుల కోసం మరణించడం రమ్యమైన అమరత్వం కాక మరేమవుతుంది? ఈ ఇద్దరు మహనీయులు కూడా ఉన్నత చదువులను అభ్యసించి ప్రతి క్షణం పేదవారి గురించే ఆలోచించి, ఏ మాత్రం స్వార్థం లేకుండా తమ అమూల్యమైన జీవితాలను ప్రజల కోసం త్యాగం చేశారు. ఇరువురి దారులు వేరైనా అంతిమ లక్ష్యం ఒక్కటే... మతోన్మాద మనువాద సంస్కృతికి వ్యతిరేకంగా పోరాటం సాగించడం. ‘‘మతములన్నియు మాసిపోవును, జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును..’’ అని గురజాడ గారన్నట్లు జ్ఞానం ద్వారానే జీవితానికి వెలుగు అని, విద్య ద్వారానే అసమానతలు, అంతరాలు తొలగిపోతాయని ఇద్దరూ నమ్మారు. రిజర్వేషన్ ఫలాలు అందించి అణగారిన వర్గాలు విద్యాగంధానికి నోచుకునేలా అంబేడ్కర్ కృషి చేశారు. కులం అణచివేతలు, కుల దురహంకార పీడనలు లేని ఆత్మ గౌరవ సమాజం కోసం పోరాడిన సాంఘిక విప్లవకారుడు అంబేడ్కర్. దోపిడీ, పీడన లేని సమసమాజాన్ని కలలుగన్న విప్లవ స్వాప్నిక కార్యశీలి జార్జిరెడ్డి. ఇద్దరి జీవితం ప్రస్తుత సమాజానికి ఆదర్శ ప్రాయం, అనుసరణీయం. ఒకరు బాధిత కులంలో పుట్టి అన్యాయాలను, అక్రమాలను, అవమానాలను భరించి... కుల ఆధిపత్యా నికి, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడడానికి తమ జాతిని, బాధితులను పీడితులను చైతన్య పరిచారు. మరొకరు మధ్యతరగతి వర్గంలో జన్మించి, సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉన్నప్పటికీ పేదల, శ్రామికవర్గ, గ్రామీణ కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థుల బాధలను అవగాహన పరచుకునేందుకు వారి స్థాయికి దిగి సాధారణ జీవితాన్ని అనుభవించిన విద్యార్థి. 1972లో కామ్రేడ్ జార్జిరెడ్డిని ‘సంఘ్ పరివార్’లోని కొన్ని మతో న్మాద హిందూత్వ శక్తులు హత్య చేశాయి. నాటి పరిస్థితులే నేటికీ సమాజంలో కనిపిస్తున్నాయి. అంతేకాదు, పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. నేడు కూడా మత మౌఢ్యాన్ని, మూఢనమ్మకా లను వ్యతిరేకిస్తూ ప్రజాస్వామిక భావాలను పెంపొందింప చేయడా నికి ప్రయత్నించిన, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించిన ప్రజా స్వామిక వాదులను కాల్చి చంపిన సందర్భాలు ఉన్నాయి. యూనివర్సిటీలలో అణగారిన వర్గాల విద్యార్థులు ఉన్నత స్థాయి పరి శోధనలు జరపడానికి లేకుండా వారిని అడ్డుకుంటూ, మానసిక క్షోభకు గురిచేసి బలవన్మరణానికి పాల్పడేలా ప్రేరేపించడం జరుగుతోంది. అదే సమయంలో సమాజాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు పెరిగిపోతున్నాయి. విద్యను కాషాయీకరణ, వ్యాపారీకరణ చేసేందుకు ప్రభుత్వాలు ఆతురతను కనబరుస్తున్నాయి. అందుకే అన్న ట్లుగా ఆగమేఘాల మీద జాతీయ విద్యా విధానం ప్రవేశపెట్టి ప్రైవేటీకరణ విధానాలను ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టడం జరిగింది. ఆ విధానాలను సవరించాలని విద్యావేత్తలు, మేధావులు, ప్రజాస్వామిక వాదులు కోరినప్పటికీ వాటిని పెడచెవిన పెట్టి ఏకపక్షంగా బలవంతంగా అశాస్త్రీయ విద్యా విధానాన్ని అమలు చేయాలని ప్రయత్నించడం వల్ల బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు విద్యకు దూరమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్, విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి ఆశించినట్టుగా ప్రజాస్వామిక, ప్రజాతంత్ర, శాస్త్రీయ విద్యా విధానం అమలు కావడం లేదు, అమలు చేసే పరిస్థితులు కూడా లేవు. అమలు చేయాలని అడిగే విద్యార్థిలోకం కూడా నేడు బలంగా లేదు. అయినా నిరుత్సాహ పడనవసరం లేదు. ప్రజాస్వామిక, మానవీయ విలువలు పెంపొంది ఆదర్శవంతమైన సమాజం రూపుదిద్దుకోవాలంటే అంబే డ్కర్, జార్జిరెడ్డిల ఆశయాలు నెరవేర్చే అవకాశం ప్రగతి శీలులందరికీ ఉంటుంది. చదువే ఆయుధంగా ప్రపంచ మేధావిగా గుర్తింపు పొంది బడుగువర్గాల బాగోగుల కోసం నిరంతరం శ్రమిస్తూ అవిరళ కృషి చేసిన అంబేడ్కర్ జీవితాన్ని; అన్యాయాలకు అక్రమానికి వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేసే స్వభావం, తప్పులేనప్పుడు ఎవరినైనా ఎది రించే సత్తా, తోటి వారి కోసం తన ప్రాణాలను సైతం అర్పించే త్యాగగుణం, సమ సమాజం కోసం పరితపించే మనస్తత్వం గల జార్జిరెడ్డి పంథాను ఆదర్శంగా తీసుకుని అనుసరించాలి. జార్జిరెడ్డి ఆందోళన , పోరాటాలతోపాటు నిరంతర అధ్యయనశీలిగా గడిపారు. పాతికేళ్ల జీవితంలో ప్రపంచ విప్లవాలను పట్టుదలతో పరిశీలించి విప్లవ మార్గాన్ని అనుసరించారు. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వంటి ప్రజ్ఞ కలిగిన అపర మేధావి అతడు. భౌతిక శాస్త్రంలో గోల్డ్ మెడల్ సాధించి స్కాలర్ అయిన జార్జి రెడ్డి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని, అంబేడ్కర్ ప్రబోధించిన విలువలతో నేటి యువత సామాజిక ప్రజా సమస్యల పట్ల అవగాహన పెంచుకోవాలి. శాస్త్రీయ విద్యా విధానం కోసం, ప్రజాతంత్ర విద్య కోసం పోరాడాలి. ఈ ఇద్దరు వీరులకు మనం ఇవ్వగలిగిన నిజమైన, ఘనమైన నివాళి ఇదే! తండ సదానందం వ్యాసకర్త టి.పి.టి.ఎఫ్. రాష్ట్ర కౌన్సిలర్ మొబైల్: 99895 84665 -
PDSU: ‘ప్రగతిశీల’ శక్తులన్నీ ఒక్కటి కావాలి!
హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం కేంద్రంగా 1974లో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) ఏర్పడి మరో ఏడాదికి 50 ఏళ్లు నిండనున్నాయి. అసమానమైన పోరాటాలతో, త్యాగాలతో ఇరు రాష్ట్రాల ప్రజలపై పీడీఎస్‌యూ చూపిన ప్రభావం ఎవ్వరూ చెరపలేనిది. ఈ సంస్థకు రాష్ట్ర ఉపాధ్యక్షునిగా 1980 దశకం నాటికే నా ప్రత్యక్ష నిర్మాణ సంబంధం ముగిసిపోయింది. కానీ సోదరుడు కామ్రేడ్ కూర రాజన్న ద్వారా మా ఇంటి తలుపు తట్టిన అమరుడు కామ్రేడ్ జార్జిరెడ్డి జ్ఞాపకం, ఎంతోమంది గుండెల్ని రగిలించిన ఆయన ప్రస్థానం.. నేను పుట్టి పెరిగిన సిరిసిల్ల ప్రాంత రైతాంగ పోరాటాల వెల్లువతో పెనవేసుకుపోయింది. అదే విప్లవోద్యమంతో ముడిపడి పోయి రెండు తరాల విప్లవ విద్యార్థులతో నా ఇన్నేండ్ల ప్రయాణాన్ని నిర్దేశిస్తూ వస్తోంది. అందుకే నాకిది జ్ఞాపకం మూత్రమే కాదు, వర్తమాన నిజం. అలాంటి జ్ఞాపకాలన్నింటినీ తట్టిలేపుతూ, గతం–వర్తమాన పరిస్థితులను బేరీజు వేసుకుంటూ 2023 జనవరి 21న, పీడీఎస్‌యూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరగడం అపూర్వమనే భావించాలి. కామ్రేడ్ జార్జిరెడ్డి ఆధ్వర్యాన ఏర్పడిన పీడీఎస్‌యూ, ఆయన అమరుడైన ఏప్రిల్ 14 (1974)ననే పీడీఎస్‌యూగా ఆవిర్భవించింది. అది మొదలు అధిక ధరలపై, పలు సమస్యల సాధనకై పోరాడింది. కామ్రేడ్స్ భూమయ్య, కిష్టాగౌడ్‌ల ఉరిశిక్షల రద్దుకై ఉద్యమించింది. రైల్వే కార్మికుల సమ్మెకు మద్దతుగా నడిచింది. శ్రీకాకుళ గోదావరి లోయ పోరాటాలకు సంఘీభావంగా నిలిచింది. శ్రామికవర్గ అంతర్జాతీయతను ఎలుగెత్తి చాటి, ప్రపంచ పౌరుడిగా అవతరించిన చేగువేరా త్యాగనిరతిని పునికి పుచ్చుకుంది. అందుకే మతోన్మాదుల చేతుల్లో జార్జ్, చాంద్ పాషాల హత్యలు మొదలు... రాజ్యమే యుద్ధం ప్రకటించడంతో జంపాల, శ్రీపాద శ్రీహరిల నుండి చంద్రశేఖర్, రియాజ్‌ల వరకూ డజనుల కొలది విద్యార్థి వీరులు అమరు లైనారు. మరి ఎంతోమంది విద్యాలయాల నుండి పయనమై సమాజపు విముక్తిలో అంతర్భాగమైనారు. ఇందులో కొందరు తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో నిలబడి బూర్జువా పార్లమెంటరీ రాజకీయాల్లో కీలకంగా ఎదిగారు. ఈనాడు విప్లవ విద్యార్థి ఉద్యమం ఎదుర్కొంటున్న సమస్యల ప్రత్యేక సందర్భంలో పలు పీడీఎస్యూలన్నీ ఒకే తాటి మీదకు రావడమనేది, ప్రధాన ఎజెండా కావాలనేది నా అభిప్రాయం. ఇప్పుడు గతం కంటే తీవ్రంగా యావద్దేశం హిందుత్వ రాజకీయాల ఫాసిస్టు దాడికి గురవుతోంది. ప్రారంభం నుండీ ఇలాంటి ఉన్మాద దాడుల్లోనే రక్తసిక్త పసిగుడ్డుగా పుట్టిన పీడీఎస్‌యూ అనతి కాలంలోనే ఎమర్జెన్సీ ఫాసిస్టు దాడికి గురయ్యింది. చితాభస్మంలోంచి లేచిన ఫినిక్స్ పక్షిలాగా మారిన పీడీఎస్‌యూ నేడు అప్రకటిత ఎమర్జెన్సీని ఎదుర్కొంటూనే మునుముందుకు సాగుతోంది. అయితే పీడీఎస్‌యూలో సంభవించిన చీలికలు ఉద్యమ గమనం మందగించడానికి కారణమయ్యాయి. నాకు సమకాలికులుగా ఉన్న చాలామంది కామ్రేడ్స్ ప్రత్యక్షంగా ఎదుర్కొన్న 1984 నాటి చీలికను చూసి కొందరు పీడ విరగడయిందని (గుడ్ రిడెన్స్) భావించిన వాళ్లున్నారు. కానీ అసలు పీడ అక్కడ నుండే మొదలయ్యింది. ఆ తర్వాతి 45 ఏళ్లలో 1986 రాజీవ్‌గాంధీ నూతన విద్యా విధానం, రిజర్వేషన్లు, ఎల్పీజీ, విద్యా కాషాయీకరణ – కార్పొరేటీకరణ లాంటి ఎన్నో పరిణామాలు వచ్చాయి. విద్యాహక్కు చట్టం తర్వాత కూడా ఎన్నో పాఠశాలలు మూసివేయబడి, సార్వజనీన విద్య (కామన్ స్కూల్ ఎడ్యుకేషన్) అనేది కనుమరుగై పోయింది. వాటన్నిటిపై ప్రగతిశీల విద్యార్థి ఉద్యమం బలాబలాలు మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. రెండు తరాలూ... అధిక ధరలు, ఆకలి చావులు, అన్నార్థుల ఆవేదనలు, దేశ సంపదను దోచుకెళ్తున్న పిడికెడు మంది బడా దోపిడీ దారులకు వ్యతిరేకంగా సాగే పోరాటాలతో మమేకం కావాలని కోరుకోవడం ఆహ్వానించతగ్గది. సమ్మేళనం బాధ్యతను నెత్తికెత్తుకున్న నిర్వాహకులకు విప్లవాభినందనలు. ఇది బయటి వ్యక్తి మాటగా కాకుండా మీతో నేను, నాతో మీరుగానే స్వీకరించాలని నా విజ్ఞప్తి. – అమర్ (జనవరి 21 పీడీఎస్‌యూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం సందర్భంగా) -
అన్యాయాలపై సంధించిన సూటి ప్రశ్న!
