George Reddy Movie Review, in Telugu | Rating (2.75/5) | ‘జార్జి రెడ్డి’ మూవీ రివ్యూ | Sandeep Madhav - Sakshi
Sakshi News home page

‘జార్జి రెడ్డి’ మూవీ రివ్యూ

Published Fri, Nov 22 2019 3:52 AM | Last Updated on Wed, Dec 25 2019 2:48 PM

George Reddy Telugu Movie Review And Rating - Sakshi

మూవీ: జార్జి రెడ్డి
జానర్‌: బయోపిక్‌
తారాగణం: సందీప్‌ మాధవ్‌, సత్య దేవ్, మనోజ్‌ నందన్, చైతన్య కృష్ణ, వినయ్‌ వర్మ, అభయ్‌, ముస్కాన్, మహాతి
దర్శకత్వం: జీవన్‌ రెడ్డి
సంగీతం: సురేష్‌ బొబ్బిలి
నిర్మాత: అప్పిరెడ్డి

ప్రస్తుతం టాలీవుడ్‌లో చరిత్ర మరిచిపోయిన వీరుల కథల ట్రెండ్‌ నడుస్తోంది. ఇప్పటికే తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం విజయం సాధించింది. ప్రస్తుతం ఆదే కోవలో దశాబ్ధాల క్రితం విద్యార్థి విప్లవోద్యమ నాయకుడుగా చరిత్రలో నిలిచిపోయి ఆ తర్వాత మరిచిపోయిన వీరుడి కథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ‘జార్జిరెడ్డి’. సినిమా ఆరంభం నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి అందరి మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ‘జార్జిరెడ్డి’ జీవిత కథను తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడా? అసలు జార్జిరెడ్డి కథేంటి? చూద్దాం. 

కథ: 
‘అమ్మ ఈయన ఎవరు.. భగత్‌ సింగ్‌. ఎక్కడున్నారు? చంపేశారు. మళ్లీ రారా?. చావు ఒక్కసారే వస్తుంది’ జార్జిరెడ్డి చిన్నప్పుడు తన తల్లితో జరిపిన సంభాషణలు. చిన్నప్పట్నుంచే భగత్‌ సింగ్‌, చెగువేరా పుస్తకాలు చదవడంతో జార్జిరెడ్డికి చైతన్యంతో పాటు కాస్త ఆవేశం ఎక్కువగా ఉంటుంది. తన ముందు అన్యాయం కనిపించినా.. కులం, మతం పేరుతో ఎవరినైనా దూషించినా తట్టుకోలేడు. తెగిస్తాడు. పోరాడతాడు. కత్తిపోట్లు పడినా.. శత్రువులు చంపడానికి వచ్చినా ధైర్యంతో నిలబడి చివరి శ్వాస వరకు నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాడు. తనను నమ్ముకున్న వారికోసం చివరి వరకు పోరాడాడు. 

జార్జిరెడ్డి పుట్టుక కేరళ.. చదివింది బెంగళూరు, చెన్నైలలో.. విద్యార్థి నాయకుడిగా ఎదిగింది హైదరాబాద్‌లోని ఓ విశ్వవిద్యాలయంలో. జార్జిరెడ్డి (సందీప్‌ మాధవ్‌) చిన్నప్పట్నుంచే చదువులో చురుకుగా ఉండేవాడు. ప్రతీ విషయం శోధించి తెలుసుకోవాలనుకుంటాడు. చదువు, విజ్ఞానంతో పాటు కత్తిసాము, కర్రసాము, బాక్సింగ్‌లో ప్రావీణ్యం పొందాడు. తల్లి(దేవిక) తోడ్పాటు, సహకారంతో జార్జిరెడ్డి అన్ని రంగాల్లో రాటుదేలుతాడు. అయితే ఉన్నత విద్య కోసం యూనివర్సిటీకి రావడంతో అతడి జీవతం పూర్తిగా మారిపోతుంది. అతడి మేధోసంపత్తికి ఆశ్చర్యపడి ఎన్నో ప్రముఖ యూనివర్సిటీలు ఆహ్వానం పలికినా పలు కారణాలతో తిరస్కరిస్తాడు.  
  

అయితే యూనివర్సిటీలో మాయ(ముస్కాన్‌), దస్తగిరి(పవన్‌), రాజన్న(అభయ్‌)లతో జార్జిరెడ్డికి ఏర్పడిన పరిచయం ఎక్కడి వరకు తీసుకెళ్తుంది? అతడు ఎందుకు యూనివర్సిటీ, సమాజం కోసం పోరాడతాడు? ఓ సమయంలో సొసైటీకి వ్యతిరేకంగా ఎందుకు పోరాడతాడు? ఈ పోరాటంలో సత్య(సత్యదేవ్‌), అర్జున్‌(మనోజ్‌ నందం)లతో అతడికి ఏర్పడిన సమస్యలు ఏమిటి? తన పోరాటంలో జార్జిరెడ్డి విజయం సాధించాడా? ఎందుకు హత్యకు గురవుతాడు? ఇంతకి జార్జిరెడ్డిని ఎవరు హత్య చేస్తారు? అనేదే మిగతా కథ.

