రెండు దశాబ్దాల పాటు ఉస్మానియా క్యాంపస్‌లో యువవిద్యార్థుల మనస్సులపై జార్జిరెడ్డి వేసిన ప్రభావం అసాధారణమైనది. అతడి భావజాలం సామాజిక శాస్త్రాల విద్యార్ధులపై బలమైన ప్రభావం వేస్తూ వచ్చింది. సమాజంలోనూ, క్యాంపస్‌లోనూ ఛాందస, కులోన్మాద భావజాలాలతో ఘర్షించటంలో జార్జిరెడ్డి సాగించిన వీరోచిత పోరాటానికి సినిమా చిత్రికపట్టింది. 1970లలో జార్జిరెడ్డి, 2010లలో రోహిత్ వేముల ఈ కారణంతోనే వేలాదిమంది విద్యార్థులను కదిలించారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలనే భావం ఇద్దరిలోనూ రగులుతుండేది. తిరుగుబాటు మనస్తత్వం కలిగిన వారితో చర్చించాలే తప్ప అణిచివేయకూడదు. సమాజంలో సమూల మార్పులను తీసుకొచ్చే మానసిక సమర్థతలను అణిచివేస్తే జాతికే నష్టం వాటిల్లుతుంది. జార్జి వంటి యువకులు పుట్టుకొస్తే వారిని పెంచి పోషించాలి తప్ప తుంచేయకూడదు.
తెలుగు సినిమా ‘జార్జిరెడ్డి’ని ఎంతో ఆస క్తితో చూశాను. ప్రగాఢ అభినివేశంతో కూడిన అతడి అకడమిక్ పాండిత్య దృక్పథంతో ప్రభావితమైన వ్యక్తుల్లో నేనూ ఒకడిని. జార్జిరెడ్డిని పాశవికంగా హత్య చేసిన రెండేళ్ల తర్వాత అంటే 1974లో నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ కోర్సులో చేరాను. నేను చదివిన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీ.. జార్జిరెడ్డి అనే అసాధారణ మేధావి ఫైర్ బ్రాండ్ తరహా కార్యాచరణకు ప్రధాన ఆకర్షణగా మారింది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే అతడు ఫిజిక్స్ విద్యార్థి.
ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆ రోజుల్లో రాజకీయ చర్చలకు, క్రియాశీల ఆచరణకు కేంద్రస్థానమై వెలుగొందుతుండేది. మరణం తర్వాత కూడా జార్జిరెడ్డి భావజాలం అనేకమంది సామాజిక శాస్త్రాల విద్యార్ధులపై బలమైన ప్రభావం వేస్తూ వచ్చింది. తదనంతర కాలంలో వీరే అనేక రంగాల్లో నాయకత్వం వహించారు. ప్రకృతి శాస్త్రాలు, ఇంజనీరింగ్, న్యాయశాస్త్ర విద్యార్థులు సైతం జార్జిరెడ్డి భావాలతో ప్రభావితులయ్యారు. సామాజిక సమస్యలపట్ల బాధ్యత ప్రదర్శిం చిన అనేకమంది విద్యార్థులు ఈ జ్ఞాన విభాగాలనుంచి కూడా ఆవిర్భవించారు. మరణించాక రెండు దశాబ్దాల పాటు ఓయూ క్యాంపస్‌లో యువ మనస్సులపై జార్జిరెడ్డి వేసిన ప్రభావం అనన్యసామాన్యమైంది. ఆనాటికి పెద్దగా రచనలు కూడా చేసి ఉండని ఒక పాతికేళ్ల విద్యార్థి మూడు అంశాలలో రాటుదేలడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అవేమిటంటే, 1. జ్ఞానాన్ని ఆయుధంగా చేసుకోవడం. 2. దాన్ని అతి స్వల్ప కాలంలోనే పీడిత కులాల విముక్తికోసం ఉపయోగించడం. 3. తాను పోరాడిన పీడకుల చేతుల్లో అమరత్వం పొందడం.
సోషలిస్టు విప్లవ సిద్ధాంతాన్ని పేదలకు, దిగువ కులాలకు అనుకూలమైనదిగా మల్చడంలో జార్జిరెడ్డి నిర్వహించిన పాత్ర సాధారణ ప్రజలను కూడా ఆకట్టుకునేలా చేయడంలో ‘జార్జిరెడ్డి’ సినిమా చక్కటి విజయం సాధించింది. సమాజంలోనూ, క్యాంపస్‌లోనూ సంఘ వ్యతిరేక, కులోన్మాద భావజాలాలతో భావోద్వేగంగా ఘర్షించ టంలో జార్జి సాగించిన వీరోచిత పోరాటానికి సినిమా చిత్రికపట్టింది. నాటి నుంచి నేటి దాకా ప్రభుత్వాలు, రాజకీయ శక్తులు సాగిస్తున్న విద్యా వ్యతిరేకమైన ఎజెండా నేటికీ అనేక క్యాంపస్‌లలో సమస్యగా కొనసాగుతూనే వస్తోంది. అలాంటి బాహ్య శక్తుల ప్రభావానికి సగటు విద్యార్థులు, కండబలం, అధికార బలం ఉన్న శక్తులు సులువుగా లోనయ్యేవారు. అయితే విద్యార్జనలో కానీ, భౌతిక పోరాటాల్లో కానీ అలాంటి శక్తులందరినీ జార్జిరెడ్డి తోసిపుచ్చేశాడు. ఆయనలోని ఈ మహామూర్తిమత్వాన్ని సినిమా చాలా చక్కగా ప్రదర్శించింది.
1970లలో జార్జిరెడ్డి, 2010లలో రోహిత్ వేముల ఈ కారణంతోనే యూనివర్సిటీ క్యాంపస్‌లలోని వేలాదిమంది విద్యార్థులను ప్రభావితం చేశారు. మనుషులను పీడించే వారి ఏజెంట్ల చేతుల్లో 1972 ఏప్రిల్ 14న హత్యకు గురయ్యేనాటికి జార్జి రెడ్డి వయస్సు సరిగ్గా పాతికేళ్లు. అదే పీడకుల దౌర్జన్యానికి నిరసన తెలుపుతూ రోహిత్ వేముల 2016 జనవరి 17న ఆత్మహత్య చేసుకున్నాడు. పీడన అనైతికం, సంఘ వ్యతిరేకమనే సామాజిక–ఆత్మిక, సాంస్కృతిక మూలాల విషయంలో ఈ ఇరువురి స్వభావం ఒక్కటే. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలనే భావం ఇద్దరిలోనూ రగులుతుండేది. తమ తల్లుల్లోని సానుకూల ఆధ్యాత్మిక నైతిక భావజాలం ప్రభావంతో వీరిరువురు పేదలకు, పీడితులకు అనుకూలమైన ఉమ్మడి లక్ష్యాన్ని కలిగి ఉండేవారు.
జార్జి తల్లి లీల, రోహిత్ తల్లి రాధిక ఇద్దరూ ఆ ఆధ్యాత్మిక నైతికతతోనే వారిని ఉగ్గుపాలనుంచి పెంచి పోషించారు. ఆ రోజుల్లో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలే జార్జిరెడ్డి అజెండాగా సినిమా ప్రదర్శించినప్పటికీ, పీడితుల పట్ల, పేదల పట్ల సానుభూతి చూపడంలో అతడి కుటుంబ నైతికత ఆ రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా చెలరేగిన సోషలిస్టు భావతరంగాలతో మిళితమైంది. సోవి యట్ యూనియన్ అగ్రరాజ్యంగా ఎదగడం, చైనాలో సాంస్కృతిక విప్లవం.. ఫిడెల్ క్యాస్ట్రో, చేగువేరా నాయకత్వంలో సాగిన క్యూబన్ విప్లవం వంటివి ప్రపంచవ్యాప్తంగా యువతను ప్రభావితం చేస్తూ వచ్చాయి. ఇవి జార్జిరెడ్డిపై కూడా తీవ్రప్రభావం చూపాయి.
ఆ రోజుల్లో ప్రపంచమంతటా విశ్వవిద్యాలయాల క్యాంపస్‌లలో సాగిన వియత్నాం అనుకూల, అమెరికన్ వ్యతిరేక ఉద్యమాలు ప్రజాతంత్ర పౌర హక్కులకు, సోషలిస్టు ప్రచారానికి ప్రేరణనిచ్చాయి. తీవ్రమైన మేధోపరమైన అభినివేశం కలవారు తరగతి గదుల్లో, లైబ్రరీల్లో లోతైన అధ్యయనాలు, చర్చలు జరుపుతూనే వీధి పోరాటాల్లో కూడా పాల్గొనేవారు. జార్జిరెడ్డి అసాధారణ మేధోశక్తికి ఇదే ప్రాతిపదిక అయింది. తనలోని ఈ అసాధారణ శక్తే మాలో అనేకమందిని ప్రభావితం చేసింది. కానీ అతడి తర్వాత ఈ రెండు శక్తులను ఏ ఒక్కరూ తమలో నిలుపుకోలేకపోయారు. ఆయన అనుయాయుల్లో అనేకమంది తర్వాత నక్సలైట్ ఉద్యమాలవైపునకు తరలిపోయారు. కొంతమంది సీరియస్‌గా అధ్యయనంపై దృష్టిపెట్టి పాక్షిక విజయాలు మాత్రమే సాధించారు. మాలో ప్రతి ఒక్కరూ కొన్ని కొన్ని విడి విడి రంగాల్లో తమ ప్రయత్నాలు చేసినప్పటికీ ఏ ఒక్కరం కూడా జార్జిరెడ్డి తర్వాత అంతటి ప్రభావం కలిగించలేకపోయామన్నది వాస్తవం.
జార్జిరెడ్డి ప్రతిభాపాటవాలను ప్రస్తుతతరం విద్యార్థుల ముందు ప్రదర్శించడానికి ఈ సినిమా గట్టి కృషి చేసింది. అంత చిన్న వయస్సులోనే అలాంటి అసాధారణ శక్తియుక్తులను ప్రదర్శించిన వారు మానవుల్లో చాలా తక్కువమందే ఉంటారు. వీరు ప్రపంచం దృష్టిలో అద్భుత వ్యక్తులుగా వెలుగొందుతుంటారు. అసాధారణమైన మానవుల్లో దేవుడు విభిన్నమైన బీజాలు నాటతాడు అని సామెత. సైన్స్, ఆర్ట్స్, నైతికత వంటివి ఇలాంటి వారి ద్వారానే ప్రకాశిస్తుంటాయి. ఇలాంటి అసాధారణమైన అమరుల జీవిత చిత్రాన్ని భారతీయ జీవిత చిత్రాల వారసత్వం చాలా అరుదుగా మాత్రమే చిత్రించింది. భారతీయ సినిమా పరిశ్రమ పాటలు, డ్యాన్స్ మాయాజాలానికి మించి ఎదగలేకపోయింది. జార్జిరెడ్డిపై వచ్చిన ఈ సినిమా ప్రాంతీయ చిత్రమే అయినప్పటికీ, అతి చిన్న బడ్జెట్‌తోనే పూర్తయినప్పటికీ, విభిన్నమైన ప్రయోగాత్మక చిత్రంగా తన ముద్ర వేసింది.
ఈ సినిమాలో గొప్పతనం ఏమిటంటే, బాల్యదశలో జార్జిరెడ్డిలో రూపొందిన విశిష్ట వ్యక్తిత్వంపై ఇది కేంద్రీకరించడమే. తన తల్లి నుంచి ప్రతివిషయంలోనూ అతడు సానుకూలమైన మానవీయ దృక్పథాన్ని పుణికిపుచ్చుకున్నాడు. అదే సమయంలో తనలో అంతర్లీనంగా ఉండిన అపారమైన మానవీయ సహజాతాన్ని పాటించడంలో తల్లి ఊహలను కూడా అతడు మించిపోయాడు. సామాజికంగా, సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా అలాంటి సహజాత గుణంతో పెరిగి పెద్దవడం జీవితంలో చాలా ముఖ్యమైన విషయం. కుటుంబం నుంచి పాఠశాలకు, యూనివర్సిటీకి ఎదిగే క్రమంలో తనలోని సృజ నాత్మకమైన ప్రోత్సాహక గుణాన్ని, మంచితనాన్ని, మేధోపరమైన అభినివేశాన్ని అట్టిపెట్టుకుని పెంచుకుంటూ రావడం చాలా ముఖ్యమైన విషయం. పిల్లల వ్యక్తిత్వాలను చంపేయడం, లేదా ఇలాంటి వ్యక్తుల ప్రధాన స్ఫూర్తిని చంపేయడాన్ని భారతీయ పౌర సామాజిక నైతిక చట్రాలు ఒక ధోరణిగా కలిగి ఉంటున్నాయి.
ఇలాంటి స్ఫూర్తిని వారిలో చంపేశాక మన సమాజంలో ఆడ, మగ వ్యక్తులు ఎక్కువ కాలం బతకవచ్చు కానీ చరిత్రను మాత్రం సృష్టించలేరు. చిన్నవయసులోనే హత్యకు గురైనప్పటికీ జార్జిరెడ్డి, రోహిత్ వేముల మన జీవిత కాలంలోనే చరిత్ర సృష్టించారు. స్వాతంత్య్రపోరాటంలో భగత్‌సింగ్ అదే పని చేశారు. వీరు వదిలివెళ్లిన చరిత్ర అత్యంత శక్తివంతమైన సానుకూలతను కలిగి ఉంది, అనేకమంది తరుణ మనస్కులు అనుసరించదగిన సృజనాత్మక కార్యదీక్షను వీరు చరిత్రలో నిలిపివెళ్లారు.
క్యాంపస్‌లలో అలాంటి చురుకైన మనస్సు కలవారు అడుగుపెట్టకుండా చేయడానికి ఇప్పుడు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కుటుంబం, పాఠశాల, విశ్వవిద్యాలయం ప్రతిచోటా సంప్రదాయ జీవన వాతావరణం ఉంటున్న పరిసరాలు సృజనాత్మక ప్రయోగాలను అనుమతించడం లేదు. నూతన విషయాలపై ప్రయోగాలు చేయదలిచిన యువత ప్రతి సంప్రదాయానికి, ఛాందసత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది. తిరుగుబాటు మనస్తత్వం కలిగిన వారితో చర్చించాలే తప్ప అణిచివేయకూడదు. సమాజంలో సమూల మార్పులను తీసుకొచ్చే మానసిక సమర్థతలను అణిచివేస్తే జాతికే నష్టం వాటిల్లుతుంది. దేశంలో ఏ మారుమూలైనా జార్జి వంటి యువకులు పుట్టుకొస్తే వారిని పెంచి పోషిం చాలి. చివరగా ఈ సినిమాను అన్ని భాషల్లోకీ డబ్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.
వ్యాసకర్త: ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెపర్డ్
డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్
సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ
Comments
Please login to add a commentAdd a comment