మోసం పునాదులమీద నిలబడ్డ మీ సంకుచిత మత విశ్వాసాలని ధ్వంసం చేస్తాను కూకటివేళ్లతో సమూలంగా పెకలించి వేస్తాను మతవిద్వేషపు కళంకాన్ని ఊడ్చేస్తూ నా ఆశలు సగర్వంగా ఆకాశంలో ఎగురుతాయి – జోష్ మలీహాబాదీ అది 1972 ఏప్రిల్ 14 సాయంత్రం. జార్జిని ధూల్ పేట కిరాయి గూండాలు హత్య చేశారని ఒక మిత్రుడు హడావుడిగా వచ్చి చెప్పాడు. నమ్మలేదు. హిమాయత్ నగర్లో ఉన్న మరొక మిత్రుని దగ్గరకు వెళ్లే సరికి అప్పటికే జార్జి హత్యపై తాను రాసిన కరపత్రంతో కనిపించాడు. చావు అంత తేలికగా తన దగ్గరకు రాదని జార్జి తరచూ మాతో చెప్పేవాడు. ఏప్రిల్ 15న డీడీ కాలనీలోని ఇంటిదగ్గర శవపేటికలో జార్జి మృత దేహం మా కళ్ళముందున్నది. తన దేహంపై 32 కత్తిపోట్లు... హంతకుల ద్వేషానికి సాక్ష్యంగా! రెండువేల మంది విద్యార్థులు గుమికూడారు. కన్నీళ్ళు, నిశ్శబ్దం అలుముకున్న ఉద్విగ్న విషాద వాతావరణం. అంతలో ఎవరిదో ఒక గొంతు నుండి ‘జార్జిరెడ్డి అమర్ రహే’ నినాదం! వేల గొంతులు ఒక్కటిగా పిక్కటిల్లాయి. ఆర్ఎస్ఎస్ కార్యాలయం ముందునుంచి జార్జి శవయాత్ర సాగేటప్పుడు కట్టలు తెగిన ఉద్రేకం! మేము అప్పుడు నిగ్రహం పాటించకపోతే ఏమయ్యేదో తెలియదు. జార్జిని నారాయణగూడ శ్మశానవాటికలో ఖననం చేశాం. ఎవరీ జార్జి? అత్యంత ప్రతిభాశాలియైన విద్యార్థి. అణుభౌతిక శాస్త్రంలో స్వర్ణపతక గ్రహీత. పీహెచ్డీ పరిశోధనకు నమోదు చేసుకోవాలనుకున్నపుడు, ఫిజిక్స్ డిపార్ట్ మెంట్లో ప్రొఫెసర్లు ఎవరూ తనకి గైడ్‌గా ఉండడానికి సిద్ధపడలేదనీ, ఒక ఆస్ట్రానమీ ప్రొఫెసర్ ముందుకు వచ్చిన తర్వాతనే తాను పరిశోధనకు ఉపక్రమించాడనీ అనుకునేవాళ్ళు. పరీక్షా పత్రాలలో తన జవాబులను చదివిన ప్రొఫెసర్ ఒకరు తనని ప్రత్యక్షంగా చూడాలని బొంబాయి నుంచి వచ్చి కలిశాడు. అయితే జార్జిని యాభై సంవత్సరాల తర్వాత గుర్తు చేసుకుంటున్నది అసాధారణమైన ఈ ప్రతిభాపాటవాల వల్ల మాత్రమే కాదు. జార్జి అణగారిన ప్రజల గురించి ఆలోచించేవాడు. ఆ రోజులలో రిక్షాలు ఎక్కువగా ఉండేవి. ఒకసారి మేము రిక్షా కార్మికుల గురించి మాట్లాడుకుంటున్నాం. ‘ఒక మనిషి రిక్షాని ఎగువకి లాగుతుంటే, ఇంకో మనిషి ఆ రిక్షాలో కూర్చోవడాన్ని చూస్తే ఎలా అనిపిస్తుంద’ని జార్జి అడగడం నాకు గుర్తుంది. జార్జి స్వార్థంలేని మనిషి. జార్జి అత్యంత సాహసోపేతమైన వ్యక్తి. అన్యాయాన్ని సహించక ఎదురుతిరిగేవాడు. సిద్ధాంత రాజకీయ చర్చలలో ప్రశ్నలతో ఆలోచనలు రేకెత్తించేవాడు. వివిధ కళాశాలల విద్యార్థులతో అధ్యయన బృందాలు నెలకొల్పి పుస్తకాలపై చర్చించే వాడు. సైన్స్ కాలేజిలోని ఆస్ట్రానమీ డిపార్ట్ మెంట్ పక్కనే ఉండిన ఒక క్యాంటీన్ తన చర్చలకు ఒక కేంద్రంగా ఉండేది. అక్కడ కూర్చుని మేం వివిధ అంశాలపై చర్చిస్తూ జార్జి విశ్లేషణలను వింటూ ఉండేవాళ్ళం. అక్కడకు వచ్చేవాళ్ళలో ‘అట్లాస్ ష్రగ్డ్’, ‘ఫౌంటెన్ హెడ్’ వంటి అయన్ రాండ్ పుస్తకాలను చేతిలో పెట్టుకుని చర్చించే మార్క్సిస్ట్, సోషలిస్టు వ్యతిరేకులు కూడా వుండేవాళ్ళు. సైన్సు, తత్వశాస్త్రం, సిద్ధాంతం, విప్లవం వంటి అంశాలపై నిశితమైన చర్చలు అక్కడ ఉండేవి. అచ్చెరువొందించే తెలివితేటలూ, అన్యాయానికి స్పందించి తిరగబడడంతో పాటు, ప్రగతిశీల భావాలని ప్రోదిచేసి విద్యార్థులను సమీకరించిన కృషియే జార్జిని ప్రత్యేకంగా నిలబెట్టింది. నిర్దిష్టమైన పోలికలు లేకపోయినా జార్జి... తన నడక, నడవడికలతో విప్లవ స్ఫూర్తి ‘చే గువేరా’ని స్ఫురింపజేసేవాడు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో సైన్స్ గ్రాడ్యుయేషన్ విద్యార్థిగా ఉన్న నాకు జార్జి సహచరునిగా పనిచేసే అవకాశం లభించింది. జార్జి మరణం తర్వాత పీడీఎస్‌యూ ఆవిర్భావానికి దారులు వేసిన ప్రగతిశీల విద్యార్థుల బృందంలో నేనొకడిని. ఆనాటి పరిస్థితులపై ‘క్రైసిస్ ఇన్ క్యాంపస్’ పేరుతో ఒక డాక్యుమెంటరీ వచ్చింది. అందులో జార్జి సమాజంలో హింస గురించీ, ధిక్కారాన్ని సహించని వ్యవస్థ శాంతియుత నిరసనను ఎలా హింసతో అణచివేస్తుందో వివరిస్తాడు. ఆ చర్చ, ప్రశ్నలు ఇప్పటికీ వర్తించేవే. ‘చావు మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఎప్పుడైనా రావచ్చున’నే చే గువేరా మాటలని జార్జి ఉటంకించేవాడు. జార్జి జీవితం చావును ధిక్కరించడంలో వుంది. జార్జి మరణం సమాజంలో అన్యాయాలపై సంధించిన సూటైన ప్రశ్న! (క్లిక్: ఉస్మానియా ఎరుపెక్కిన వేళ...) 1960ల నాటి విప్లవ జ్వాల... జార్జి వంటి అసాధారణమైన వ్యక్తులను సృష్టించింది. ప్రజల కోసం మరణించిన స్ఫూర్తిగా జార్జి కొనసాగుతున్నాడు. సంక్లిష్టమైన పరిస్థితులలో, వేర్వేరు రూపాలలో జార్జి వారసత్వం ఈనాటికీ కొనసాగుతూనేవుంది. జార్జి ఆలోచనలూ, రేకెత్తించిన ప్రశ్నలూ, మెరుగైన సమసమాజ స్వప్నాలూ ఇంకా సజీవంగానే వున్నాయి. ఆ స్వప్నాలను ఎవ్వరూ చిదిమి వేయలేరు. యాభై సంవత్సరాల తర్వాత కూడా చావును ఎదిరించి గేలి చేసిన ధిక్కారానికి ప్రతీకగా, సజీవంగా జార్జి నిలిచి వున్నాడు! (క్లిక్: మలి అంబేడ్కరిజమే మేలు!) - బి. ప్రదీప్ వ్యాసకర్త జార్జిరెడ్డి సహచరుడు bpkumar05@rediffmail.com -
ఉస్మానియా ఎరుపెక్కిన వేళ...
కాసింత ఆహారం, దుస్తులు, వైద్యం లాంటి కనీస అవసరాలు అందరికీ సంపూర్ణంగా అందాలని అర్ధ శతాబ్దం క్రితం ఒక యువ మేధస్సు ఆలోచించింది. ఆ లక్ష్య సాధనకై ఆచరణాత్మక కార్యాచరణ రూపొందించి, అడుగులు వేస్తున్న నేపథ్యంలో 1972 ఏప్రిల్ 14న ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీ కిన్నెర హాస్టల్ ప్రాంగణంలో... ప్రగతి నిరోధక, ఛాందస భావాల ప్రతినిధుల కుట్రలకు ఆ యువ కిశోరం ఎదురు నిలిచి పోరాడి నేలకొరిగింది. అతడే ప్రగతి శీల విద్యార్థుల ప్రియ నేత, ఉస్మానియా అరుణ తార, హైదరాబాద్ చేగువేరాగా పిలుచుకునే జార్జి రెడ్డి! 1947 జనవరి 15న కేరళలో జన్మించాడు జార్జి రెడ్డి. 1960–70ల్లో హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ విద్యార్థిగా, ఉస్మానియా రీసెర్చ్ స్కాలర్‌గా జార్జ్ చెరగని ముద్ర వేశాడు. క్లిష్టమైన అణు భౌతిక శాస్త్రంలో (న్యూక్లియర్ ఫిజిక్స్) గోల్డ్ మెడల్ సాధించాడు. విద్యార్థులకు విద్యతో పాటు మానసిక శారీరక దృఢత్వం తప్పనిసరి అని విశ్వసించే జార్జ్ తనని తాను బాక్సింగ్ ఛాంపియన్‌గా మలుచుకున్నాడు. అంతేగాక తోటి విద్యార్థులకు, విద్యార్థినులకు స్వీయ రక్షణ మెలకువలు బోధిస్తూ, వారిలో నూతన విశ్వాసాన్ని నింపేవాడు. నక్సల్బరీ, శ్రీకాకుళం, గోదావరి లోయ గిరిజన పోరాటాలు, తొలి దశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ గాలులు ఉస్మానియా గడ్డను తాకాయి. ఆ ప్రజా ‘తిరుగుబాట్లు’ ఉస్మానియా విద్యార్థులలో ఆసక్తిని కలిగించాయి. ఈ నేపథ్యంలోనే యూనివర్సిటీ నూతన పరిణామాలకు వేదికైంది. రైతాంగ పోరాటాలకు జడుచుకొని నగరాలలో స్థిరపడిన ఆధిపత్య సామాజిక వర్గాల వారసులు... చదువు సాకుతో ఉస్మానియా యూనివర్సిటీలో తిష్ఠ వేశారు. మరోవైపు నాటి ఉద్యమ విజయాలతో చదువుల ఒడిని చేరుకున్న మధ్యతరగతి, రైతు కూలీల బిడ్డలు, ఉన్నత విద్యకై ఉస్మానియా వర్సిటీలోకి అప్పుడప్పుడే చేరుకోవడం ఆరంభమైంది. (క్లిక్: మహిళల వద్దకే ఉద్యోగాలు) మొదటి బృందానికి నాటి పాలక పార్టీ, నేటి అధికార పార్టీ మాతృసంస్థలు దిశానిర్దేశం చేస్తూ... యూనివర్సిటీపై తమ తమ ఆధిపత్యాల కోసం వికృత మార్గాలు ఎంచుకున్నాయి. ఫలితంగా రెండో బృందం విద్యార్థులపై హాస్టళ్లలో, మెస్‌లలో, తరగతి గదులలో, ఈవ్ టీజింగ్, ర్యాగింగ్‌ల పేరుతో.. బల ప్రదర్శన, ఆధిపత్యం చేయడం ఆనవాయితీగా మారింది. యూనివర్సిటీ అధికారులపై, ఆచార్యులపై బెదిరింపులకు పాల్పడటం; విద్యార్థి సంఘాల ఎన్నికలలో ఆరోగ్యకరమైన పోటీ జరగకుండా భయభ్రాంతులు సృష్టించడం, తోటి విద్యార్థుల స్వేచ్ఛను హరించడం సర్వసాధారణమైపోయింది. ఈ నేపథ్యంలో ఎమ్మెస్సీ ఫిజిక్స్ విద్యార్థిగా జార్జి రెడ్డి యూనివర్సిటీ గడ్డపై అడుగు పెట్టాడు. బిక్కుబిక్కుమంటున్న విద్యార్థి లోకానికి పెద్ద దిక్కై నిలిచాడు. క్యాంపస్‌లో విద్యార్థి హక్కుల రక్షణకై నిలబడ్డాడు. భౌతిక దాడులను తన బిగి పిడికిలితో తిప్పికొడుతూ విద్యార్థుల్లో ధైర్యాన్ని నింపాడు. సైద్ధాంతిక అధ్యయనం, చర్చలతో సహచరులలో స్ఫూర్తి రగిలించాడు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి బృందాన్ని నిర్మించి ఆనతి కాలంలోనే విద్యార్థుల ఆత్మీయ నేతగా ఎదిగాడు. సాధారణ విద్యార్థులను పోటీకి నిలవనివ్వని ‘ఆధిపత్యం’పై విద్యార్థి సంఘాల ఎన్నికలలో గెలిచి రికార్డు సృష్టించాడు. విజ్ఞానంలోనూ, నాయకత్వంలోనూ పతాక స్థాయికి చేరుకుంటున్న జార్జి ‘ఆధిపత్య వర్గాలకు’ కంటగింపుగా మారాడు. దీంతో ఛాందసవాదులు జార్జిని అమానుషంగా హత్య చేశారు. జార్జి త్యాగాన్నీ, ఆశయాలనూ ఎత్తి పడుతూ జార్జి స్థాపించిన పీడీఎస్ అనతికాలంలోనే ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ)గా దేశవ్యాప్తంగా విస్తరించింది. ‘జీనా హై తో మర్ నా సీఖో, ఖదం ఖదం పర్ లడ్నా సీఖో’ అంటూ మరణానంతరం కూడా యువ తరానికి దిశానిర్దేశం చేస్తున్న హీరో జార్జి రెడ్డి. (చదవండి: వ్యవస్థల్లో విపరీత ధోరణులు) - ఎస్. నాగేశ్వర్ రావు పీడీఎస్‌యూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు (ఏప్రిల్ 14న జార్జి రెడ్డి 50వ వర్ధంతి సందర్భంగా... నేడు ఓయూలో నిర్వహించే ‘రెడ్ షర్ట్’ కవాతు, బహిరంగ సభ నేపథ్యంలో) -
భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో ‘జార్జి రెడ్డి’ నటుడి కొత్త మూవీ
‘జార్జిరెడ్డి’, ‘వంగవీటి’ ఫేమ్ సందీప్ మాధవ్ హీరోగా గాయత్రి ఆర్. సురేష్, శీతల్ భట్ హీరోయిన్స్‌గా రూపొందుతున్న చిత్రం ‘గంధర్వ’. ఫన్నీ ఫాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఎం.ఎన్.మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి కుమార్, సురేష్, బాబుమోహన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన లభించింది. ఇండియన్ సినిమాల్లో ఇప్పటివరకు రాని ఓ డిఫరెంట్ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలుంటాయని మూవీ టీం వెల్లడించింది. ఇటీవల షూటింగ్ జరిగిన ఓ యాక్షన్ సీక్వెన్స్ లో హీరో సందీప్ తో పాటు ముఖ్యనటులతో పాటు 50 మంది ఫైటర్స్ పాల్గొన్నరన్నారు. ఈ సందర్భంగా హీరో సందీప్ పుట్టినరోజు సందర్భంగా.. ఆయనకు వెండి నాణాలను బహుకరించి అభినందించింది చిత్ర యూనిట్. ఈ కార్యక్రమంలో నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. చదవండి: నాకు చుక్కలు చూపించేవాడు.. ఆనంద్‌కే ముందు పెళ్లి: విజయ్ దేవరకొండ -
‘‘గంధర్వ’’ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల
వంగవీటి, 'జార్జిరెడ్డి' ఫేమ్ సందీప్ మాధవ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం గంధర్వ. గాయత్రి ఆర్. సురేష్, శీతల్ భట్ కథనాయికలు. ఫన్నీ ఫాక్స్ ఎంటర్టైన్మెంట్స్, వీర శంకర్ సిల్వర్ స్క్రీన్స్ పతాకాలపై అప్సర్ దర్శకత్వంలో ఎమ్.ఎన్ మధు ఈ మూవీని నిర్మిస్తున్నారు. డైలాగ్ కింగ్ సాయి కుమార్, సురేష్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ ఆదివారం విడుదల చేసింది. ఇండియన్ సినిమాల్లో రానటువంటి ఓ డిఫరెంట్ కథాంశంతో దర్శకుడు అప్సర్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా.. ఇప్పటి వరకు నటించని ఓ డిఫరెంట్ రోల్లో సందీప్ మాధవ్ కనిపించనున్నారు. ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌ను గమనిస్తే హీరో సందీప్ మాధవ్ రౌడీలను చితక్కొడుతున్నారు. హీరో చేతులు ఓ కుర్చీకి కట్టేసి ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే గంధర్వ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలుంటాయని తెలుస్తుంది. సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. నాగు.వై ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ర్యాప్ రాక్ షకీల్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నిరంజన్ జె.రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. -
‘రాత’ మార్చిన రాంగోపాల్ వర్మ..
సాక్షి, హైదరాబాద్: అడుగు పెట్టిన స్వల్ప కాలంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన పేజీ రాసుకున్న యువ హీరో సందీప్ మాధవ్. ఏ కొత్త నటుడికీ రాని విధంగా వరుస బయోపిక్స్‌లో నటించిన ఘనత ఈ యువ నటుడికే దక్కింది. నిజ జీవిత పాత్రలను తెరపై పండించడం, ప్రేక్షకుల్ని మెప్పించడం అంత సులువైన పనికాదు. వంగవీటి, జార్జ్‌రెడ్డి సినిమాల ద్వారా దాన్ని సుసాధ్యం చేసిన సందీప్ (సాండీ) బయోపిక్స్ రూపొందించాలనుకుంటున్న పలువురు నిర్మాతలకు ఆశాదీపంగా మారాడు.. ‘సాక్షి’తో తన మనోభావాలను సందీప్ ఇలా పంచుకున్నాడు.. ఆ విశేషాలు తన మాటల్లోనే.. సినిమా కుటుంబంలో ఒక భాగం అవ్వాలనే ఆశతో, ఆశయంతో వచ్చిన సగటు సినిమా ప్రేమికుడ్ని నేను. పుట్టింది ఎక్కడైనా, పెరిగిందంతా.. చదువంతా ఈ సిటీలోనే. చదువైన తర్వాత ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా జాబ్ చేస్తున్నా కానీ మనసంతా సినిమానే. స్టేజ్ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పటి కల కావడంతో సినిమా ప్రయత్నాలు కొనసాగిస్తూ వచ్చా. అందులో భాగంగానే పూరి జగన్నాథ్ ‘జ్యోతిలక్ష్మీ’ సినిమా ఆడిషన్స్‌లో అవకాశం వచ్చింది. అప్పటికే ఒక సినిమాలో చేసినప్పటికీ నా సినిమా ఆశలకు కొత్త ఊపిరి వచ్చింది అక్కడే.. లీడ్‌రోల్ చేసే అవకాశం పూరి దగ్గరకు రాకపోకలు సాగిస్తున్న సమయంలోనే నన్ను చూసిన రామ్‌గోపాల్ వర్మకి తానెప్పటి నుంచో తీయాలనుకుంటున్న వంగవీటి సినిమాలో వంగవీటి రంగా పాత్రధారి నాలో కనపడ్డాడు. దాంతో ఆ సినిమాలో లీడ్‌రోల్ చేసే అవకాశం వచ్చింది. సుప్రసిద్ధ రామ్‌గోపాల్ వర్మ దర్శకుడు, అందులోనూ నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న పవర్ఫుల్ స్టోరీ కాబట్టి సినిమాలో నేను కాకుండా క్యారెక్టర్ మాత్రమే కనిపించేలా ఆహార్యం, హావభావాలను కనపడేందుకు బాగా కష్టపడి ప్రాక్టీస్ చేశా. దానికి తగిన ఫలితం విమర్శకుల ప్రశంసల రూపంలో దక్కింది. చార్జ్ చేసిన జార్జ్.. వంగవీటి ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో మరింత మంచి పాత్రలు చేయాలనే ఆసక్తి ఏర్పడింది. వంగవీటి తర్వాత దాదాపు 50 కథల వరకు విన్నాను. ఆ సమయంలోనే జార్జిరెడ్డి కథ విన్న వెంటనే ఓకే చేశాను.. నన్ను అత్యంత ప్రభావితం చేసిన బయోపిక్ అది. పైగా ఛాలెంజింగ్ రోల్, జార్జిరెడ్డి అనేది ఈ తరానికి తెలియని రియల్ హీరో చరిత్ర. దాన్ని తెరపైకి తీసుకురావాలంటే గట్స్ ఉండాలి. అవన్నీ నాకు దర్శకుడిలో కనిపించాయి. కథని ఎంత నమ్ముతానో కథని సినిమాగా మలిచే దర్శకుడిని అంతకన్నా ఎక్కువ నమ్ముతా. దాన్ని ప్రజెంట్ చేయడంలో మంచి క్లారిటీ ఉన్న దర్శకుడు తను. గతం మరిచిన కథని తట్టిలేపుతున్నామని కాస్త ఆలోచన వచ్చినా ప్రేక్షకులు ‘సినిమాని సినిమాగానే చూస్తారన్న’ ప్రగాఢ నమ్మకం నాది. ఈ విషయంలో నేను తీసుకున్న నిర్ణయం నన్ను గెలిపించింది. కొత్త సాండీని చూస్తారిక.. చేసిన రెండు సినిమాలు వివాదాస్పద కథలే అయినప్పటికీ వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. ప్రస్తుతం మరో రెండు సినిమాలు చేస్తున్నాను. ఇవి నా నటనలోని మరో కోణాన్ని చూపించడానికి ఎంచుకున్న సినిమాలు. ఒకటి కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్తో అందరినీ అలరిస్తుంది. మరోటి పవర్ఫుల్ ఆర్మీ క్యారెక్టర్. నాకెప్పుడూ సమాజంపై అభిమానం, ఆరాధనా భావం ఉంటుంది. ఎలాంటి సినిమా చేసినా సమాజ శ్రేయస్సుకు దోహద పడే అంశం దానిలో ఉండేలా చూసుకుంటా. నేనెప్పుడూ స్టార్‌గా ఫీలవ్వను. కమర్షియల్ సినిమాలు చేస్తూనే తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమాలు, సైంటిఫిక్ కథాంశంతో కూడిన సినిమాల్లో చేయాలనుంది. ఏలియన్స్, గెలాక్సి తదితర ఆసక్తికర అంశాలతో ఉన్న సినిమాలంటే ఇష్టం. కరోనాపై పరిశ్రమ గెలిచింది.. కళపై ఆసక్తి ప్రతిభ ఉండాలే కానీ అవకాశాలకు కొదువ లేదు మన దగ్గర. కరోనా ఇండస్ట్రీని దెబ్బతీసినా కొత్త అవకావాలను సృష్టించుకోవడంలో సినిమా ఇండస్ట్రీనే గెలిచింది. నిజానికి ఇప్పుడు ఎవరూ ఖాళీ లేరు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు వచ్చాక చాలా ప్రాజెక్ట్‌లు పెరిగాయి, పని పెరిగింది. కష్టాల్లో ఉన్న సినిమా కార్మికులకు ఇది కల్పతరువుగా మారింది. దీనికి స్టార్డమ్తో పనిలేదు కాబట్టి ప్రతిభ ఉన్న ప్రతివారికీ అవకాశాలు దక్కుతాయి. -
రొమాంటిక్ ఎంటర్టైనర్లో...
‘వంగవీటి, జార్జి రెడ్డి’ వంటి సినిమాలతో తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరో సందీప్ మాధవ్. తాజాగా ఆయన నటించనున్న సినిమాని ప్రకటించారు. ఈ చిత్రంతో రచయిత జె.వి. మధుకిరణ్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. హల్సియన్ మూవీ పతాకంపై సినిమాటోగ్రాఫర్ అరుణ్ కుమార్ సూరపనేని ఈ సినిమా నిర్మించనున్నారు. ‘‘రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కనుంది. ‘వంగవీటి, జార్జి రెడ్డి’ చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించిన సందీప్ మాధవ్ ఈ సినిమాతో మరింత దగ్గరవుతారు. అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని రూపొందించనున్నాం. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. కాగా.. ‘వంగవీటి’, ‘జార్జి రెడ్డి’.. ఈ రెండూ యాక్షన్ సినిమాలే. తాజా సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ కాబట్టి కొత్త లుక్‌లో సందీప్ కనిపిస్తారని ఊహించ్చు. -
హైదరాబాద్ చే గువేరా
జీనా హై తో మర్నా సీఖో! కదం కదం ఫర్ లడ్నా సీఖో!! ‘జీవిం చాలంటే మరణం గురించి నేర్చుకో, అడుగడుగునా పోరాటం గురించి నేర్చుకో’ అంటూ ఉస్మానియా కేంద్రంగా ఒక నినాదం జనించింది. వేలాది మందిని చైతన్యపరిచింది. ఆ గొప్పతనం ఆ నినాదానిదే కాదు, ఆ నినాదాన్నిచ్చిన వ్యక్తిత్వానిది కూడా. ఎం.బి.బి.ఎస్. చదివి, డాక్టర్ కావాలన్న కోరిక కోరికగానే మిగిలిపోయిన సందర్భంలో, సమాజం లోని వ్యవస్థీకృత దోపిడీని నయం చేసే విప్లవ విద్యార్థి ఉద్యమానికి ఆయన్ని ఆద్యుడిని చేసింది. బలహీనులపట్ల బలంగా నిలబడాలనే కాంక్ష ‘హైదరాబాదు చే గువేరా’గా మలిచింది. జార్జిరెడ్డి 1947 జనవరి 15న కేరళలో పుట్టి, తమిళనాడులో పెరిగాడు. అమ్మ లీలా వర్గీస్, నాన్న రఘునాథ రెడ్డి. చిన్నతనం నుంచి చదువులో ముందుండేవాడు. ఉన్నత విద్య కోసం ఉస్మానియా యూనివర్సిటీలోకి అడుగుపెట్టిన జార్జి, ఇక్కడి భౌతిక పరిస్థితులను అర్థం చేసుకున్నాడు. గ్రామీణ విద్యార్థులపై ఉన్నత వర్గానికి చెందిన విద్యార్థులు చేసే దాడులను గమనించాడు. అకడమిక్ పుస్తకాలతో పాటు, నాన్ అక డమిక్ పుస్తకాలను అధ్యయనం చేశాడు. అప్పటికే సామ్రాజ్యవాద దేశాలతో పోరాటం చేస్తున్న చే గువేరా, నక్సల్బరీ, శ్రీకాకుళం ఉద్యమాలు తీవ్రంగా ప్రభావితం చేశాయి. జాతీయ, అంతర్జాతీయ ఉద్యమాల ప్రభావంతో ఉస్మానియా కేంద్రంగా విద్యార్థి మేధోవర్గాన్ని తయారు చేశాడు. విద్యార్థి రాజకీయాల్లో ముందుండి, ఆయన బలపరిచిన వ్యక్తులు గెలుపొందడంతో జార్జిని భౌతికంగా నిర్మూలిస్తే గాని తమ ఆగడాలు సాగవనే నిర్ణయానికి వచ్చిన మతోన్మాదులు, కిరాయి మూకలు ఈ ప్రగతిశీల నాయకున్ని హత్య చేశాయి. హత్య జరిగిన 47 ఏళ్ల తర్వాత ఆయన జీవిత చరిత్రను జీవన్‌రెడ్డి తెరకెక్కించారు. జార్జిరెడ్డిని ఆయన భావజాల వారసులే గాక సాధారణ విద్యార్థులు, ప్రజలు కూడా నేటికీ స్మరించుకుంటున్నారు. (ఏప్రిల్ 14న జార్జి రెడ్డి 48వ వర్ధంతి) గడ్డం శ్యామ్, పీడీఎస్‌యూ -
రివైండ్ 2019: తలనొప్పిగా మారిన సిన్మాలు.. వివాదాలు
సినిమా మొదలైనప్పటి నుంచి.. పూర్తయ్యే దాకా దర్శకులు నిర్మాతలు ఎన్నో ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. టైటిల్, స్టోరీ, లేదా నటీనటుల ఏదో ఒక సందర్భాల్లో అడ్డంకులు ఎదురవుతూనే ఉంటాయి.. ఇక ఈ మధ్యకాలంలో ఇలాంటి వివాదాలు ఎక్కువయ్యాయి. సినిమా ప్రారంభం నుంచి థియేటర్లోకి వచ్చే వరకు అడుగడుగునా ఆటంకాలతో చిత్ర నిర్మాతలు తలబాదుకుంటున్నారు. ఏదైనా చిత్రం విడుదలకు ముందు ఈ వివాదం బాగా నడుస్తోంది. టాలీవుడ్, కోలీవుడ్ ఇలా ప్రతి ఇండస్ట్రీలోనూ కాంట్రవర్సరీలు కొనసాగుతున్నాయి. వీటికి అనేక కారణాలు ఉన్నాయి. కథను కాపీ కొట్టడం, సినిమా పేర్లను కాపీ కొట్టడం.. వివాదాస్పదమైన పేర్లు పెట్టడం.. సినిమా అంతా పూర్తి అయ్యాక సెన్సార్షిప్ సర్టిఫికెట్ వివాదం. ఇలాంటి కారణాలు తెలుగు చిత్ర సీమను ఈ ఏడాది విమర్శల్లో నెట్టాయి.. మరీ వాటి విశేషాలెంటో ఓసారి చుద్దాం రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా అది ఓ సంచలనం అవుతుంది. వర్మ సినిమా చేస్తున్నాడు అంటే అప్పటి నుంచే ఏం చేయబోతున్నాడు. ఎలాంటి సినిమా చేయబోతున్నాడు. సినిమా టైటిల్ ఏం పెట్టబోతున్నాడు అనే దాని చుట్టూనే మొదటగా అందరూ ఆలోచిస్తారు. అలా ఈ సంవత్సరం విమర్శల్లో కేంద్ర బిందువులా మారాడు వర్మ. ఆయన చేసిన రెండు సినిమాలు వివాదాల్లో నిలిచాయి. లక్ష్మీస్ ఎన్టీఆర్ రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఆది నుంచి వివాదాలను మూటగట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన ఘటనలను తీసుకొని లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో సినిమాను తెరకెక్కించాడు వర్మ. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మి పార్వతి ప్రవేశించాక జరిగిన సంఘటనల చుట్టూ సినిమా తిరుగుతుంది. బాలయ్య నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్కు కౌంటర్‌గా వర్మ ఈ మూవీ, రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. నిజానికి ఎన్టీఆర్ కథానాయకుడు విడుదలైనపుడు కూడా ఇంతగా చర్చ జరగలేదు కానీ వర్మ మాత్రం సంచలనాలకు తెరతీసాడు. ఈ సినిమా విడుదలను ఆపాలని కొందరు ఈసీకి ఫిర్యాదు చేయగా విడుదలను అడ్డుకోలేమని తొలుత ప్రకటించింది. అయితే, ఏపీ హైకోర్టు మాత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలపై స్టే విధించింది. దీంతో నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అక్కడ కూడా వారికి చుక్కెదరయ్యింది. కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా సినిమా ప్రదర్శన నిలిపివేయాలని ఆదేశించడంతో ఏపీలో విడుదల కాలేదు. తెలంగాణలో మాత్రం ఈ చిత్రాన్ని మార్చి 29 న విడుదల చేశారు. కానీ, ఏపీలో మే 1న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రకటించారు. కొన్ని రాజకీయ పార్టీల ఒత్తిడి కారణంగా ఆంధ్రప్రదేశ్ లో సినిమా రిలీజ్ కాలేదు. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అలియాస్ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు రాంగోపాల్‌వర్మ తీసే ప్రతీ సినిమాతో ఏదో ఒక కాంట్రవర్సీ సృష్టిస్తాడు. కొన్నాళ్ళ క్రితం లక్ష్మీస్ ఎన్టీఆర్ తో పెను దుమారం రేపిన విషయం తెలిసిందే. తాజాగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా టైటిల్‌తో ఇంకొక వివాదాన్ని రాజేసాడు. ఈ సినిమా రాజకీయంగాను, కొన్ని వర్గాల పార్టీ నేతలలో ఆందోళన కలిగేలా చేసింది. ఏపీలో ప్రముఖ రాజకీయ నాయకులను కించపరిచేలా, వారి హోదాను దిగజార్చేలా సినిమా ఉందన్నకారణంతో పెద్ద ఎత్తు విమర్శలు వెల్లువెత్తాయి. 2019 ఎన్నికల తరువాత జరిగిన పరిణామాలను ఆధారంగా తీసుకుని ఈ సినిమాను రూపొందిన విషయం విదితమే. ఈ చిత్రం పట్ల ఏపీలో చాలామంది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ కేఏ పాల్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సినిమాలో తన పాత్రను అవమానపరిచే విధంగా చూపించారని పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో హైకోర్టు పేరు మార్చాలని సూచంచడంతో కమ్మరాజ్యంలో కడప బిడ్డలు కాస్తా అమ్మ రాజ్యంలో కడప రెడ్లు అని పేరు మార్చారు. సినిమా టైటిల్ మార్చినప్పటికీ సెన్సార్ బోర్డు అనుమతి లభించలేదు. దీంతో నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. ఈ విషయంపై స్పందించిన కోర్టు వారం రోజుల్లో సినిమా చూసి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని ఆదేశించింది. చివరికి డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వర్మ తన సెటైరికల్ కామెడీతో ప్రేక్షకులను నవ్వించాడు. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే ఇంకొక కాంట్రవర్సీకి తెరలేపాడు రామ్ గోపాల్ వర్మ. తాజాగా ఒక ప్రముక చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన తదుపరి సినిమా మెగా ఫ్యామిలీతోఅంటూ వివాదాల్లో నిలిచాడు. అది కాస్త 24 గంటలు కాకుండానే ఈ సినిమాను నేను తీయడం లేదని తేల్చి చెప్పాడు. తాను విన్న కధ 39 మంది పిల్లలున్న మెగా ఫామిలీ పై సినిమా తీయడం నావల్ల కాదని, తనకు చిన్నపిల్లలంటే ఇష్టముండదని అందుకే ఆ సినిమా చేయట్లదన్నాడు వర్మ. దీనిపై చిరంజీవి వర్మకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడని అందువల్ల వర్మ వెనక్కి తగ్గాడని టాలివుడ్ లో చర్చ నడుస్తుంది. గద్దలకొండ గణేష్ అలియాస్ వాల్మీకీ వివాదంగా మారిన మరో తెలుగు చిత్రం వాల్మీకీ. తమిళంలో విజయవంతమైన జిగార్తండను దర్శకుడు హరీష్ శంకర్ వరుణ్ తేజ్‌తో తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా టైటిల్ సమస్యనే ఎదుర్కొంది. వాల్మీకి అనే టైటిల్ ని పెట్టడమే కాకుండా టైటిల్ లోగో లో రివాల్వర్ ని యాడ్ చేయడంతో వాల్మికి కులస్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.. రివాల్వర్ పెట్టి వాల్మీకిల మనోభావాలను కించపరిచేలా చేశారని చిత్ర యూనిట్ పై మండిపడ్డారు. సినిమా పేరును మార్చాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో చివరి క్షణంలో గద్దలకొండ గణేష్‌గా పేరు మార్చి సెప్టెంబర్ 13న విడుదల చేశారు. వరుణ్ తేజ్ తన సింగిల్ క్యారెక్టర్‌తోనే సినిమాను పండించాడు. ఈ సినిమా యాక్షన్, కామెడీ పరంగా మంచి హిట్‌ను సాధించింది. జార్జి రెడ్డి తెలుగులో వివాదస్పదమైన మరో చిత్రం జార్జి రెడ్డి. 1970లో హైదరాబాద్ ఉస్మానియా విశ్వ విద్యాలయంలో చదువుకుంటూ..రాజకీయ పంథాలో విద్యార్థి ఉద్యమాన్నినడిపిన నాయకుడు జార్జిరెడ్డి. ఆయన కథ ఆధారంగానే ఈ మూవీ తెరకెక్కించారు. జార్జిరెడ్డి 1972 ఏప్రిల్ 14న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కాలేజీలో హత్యకు గురయ్యాడు. ఆయన సిద్దాంతాలను వ్యతిరేకించే రైట్ వింగ్ విద్యార్థి సంఘం ఆయన్ను హత్య చేసి ఉంటారని ఆరోపనలు ఉన్నాయి. అయితే సినిమాలో కేవలం జార్జిరెడ్డి నడిపి ఉద్యయాన్ని, ఆయన హీరోయిజాన్ని చూపించడంతో రైట్ వింగ్ రాజకీయాలు నడిపేవారు అభ్యంతరం వ్యక్తం చేశారు. జార్జిరెడ్డి సిద్దాంతాలను తెరకెక్కించే సందర్భంలో తమను తప్పుగా చూపే ఎలిమెంట్స్ ఉంటాయని ఏబీవీపీ కార్యకర్తలు సినిమాకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. జార్జిరెడ్డిపై దాదాపు 15 క్రిమినల్ కేసులున్నాయని, ఆయన రౌడీయిజాన్ని కూడా చూపించాలంటూ వారు డిమాండ్ చేశారు. సినిమాలో ఏక పక్షంగా ఏబీవీపీ విద్యార్థులనే టార్గెట్ చేసి లేనివి ఉన్నట్లు చూపిస్తే సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించారు. అయితే ఎట్టకేలకు నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మా(మూవీ ఆర్టిస్టు అసోసియేషన్) అలాగే సినిమా వివాదాలతో ఈ ఏడాది మరో వివాదం తెరమీదకు వచ్చింది. అదే మా అసోసియేషన్. ఇది రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. దీంతో మా ఒక్కసారిగా వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. మా లో ఇటీవల జరిగిన ఎన్నికలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. నరేష్ ప్యానల్, శివాజీ రాజా ప్యానల్ ఎన్నికల్లో పోటీ చేయగా అనూహ్యంగా నరేష్ ప్యానల్ విజయం సాధించడంతో కమిటీపై ఆరోపణలు వచ్చాయి. అనంతరం ఒకే ప్యానల్ నుంచి పోటీ చేసిన నరేష్, జీవితా రాజశేఖర్ మధ్య వివాదం రాజుకుంది. అధ్యక్షుడు నరేష్ లేకుండానే ఎక్జిక్యూటివ్ ప్రెసిడెంట్ రాజశేఖర్, సెక్రటరీ జీవితలు జనరల్ బాడీ మీటింగ్‌ను నిర్వహించారు. అత్యవసర సమావేశం జరుగుతుంది అంటూ సభ్యులకు మెసేజ్ చేయటంలో అంతా హజరయ్యారు. అయితే ఈ మీటింగ్‌పై మా అధ్యక్షుడు నరేష్‌కు సమాచారం లేకపోవటంతో అధ్యక్షుడికి తెలియకుండా మీటింగ్ ఎలా నిర్వహిస్తారంటూ జీవిత రాజశేఖర్‌లను ప్రశ్నించాడు. ఇక అయితే ఈ విషయంపై స్పదించిన రాజశేఖర్, జీవితలు ఇది ఫ్రెండ్లీ మీటింగ్ మాత్రమే.. కోర్టు ఆదేశాల ప్రకారం ఏర్పాటు చేసిన జనరల్ బాడీ మీటింగ్ కాదన్నారు. ఈ మీటింగ్‌లో గత తొమ్మిది నెలలో అధ్యక్షుడిగా నరేష్ తీసుకున్న నిర్ణయాలపై చర్చిస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా నరేష్, జీవిత రాజశేఖర్ల మధ్య వివాదాలు జరగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే నరేష్‌కు రాజశేఖర్ తన వర్గంతో కలిసి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ పంచాయితీ కాస్తా మెగాస్టార్ చిరంజీవి దాకా చేరడంతో ఆయన నరేష్వైపే ఉన్నట్లు సమాచారం ఇక ఇవేనండి ఈ ఏడాది కాంట్రవర్సీలాగా మారిన టాలీవుడ్ సినిమాలు. పలు సినిమాలపై వివాదాలు అయితే వచ్చాయి గానీ.. ఇలాంటి వివాదాలను లెక్క చేయకుండా ప్రేక్షకులు ఈ సినిమాలను ఆదరించారు. సినిమాలో కంటెంట్ ఉంటేనే ఏ మూవీ అయినా హిట్ కొడుతుందని ప్రేక్షకులు వాదిస్తున్నారు. -
లేక్ వ్యూ ఫెస్టివల్‌కు జార్జిరెడ్డి
స్టూడెంట్ లీడర్ జార్జిరెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘జార్జిరెడ్డి’. సందీప్ మాధవ్ టైటిల్ రోల్లో, జీవన్‌రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అప్పిరెడ్డి, సంజయ్‌రెడ్డి, దామోదర్ రెడ్డి నిర్మించారు. నవంబరు 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ‘జార్జిరెడ్డి’ చిత్రం ఫోర్త్ లేక్ వ్యూ ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ఫెస్టివల్‌కు ఎంపికైంది. ఈ నెల 22, 23 తేదీల్లో ఈ చిత్రాన్ని ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించనున్నారు. ఢిల్లీ, నోయిడాల్లో ఈ చిత్రం ప్రత్యేక పదర్శనలు జరుగనున్నాయి. ‘‘చిన్న సినిమాగా విడుదలైన మా ‘జార్జిరెడ్డి’ ఇండస్ట్రీని బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లెవల్‌కి వెళ్లడం చాలా సంతోషంగా ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ వేడుకకు చిత్రయూనిట్ హాజరు కానుంది. -
జార్జిరెడ్డిని తల్చుకోవడం అంటే..!
