జీవన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి యక్కంటి
సందీప్ మాధవ్ టైటిల్ రోల్‌లో జీవన్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘జార్జ్ రెడ్డి’. సిల్లీ మంక్స్, త్రీ లైన్స్ సినిమా బ్యానర్లతో కలిసి మైక్ మూవీస్ అధినేత అప్పిరెడ్డి నిర్మించారు. గత శుక్రవారం ఈ చిత్రం విడుదలైంది. ఈ సందర్భ ంగా దర్శకుడు జీవన్ రెడ్డి, కెమెరామేన్ సుధాకర్ రెడ్డి యక్కంటి మీడియాతో మాట్లాడారు.
జీవన్ రెడ్డి మాట్లాడుతూ – ‘‘జార్జ్ రెడ్డి’ కథను సినిమాగా తీయాలనుకున్నప్పుడు చాలా పరిశోధన చేశాం. జార్జ్ రెడ్డి గురించి తెలిసిన వాళ్లను కలిశాం. వాళ్ల దగ్గర నుంచి వివరాలు సేకరించాం. ఆ సేకరించిన వివరాలు చదవడానికే నాకూ, కెమెరామేన్ సుధాకర్ అన్నకు కొన్ని నెలలు పట్టింది. జార్జ్ రెడ్డి లైఫ్ జర్నీనే స్క్రీన్‌ప్లేగా చూపించాలనుకున్నాను. ఆయన గురించి చెప్పాలంటే 10–12 గంటల సినిమా తీయాలి. రెండున్నర గంటల సినిమాలో అన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నించాను. ఆయన గురించి ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయం వ్యక్తం చేశారు.
వాళ్లు చెప్పినదాంతో సుమారు 120 బయోపిక్స్ తీయొచ్చు అనిపించింది. జార్జ్ రెడ్డి సిద్ధాంతాలు ఏంటి? ఆయన ఎమోషన్స్ ఏంటి? జార్జ్ రెడ్డి నిజాయితీ, తన ఫైటింగ్ స్పిరిట్ ఈ సినిమాలో చెప్పాలనుకున్నాను. ఇప్పటి తరం వాళ్లు కూడా అవసరమైనప్పుడు తమ గొంతుని వినిపించాలి. ఈ సినిమా ఎవర్నీ కించపరచకూడదనుకున్నాం. కథకు తగ్గట్టుగానే కొన్ని కమర్షియల్ హంగులు జోడించాం. ఉస్మానియా యూనివర్శిటీలో చాలా కథలున్నాయి. వాటిని సినిమాలుగా తీస్తాను’’ అన్నారు.
సుధాకర్ రెడ్డి యక్కంటి మాట్లాడుతూ–‘‘నా దృష్టిలో తెలుగు సినిమా హీరోల కన్నా పెద్ద హీరో జార్జ్ రెడ్డి. ఈ సినిమాను యువత అందరూ చూడాలి. ‘రైజ్ యువర్ వాయిస్’ అనేది జార్జ్ రెడ్డిగారి నినాదం. తప్పు జరిగినప్పుడు అది తప్పు అని చెప్పే ధైర్యం కావాలి. అలాంటి లక్షణం ఉన్న గొప్ప వ్యక్తి ఆయన. ఆ స్ఫూర్తిని యూత్‌కి చెప్పాలనుకున్నాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment