సినిమా మొదలైనప్పటి నుంచి.. పూర్తయ్యే దాకా దర్శకులు నిర్మాతలు ఎన్నో ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. టైటిల్, స్టోరీ, లేదా నటీనటుల ఏదో ఒక సందర్భాల్లో అడ్డంకులు ఎదురవుతూనే ఉంటాయి.. ఇక ఈ మధ్యకాలంలో ఇలాంటి వివాదాలు ఎక్కువయ్యాయి. సినిమా ప్రారంభం నుంచి థియేటర్లోకి వచ్చే వరకు అడుగడుగునా ఆటంకాలతో చిత్ర నిర్మాతలు తలబాదుకుంటున్నారు. ఏదైనా చిత్రం విడుదలకు ముందు ఈ వివాదం బాగా నడుస్తోంది. టాలీవుడ్, కోలీవుడ్ ఇలా ప్రతి ఇండస్ట్రీలోనూ కాంట్రవర్సరీలు కొనసాగుతున్నాయి. వీటికి అనేక కారణాలు ఉన్నాయి. కథను కాపీ కొట్టడం, సినిమా పేర్లను కాపీ కొట్టడం.. వివాదాస్పదమైన పేర్లు పెట్టడం.. సినిమా అంతా పూర్తి అయ్యాక సెన్సార్‌షిప్ సర్టిఫికెట్ వివాదం. ఇలాంటి కారణాలు తెలుగు చిత్ర సీమను ఈ ఏడాది విమర్శల్లో నెట్టాయి.. మరీ వాటి విశేషాలెంటో ఓసారి చుద్దాం
రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా అది ఓ సంచలనం అవుతుంది. వర్మ సినిమా చేస్తున్నాడు అంటే అప్పటి నుంచే ఏం చేయబోతున్నాడు. ఎలాంటి సినిమా చేయబోతున్నాడు. సినిమా టైటిల్ ఏం పెట్టబోతున్నాడు అనే దాని చుట్టూనే మొదటగా అందరూ ఆలోచిస్తారు. అలా ఈ సంవత్సరం విమర్శల్లో కేంద్ర బిందువులా మారాడు వర్మ. ఆయన చేసిన రెండు సినిమాలు వివాదాల్లో నిలిచాయి.
లక్ష్మీస్ ఎన్టీఆర్
రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఆది నుంచి వివాదాలను మూటగట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన ఘటనలను తీసుకొని లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో సినిమాను తెరకెక్కించాడు వర్మ. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మి పార్వతి ప్రవేశించాక జరిగిన సంఘటనల చుట్టూ సినిమా తిరుగుతుంది. బాలయ్య నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్‌కు కౌంటర్‌గా వర్మ ఈ మూవీ, రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. నిజానికి ఎన్టీఆర్ కథానాయకుడు విడుదలైనపుడు కూడా ఇంతగా చర్చ జరగలేదు కానీ వర్మ మాత్రం సంచలనాలకు తెరతీసాడు. ఈ సినిమా విడుదలను ఆపాలని కొందరు ఈసీకి ఫిర్యాదు చేయగా విడుదలను అడ్డుకోలేమని తొలుత ప్రకటించింది. అయితే, ఏపీ హైకోర్టు మాత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలపై స్టే విధించింది. దీంతో నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అక్కడ కూడా వారికి చుక్కెదరయ్యింది. కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా సినిమా ప్రదర్శన నిలిపివేయాలని ఆదేశించడంతో ఏపీలో విడుదల కాలేదు. తెలంగాణలో మాత్రం ఈ చిత్రాన్ని మార్చి 29 న విడుదల చేశారు. కానీ, ఏపీలో మే 1న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రకటించారు. కొన్ని రాజకీయ పార్టీల ఒత్తిడి కారణంగా ఆంధ్రప్రదేశ్ లో సినిమా రిలీజ్ కాలేదు.
