‘ఈ ప్రపంచాన్ని జయించడానికి ప్రేమతో మొదలవ్వు. ప్రేమ త్యాగమై, యుద్ధ గీతమై, అదో గొప్ప పోరాటాన్ని విశ్వవ్యాప్తం చేస్తుంది. నిన్ను విజేతగా నిలబెడుతుంది’ అంటారు 71 ఏళ్ల సాహితీ వేత్త, దళితోద్యమ నాయకుడు డా‘‘ కత్తి పద్మారావు. ఆయన జీవితం – సాహిత్యం – ఉద్యమాలు వేర్వేరు కావు. పరిణామ క్రమంలో ప్రవాహ సదృశ్యంగా కొన సాగుతూ వచ్చిన, గుణవాచి అయిన కాల ధర్మం! అంబేడ్కర్ దార్శనికతనూ, తాత్వికతనూ, వివేచనా నిపుణతనూ ఆకళింపు చేసుకున్న ప్రథమ శ్రేణి ఆచరణ శీలుడాయన.
అంబేడ్కర్ మార్గంలో పూలే నుండి పెరియార్ మీదగా చార్వాకుడు, బుద్ధుని వరకూ... ఆ తరువాతి నవ్య సిద్ధాంతకర్తలనూ, చరిత్రకారులనూ పరి శీలించి ఆకలింపు చేసుకున్నారు. సంస్కృత పాండిత్యం వల్ల అపా రమైన అధ్యయనం, పరిశీలన, రచనా శక్తి అబ్బింది. జలపాతం సదృశ్యమైన వాక్చాతుర్యం, సమయ స్ఫూర్తి, ఉత్తేజ పరచటం, వాదనా పటిమలతో అత్యుత్తమ రీతిలో ప్రజ లకు చేరువయ్యారు. కారంచేడు, కొత్తకోట, నీరుకొండ, పిప్పర్ల బండ్ల పల్లి, చుండూరు, పదిరి కుప్పం, వేంపెంట, లక్షింపేట వంటి ఉద్యమాలలో నాయకునిగా నిలిచి, ప్రభుత్వాలతో పోరాడి, ప్రజాయుద్ధంతో విజ యాన్ని సాధించారు.
కారంచేడు, చుండూరు వంటి ఉద్యమాలలో బాధితుల పక్షాన నిలబడి వారికి వందల ఎకరాల భూములు ఇప్పించి, బాధిత కుటుంబాల పిల్లలకు ప్రభుత్వ సహాయం ఏర్పాటు చేసి, ఉద్యోగాలు ఇప్పించి, చిల్లిగవ్వ కూడా ప్రభుత్వ సొమ్ములను ఆశించకుండా నిజాయితీగా, నిబద్ధతతో తమ రచనలను నమ్ముకుని, అమ్ముకుని జీవనం సాగిస్తున్న అక్షర సంపన్ను లాయన. పార్లమెంటు సాక్షిగా 111 మంది ఎంపీలతో ‘1989 ప్రివెన్షన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ చట్టా’న్ని తీసుకు రాగలిగారు.
‘బౌద్ధ దర్శనం’, ‘చార్వాక దర్శనం’, ‘దళితుల చరిత్ర,’ ‘బ్రాహ్మణవాద మూలాలు’, ‘కులం ప్రత్యామ్నాయ సంస్కృతి’, ‘పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీ’, ‘భారత రాజకీయాలు – కులాధిపత్య రాజకీయం – ప్రత్యామ్నాయ వ్యక్తిత్వాలు’, ‘అంబేడ్కర్ చూపు’ వంటి 89 రచనలను అందించారు. ఆయన కుటుంబం అంతా కులాంతర వివాహాలు చేసుకున్నారు. స్వయంగా తన చేతుల మీదుగా కొన్ని వేల కులాంతర వివాహాలు జరిపించడం ద్వారా ఒక సామాజిక మార్పునకు మార్గదర్శిగా నిలిచారు.
మొత్తంగా ఆయన రచనల సారాంశం... ఉద్యమ రూపం, ప్రశ్న, ప్రతిఘటన, ప్రగతిగా సాగుతుంది. సమకాలీన రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక, సామా జిక రంగాల్లో కత్తి పద్మారావు పాత్ర ఎవరూ తిరస్కరింపలేనిది. – శిఖా ఆకాష్, నూజివీడు, 93815 22247 (రేపు డా. కత్తి పద్మారావు 71వ జన్మదినం సందర్భంగా...)
Comments
Please login to add a commentAdd a comment