నటీనటులు:
‘వంగవీటి’తో నటుడిగా తనేంటో నిరూపించుకున్న సందీప్‌ మాధవ్‌ ఈ సినిమాలోనూ వందకు వంద మార్కులు సాధించాడు. బాడీ లాంగ్వేజ్‌, దుస్తులు, నడవడిక అచ్చం జార్జిరెడ్డిని తలపించేలా చేశాడు. పలుచోట్ల జార్జిరెడ్డే కళ్ల ముందే నిలుచున్నట్లు అనిపిస్తుంది. ఇక తల్లి పాత్రలో మరాఠీ నటి దేవిక జీవించిందనే చెప్పాలి. హీరోయిన్‌ ముస్కాన్‌ తన క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో మెప్పించింది. ఇక అభయ్‌, యాదమరాజు, పవన్‌, సత్యదేవ్‌, మనోజ్‌ నందం తదితర నటులు తమ పరిధి మేరకు మెప్పించారు. ముఖ్యంగా అభయ్‌, యాదమరాజు తన పెర్ఫార్మెన్స్‌తో హీరోకు పోటీగా నిలవడం విశేషం. 


విశ్లేషణ
‘దళం’ సినిమాతో విభిన్నమైన దర్శకుడిగా పేరుతెచ్చుకున్న జీవన్ రెడ్డి.. ఆదర్శనీయమైన విద్యార్థి నేత జీవితం వెండితెరపై ఆవిష్కరించాలని దర్శకుడు చేసిన ధైర్యానికి సెల్యూట్‌ చేయాల్సిందే. ఎందుకంటే ఈ కథలో ఎన్నో సున్నితమైన అంశాలు ఉన్నాయి. ఎవరి మనోభావాలు కించపరచకుండా చక్కగా ప్రజెంట్‌ చేయాలి. అలాగే జార్జిరెడ్డి అసలు కథ డీవియేట్‌ కాకుండా కమర్షియల్‌ అంశాలను జోడించాలి. ఈ విషయంలో దర్శకుడు విజయవంతం అయ్యాడు. యూనివర్సిటీ రాజకీయాలు, నేతలు, పార్టీల పేర్లను ఎక్కడా ప్రస్తావించకుండా డైరెక్టర్‌ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. 

కథేంటనే ఉత్సుకతో ప్రేక్షకులు సీట్లలో కూర్చోని సర్దుకునే లోపే నేరుగా కథ ప్రారంభమవుతుంది. ఆరంభం నుంచే నెక్ట్స్‌ ఏదో జరగబోతోంది అని ఆసక్తిగా ఎదురు చూడటం.. క్యారెక్టర్ల పరిచయం.. రెండు మూడు చోట్ల హీరో సూపర్బ్‌ ఎలివేషన్‌తో తొలి అర్థభాగం ముగుస్తుంది. ఇక రెండో అర్థభాగం వచ్చే సరికి డైరెక్టర్‌ కాస్త తడబడ్డాడు. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ జోడించాలనే ఉద్దేశంతో కథను కాస్త డీవియేట్‌ అయినట్టుగా అనిపిస్తుంది. కొన్ని చోట్ల సీన్లు అతికించినట్టుగా కనిపించడం, పవర్‌ ఫుల్‌ డైలాగ్‌ల కోసం అనేక చోట్ల ఇంగ్లీష్‌, హిందీ భాషను వాడటం రుచించలేదు. ఇలాంటి సినిమాలకు మాటలు ముఖ్యం. కానీ చాలా చోట్ల తేలిపోయినట్లు కనిపిస్తోంది. 

పలు చోట్ల తల్లి కొడుకుల సెంటిమెంట్‌, వారి మధ్య వచ్చే ఎమోషన్‌ సీన్స్‌ ప్రేక్షకుల హృదయాలను కదలించడం ఖాయం. ఇక హీరోయిన్‌ వన్‌ సైడ్‌ లవ్‌ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో మరో ప్రధాన అంశం సినిమాటో​గ్రఫి. కెమెరా పనితనం బాగుండటంతో ఆ కాలానికి వెళ్లిపోతాం. ఇక యాక్షన్‌ సీన్స్‌ కూడా కొత్తగా అనిపిస్తాయి. పాటలు సన్నివేశాలకు తగ్గట్టు బాగున్నాయి. లిరిక్స్‌ హృదయాలను కదిలించేలా ఉన్నాయి. ఎలాంటి గందరగోళం లేకుండా స్క్రీన్‌ ప్లే  చాలా చక్కగా ప్రజెంట్‌ చేశారు. ఆ కాలానికి తగ్గటు​ దుస్తులు, సెట్టింగ్స్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి.
      

ప్లస్‌ పాయింట్స్‌
సందీప్‌, అభయ్‌ నటన
ఎమోషన్స్‌, తల్లి సెంటిమెంట్‌
సినిమాటోగ్రఫీ

మైనస్‌ పాయింట్స్‌
సెకండాఫ్‌
స్లో నెరేషన్‌
మాటలు

-  సంతోష్ యాంసాని, సాక్షి వెబ్‌డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement