‘‘ప్రైవేటైజేషన్ ఈజ్ టేకింగోవర్. పూర్ స్టేయింగ్ పూర్ అండ్ రిచ్ బికమింగ్ రిచర్’’.జార్జిరెడ్డి మాట్లాడుతున్నాడు.‘‘.. బీయింగ్ అగైనెస్ట్ దిస్, వి హ్యావ్ రైజ్‌డ్ అవర్ వాయిస్ టు ప్రొటెస్ట్.. బట్ అవర్ ప్రొటెస్ట్ హ్యాజ్ రిమెయిన్డ్ అన్‌హర్డ్..’’(పేదోడు పేదోడిగానే ఉండిపోతున్నాడు. ఉన్నోడు ఇంకా ఇంకా ఉన్నోడు అయిపోతున్నాడు. దీనిపై మేము గళం విప్పాం. పిడికిలి బిగించాం).
ఉస్మానియా విశ్వవిద్యాలయం 1967. హాస్టల్ డైనింగ్ హాల్. ‘‘మనం తిన్న ప్లేట్లల్ల ఉప్పేసి కడుగుతరు ఈ నా కొడుకులు. తినండ్రా మీరు తిన్నంక అదే ప్లేట్లల్లో ఉచ్చ పోసి కడుగుత..’’అన్నం పరబ్రహ్మ స్వరూపం. వర్ణం? మనుధర్మ వికృతరూపం. తింటున్న ప్లేట్లు గాల్లోకి లేచాయి. ‘‘రేయ్.. ఏం కూశావ్‌రా’’ అగ్రవర్ణం పైకి లేచింది. జార్జిరెడ్డి కూడా పైకి లేచాడు. తనది ఏ వర్ణమో అతడు చూసుకోలేదు. ‘ఉచ్చపోసి కడుగుతా’ అని అరిచిన ‘అధమ’ వర్ణం వైపు నిలబడ్డాడు! ‘అర్జున్‌రెడ్డి’ సినిమాలో అమిత్‌గాడి హాస్టల్‌కి వెళ్లి మరీ వాడి ముక్కూమూతి పగలగొట్టినట్లు.. ‘ఏం కూశావ్‌రా..’ అని అధమ వర్ణంపైకి లేచిన అగ్రవర్ణం ముక్కు బద్దలు కొట్టాడు జార్జిరెడ్డి.‘‘ఈ దేశంలో పుట్టి, ఈ దేశం గాలి పీల్చి, ఈ దేశం కోసం పోరాడుతున్న విద్యార్థులారా.. యుద్ధానికి సిద్ధం కండి. భారత్ మాతాకీ జై.’’క్యాంపస్‌లోకి అవుట్ సైడర్స్! టార్గెట్ జార్జిరెడ్డి!‘‘ఎవరు వాడు?’’.. పొలీస్ ఇన్‌స్పెక్టర్ అడిగాడు.‘‘ఎవడో కొత్త కుర్రోడు సార్.
పేరు జార్జిరెడ్డి’’.. ముఖం పచ్చడైన భరతమాత ముద్దుబిడ్డ ఒకడు చేతులు కట్టుకుని చెబుతున్నాడు.‘‘ఎనీ బడి కెన్ సాల్వ్ దిస్?’’.. ఫిజిక్స్ క్లాస్ రూమ్‌లో లెక్చరర్ అడిగాడు. జార్జిరెడ్డి చెయ్యెత్తాడు. క్లాసయ్యాక క్లాస్‌మేట్ అడిగాడు.. ‘‘నిజం చెప్పు డబుల్ ఎమ్మెస్సీ కదా!’’ జార్జిరెడ్డి నవ్వలేదు. నవ్వీ నవ్వనట్లు చూశాడు. క్యాంపస్‌లోకి మళ్లీ ఔట్ సైడర్స్. మళ్లీ జార్జిరెడ్డే టార్గెట్. వీడిని ఇలాగే వదిలేస్తే క్యాంపస్ చేజారిపోతుంది. ‘‘పోతేపోయింది.. ఆ నా కొడుకుల చేతిలోకి పోతుంది’’. కత్తులు, కర్రలు.. ఉస్మానియాలో ఉద్రిక్తత. కారణం.. మళ్లీ జార్జిరెడ్డి! ‘‘వన్ ఇయర్ రస్టికేట్ లెటర్ టైప్ చెయ్యండి’’.. వైస్ చాన్స్‌లర్ ఆర్డర్. ఇంటికొచ్చాడు జార్జిరెడ్డి. ‘‘నేను అనుకున్న క్యాంపస్ ఇది కాదమ్మా..’’ తల్లితో అన్నాడు. కానీ క్యాంపస్ అనుకున్న హీరో మాత్రం జార్జిరెడ్డే. రష్యన్ రివల్యూషన్ పుస్తకాన్ని కొడుకు చేతికిచ్చింది తల్లి. జార్జిరెడ్డి రీచార్జ్‌రెడ్డి అయ్యాడు. ‘‘జార్జిరెడ్డి దాదా అయిండన్నా.. ఔటర్స్ లోపలికి రావాలంటేనే భయపడుతున్నారు.
అంతేకాదు.. అప్పర్ క్యాస్ట్ అంటే.. అసలు ఆలోచించకుండా కొడుతున్నాడు’’ ‘‘అసలు ఈడెవడు భయ్యా. నిన్నగాక మొన్నొచ్చాడు’’ వచ్చింది నిన్నగాక మొన్ననే. ఉండబోతున్నది ఉస్మానియా క్యాంపస్ ఉన్నంతకాలం. ‘‘స్కాలర్‌షిప్పులు రాకుండా చేసినా, ఏం చేసినా సరే.. గల్లా పట్టుకుని ప్రశ్నించండి.. రైజ్ యువర్ వాయిస్’’.. జార్జిరెడ్డి స్పీచ్‌కి క్యాంపస్‌లోని చెట్టు కూడా తలలు ఊపుతున్నాయి. ‘‘ఈ కాలేజేమైనా వాళ్ల అయ్యదా? తాతదా? ఎవరికి ఆయాసమొచ్చినా ఉరికొస్తుండు’’ ‘‘ఎవరో కనుక్కోండి’’ జార్జిరెడ్డి. మ్యాన్ ఆఫ్ యాక్షన్. ‘‘టుడే వాట్ వియ్ లెఫ్ట్ విత్ అజ్ ఈజ్ ఆర్గనైజింగ్ దిస్ అండ్ మీట్ వయొలెన్స్ విత్ వయొలెన్స్’’ జార్జిరెడ్డి మాట్లాడుతున్నాడు. ‘‘రైజ్ యువర్ వాయిస్. బిఫోర్ ద ట్రూత్ డైస్’’. జార్జిరెడ్డి కొట్లాడుతున్నాడు.
‘‘జీనా హైతో మర్‌నా సీకో.. కదమ్ కదమ్ పర్ లడ్‌నా సీకో’’. బతకాలంటే చావడం ఎలాగో నేర్చుకో. ప్రతి అడుగులోనూ పోరాడటం నేర్చుకో. రెండేళ్ల క్రితం ‘అర్జున్‌రెడ్డి’ సినిమా ట్రైలర్ ఎంత వైరల్ అయిందో.. ఇప్పుడు ‘జార్జిరెడి’్డ ట్రైలర్ అలాగే యూత్‌ని ఊపేస్తోంది. అర్జున్‌రెడ్డి లవ్ స్టోరీ. జార్జిరెడ్డి వార్ స్టోరీ. పేదరికంపై వార్. ప్రైవేటీకరణపై వార్. అగ్రవర్ణ ఆధిపత్యంపై వార్. ఉత్తమాటలపై వార్. చెత్త రాజకీయాలపై వార్. సమసమాజ స్థాపనే ధ్యేయంగా జీవించి, పోరాడి, అమరుడైన విద్యార్థి ఉద్యమ నాయకుడు జార్జిరెడ్డిపై ఈ సినిమాను తీస్తున్నది జీవన్‌రెడ్డి (‘దళం’ఫేమ్). జార్జిరెడ్డిగా నటిస్తున్నది సందీప్ మాధవ్ (‘వంగవీటి’ ఫేమ్). ఇది హిట్ కొట్టేలా కనిపిస్తోంది. కొట్టాలి.
విద్యార్థి ఉద్యమ నిర్మాత
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1970వ దశాబ్దారంభంలో ప్రగతిశీల విద్యార్థి ఉద్యమ నిర్మాణానికి జార్జిరెడ్డి రాజకీయ పునాదులు వేశాడు. ఆ క్రమంలోనే 1972లో 25 ఏళ్ల వయసులో క్యాంపస్‌లోని ఇంజినీరింగ్ కాలేజ్ హాస్టల్ బయట ప్రత్యర్థి శక్తుల చేతుల్లో హత్యకు గురయ్యాడు. ఓయూ క్యాంపస్‌లో సామాజికంగా అట్టడుగు విద్యార్థులను చైతన్య పరచిన చరిత్ర జార్జిరెడ్డిది.
Comments
Please login to add a commentAdd a comment