రెండు దశాబ్దాల పాటు ఉస్మానియా క్యాంపస్‌లో యువవిద్యార్థుల మనస్సులపై జార్జిరెడ్డి వేసిన ప్రభావం అసాధారణమైనది. అతడి భావజాలం సామాజిక శాస్త్రాల విద్యార్ధులపై బలమైన ప్రభావం వేస్తూ వచ్చింది. సమాజంలోనూ, క్యాంపస్‌లోనూ ఛాందస, కులోన్మాద భావజాలాలతో ఘర్షించటంలో జార్జిరెడ్డి సాగించిన వీరోచిత పోరాటానికి సినిమా చిత్రికపట్టింది. 1970లలో జార్జిరెడ్డి, 2010లలో రోహిత్ వేముల ఈ కారణంతోనే వేలాదిమంది విద్యార్థులను కదిలించారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలనే భావం ఇద్దరిలోనూ రగులుతుండేది. తిరుగుబాటు మనస్తత్వం కలిగిన వారితో చర్చించాలే తప్ప అణిచివేయకూడదు. సమాజంలో సమూల మార్పులను తీసుకొచ్చే మానసిక సమర్థతలను అణిచివేస్తే జాతికే నష్టం వాటిల్లుతుంది. జార్జి వంటి యువకులు పుట్టుకొస్తే వారిని పెంచి పోషించాలి తప్ప తుంచేయకూడదు. తెలుగు సినిమా ‘జార్జిరెడ్డి’ని ఎంతో ఆస క్తితో చూశాను. ప్రగాఢ అభినివేశంతో కూడిన అతడి అకడమిక్ పాండిత్య దృక్పథంతో ప్రభావితమైన వ్యక్తుల్లో నేనూ ఒకడిని. జార్జిరెడ్డిని పాశవికంగా హత్య చేసిన రెండేళ్ల తర్వాత అంటే 1974లో నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ కోర్సులో చేరాను. నేను చదివిన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీ.. జార్జిరెడ్డి అనే అసాధారణ మేధావి ఫైర్ బ్రాండ్ తరహా కార్యాచరణకు ప్రధాన ఆకర్షణగా మారింది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే అతడు ఫిజిక్స్ విద్యార్థి. ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆ రోజుల్లో రాజకీయ చర్చలకు, క్రియాశీల ఆచరణకు కేంద్రస్థానమై వెలుగొందుతుండేది. మరణం తర్వాత కూడా జార్జిరెడ్డి భావజాలం అనేకమంది సామాజిక శాస్త్రాల విద్యార్ధులపై బలమైన ప్రభావం వేస్తూ వచ్చింది. తదనంతర కాలంలో వీరే అనేక రంగాల్లో నాయకత్వం వహించారు. ప్రకృతి శాస్త్రాలు, ఇంజనీరింగ్, న్యాయశాస్త్ర విద్యార్థులు సైతం జార్జిరెడ్డి భావాలతో ప్రభావితులయ్యారు. సామాజిక సమస్యలపట్ల బాధ్యత ప్రదర్శిం చిన అనేకమంది విద్యార్థులు ఈ జ్ఞాన విభాగాలనుంచి కూడా ఆవిర్భవించారు. మరణించాక రెండు దశాబ్దాల పాటు ఓయూ క్యాంపస్‌లో యువ మనస్సులపై జార్జిరెడ్డి వేసిన ప్రభావం అనన్యసామాన్యమైంది. ఆనాటికి పెద్దగా రచనలు కూడా చేసి ఉండని ఒక పాతికేళ్ల విద్యార్థి మూడు అంశాలలో రాటుదేలడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అవేమిటంటే, 1. జ్ఞానాన్ని ఆయుధంగా చేసుకోవడం. 2. దాన్ని అతి స్వల్ప కాలంలోనే పీడిత కులాల విముక్తికోసం ఉపయోగించడం. 3. తాను పోరాడిన పీడకుల చేతుల్లో అమరత్వం పొందడం. సోషలిస్టు విప్లవ సిద్ధాంతాన్ని పేదలకు, దిగువ కులాలకు అనుకూలమైనదిగా మల్చడంలో జార్జిరెడ్డి నిర్వహించిన పాత్ర సాధారణ ప్రజలను కూడా ఆకట్టుకునేలా చేయడంలో ‘జార్జిరెడ్డి’ సినిమా చక్కటి విజయం సాధించింది. సమాజంలోనూ, క్యాంపస్‌లోనూ సంఘ వ్యతిరేక, కులోన్మాద భావజాలాలతో భావోద్వేగంగా ఘర్షించ టంలో జార్జి సాగించిన వీరోచిత పోరాటానికి సినిమా చిత్రికపట్టింది. నాటి నుంచి నేటి దాకా ప్రభుత్వాలు, రాజకీయ శక్తులు సాగిస్తున్న విద్యా వ్యతిరేకమైన ఎజెండా నేటికీ అనేక క్యాంపస్‌లలో సమస్యగా కొనసాగుతూనే వస్తోంది. అలాంటి బాహ్య శక్తుల ప్రభావానికి సగటు విద్యార్థులు, కండబలం, అధికార బలం ఉన్న శక్తులు సులువుగా లోనయ్యేవారు. అయితే విద్యార్జనలో కానీ, భౌతిక పోరాటాల్లో కానీ అలాంటి శక్తులందరినీ జార్జిరెడ్డి తోసిపుచ్చేశాడు. ఆయనలోని ఈ మహామూర్తిమత్వాన్ని సినిమా చాలా చక్కగా ప్రదర్శించింది. 1970లలో జార్జిరెడ్డి, 2010లలో రోహిత్ వేముల ఈ కారణంతోనే యూనివర్సిటీ క్యాంపస్‌లలోని వేలాదిమంది విద్యార్థులను ప్రభావితం చేశారు. మనుషులను పీడించే వారి ఏజెంట్ల చేతుల్లో 1972 ఏప్రిల్ 14న హత్యకు గురయ్యేనాటికి జార్జి రెడ్డి వయస్సు సరిగ్గా పాతికేళ్లు. అదే పీడకుల దౌర్జన్యానికి నిరసన తెలుపుతూ రోహిత్ వేముల 2016 జనవరి 17న ఆత్మహత్య చేసుకున్నాడు. పీడన అనైతికం, సంఘ వ్యతిరేకమనే సామాజిక–ఆత్మిక, సాంస్కృతిక మూలాల విషయంలో ఈ ఇరువురి స్వభావం ఒక్కటే. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలనే భావం ఇద్దరిలోనూ రగులుతుండేది. తమ తల్లుల్లోని సానుకూల ఆధ్యాత్మిక నైతిక భావజాలం ప్రభావంతో వీరిరువురు పేదలకు, పీడితులకు అనుకూలమైన ఉమ్మడి లక్ష్యాన్ని కలిగి ఉండేవారు. జార్జి తల్లి లీల, రోహిత్ తల్లి రాధిక ఇద్దరూ ఆ ఆధ్యాత్మిక నైతికతతోనే వారిని ఉగ్గుపాలనుంచి పెంచి పోషించారు. ఆ రోజుల్లో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలే జార్జిరెడ్డి అజెండాగా సినిమా ప్రదర్శించినప్పటికీ, పీడితుల పట్ల, పేదల పట్ల సానుభూతి చూపడంలో అతడి కుటుంబ నైతికత ఆ రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా చెలరేగిన సోషలిస్టు భావతరంగాలతో మిళితమైంది. సోవి యట్ యూనియన్ అగ్రరాజ్యంగా ఎదగడం, చైనాలో సాంస్కృతిక విప్లవం.. ఫిడెల్ క్యాస్ట్రో, చేగువేరా నాయకత్వంలో సాగిన క్యూబన్ విప్లవం వంటివి ప్రపంచవ్యాప్తంగా యువతను ప్రభావితం చేస్తూ వచ్చాయి. ఇవి జార్జిరెడ్డిపై కూడా తీవ్రప్రభావం చూపాయి. ఆ రోజుల్లో ప్రపంచమంతటా విశ్వవిద్యాలయాల క్యాంపస్‌లలో సాగిన వియత్నాం అనుకూల, అమెరికన్ వ్యతిరేక ఉద్యమాలు ప్రజాతంత్ర పౌర హక్కులకు, సోషలిస్టు ప్రచారానికి ప్రేరణనిచ్చాయి. తీవ్రమైన మేధోపరమైన అభినివేశం కలవారు తరగతి గదుల్లో, లైబ్రరీల్లో లోతైన అధ్యయనాలు, చర్చలు జరుపుతూనే వీధి పోరాటాల్లో కూడా పాల్గొనేవారు. జార్జిరెడ్డి అసాధారణ మేధోశక్తికి ఇదే ప్రాతిపదిక అయింది. తనలోని ఈ అసాధారణ శక్తే మాలో అనేకమందిని ప్రభావితం చేసింది. కానీ అతడి తర్వాత ఈ రెండు శక్తులను ఏ ఒక్కరూ తమలో నిలుపుకోలేకపోయారు. ఆయన అనుయాయుల్లో అనేకమంది తర్వాత నక్సలైట్ ఉద్యమాలవైపునకు తరలిపోయారు. కొంతమంది సీరియస్‌గా అధ్యయనంపై దృష్టిపెట్టి పాక్షిక విజయాలు మాత్రమే సాధించారు. మాలో ప్రతి ఒక్కరూ కొన్ని కొన్ని విడి విడి రంగాల్లో తమ ప్రయత్నాలు చేసినప్పటికీ ఏ ఒక్కరం కూడా జార్జిరెడ్డి తర్వాత అంతటి ప్రభావం కలిగించలేకపోయామన్నది వాస్తవం. జార్జిరెడ్డి ప్రతిభాపాటవాలను ప్రస్తుతతరం విద్యార్థుల ముందు ప్రదర్శించడానికి ఈ సినిమా గట్టి కృషి చేసింది. అంత చిన్న వయస్సులోనే అలాంటి అసాధారణ శక్తియుక్తులను ప్రదర్శించిన వారు మానవుల్లో చాలా తక్కువమందే ఉంటారు. వీరు ప్రపంచం దృష్టిలో అద్భుత వ్యక్తులుగా వెలుగొందుతుంటారు. అసాధారణమైన మానవుల్లో దేవుడు విభిన్నమైన బీజాలు నాటతాడు అని సామెత. సైన్స్, ఆర్ట్స్, నైతికత వంటివి ఇలాంటి వారి ద్వారానే ప్రకాశిస్తుంటాయి. ఇలాంటి అసాధారణమైన అమరుల జీవిత చిత్రాన్ని భారతీయ జీవిత చిత్రాల వారసత్వం చాలా అరుదుగా మాత్రమే చిత్రించింది. భారతీయ సినిమా పరిశ్రమ పాటలు, డ్యాన్స్ మాయాజాలానికి మించి ఎదగలేకపోయింది. జార్జిరెడ్డిపై వచ్చిన ఈ సినిమా ప్రాంతీయ చిత్రమే అయినప్పటికీ, అతి చిన్న బడ్జెట్‌తోనే పూర్తయినప్పటికీ, విభిన్నమైన ప్రయోగాత్మక చిత్రంగా తన ముద్ర వేసింది. ఈ సినిమాలో గొప్పతనం ఏమిటంటే, బాల్యదశలో జార్జిరెడ్డిలో రూపొందిన విశిష్ట వ్యక్తిత్వంపై ఇది కేంద్రీకరించడమే. తన తల్లి నుంచి ప్రతివిషయంలోనూ అతడు సానుకూలమైన మానవీయ దృక్పథాన్ని పుణికిపుచ్చుకున్నాడు. అదే సమయంలో తనలో అంతర్లీనంగా ఉండిన అపారమైన మానవీయ సహజాతాన్ని పాటించడంలో తల్లి ఊహలను కూడా అతడు మించిపోయాడు. సామాజికంగా, సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా అలాంటి సహజాత గుణంతో పెరిగి పెద్దవడం జీవితంలో చాలా ముఖ్యమైన విషయం. కుటుంబం నుంచి పాఠశాలకు, యూనివర్సిటీకి ఎదిగే క్రమంలో తనలోని సృజ నాత్మకమైన ప్రోత్సాహక గుణాన్ని, మంచితనాన్ని, మేధోపరమైన అభినివేశాన్ని అట్టిపెట్టుకుని పెంచుకుంటూ రావడం చాలా ముఖ్యమైన విషయం. పిల్లల వ్యక్తిత్వాలను చంపేయడం, లేదా ఇలాంటి వ్యక్తుల ప్రధాన స్ఫూర్తిని చంపేయడాన్ని భారతీయ పౌర సామాజిక నైతిక చట్రాలు ఒక ధోరణిగా కలిగి ఉంటున్నాయి. ఇలాంటి స్ఫూర్తిని వారిలో చంపేశాక మన సమాజంలో ఆడ, మగ వ్యక్తులు ఎక్కువ కాలం బతకవచ్చు కానీ చరిత్రను మాత్రం సృష్టించలేరు. చిన్నవయసులోనే హత్యకు గురైనప్పటికీ జార్జిరెడ్డి, రోహిత్ వేముల మన జీవిత కాలంలోనే చరిత్ర సృష్టించారు. స్వాతంత్య్రపోరాటంలో భగత్‌సింగ్ అదే పని చేశారు. వీరు వదిలివెళ్లిన చరిత్ర అత్యంత శక్తివంతమైన సానుకూలతను కలిగి ఉంది, అనేకమంది తరుణ మనస్కులు అనుసరించదగిన సృజనాత్మక కార్యదీక్షను వీరు చరిత్రలో నిలిపివెళ్లారు. క్యాంపస్‌లలో అలాంటి చురుకైన మనస్సు కలవారు అడుగుపెట్టకుండా చేయడానికి ఇప్పుడు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కుటుంబం, పాఠశాల, విశ్వవిద్యాలయం ప్రతిచోటా సంప్రదాయ జీవన వాతావరణం ఉంటున్న పరిసరాలు సృజనాత్మక ప్రయోగాలను అనుమతించడం లేదు. నూతన విషయాలపై ప్రయోగాలు చేయదలిచిన యువత ప్రతి సంప్రదాయానికి, ఛాందసత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది. తిరుగుబాటు మనస్తత్వం కలిగిన వారితో చర్చించాలే తప్ప అణిచివేయకూడదు. సమాజంలో సమూల మార్పులను తీసుకొచ్చే మానసిక సమర్థతలను అణిచివేస్తే జాతికే నష్టం వాటిల్లుతుంది. దేశంలో ఏ మారుమూలైనా జార్జి వంటి యువకులు పుట్టుకొస్తే వారిని పెంచి పోషిం చాలి. చివరగా ఈ సినిమాను అన్ని భాషల్లోకీ డబ్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాసకర్త: ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెపర్డ్ డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ -
