జార్జి రెడ్డి (1947–1972)
కాసింత ఆహారం, దుస్తులు, వైద్యం లాంటి కనీస అవసరాలు అందరికీ సంపూర్ణంగా అందాలని అర్ధ శతాబ్దం క్రితం ఒక యువ మేధస్సు ఆలోచించింది. ఆ లక్ష్య సాధనకై ఆచరణాత్మక కార్యాచరణ రూపొందించి, అడుగులు వేస్తున్న నేపథ్యంలో 1972 ఏప్రిల్ 14న ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీ కిన్నెర హాస్టల్ ప్రాంగణంలో... ప్రగతి నిరోధక, ఛాందస భావాల ప్రతినిధుల కుట్రలకు ఆ యువ కిశోరం ఎదురు నిలిచి పోరాడి నేలకొరిగింది. అతడే ప్రగతి శీల విద్యార్థుల ప్రియ నేత, ఉస్మానియా అరుణ తార, హైదరాబాద్ చేగువేరాగా పిలుచుకునే జార్జి రెడ్డి!
1947 జనవరి 15న కేరళలో జన్మించాడు జార్జి రెడ్డి. 1960–70ల్లో హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ విద్యార్థిగా, ఉస్మానియా రీసెర్చ్ స్కాలర్‌గా జార్జ్ చెరగని ముద్ర వేశాడు. క్లిష్టమైన అణు భౌతిక శాస్త్రంలో (న్యూక్లియర్ ఫిజిక్స్) గోల్డ్ మెడల్ సాధించాడు. విద్యార్థులకు విద్యతో పాటు మానసిక శారీరక దృఢత్వం తప్పనిసరి అని విశ్వసించే జార్జ్ తనని తాను బాక్సింగ్ ఛాంపియన్‌గా మలుచుకున్నాడు. అంతేగాక తోటి విద్యార్థులకు, విద్యార్థినులకు స్వీయ రక్షణ మెలకువలు బోధిస్తూ, వారిలో నూతన విశ్వాసాన్ని నింపేవాడు. నక్సల్బరీ, శ్రీకాకుళం, గోదావరి లోయ గిరిజన పోరాటాలు, తొలి దశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ గాలులు ఉస్మానియా గడ్డను తాకాయి. ఆ ప్రజా ‘తిరుగుబాట్లు’ ఉస్మానియా విద్యార్థులలో ఆసక్తిని కలిగించాయి. ఈ నేపథ్యంలోనే యూనివర్సిటీ నూతన పరిణామాలకు వేదికైంది.
రైతాంగ పోరాటాలకు జడుచుకొని నగరాలలో స్థిరపడిన ఆధిపత్య సామాజిక వర్గాల వారసులు... చదువు సాకుతో ఉస్మానియా యూనివర్సిటీలో తిష్ఠ వేశారు. మరోవైపు నాటి ఉద్యమ విజయాలతో చదువుల ఒడిని చేరుకున్న మధ్యతరగతి, రైతు కూలీల బిడ్డలు, ఉన్నత విద్యకై ఉస్మానియా వర్సిటీలోకి అప్పుడప్పుడే చేరుకోవడం ఆరంభమైంది. (క్లిక్: మహిళల వద్దకే ఉద్యోగాలు)
మొదటి బృందానికి నాటి పాలక పార్టీ, నేటి అధికార పార్టీ మాతృసంస్థలు దిశానిర్దేశం చేస్తూ... యూనివర్సిటీపై తమ తమ ఆధిపత్యాల కోసం వికృత మార్గాలు ఎంచుకున్నాయి. ఫలితంగా రెండో బృందం విద్యార్థులపై హాస్టళ్లలో, మెస్‌లలో, తరగతి గదులలో, ఈవ్ టీజింగ్, ర్యాగింగ్‌ల పేరుతో.. బల ప్రదర్శన, ఆధిపత్యం చేయడం ఆనవాయితీగా మారింది. యూనివర్సిటీ అధికారులపై, ఆచార్యులపై బెదిరింపులకు పాల్పడటం; విద్యార్థి సంఘాల ఎన్నికలలో ఆరోగ్యకరమైన పోటీ జరగకుండా భయభ్రాంతులు సృష్టించడం, తోటి విద్యార్థుల స్వేచ్ఛను హరించడం సర్వసాధారణమైపోయింది. ఈ నేపథ్యంలో ఎమ్మెస్సీ ఫిజిక్స్ విద్యార్థిగా జార్జి రెడ్డి యూనివర్సిటీ గడ్డపై అడుగు పెట్టాడు.
బిక్కుబిక్కుమంటున్న విద్యార్థి లోకానికి పెద్ద దిక్కై నిలిచాడు. క్యాంపస్‌లో విద్యార్థి హక్కుల రక్షణకై నిలబడ్డాడు. భౌతిక దాడులను తన బిగి పిడికిలితో తిప్పికొడుతూ విద్యార్థుల్లో ధైర్యాన్ని నింపాడు. సైద్ధాంతిక అధ్యయనం, చర్చలతో సహచరులలో స్ఫూర్తి రగిలించాడు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి బృందాన్ని నిర్మించి ఆనతి కాలంలోనే విద్యార్థుల ఆత్మీయ నేతగా ఎదిగాడు. సాధారణ విద్యార్థులను పోటీకి నిలవనివ్వని ‘ఆధిపత్యం’పై విద్యార్థి సంఘాల ఎన్నికలలో గెలిచి రికార్డు సృష్టించాడు.
విజ్ఞానంలోనూ, నాయకత్వంలోనూ పతాక స్థాయికి చేరుకుంటున్న జార్జి ‘ఆధిపత్య వర్గాలకు’ కంటగింపుగా మారాడు. దీంతో ఛాందసవాదులు జార్జిని అమానుషంగా హత్య చేశారు. జార్జి త్యాగాన్నీ, ఆశయాలనూ ఎత్తి పడుతూ జార్జి స్థాపించిన పీడీఎస్ అనతికాలంలోనే ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ)గా దేశవ్యాప్తంగా విస్తరించింది. ‘జీనా హై తో మర్ నా సీఖో, ఖదం ఖదం పర్ లడ్‌నా సీఖో’ అంటూ మరణానంతరం కూడా యువ తరానికి దిశానిర్దేశం చేస్తున్న హీరో జార్జి రెడ్డి. (చదవండి: వ్యవస్థల్లో విపరీత ధోరణులు)
- ఎస్. నాగేశ్వర్ రావు
పీడీఎస్‌యూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు
(ఏప్రిల్ 14న జార్జి రెడ్డి 50వ వర్ధంతి సందర్భంగా... నేడు ఓయూలో నిర్వహించే ‘రెడ్ షర్ట్’ కవాతు, బహిరంగ సభ నేపథ్యంలో)
Comments
Please login to add a commentAdd a comment