భారతదేశ చరిత్రలో ఏప్రిల్ 14 ఒక మైలురాయి వంటిది. సమాజంలో మార్పు కోసం, సమాజ అభివృద్ధి కోసం మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రీబాయి ఫూలే, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, బాబూ జగ్జీవన్‌రామ్ వంటి ఎందరో మహనీయులు తమ జీవితాలను త్యాగం చేశారు. ఆ కోవకు చెందినవారే అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి ఏప్రిల్ 14. ఈ తేదీకే ఇంకో ప్రాముఖ్యం కూడా ఉంది.
యూనివర్సిటీలలోనే సమాజం మార్పుకు నాంది పడాలని విద్యార్థులను చైతన్య పరచిన విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి అమర వీరుడైన రోజు కూడా ఇదే! ఇద్దరి ఆశయం సమాజంలోని అసమానతల్ని నిర్మూలించడమే! అంతరాలు లేని మానవీయ సమాజాన్ని నిర్మించడమే! ప్రయాణించిన మార్గాలు వేరైనా, ఇద్దరూ అడుగడుగునా సమాజ హితం కోసం పోరాడిన వారే! అందుకే ఈ రోజుకు ఇంత ప్రాధాన్యం. చరిత్రపుటల్లో ఇంతటి ప్రత్యేక స్థానం.
సమాజంలోని కుల వివక్ష, అంటరాని తనం నిర్మూలనకు అహోరాత్రులు శ్రమించి బడుగు బలహీన వర్గాలకు సమన్యాయం జరిగేందుకు అవసరమైన హక్కులను భారత రాజ్యాంగంలో పొందుపరిచినవారు అంబేడ్కర్. స్వతంత్ర భారతంలో సామాన్య ప్రజలకు స్వేచ్ఛా ఫలాలు అందకుండా పోతున్న సమయంలో సమాజంలోని అపసవ్య ధోరణులను అధ్యయనం చేస్తూ లాటిన్ అమెరికా దేశాల విప్లవ వీరుడు చేగువేరా స్ఫూర్తిగా యూనివర్సిటీలలోనే సమాజ మార్పుకు నాంది పడాలని విద్యార్థులను చైతన్య పరిచే పోరాటంలో మతోన్మాదుల చేతిలో బలి అయిన ఉస్మానియా అరుణతార జార్జిరెడ్డి.
నేటి ‘ప్రగతిశీల ప్రజా స్వామిక విద్యార్థి సంఘం’ (పీడీఎస్‌యూ) స్థాపక కారకులు జార్జి రెడ్డి అమరుడైన రోజు, సామాజిక న్యాయం కోసం పరితపించిన రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జన్మదినం ఒకే రోజు కావడం యాదృచ్ఛికమే అయి నప్పటికీ.. స్ఫూర్తి చేతనలను ప్రేరేపించే ఒక ప్రత్యేక సందర్భం ఇది. అంబేడ్కర్ సమసమాజ స్థాపన కోసం పాటు పడితే, జార్జిరెడ్డి సామాజిక న్యాయం కోసం పోరాడిన విప్లవ వీరుడు. అంబే డ్కర్ ఒక ధ్రువతార అయితే, జార్జిరెడ్డి ఒక అరుణతార. ఇద్దరూ చరిత్రపుటల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పచుకున్న వారే. ప్రజల గుండెల్లో నిలిచి పోయినవారే.
ఇద్దరి ఆశయాలు సమాజంలోని సమా నత కోసమే, అంతరాలు లేని మానవీయ సమాజం కోసమే. ఇద్దరూ ప్రపంచ స్థాయి మేధావులే. ప్రజల బాగోగుల కోసం, సంక్షేమం కోసం వారి అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచించిన ఆలోచనాపరులే. సమాజ హితం కోసం అడుగడుగునా పోరాడిన వీర యోధులే.
ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నాలో ఒక సంఘర్షణను రేపుతుంది. ఒక సామాజిక విప్లవకారుని జననం, మరొక విప్లవకారుడు నేల కొరిగిన దినం! ఒకరిది పుట్టుక, ఒకరిది మరణం.
ఇద్దరినీ ఒకే రోజు స్మరించుకోవడం సంఘర్షణ కాదా? ‘సమీకరించు, బోధించు, పోరాడు’.. అన్న నినాదంతో చైతన్యం కోసం పాటుపడిన వారు ఒకరు; ‘జీనా హైతో మర్‌నా సీఖో... కదం కదం పర్ లడ్నా సీఖో’ అనే నినాదం ఇచ్చి విప్లవ ఆదర్శాలను అందించిన సాహసోపేతమైన శక్తి ఒకరు. పుట్టినవారు మరణించక తప్పదు అని తెలిసినా, ఆ ఆలోచనకు ఒకింత బాధ కలుగుతూనే ఉంటుంది. కానీ అమరత్వం రమ్యమైనది. మనిషి తన కోసమే పుట్టి తన కోసమే మరణించడం సహజం.
కానీ సమాజం కోసం, సమాజంలోని బాధితుల తరఫున గళమెత్తి, కలమెత్తి పోరాడి, పరుల కోసం మరణించడం రమ్యమైన అమరత్వం కాక మరేమవుతుంది? ఈ ఇద్దరు మహనీయులు కూడా ఉన్నత చదువులను అభ్యసించి ప్రతి క్షణం పేదవారి గురించే ఆలోచించి, ఏ మాత్రం స్వార్థం లేకుండా తమ అమూల్యమైన జీవితాలను ప్రజల కోసం త్యాగం చేశారు.
ఇరువురి దారులు వేరైనా అంతిమ లక్ష్యం ఒక్కటే... మతోన్మాద మనువాద సంస్కృతికి వ్యతిరేకంగా పోరాటం సాగించడం. ‘‘మతములన్నియు మాసిపోవును, జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును..’’ అని గురజాడ గారన్నట్లు జ్ఞానం ద్వారానే జీవితానికి వెలుగు అని, విద్య ద్వారానే అసమానతలు, అంతరాలు తొలగిపోతాయని ఇద్దరూ నమ్మారు. రిజర్వేషన్ ఫలాలు అందించి అణగారిన వర్గాలు విద్యాగంధానికి నోచుకునేలా అంబేడ్కర్ కృషి చేశారు.
కులం అణచివేతలు, కుల దురహంకార పీడనలు లేని ఆత్మ గౌరవ సమాజం కోసం పోరాడిన సాంఘిక విప్లవకారుడు అంబేడ్కర్. దోపిడీ, పీడన లేని సమసమాజాన్ని కలలుగన్న విప్లవ స్వాప్నిక కార్యశీలి జార్జిరెడ్డి. ఇద్దరి జీవితం ప్రస్తుత సమాజానికి ఆదర్శ ప్రాయం, అనుసరణీయం. ఒకరు బాధిత కులంలో పుట్టి అన్యాయాలను, అక్రమాలను, అవమానాలను భరించి... కుల ఆధిపత్యా నికి, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడడానికి తమ జాతిని, బాధితులను పీడితులను చైతన్య పరిచారు. మరొకరు మధ్యతరగతి వర్గంలో జన్మించి, సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉన్నప్పటికీ పేదల, శ్రామికవర్గ, గ్రామీణ కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థుల బాధలను అవగాహన పరచుకునేందుకు వారి స్థాయికి దిగి సాధారణ జీవితాన్ని అనుభవించిన విద్యార్థి.
1972లో కామ్రేడ్ జార్జిరెడ్డిని ‘సంఘ్ పరివార్’లోని కొన్ని మతో న్మాద హిందూత్వ శక్తులు హత్య చేశాయి. నాటి పరిస్థితులే నేటికీ సమాజంలో కనిపిస్తున్నాయి. అంతేకాదు, పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. నేడు కూడా మత మౌఢ్యాన్ని, మూఢనమ్మకా లను వ్యతిరేకిస్తూ ప్రజాస్వామిక భావాలను పెంపొందింప చేయడా నికి ప్రయత్నించిన, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించిన ప్రజా స్వామిక వాదులను కాల్చి చంపిన సందర్భాలు ఉన్నాయి. యూనివర్సిటీలలో అణగారిన వర్గాల విద్యార్థులు ఉన్నత స్థాయి పరి శోధనలు జరపడానికి లేకుండా వారిని అడ్డుకుంటూ, మానసిక క్షోభకు గురిచేసి బలవన్మరణానికి పాల్పడేలా ప్రేరేపించడం జరుగుతోంది.