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అలియాస్ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు
రాంగోపాల్‌వర్మ తీసే ప్రతీ సినిమాతో ఏదో ఒక కాంట్రవర్సీ సృష్టిస్తాడు. కొన్నాళ్ళ క్రితం లక్ష్మీస్ ఎన్టీఆర్ తో పెను దుమారం రేపిన విషయం తెలిసిందే. తాజాగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా టైటిల్తో ఇంకొక వివాదాన్ని రాజేసాడు. ఈ సినిమా రాజకీయంగాను, కొన్ని వర్గాల పార్టీ నేతలలో ఆందోళన కలిగేలా చేసింది. ఏపీలో ప్రముఖ రాజకీయ నాయకులను కించపరిచేలా, వారి హోదాను దిగజార్చేలా సినిమా ఉందన్నకారణంతో పెద్ద ఎత్తు విమర్శలు వెల్లువెత్తాయి. 2019 ఎన్నికల తరువాత జరిగిన పరిణామాలను ఆధారంగా తీసుకుని ఈ సినిమాను రూపొందిన విషయం విదితమే. ఈ చిత్రం పట్ల ఏపీలో చాలామంది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ కేఏ పాల్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సినిమాలో తన పాత్రను అవమానపరిచే విధంగా చూపించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో హైకోర్టు పేరు మార్చాలని సూచంచడంతో కమ్మరాజ్యంలో కడప బిడ్డలు కాస్తా అమ్మ రాజ్యంలో కడప రెడ్లు అని పేరు మార్చారు. సినిమా టైటిల్ మార్చినప్పటికీ సెన్సార్ బోర్డు అనుమతి లభించలేదు. దీంతో నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. ఈ విషయంపై స్పందించిన కోర్టు వారం రోజుల్లో సినిమా చూసి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని ఆదేశించింది. చివరికి డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వర్మ తన సెటైరికల్ కామెడీతో ప్రేక్షకులను నవ్వించాడు.
అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే ఇంకొక కాంట్రవర్సీకి తెరలేపాడు రామ్ గోపాల్ వర్మ. తాజాగా ఒక ప్రముక చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన తదుపరి సినిమా మెగా ఫ్యామిలీతోఅంటూ వివాదాల్లో నిలిచాడు. అది కాస్త 24 గంటలు కాకుండానే ఈ సినిమాను నేను తీయడం లేదని తేల్చి చెప్పాడు. తాను విన్న కధ 39 మంది పిల్లలున్న మెగా ఫామిలీ పై సినిమా తీయడం నావల్ల కాదని, తనకు చిన్నపిల్లలంటే ఇష్టముండదని అందుకే ఆ సినిమా చేయట్లదన్నాడు వర్మ. దీనిపై చిరంజీవి వర్మకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడని అందువల్ల వర్మ వెనక్కి తగ్గాడని టాలివుడ్ లో చర్చ నడుస్తుంది.
గద్దలకొండ గణేష్ అలియాస్ వాల్మీకీ
వివాదంగా మారిన మరో తెలుగు చిత్రం వాల్మీకీ. తమిళంలో విజయవంతమైన జిగార్తండను దర్శకుడు హరీష్ శంకర్ వరుణ్ తేజ్‌తో తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా టైటిల్ సమస్యనే ఎదుర్కొంది. వాల్మీకి అనే టైటిల్ ని పెట్టడమే కాకుండా టైటిల్ లోగో లో రివాల్వర్ ని యాడ్ చేయడంతో వాల్మికి కులస్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.. రివాల్వర్ పెట్టి వాల్మీకిల మనోభావాలను కించపరిచేలా చేశారని చిత్ర యూనిట్ పై మండిపడ్డారు. సినిమా పేరును మార్చాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో చివరి క్షణంలో గద్దలకొండ గణేష్‌గా పేరు మార్చి సెప్టెంబర్ 13న విడుదల చేశారు. వరుణ్ తేజ్ తన సింగిల్ క్యారెక్టర్‌తోనే సినిమాను పండించాడు. ఈ సినిమా యాక్షన్, కామెడీ పరంగా మంచి హిట్‌ను సాధించింది.
జార్జి రెడ్డి
తెలుగులో వివాదస్పదమైన మరో చిత్రం జార్జి రెడ్డి. 1970లో హైదరాబాద్ ఉస్మానియా విశ్వ విద్యాలయంలో చదువుకుంటూ..రాజకీయ పంథాలో విద్యార్థి ఉద్యమాన్నినడిపిన నాయకుడు జార్జిరెడ్డి. ఆయన కథ ఆధారంగానే ఈ మూవీ తెరకెక్కించారు. జార్జిరెడ్డి 1972 ఏప్రిల్ 14న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కాలేజీలో హత్యకు గురయ్యాడు. ఆయన సిద్దాంతాలను వ్యతిరేకించే రైట్ వింగ్ విద్యార్థి సంఘం ఆయన్ను హత్య చేసి ఉంటారని ఆరోపనలు ఉన్నాయి. అయితే సినిమాలో కేవలం జార్జిరెడ్డి నడిపి ఉద్యయాన్ని, ఆయన హీరోయిజాన్ని చూపించడంతో రైట్ వింగ్ రాజకీయాలు నడిపేవారు అభ్యంతరం వ్యక్తం చేశారు. జార్జిరెడ్డి సిద్దాంతాలను తెరకెక్కించే సందర్భంలో తమను తప్పుగా చూపే ఎలిమెంట్స్ ఉంటాయని ఏబీవీపీ కార్యకర్తలు సినిమాకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. జార్జిరెడ్డిపై దాదాపు 15 క్రిమినల్ కేసులున్నాయని, ఆయన రౌడీయిజాన్ని కూడా చూపించాలంటూ వారు డిమాండ్ చేశారు. సినిమాలో ఏక పక్షంగా ఏబీవీపీ విద్యార్థులనే టార్గెట్ చేసి లేనివి ఉన్నట్లు చూపిస్తే సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించారు. అయితే ఎట్టకేలకు నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మా(మూవీ ఆర్టిస్టు అసోసియేషన్)
అలాగే సినిమా వివాదాలతో ఈ ఏడాది మరో వివాదం తెరమీదకు వచ్చింది. అదే మా అసోసియేషన్. ఇది రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. దీంతో మా ఒక్కసారిగా వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. మా లో ఇటీవల జరిగిన ఎన్నికలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. నరేష్ ప్యానల్, శివాజీ రాజా ప్యానల్ ఎన్నికల్లో పోటీ చేయగా అనూహ్యంగా నరేష్ ప్యానల్ విజయం సాధించడంతో కమిటీపై ఆరోపణలు వచ్చాయి. అనంతరం ఒకే ప్యానల్ నుంచి పోటీ చేసిన నరేష్, జీవితా రాజశేఖర్ మధ్య వివాదం రాజుకుంది. అధ్యక్షుడు నరేష్ లేకుండానే ఎక్జిక్యూటివ్ ప్రెసిడెంట్ రాజశేఖర్, సెక్రటరీ జీవితలు జనరల్ బాడీ మీటింగ్‌ను నిర్వహించారు. అత్యవసర సమావేశం జరుగుతుంది అంటూ సభ్యులకు మెసేజ్ చేయటంలో అంతా హజరయ్యారు. అయితే ఈ మీటింగ్‌పై మా అధ్యక్షుడు నరేష్‌కు సమాచారం లేకపోవటంతో అధ్యక్షుడికి తెలియకుండా మీటింగ్ ఎలా నిర్వహిస్తారంటూ జీవిత రాజశేఖర్‌లను ప్రశ్నించాడు. ఇక అయితే ఈ విషయంపై స్పదించిన రాజశేఖర్, జీవితలు ఇది ఫ్రెండ్లీ మీటింగ్ మాత్రమే.. కోర్టు ఆదేశాల ప్రకారం ఏర్పాటు చేసిన జనరల్ బాడీ మీటింగ్ కాదన్నారు. ఈ మీటింగ్‌లో గత తొమ్మిది నెలలో అధ్యక్షుడిగా నరేష్ తీసుకున్న నిర్ణయాలపై చర్చిస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా నరేష్, జీవిత రాజశేఖర్‌ల మధ్య వివాదాలు జరగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే నరేష్‌కు రాజశేఖర్ తన వర్గంతో కలిసి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ పంచాయితీ కాస్తా మెగాస్టార్ చిరంజీవి దాకా చేరడంతో ఆయన నరేష్‌వైపే ఉన్నట్లు సమాచారం
ఇక ఇవేనండి ఈ ఏడాది కాంట్రవర్సీలాగా మారిన టాలీవుడ్ సినిమాలు. పలు సినిమాలపై వివాదాలు అయితే వచ్చాయి గానీ.. ఇలాంటి వివాదాలను లెక్క చేయకుండా ప్రేక్షకులు ఈ సినిమాలను ఆదరించారు. సినిమాలో కంటెంట్ ఉంటేనే ఏ మూవీ అయినా హిట్ కొడుతుందని ప్రేక్షకులు వాదిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment