సాక్షి, హైదరాబాద్: అడుగు పెట్టిన స్వల్ప కాలంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన పేజీ రాసుకున్న యువ హీరో సందీప్ మాధవ్. ఏ కొత్త నటుడికీ రాని విధంగా వరుస బయోపిక్స్‌లో నటించిన ఘనత ఈ యువ నటుడికే దక్కింది. నిజ జీవిత పాత్రలను తెరపై పండించడం, ప్రేక్షకుల్ని మెప్పించడం అంత సులువైన పనికాదు. వంగవీటి, జార్జ్‌రెడ్డి సినిమాల ద్వారా దాన్ని సుసాధ్యం చేసిన సందీప్ (సాండీ) బయోపిక్స్ రూపొందించాలనుకుంటున్న పలువురు నిర్మాతలకు ఆశాదీపంగా మారాడు.. ‘సాక్షి’తో తన మనోభావాలను సందీప్ ఇలా పంచుకున్నాడు.. ఆ విశేషాలు తన మాటల్లోనే..
సినిమా కుటుంబంలో ఒక భాగం అవ్వాలనే ఆశతో, ఆశయంతో వచ్చిన సగటు సినిమా ప్రేమికుడ్ని నేను. పుట్టింది ఎక్కడైనా, పెరిగిందంతా.. చదువంతా ఈ సిటీలోనే. చదువైన తర్వాత ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా జాబ్ చేస్తున్నా కానీ మనసంతా సినిమానే. స్టేజ్ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పటి కల కావడంతో సినిమా ప్రయత్నాలు కొనసాగిస్తూ వచ్చా. అందులో భాగంగానే పూరి జగన్నాథ్ ‘జ్యోతిలక్ష్మీ’ సినిమా ఆడిషన్స్‌లో అవకాశం వచ్చింది. అప్పటికే ఒక సినిమాలో చేసినప్పటికీ నా సినిమా ఆశలకు కొత్త ఊపిరి వచ్చింది అక్కడే..
లీడ్‌రోల్ చేసే అవకాశం
పూరి దగ్గరకు రాకపోకలు సాగిస్తున్న సమయంలోనే నన్ను చూసిన రామ్‌గోపాల్ వర్మకి తానెప్పటి నుంచో తీయాలనుకుంటున్న వంగవీటి సినిమాలో వంగవీటి రంగా పాత్రధారి నాలో కనపడ్డాడు. దాంతో ఆ సినిమాలో లీడ్‌రోల్ చేసే అవకాశం వచ్చింది. సుప్రసిద్ధ రామ్‌గోపాల్ వర్మ దర్శకుడు, అందులోనూ నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న పవర్‌ఫుల్ స్టోరీ కాబట్టి సినిమాలో నేను కాకుండా క్యారెక్టర్ మాత్రమే కనిపించేలా ఆహార్యం, హావభావాలను కనపడేందుకు బాగా కష్టపడి ప్రాక్టీస్ చేశా. దానికి తగిన ఫలితం విమర్శకుల ప్రశంసల రూపంలో దక్కింది.
చార్జ్ చేసిన జార్జ్..
వంగవీటి ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో మరింత మంచి పాత్రలు చేయాలనే ఆసక్తి ఏర్పడింది. వంగవీటి తర్వాత దాదాపు 50 కథల వరకు విన్నాను. ఆ సమయంలోనే జార్జిరెడ్డి కథ విన్న వెంటనే ఓకే చేశాను.. నన్ను అత్యంత ప్రభావితం చేసిన బయోపిక్ అది. పైగా ఛాలెంజింగ్ రోల్, జార్జిరెడ్డి అనేది ఈ తరానికి తెలియని రియల్ హీరో చరిత్ర. దాన్ని తెరపైకి తీసుకురావాలంటే గట్స్ ఉండాలి. అవన్నీ నాకు దర్శకుడిలో కనిపించాయి. కథని ఎంత నమ్ముతానో కథని సినిమాగా మలిచే దర్శకుడిని అంతకన్నా ఎక్కువ నమ్ముతా. దాన్ని ప్రజెంట్ చేయడంలో మంచి క్లారిటీ ఉన్న దర్శకుడు తను. గతం మరిచిన కథని తట్టిలేపుతున్నామని కాస్త ఆలోచన వచ్చినా ప్రేక్షకులు ‘సినిమాని సినిమాగానే చూస్తారన్న’ ప్రగాఢ నమ్మకం నాది. ఈ విషయంలో నేను తీసుకున్న నిర్ణయం నన్ను గెలిపించింది.
కొత్త సాండీని చూస్తారిక..
చేసిన రెండు సినిమాలు వివాదాస్పద కథలే అయినప్పటికీ వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. ప్రస్తుతం మరో రెండు సినిమాలు చేస్తున్నాను. ఇవి నా నటనలోని మరో కోణాన్ని చూపించడానికి ఎంచుకున్న సినిమాలు. ఒకటి కామెడీ, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌తో అందరినీ అలరిస్తుంది. మరోటి పవర్‌ఫుల్ ఆర్మీ క్యారెక్టర్. నాకెప్పుడూ సమాజంపై అభిమానం, ఆరాధనా భావం ఉంటుంది. ఎలాంటి సినిమా చేసినా సమాజ శ్రేయస్సుకు దోహద పడే అంశం దానిలో ఉండేలా చూసుకుంటా. నేనెప్పుడూ స్టార్‌గా ఫీలవ్వను. కమర్షియల్ సినిమాలు చేస్తూనే తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమాలు, సైంటిఫిక్ కథాంశంతో కూడిన సినిమాల్లో చేయాలనుంది. ఏలియన్స్, గెలాక్సి తదితర ఆసక్తికర అంశాలతో ఉన్న సినిమాలంటే ఇష్టం.
కరోనాపై పరిశ్రమ గెలిచింది..
కళపై ఆసక్తి ప్రతిభ ఉండాలే కానీ అవకాశాలకు కొదువ లేదు మన దగ్గర. కరోనా ఇండస్ట్రీని దెబ్బతీసినా కొత్త అవకావాలను సృష్టించుకోవడంలో సినిమా ఇండస్ట్రీనే గెలిచింది. నిజానికి ఇప్పుడు ఎవరూ ఖాళీ లేరు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు వచ్చాక చాలా ప్రాజెక్ట్‌లు పెరిగాయి, పని పెరిగింది. కష్టాల్లో ఉన్న సినిమా కార్మికులకు ఇది కల్పతరువుగా మారింది. దీనికి స్టార్‌డమ్‌తో పనిలేదు కాబట్టి ప్రతిభ ఉన్న ప్రతివారికీ అవకాశాలు దక్కుతాయి.
Comments
Please login to add a commentAdd a comment