యోగేశ్వర్, అతిధి జంటగా నటించిన చిత్రం పరారీ. శ్రీ శంకర ఆర్ట్స్ పతాకంపై గాలి ప్రత్యూష సమర్పణలో జి.వి.వి.గిరి నిర్మించారు. సాయి శివాజీ దర్శకత్వం వహించాడు. లవ్ అండ్ క్రైం కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజు(మార్చి 30) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఆడియన్స్‌ను ఏ మాత్రం నవ్వించిందో చూద్దాం..
కథ
ఒకే కాలేజీలో చదువుకుంటున్న యోగి(యోగీశ్వర్), అతిథి(అతిథి) ప్రేమించుకుంటారు. హీరో తండ్రి(షయాజి షిండే) బడా వ్యాపారవేత్త కావడంతో చాలా తీరిక లేకుండా గడిపేస్తుంటారు. హీరోకి మరో ఇద్దరు స్నేహితులు(జబర్దస్త్ రఘు కారుమంచి, భూపాల్) ఉంటారు. అందులో భూపాల్ తన తోటి ఆర్టిస్ట్ శివాని సైనిని ప్రేమిస్తుంటారు. వీరు ఐదు మంది కలిసి అనుకోకుండా ఓ మర్డర్ మిస్టరీలో ఇరుక్కుంటారు. దాని నుంచి తప్పించుకోవడానికి అనేక రకాల ఇబ్బందులు పడుతుంటారు. అదే సమయంలో యోగి తండ్రి పాండే(మకరంద్ దేశముఖ్ పాండే) కిడ్నాప్ అవుతాడు. మరి యోగి... మర్డర్ మిస్టరీ నుంచి ఎలా బయటపడ్డారు? కిడ్నాప్‌కు గురైన తన తండ్రిని ఎలా విడిపించుకున్నాడు? అతిథితో ప్రేమాయణానికి శుభం కార్డు పడిందా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
కథ... కథనం విశ్లషణ
లవ్ క్రైం కామెడీ థ్రిల్లర్ మూవీస్ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. దానికి కావాల్సిన స్క్రీన్ ప్లేను గ్రిప్పింగ్‌గా రాసుకుంటే చాలు. ఆడియన్స్‌ను థియేటర్‌లో రెండున్నర గంటల పాటు హాయిగా నవ్వుకునేలా కూర్చోబెట్టవచ్చు. దర్శకుడు సాయి శివాజీ ఈ చిత్రానికి ‘రన్ ఫర్ ఫన్’ అనే క్యాచీ ట్యాగ్ లైన్ పెట్టి... ఈ సినిమాలో హీరో అండ్ బ్యాచ్‌ను ఇంటర్వల్ నుంచి పరుగులు పెట్టిస్తుంటాడు. దానిని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంటర్వల్ బ్యాంగ్ వరకు సరదాగా కాలేజీ లైఫ్.. ఆ తరువాత అత్తాపురం ఎపిసోడ్‌తో కొంత అడల్ట్ కామెడీతో ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేశాడు. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ట్విస్ట్ ఇచ్చి సెకండాఫ్‌పై మర్డర్ మిస్టరీతో సినిమాని పరుగులు పెట్టించాడు. క్లైమాక్స్ సీన్ బాగుంది. మకరంద్ దేశ్ ముఖ్ పాండే అండ్ బ్యాచ్ తో కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ నవ్వు తెప్పిస్తాయి.
హీరో యోగీశ్వర్ కొత్త కుర్రాడైనా... బాగా నటించాడు. హీరోయిన్ అతిథి పాత్ర పర్వాలేదనిపిస్తుంది. హీరోతో పాటు చేసిన భూపాల్ పాత్ర కూడా ఒకే. అతనికి జోడీగా నటించిన శివాని సైని పాత్ర గ్లామర్‌తో ఆకట్టుకుంటుంది. జబర్దస్త్ రఘు కారుమంచి... తన కామెడీ టైమింగ్‌తో చాలా చోట్ల నవ్వించే ప్రయత్నం చేశాడు. ఆలీ ఇందులో ఉన్నా సైలెంట్‌గానే ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. పోలీస్ అధికారి పాత్రలో సుమన్, హీరో తండ్రిగా షాయాజీ షిండే పర్ఫెక్ట్‌గా సూటయ్యారు. బాలీవుడ్ నటుడు, థియేటర్ ఆర్టిస్ట్ మకరంద్ దేశ్ ముఖ్ పాండే... అమ్మాయిలను కిడ్నాప్ చేసి... వ్యభిచారం రొంపిలోకి దింపే కామెడీ విలన్ పాత్రలో బాగా చేశాడు. విలన్ శ్రవణ్ కాసేపే ఉన్నా... తన పాత్ర పరిధి మేరకు నటించాడు.
దర్శకుడు సాయి శివాజీ సినిమా ఆద్యంతం నవ్వించారు, కానీ కొన్నిచోట్ల అనవసర సన్నివేశాలు బలవంతంగా జోడించినట్లు అనిపిస్తుంది. గరుడ వేగ అంజి అందించిన సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. చక్రి తమ్ముడు మహిత్ నారాయణ్ అందించిన సంగీతం పర్వాలేదు. రామజోగయ్య శాస్త్రి, భాస్కర భట్ల, మహిత్ నారాయణ్ రాసిన లిరిక్స్ మాసీగా ఉన్నాయి. దివంగత సీనియర్ ఎడిటర్ గౌతం రాజు ఎడిటింగ్ చాలా బాగుంది. నిర్మాణ విలువలు పర్వాలేదనిపించాయి.
Comments
Please login to add a commentAdd a comment