ఆయన గురించి 120 సినిమాలు తీయొచ్చు
సందీప్ మాధవ్ టైటిల్ రోల్లో జీవన్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘జార్జ్ రెడ్డి’. సిల్లీ మంక్స్, త్రీ లైన్స్ సినిమా బ్యానర్లతో కలిసి మైక్ మూవీస్ అధినేత అప్పిరెడ్డి నిర్మించారు. గత శుక్రవారం ఈ చిత్రం విడుదలైంది. ఈ సందర్భ ంగా దర్శకుడు జీవన్ రెడ్డి, కెమెరామేన్ సుధాకర్ రెడ్డి యక్కంటి మీడియాతో మాట్లాడారు. జీవన్ రెడ్డి మాట్లాడుతూ – ‘‘జార్జ్ రెడ్డి’ కథను సినిమాగా తీయాలనుకున్నప్పుడు చాలా పరిశోధన చేశాం. జార్జ్ రెడ్డి గురించి తెలిసిన వాళ్లను కలిశాం. వాళ్ల దగ్గర నుంచి వివరాలు సేకరించాం. ఆ సేకరించిన వివరాలు చదవడానికే నాకూ, కెమెరామేన్ సుధాకర్ అన్నకు కొన్ని నెలలు పట్టింది. జార్జ్ రెడ్డి లైఫ్ జర్నీనే స్క్రీన్‌ప్లేగా చూపించాలనుకున్నాను. ఆయన గురించి చెప్పాలంటే 10–12 గంటల సినిమా తీయాలి. రెండున్నర గంటల సినిమాలో అన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నించాను. ఆయన గురించి ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయం వ్యక్తం చేశారు. వాళ్లు చెప్పినదాంతో సుమారు 120 బయోపిక్స్ తీయొచ్చు అనిపించింది. జార్జ్ రెడ్డి సిద్ధాంతాలు ఏంటి? ఆయన ఎమోషన్స్ ఏంటి? జార్జ్ రెడ్డి నిజాయితీ, తన ఫైటింగ్ స్పిరిట్ ఈ సినిమాలో చెప్పాలనుకున్నాను. ఇప్పటి తరం వాళ్లు కూడా అవసరమైనప్పుడు తమ గొంతుని వినిపించాలి. ఈ సినిమా ఎవర్నీ కించపరచకూడదనుకున్నాం. కథకు తగ్గట్టుగానే కొన్ని కమర్షియల్ హంగులు జోడించాం. ఉస్మానియా యూనివర్శిటీలో చాలా కథలున్నాయి. వాటిని సినిమాలుగా తీస్తాను’’ అన్నారు. సుధాకర్ రెడ్డి యక్కంటి మాట్లాడుతూ–‘‘నా దృష్టిలో తెలుగు సినిమా హీరోల కన్నా పెద్ద హీరో జార్జ్ రెడ్డి. ఈ సినిమాను యువత అందరూ చూడాలి. ‘రైజ్ యువర్ వాయిస్’ అనేది జార్జ్ రెడ్డిగారి నినాదం. తప్పు జరిగినప్పుడు అది తప్పు అని చెప్పే ధైర్యం కావాలి. అలాంటి లక్షణం ఉన్న గొప్ప వ్యక్తి ఆయన. ఆ స్ఫూర్తిని యూత్‌కి చెప్పాలనుకున్నాం’’ అన్నారు. -
జార్జిరెడ్డి జీవితం యువతకు స్ఫూర్తి
సాక్షి, కాచిగూడ: చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకున్న జార్జిరెడ్డి జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ‘జార్జిరెడ్డి’ చిత్ర దర్శకుడు జీవన్‌రెడ్డి అన్నారు. సినిమా విడుదల సందర్భంగా గురువారం నారాయణగూడలోని క్రైస్తవ స్మశానవాటికలో జార్జిరెడ్డి సమాధి వద్ద చిత్ర యూనిట్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దర్శకుడు జీవన్‌రెడ్డి, నిర్మాతలు దామోదర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, హీరో సందీప్ మాధవ్ మాట్లాడుతూ నీతి, నిజాయితీ గల జార్జిరెడ్డి రేపు మళ్లీ పుట్టబోతున్నాడని, ఆయన జీవితం అందరికి ఆదర్శప్రాయంగా ఉంటుందన్నారు. జార్జిరెడ్డి చిత్రం విడుదల తర్వాతే ఎవరికైనా తాను సమాధానం చెబుతానని దర్శకుడు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎవరినీ కించపరిచే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని నిర్మించలేదని, ఆయన నీతి, నిజాయితీ, నాయకత్వ లక్షణాలు తను ఎంతో ఆకట్టుకున్నాయని, రెండేళ్ల పాటు జార్జిరెడ్డి జీవితాన్ని అధ్యయనం చేశాక సినిమాగా రూపొందించామన్నారు. 25 ఏళ్లకే ఓ విద్యార్థి నాయకుడిగా ఎదిగి నాటికి, నేటికి యువతకు స్ఫూర్తిగా నిలిచాడని సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. సినిమాపై ఎలాంటి ఆపోహలు వద్దని, ఎవరికైనా అభ్యంతరముంటే వారితో కలిసి తాము సినిమాను చూస్తామని, వారికి సమాధానం చెబుతామని జీవన్‌రెడ్డి అన్నారు. జార్జిరెడ్డి జీవితకథ మాత్రమే చిత్రంలో చూపిస్తున్నామన్నారు. సమాజం జార్జిరెడ్డి లాంటి వాళ్లను చాలామందిని కోల్పోయిందని, ఎలా కోల్పోయామో తెలిపేందుకు సినిమా తీశామన్నారు. -
‘జార్జిరెడ్డి’ సినిమాను అడ్డుకుంటే ఊరుకోం
సాక్షి, హైదరాబాద్: జార్జిరెడ్డి నేటి తరానికి ఆదర్శమని, ఆయన సినిమాను అడ్డుకుంటే సహించేది లేదని ఇండియన్ నేషనల్ యువజన పార్టీ పేర్కొంది. సినిమా విషయంలో ఎవరికైనా అభ్యంతరాలుంటే కోర్టును ఆశ్రయించాలని సూచించింది. అంతేగానీ ఇష్టానుసారంగా అడ్డుకుంటామని చెప్పడం సరికాదంది. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు బందెల కాంత్రికుమార్ మాట్లాడుతూ... కొన్ని అరాచక శక్తులు సినిమాను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాయని, దాన్ని విరమించుకోవాలన్నారు. లేని పక్షంలో ఊరుకోబోమని హెచ్చరించారు. తమ పార్టీ ప్రజాస్వామ్య స్ఫూర్తితో ముందుకెళ్తోందన్నారు. సమావేశంలో పార్టీ జాతీయ కోశాధికారి వినయ్‌సాగర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్‌కల్యాణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. విలేకరుల సమావేశంలో ఇండియన్ నేషనల్ యువజన పార్టీ ప్రతినిధులు ఎవరినీ కించపరచలేదు: దర్శకుడు చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకున్న జార్జిరెడ్డి జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ‘జార్జిరెడ్డి’ చిత్ర దర్శకుడు జీవన్‌రెడ్డి అన్నారు. సినిమా విడుదల సందర్భంగా గురువారం నారాయణగూడలోని క్రైస్తవ స్మశానవాటికలో జార్జిరెడ్డి సమాధి వద్ద చిత్ర యూనిట్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దర్శకుడు జీవన్‌రెడ్డి, నిర్మాతలు దామోదర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, హీరో సందీప్ మాధవ్ మాట్లాడుతూ నీతి, నిజాయితీ గల జార్జిరెడ్డి రేపు మళ్లీ పుట్టబోతున్నాడని, ఆయన జీవితం అందరికి ఆదర్శప్రాయంగా ఉంటుందన్నారు. జార్జిరెడ్డి చిత్రం విడుదల తర్వాతే ఎవరికైనా తాను సమాధానం చెబుతానని దర్శకుడు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎవరినీ కించపరిచే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని నిర్మించలేదని, ఆయన నీతి, నిజాయితీ, నాయకత్వ లక్షణాలు తను ఎంతో ఆకట్టుకున్నాయని, రెండేళ్ల పాటు జార్జిరెడ్డి జీవితాన్ని అధ్యయనం చేశాక సినిమాగా రూపొందించామన్నారు. 25 ఏళ్లకే ఓ విద్యార్థి నాయకుడిగా ఎదిగి నాటికి, నేటికి యువతకు స్ఫూర్తిగా నిలిచాడని సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. సినిమాపై ఎలాంటి ఆపోహలు వద్దని, ఎవరికైనా అభ్యంతరముంటే వారితో కలిసి తాము సినిమాను చూస్తామని, వారికి సమాధానం చెబుతామని జీవన్‌రెడ్డి అన్నారు. జార్జిరెడ్డి జీవితకథ మాత్రమే చిత్రంలో చూపిస్తున్నామన్నారు. సమాజం జార్జిరెడ్డి లాంటి వాళ్లను చాలామందిని కోల్పోయిందని, ఎలా కోల్పోయామో తెలిపేందుకు సినిమా తీశామన్నారు. (చదవండి: ‘జార్జిరెడ్డి’ సినిమా ఎలా ఉందంటే..?) జార్జిరెడ్డి సమాధి వద్ద నివాళి అర్పిస్తున్న దృశ్యం -
‘జార్జి రెడ్డి’ మూవీ రివ్యూ
మూవీ: జార్జి రెడ్డి జానర్: బయోపిక్ తారాగణం: సందీప్ మాధవ్, సత్య దేవ్, మనోజ్ నందన్, చైతన్య కృష్ణ, వినయ్ వర్మ, అభయ్, ముస్కాన్, మహాతి దర్శకత్వం: జీవన్ రెడ్డి సంగీతం: సురేష్ బొబ్బిలి నిర్మాత: అప్పిరెడ్డి ప్రస్తుతం టాలీవుడ్లో చరిత్ర మరిచిపోయిన వీరుల కథల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం విజయం సాధించింది. ప్రస్తుతం ఆదే కోవలో దశాబ్ధాల క్రితం విద్యార్థి విప్లవోద్యమ నాయకుడుగా చరిత్రలో నిలిచిపోయి ఆ తర్వాత మరిచిపోయిన వీరుడి కథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ‘జార్జిరెడ్డి’. సినిమా ఆరంభం నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి అందరి మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ‘జార్జిరెడ్డి’ జీవిత కథను తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడా? అసలు జార్జిరెడ్డి కథేంటి? చూద్దాం. కథ: ‘అమ్మ ఈయన ఎవరు.. భగత్ సింగ్. ఎక్కడున్నారు? చంపేశారు. మళ్లీ రారా?. చావు ఒక్కసారే వస్తుంది’ జార్జిరెడ్డి చిన్నప్పుడు తన తల్లితో జరిపిన సంభాషణలు. చిన్నప్పట్నుంచే భగత్ సింగ్, చెగువేరా పుస్తకాలు చదవడంతో జార్జిరెడ్డికి చైతన్యంతో పాటు కాస్త ఆవేశం ఎక్కువగా ఉంటుంది. తన ముందు అన్యాయం కనిపించినా.. కులం, మతం పేరుతో ఎవరినైనా దూషించినా తట్టుకోలేడు. తెగిస్తాడు. పోరాడతాడు. కత్తిపోట్లు పడినా.. శత్రువులు చంపడానికి వచ్చినా ధైర్యంతో నిలబడి చివరి శ్వాస వరకు నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాడు. తనను నమ్ముకున్న వారికోసం చివరి వరకు పోరాడాడు. జార్జిరెడ్డి పుట్టుక కేరళ.. చదివింది బెంగళూరు, చెన్నైలలో.. విద్యార్థి నాయకుడిగా ఎదిగింది హైదరాబాద్‌లోని ఓ విశ్వవిద్యాలయంలో. జార్జిరెడ్డి (సందీప్ మాధవ్) చిన్నప్పట్నుంచే చదువులో చురుకుగా ఉండేవాడు. ప్రతీ విషయం శోధించి తెలుసుకోవాలనుకుంటాడు. చదువు, విజ్ఞానంతో పాటు కత్తిసాము, కర్రసాము, బాక్సింగ్‌లో ప్రావీణ్యం పొందాడు. తల్లి(దేవిక) తోడ్పాటు, సహకారంతో జార్జిరెడ్డి అన్ని రంగాల్లో రాటుదేలుతాడు. అయితే ఉన్నత విద్య కోసం యూనివర్సిటీకి రావడంతో అతడి జీవతం పూర్తిగా మారిపోతుంది. అతడి మేధోసంపత్తికి ఆశ్చర్యపడి ఎన్నో ప్రముఖ యూనివర్సిటీలు ఆహ్వానం పలికినా పలు కారణాలతో తిరస్కరిస్తాడు. అయితే యూనివర్సిటీలో మాయ(ముస్కాన్), దస్తగిరి(పవన్), రాజన్న(అభయ్)లతో జార్జిరెడ్డికి ఏర్పడిన పరిచయం ఎక్కడి వరకు తీసుకెళ్తుంది? అతడు ఎందుకు యూనివర్సిటీ, సమాజం కోసం పోరాడతాడు? ఓ సమయంలో సొసైటీకి వ్యతిరేకంగా ఎందుకు పోరాడతాడు? ఈ పోరాటంలో సత్య(సత్యదేవ్), అర్జున్(మనోజ్ నందం)లతో అతడికి ఏర్పడిన సమస్యలు ఏమిటి? తన పోరాటంలో జార్జిరెడ్డి విజయం సాధించాడా? ఎందుకు హత్యకు గురవుతాడు? ఇంతకి జార్జిరెడ్డిని ఎవరు హత్య చేస్తారు? అనేదే మిగతా కథ. నటీనటులు: ‘వంగవీటి’తో నటుడిగా తనేంటో నిరూపించుకున్న సందీప్ మాధవ్ ఈ సినిమాలోనూ వందకు వంద మార్కులు సాధించాడు. బాడీ లాంగ్వేజ్, దుస్తులు, నడవడిక అచ్చం జార్జిరెడ్డిని తలపించేలా చేశాడు. పలుచోట్ల జార్జిరెడ్డే కళ్ల ముందే నిలుచున్నట్లు అనిపిస్తుంది. ఇక తల్లి పాత్రలో మరాఠీ నటి దేవిక జీవించిందనే చెప్పాలి. హీరోయిన్ ముస్కాన్ తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో మెప్పించింది. ఇక అభయ్, యాదమరాజు, పవన్, సత్యదేవ్, మనోజ్ నందం తదితర నటులు తమ పరిధి మేరకు మెప్పించారు. ముఖ్యంగా అభయ్, యాదమరాజు తన పెర్ఫార్మెన్స్తో హీరోకు పోటీగా నిలవడం విశేషం. విశ్లేషణ ‘దళం’ సినిమాతో విభిన్నమైన దర్శకుడిగా పేరుతెచ్చుకున్న జీవన్ రెడ్డి.. ఆదర్శనీయమైన విద్యార్థి నేత జీవితం వెండితెరపై ఆవిష్కరించాలని దర్శకుడు చేసిన ధైర్యానికి సెల్యూట్ చేయాల్సిందే. ఎందుకంటే ఈ కథలో ఎన్నో సున్నితమైన అంశాలు ఉన్నాయి. ఎవరి మనోభావాలు కించపరచకుండా చక్కగా ప్రజెంట్ చేయాలి. అలాగే జార్జిరెడ్డి అసలు కథ డీవియేట్ కాకుండా కమర్షియల్ అంశాలను జోడించాలి. ఈ విషయంలో దర్శకుడు విజయవంతం అయ్యాడు. యూనివర్సిటీ రాజకీయాలు, నేతలు, పార్టీల పేర్లను ఎక్కడా ప్రస్తావించకుండా డైరెక్టర్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. కథేంటనే ఉత్సుకతో ప్రేక్షకులు సీట్లలో కూర్చోని సర్దుకునే లోపే నేరుగా కథ ప్రారంభమవుతుంది. ఆరంభం నుంచే నెక్ట్స్ ఏదో జరగబోతోంది అని ఆసక్తిగా ఎదురు చూడటం.. క్యారెక్టర్ల పరిచయం.. రెండు మూడు చోట్ల హీరో సూపర్బ్ ఎలివేషన్‌తో తొలి అర్థభాగం ముగుస్తుంది. ఇక రెండో అర్థభాగం వచ్చే సరికి డైరెక్టర్ కాస్త తడబడ్డాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించాలనే ఉద్దేశంతో కథను కాస్త డీవియేట్ అయినట్టుగా అనిపిస్తుంది. కొన్ని చోట్ల సీన్లు అతికించినట్టుగా కనిపించడం, పవర్ ఫుల్ డైలాగ్‌ల కోసం అనేక చోట్ల ఇంగ్లీష్, హిందీ భాషను వాడటం రుచించలేదు. ఇలాంటి సినిమాలకు మాటలు ముఖ్యం. కానీ చాలా చోట్ల తేలిపోయినట్లు కనిపిస్తోంది. పలు చోట్ల తల్లి కొడుకుల సెంటిమెంట్, వారి మధ్య వచ్చే ఎమోషన్ సీన్స్ ప్రేక్షకుల హృదయాలను కదలించడం ఖాయం. ఇక హీరోయిన్ వన్ సైడ్ లవ్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో మరో ప్రధాన అంశం సినిమాటోగ్రఫి. కెమెరా పనితనం బాగుండటంతో ఆ కాలానికి వెళ్లిపోతాం. ఇక యాక్షన్ సీన్స్ కూడా కొత్తగా అనిపిస్తాయి. పాటలు సన్నివేశాలకు తగ్గట్టు బాగున్నాయి. లిరిక్స్ హృదయాలను కదిలించేలా ఉన్నాయి. ఎలాంటి గందరగోళం లేకుండా స్క్రీన్ ప్లే చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. ఆ కాలానికి తగ్గటు దుస్తులు, సెట్టింగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ సందీప్, అభయ్ నటన ఎమోషన్స్, తల్లి సెంటిమెంట్ సినిమాటోగ్రఫీ మైనస్ పాయింట్స్ సెకండాఫ్ స్లో నెరేషన్ మాటలు - సంతోష్ యాంసాని, సాక్షి వెబ్‌డెస్క్ -
జార్జిరెడ్డి పాత్రే హీరో
సందీప్ మాధవ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జార్జిరెడ్డి’. ‘దళం’ ఫేమ్ జీవన్‌రెడ్డి దర్శకత్వంలో అప్పిరెడ్డి, దామోదర్‌రెడ్డి, సంజయ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ–‘‘అమెరికాలో ఉన్నప్పుడే ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించాలనుకున్నాను. ఇక్కడ మా మైక్ టీవీకి బ్రాండింగ్ ఉండటంతో మైక్ మూవీస్ అనే బ్యానర్‌ను స్థాపించి మంచి సినిమాలు చేయాలనుకున్నాను. జార్జిరెడ్డి కథ నాకు ఇన్స్పైరింగ్గా అనిపించింది. సబ్జెక్ట్ నచ్చడంతో బడ్జెట్ గురించి ఆలోచించలేదు. అప్పటి ఉస్మానియా యూనివర్సిటీ సెట్‌ను వేశాం. చిరంజీవిగారు మా సినిమా చూస్తాను అని చెప్పారు’’ అన్నారు. ‘‘జార్జిరెడ్డి కథ నేటి తరానికి స్ఫూర్తినిచ్చేలా ఉంటుంది. ఈ కథకు స్టార్ హీరోలు అవసరం లేదు. జార్జిరెడ్డి క్యారెక్టరే హీరో. ఆయనలో హీరోకు ఉన్న లక్షణాలు ఉన్నాయి. ఆయన ఒక బాక్సర్, ఫైటర్. ఓ సందర్భంలో జార్జిరెడ్డిపై ఓ డాక్యుమెంటరీ తీశాం. అప్పుడే సినిమా చేద్దామనే ఆలోచన కలిగింది. జీవన్‌రెడ్డి ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడ్డారు. జార్జిరెడ్డి క్యారెక్టర్‌ను హైలైట్ చేయాలని మరొకరిని తక్కువగా చూపించలేదు. ప్రమోషన్స్, బిజినెస్, పబ్లిసిటీ మాకు కొత్త. సంజీవ్‌రెడ్డిగారు మాతో కలవడం ప్లస్’’ అన్నారు. ‘‘కొత్త కథలను తెలుగు ఇండస్ట్రీ ప్రోత్సహిస్తుంది. చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబుగార్లు మా సినిమాకు మోరల్ సపోర్ట్‌గా నిలిచారు’’ అన్నారు సంజయ్‌రెడ్డి. -
జార్జ్ రెడ్డి లాంటి సినిమాలు రావాలి
‘‘నేను ఒంగోలులో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మొదటిసారి జార్జ్ రెడ్డి గురించి విన్నాను. ఇన్నాళ్లకు ‘జార్జ్ రెడ్డి’ సినిమా ద్వారా మరోసారి ఆయన గురించి వింటున్నాను’’ అని చిరంజీవి అన్నారు. సందీప్ మాధవ్ లీడ్ రోల్లో ‘దళం’ ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జార్జ్ రెడ్డి’. అప్పిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలకంగా వచ్చే ‘అడుగడుగు మా ప్రతి అడుగూ నీ వెనకాలే మా పరుగు...’అనే పాటను చిరంజీవి విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘జార్జ్ రెడ్డి గురించి తెలుసుకున్నప్పుడు ఎంతో ఆశ్చర్యం వేసింది. మార్పు కోసం పోరాటం చేసిన వ్యక్తి ఆయన. తప్పును ప్రశ్నించే అలాంటి వాళ్లు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇంకా చాలామంది వచ్చారు. ‘అడుగడుగు మా ప్రతి అడుగూ నీ వెనకాలే మా పరుగు...’ పాట చూసిన తర్వాత నేను చాలా ఎగై్జట్ అయ్యాను. జార్జ్ రెడ్డి ఎలాంటి ఆశయాలతో ఉండేవారు? ఆయన రివల్యూషనరీ థాట్స్ ఎలా ఉండేవి? విద్యార్థి సంఘాలను పెట్టి అన్యాయాలను ఎలా ఎదుర్కొన్నాడు? అనేది ఈ పాటలో తెలుస్తోంది. ‘జార్జ్ రెడ్డి’ లాంటి సినిమాలు ఇంకా రావాలి. ఇలాంటి సినిమా అందరూ చూడాలి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సురేష్ బొబ్బిలి, నేపథ్య సంగీతం: హర్షవర్థన్ రామేశ్వర్, అసోసియేటెడ్ ప్రొడ్యూసర్స్: దాము రెడ్డి, సుధాకర్ యొక్కంటి, సహ నిర్మాత: సంజయ్ రెడ్డి. -
72లో విన్నాను.. మళ్లీ ఇప్పుడు వింటున్నా: చిరంజీవి
‘1972లో నేను ఒంగోలులో ఇంటర్ చదువుతున్నప్పుడు తొలిసారి జార్జిరెడ్డి పేరు విన్నాను. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ‘జార్జిరెడ్డి: ఎ మ్యాన్ ఆఫ్ యాక్షన్’పేరుతో తీస్తున్న ఈ సినిమాతో మళ్లీ ఆ పేరు వింటున్నా. ఈ పాట చూసిన తర్వాత ఎక్సైట్కు లోనయ్యాను. ‘అడుగు.. ఆడుగు’సాంగ్ చూసిన దాని బట్టి అప్పట్లో నేను విన్నదాన్ని బట్టి, ఆయన ఎలాంటి ఆశయాలతో ఉండేవారు? ఏ విధంగా విప్లవకారుడిలా ఉండేవారు? అన్యాయం జరిగినా, అణచివేత జరిగినా, విద్యార్ది నాయకుడిగా జార్జిరెడ్డి ఎలా స్పందించే వారో ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారని అర్థమవుతోంది. ఇలాంటి సినిమాలు రావాలి. నేటితరం జార్జిరెడ్డితో కనెక్ట్ అవుతారని, ఈ కంటెంట్ ప్రతీ ఒక్కరికీ నచ్చుతుందని మనస్పూర్తిగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. చిత్ర బృందానికి ప్రత్యేక అభినందనలు. ఈ చిత్రాన్ని ప్రతీ ఒక్కరూ చూడండి. నేను కూడా ఎంతో ఆసక్తితో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా’అని పేర్కొన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్ జార్జిరెడ్డి కథను ‘జార్జిరెడ్డి’ పేరుతో వెండితెరపైకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ‘వంగవీటి’ ఫేమ్ సందీప్ మాధవ్ టైటిల్ రోల్ చేస్తున్నారు. జీవన్ రెడ్డి దర్శకత్వంలో అప్పిరెడ్డి నిర్మించారు. ఇదివరకే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 22న విడుదల కానుంది. ఇప్పటికే చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్స్‌ను భారీగా ప్లాన్ చేస్తుంది. దీనిలో భాగంగా ట్రైలర్, మూవీలోని ఒక్కొ సాంగ్‌ను రిలీజ్ చేస్తూ సినిమాపై హైప్‌ను క్రియేట్ చేస్తున్నారు. తాజాగా చిత్రంలోని ‘అడుగు.. అడుగు’ అంటూ సాగే లిరికల్ సాంగ్ వీడియోను చిరంజీవి విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కు చిరంజీవి అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ‘అడుగు.. అడుగు’ సాంగ్ సినీ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. కాగా, సత్య దేవ్, మనోజ్ నందన్, చైతన్య కృష్ణ, వినయ్ వర్మ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సురేశ్ బొబ్బిలి మ్యూజిక్‌ను అందించారు. -
నిజాలను వక్రీకరిస్తే ‘జార్జిరెడ్డి’ను అడ్డుకుంటాం
సాక్షి, హైదరాబాద్: పీడీఎస్‌యూ నిర్మాత జార్జిరెడ్డిపై నిర్మించిన సినిమాలో నిజాలను వక్రీకరిస్తే... ‘జార్జిరెడ్డి’ మూవీని అడ్డుకుంటామని పీడీఎస్‌యూ జాతీయ అధ్యక్షుడు ఎం.రామకృష్ణ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.పరశురాం హెచ్చరించారు. సినిమా జార్జిరెడ్డి ఆశయాలు, లక్ష్యాలకు వ్యతిరేకంగా ఉంటే సహించబోమన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ... కామ్రేడ్ జార్జిరెడ్డి తన ఆశయాలు, సిద్ధాంతాల కోసం నిలబడి, కలబడిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. విద్యార్థి లోకానికి మరో చేగువేరా అన్నారు. ఆయన ప్రగతిశీల విద్యార్థులను ఏకతాటిపైకి తీసుకొచ్చి ఉస్మానియా క్యాంపస్‌లో జరిగిన అరాచకాలను అడ్డుకున్నాడన్నారు. మతోన్మాదాన్ని, కులోన్మాదాన్ని ఎదిరించాడన్నారు. అంతేకాకుండా ఆయన అణు భౌతికశాస్త్రంలో గోల్డ్‌మెడల్ సాధించాడని గుర్తుచేశారు. చదువుతో పాటు సమాజాన్ని అధ్యయనం చేసిన గొప్ప మేధావి అని కొనియాడారు. అలాంటి జార్జిరెడ్డి జీవితంలోని ముఖ్య సంఘటనలను వ్యాపార దృక్పథంతో సినిమాగా రూపొందించడం సరికాదన్నారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయకన్న తదితరులు పాల్గొన్నారు. -
ఈ కథ ముందు ఏదీ గొప్పగా అనిపించలేదు
‘‘జ్యోతిలక్ష్మి’ సినిమా తర్వాత కమెడియన్‌గా అవకాశాలు వస్తాయనుకున్నా. కానీ, రామ్‌గోపాల్ వర్మగారు ‘నిన్ను చూస్తుంటే వంగవీటి రాధలా ఉన్నావ్, ఓసారి ఈ లుక్స్ ట్రై చెయ్’ అన్నారు. అలా ‘వంగవీటి’ సినిమాలో వంగవీటి రాధగారి పాత్రలో నటించా’’ అని సందీప్ మాధవ్ అన్నారు. ‘దళం’ ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకత్వంలో సందీప్ మాధవ్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘జార్జ్ రెడ్డి’. సిల్లీ మంక్స్, త్రీ లైన్స్ సినిమా బ్యానర్లతో కలిసి మైక్ మూవీస్ అధినేత అప్పిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా సందీప్ మాధవ్ మాట్లాడుతూ – ‘‘వంగవీటి’ తర్వాత కొన్ని అవకాశాలు వచ్చాయి. అయితే చేయదగ్గ సినిమా అనిపించే స్థాయిలో ఏదీ కనెక్ట్ అవ్వలేదు. జీవన్‌గారు చెప్పిన ‘జార్జ్ రెడ్డి’ కథ చాలా బాగా నచ్చింది. ఇది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు జార్జ్ రెడ్డి పూర్తిస్థాయి బయోపిక్ అని చెప్పను. బేసిగ్గా ఆయన బాక్సర్, స్టూడెంట్ లీడర్ కాబట్టి.. విజువలైజేషన్లో హీరోయిజమ్ న్యాచురల్‌గానే ఉంటుంది. జార్జ్ రెడ్డి పాత్ర కోసం ఆయనకు సంబంధించిన ఆర్టికల్స్, బుక్స్, కొన్ని వీడియోస్ చూశాను. ఆయన క్లాస్మేట్స్ని, ఫ్రెండ్స్‌ని కొందరిని కలిసి ఆయన గురించి తెలుసుకున్నాను. అలాగే ఫొటోలు, ఒక చోట ఆయన స్పీచ్ చూశాను. వాటిని బేస్ చేసుకునే ఈ పాత్రకి ప్రిపేర్ అయ్యాను. 1960 – 70 బ్యాక్‌డ్రాప్ కాబట్టి అప్పటి వాతావరణం సృష్టించే ప్రయత్నం చేశాం. సినిమాలో చూపించిన బైక్స్, సైకిల్స్ అప్పట్లో వాడినవే. 1960లో ఉస్మానియా యూనివర్సిటీ ఎలా ఉండేదో అలా సెట్ వేసి చిత్రీకరించాం. జార్జ్ రెడ్డి అంటే పవన్ కళ్యాణ్‌గారికి చాలా ఇష్టం. ఈ సినిమా ఆయన చేయాలనుకున్నారట.. అందుకే ఓ పాటని ఆయనకు అంకితమిచ్చాం. ఈ సినిమా వల్ల రెండేళ్లు గ్యాప్ వచ్చింది. చాలా సినిమాలు వదులుకున్నాను. అయితే ఈ కథ ముందు ఏదీ గొప్పగా అనిపించలేదు. ఈ సినిమా చూశాక ‘జార్జ్ రెడ్డి’ లాంటి గొప్ప మనిషిని మనం పోగొట్టుకున్నామా? అనే భావన తప్పకుండా వస్తుంది. ‘ఇస్రో’ లాంటి సంస్థలో అవకాశం వచ్చినా వదులుకున్నారాయన’’ అన్నారు. -
‘జార్జ్ రెడ్డి’ చూసి థ్రిల్లయ్యా: ఆర్జీవీ
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమ నాయకుడిగా అవతరించిన కథే జార్జ్ రెడ్డి. మొదటినుంచి ఈ చిత్రానికి ఎన్నో అవాంతరాలు ఎదురవుతున్నాయి. యూనివర్సిటీకి కత్తులు, నకళ్లు పరిచయం చేసిన వ్యక్తిని హీరోలా చూపిస్తున్నారంటూ ఓ వర్గం ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేసింది. జార్జ్ రెడ్డి.. చరిత్ర మర్చిపోయిన స్టూడెంట్ లీడర్ అంటూ మరో వర్గం ఆకాశానికి ఎత్తుతోంది. ఇక నిన్న(ఆదివారం) హైదరాబాద్‌లో జరగాల్సిన సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు పోలీసులు అనుమతి నిరాకరించడంతో చిత్రబృందం ప్రత్యామ్నాయాలు వెతుక్కోక తప్పలేదు. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ వస్తే భద్రతాపరంగా ఇబ్బందులు తలెత్తుతాయని పోలీసులు ఈవెంట్‌కు అనుమతి నిరాకరించారు. కాగా ఈ సినిమాపై టాలీవుడ్ సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం వారి సరసన రామ్‌గోపాల్ వర్మ చేరారు. ‘జార్జ్ రెడ్డి’ని చూసి థ్రిల్‌కు గురయ్యానన్నారు. సందీప్ మాధవ్ నటనతో జార్జ్ రెడ్డి తిరిగివచ్చినట్టు ఉందంటూ ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా సినిమా యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. సిల్లీమంక్స్, త్రీలైన్స్ సినిమా బ్యానర్లతో కలిసి మైక్ మూవీస్ అధినేత అప్పిరెడ్డి ఈ సినిమాను నిర్మించాడు. ఈ చిత్రం నవంబర్ 22న విడుదల కానుంది. Feeling thrilled to see GEORGE REDDY come alive and it’s clear from posters @SandeepMadhav_ killed it ...Congrats to @G1Dalam and @AbhishekPicture Film releasing Nov 22nd https://t.co/6LdSCvkLmD — Ram Gopal Varma (@RGVzoomin) November 18, 2019 -
‘జార్జ్‌రెడ్డి’ లిరికల్ వీడియో సాంగ్ ప్రోమో
చరిత్ర మరచిపోయిన విద్యార్థి నాయకుడి జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తున్న సినిమా జార్జ్‌రెడ్డి. సమ సమాజ స్థాపనే ధ్యేయంగా పోరాడి, లక్ష్య సాధనలో ప్రాణాలర్పించిన జార్జ్ రెడ్డి.. ఈ జనరేషన్‌కి తెలియకపోవచ్చేమో కానీ, 1965 నుంచి 1975 వరకు ఉస్మానియా యూనివర్శిటీలో చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఆయన జీవితం గురించి తెలుసు. అలాంటి ఉద్యమ నాయకుడి గురించి ఈ తరం తెలుసుకునేలా రూపొందిస్తున్న సినిమా.. ‘జార్జ్ రెడ్డి’.. (ఏ మ్యాన్ ఆఫ్ యాక్షన్) . తాజాగా ఈ సినిమాలోని తొలి లిరికల్ సాంగ్ ప్రోమోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్.. వాడి చూపుల్లో ఉంది చెగువేరా ట్రెండు’ అంటూ సాగే ఈ పాటను మంగ్లీ ఆలపించగా.. మిట్టపల్లి సురేందర్ సాహిత్యం అందిచారు. తాజాగా ఈ పాట ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ మారింది. నెటిజన్లను ప్రోమో విశేషంగా ఆకట్టుకుంటోంది. దసరా సందర్భంగా చిత్ర యూనిట్ ‘జార్జ్ రెడ్డి’ ట్రైలర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆసక్తికరంగా ఉన్న ట్రైలర్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. చిత్రం పోస్టర్‌ను మంగళవారం నందికొట్కూర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి ఆవిష్కరించారు. దీంతో ‘జార్జ్ రెడ్డి’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు పేరుగుతున్నాయి. ఈ చిత్రం నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రానికి కెమెరా: సుధాకర్ యెక్కంటి, సంగీతం: సురేష్ బొబ్బిలి, నేపథ్య సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, అసోసియేటెడ్ ప్రొడ్యూసర్స్: దాము రెడ్డి, సుధాకర్ యెక్కంటి, సహ నిర్మాత: సంజయ్ రెడ్డి. -
‘జార్జ్ రెడ్డి’ పోస్టర్ రిలీజ్
చరిత్ర మరచిపోయిన విద్యార్థి నాయకుడి జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తున్న సినిమా జార్జ్‌రెడ్డి. సమ సమాజ స్థాపనే ధ్యేయంగా పోరాడి, లక్ష్య సాధనలో ప్రాణాలర్పించిన జార్జ్ రెడ్డి.. ఈ జనరేషన్‌కి తెలియకపోవచ్చేమో కానీ, 1965 నుంచి 1975 వరకు ఉస్మానియా యూనివర్శిటీలో చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఆయన జీవితం గురించి తెలుసు. అలాంటి ఉద్యమ నాయకుడి గురించి ఈ తరం తెలుసుకునేలా రూపొందిస్తున్న సినిమా.. ‘జార్జ్ రెడ్డి’.. (ఏ మ్యాన్ ఆఫ్ యాక్షన్) . ఈ చిత్రం పోస్టర్‌ను మంగళవారం నందికొట్కూర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి ఆవిష్కరించారు. దసరా సందర్భంగా చిత్ర యూనిట్ జార్జ్ రెడ్డి ట్రైలర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం ట్రైలర్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. చిత్రానికి కెమెరా: సుధాకర్ యెక్కంటి, సంగీతం: సురేష్ బొబ్బిలి, నేపథ్య సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, అసోసియేటెడ్ ప్రొడ్యూసర్స్: దాము రెడ్డి, సుధాకర్ యెక్కంటి, సహ నిర్మాత: సంజయ్ రెడ్డి. ఈ చిత్రం నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘జార్జ్ రెడ్డి’చిత్ర పోస్టర్ రిలీజ్