అదే సమయంలో సమాజాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు పెరిగిపోతున్నాయి. విద్యను కాషాయీకరణ, వ్యాపారీకరణ చేసేందుకు ప్రభుత్వాలు ఆతురతను కనబరుస్తున్నాయి. అందుకే అన్న ట్లుగా ఆగమేఘాల మీద జాతీయ విద్యా విధానం ప్రవేశపెట్టి ప్రైవేటీకరణ విధానాలను ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టడం జరిగింది. ఆ విధానాలను సవరించాలని విద్యావేత్తలు, మేధావులు, ప్రజాస్వామిక వాదులు కోరినప్పటికీ వాటిని పెడచెవిన పెట్టి ఏకపక్షంగా బలవంతంగా అశాస్త్రీయ విద్యా విధానాన్ని అమలు చేయాలని ప్రయత్నించడం వల్ల బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు విద్యకు దూరమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి.
రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్, విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి ఆశించినట్టుగా ప్రజాస్వామిక, ప్రజాతంత్ర, శాస్త్రీయ విద్యా విధానం అమలు కావడం లేదు, అమలు చేసే పరిస్థితులు కూడా లేవు. అమలు చేయాలని అడిగే విద్యార్థిలోకం కూడా నేడు బలంగా లేదు. అయినా నిరుత్సాహ పడనవసరం లేదు. ప్రజాస్వామిక, మానవీయ విలువలు పెంపొంది ఆదర్శవంతమైన సమాజం రూపుదిద్దుకోవాలంటే అంబే డ్కర్, జార్జిరెడ్డిల ఆశయాలు నెరవేర్చే అవకాశం ప్రగతి శీలులందరికీ ఉంటుంది.
చదువే ఆయుధంగా ప్రపంచ మేధావిగా గుర్తింపు పొంది బడుగువర్గాల బాగోగుల కోసం నిరంతరం శ్రమిస్తూ అవిరళ కృషి చేసిన అంబేడ్కర్ జీవితాన్ని; అన్యాయాలకు అక్రమానికి వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేసే స్వభావం, తప్పులేనప్పుడు ఎవరినైనా ఎది రించే సత్తా, తోటి వారి కోసం తన ప్రాణాలను సైతం అర్పించే త్యాగగుణం, సమ సమాజం కోసం పరితపించే మనస్తత్వం గల జార్జిరెడ్డి పంథాను ఆదర్శంగా తీసుకుని అనుసరించాలి. జార్జిరెడ్డి ఆందోళన , పోరాటాలతోపాటు నిరంతర అధ్యయనశీలిగా గడిపారు.
పాతికేళ్ల జీవితంలో ప్రపంచ విప్లవాలను పట్టుదలతో పరిశీలించి విప్లవ మార్గాన్ని అనుసరించారు. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వంటి ప్రజ్ఞ కలిగిన అపర మేధావి అతడు. భౌతిక శాస్త్రంలో గోల్డ్ మెడల్ సాధించి స్కాలర్ అయిన జార్జి రెడ్డి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని, అంబేడ్కర్ ప్రబోధించిన విలువలతో నేటి యువత సామాజిక ప్రజా సమస్యల పట్ల అవగాహన పెంచుకోవాలి. శాస్త్రీయ విద్యా విధానం కోసం, ప్రజాతంత్ర విద్య కోసం పోరాడాలి. ఈ ఇద్దరు వీరులకు మనం ఇవ్వగలిగిన నిజమైన, ఘనమైన నివాళి ఇదే!
తండ సదానందం
వ్యాసకర్త టి.పి.టి.ఎఫ్. రాష్ట్ర కౌన్సిలర్
మొబైల్: 99895 84665
Comments
Please login to add a commentAdd a comment