‘‘జ్యోతిలక్ష్మి’ సినిమా తర్వాత కమెడియన్‌గా అవకాశాలు వస్తాయనుకున్నా. కానీ, రామ్‌గోపాల్ వర్మగారు ‘నిన్ను చూస్తుంటే వంగవీటి రాధలా ఉన్నావ్, ఓసారి ఈ లుక్స్ ట్రై చెయ్’ అన్నారు. అలా ‘వంగవీటి’ సినిమాలో వంగవీటి రాధగారి పాత్రలో నటించా’’ అని సందీప్ మాధవ్ అన్నారు. ‘దళం’ ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకత్వంలో సందీప్ మాధవ్ లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘జార్జ్ రెడ్డి’. సిల్లీ మంక్స్, త్రీ లైన్స్ సినిమా బ్యానర్లతో కలిసి మైక్ మూవీస్ అధినేత అప్పిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది.
ఈ సందర్భంగా సందీప్ మాధవ్ మాట్లాడుతూ – ‘‘వంగవీటి’ తర్వాత కొన్ని అవకాశాలు వచ్చాయి. అయితే చేయదగ్గ సినిమా అనిపించే స్థాయిలో ఏదీ కనెక్ట్ అవ్వలేదు. జీవన్‌గారు చెప్పిన ‘జార్జ్ రెడ్డి’ కథ చాలా బాగా నచ్చింది. ఇది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు జార్జ్ రెడ్డి పూర్తిస్థాయి బయోపిక్ అని చెప్పను. బేసిగ్గా ఆయన బాక్సర్, స్టూడెంట్ లీడర్ కాబట్టి.. విజువలైజేషన్‌లో హీరోయిజమ్ న్యాచురల్‌గానే ఉంటుంది. జార్జ్ రెడ్డి పాత్ర కోసం ఆయనకు సంబంధించిన ఆర్టికల్స్, బుక్స్, కొన్ని వీడియోస్ చూశాను. ఆయన క్లాస్‌మేట్స్‌ని, ఫ్రెండ్స్‌ని కొందరిని కలిసి ఆయన గురించి తెలుసుకున్నాను.
అలాగే ఫొటోలు, ఒక చోట ఆయన స్పీచ్ చూశాను. వాటిని బేస్ చేసుకునే ఈ పాత్రకి ప్రిపేర్ అయ్యాను. 1960 – 70 బ్యాక్‌డ్రాప్ కాబట్టి అప్పటి వాతావరణం సృష్టించే ప్రయత్నం చేశాం. సినిమాలో చూపించిన బైక్స్, సైకిల్స్ అప్పట్లో వాడినవే. 1960లో ఉస్మానియా యూనివర్సిటీ ఎలా ఉండేదో అలా సెట్ వేసి చిత్రీకరించాం. జార్జ్ రెడ్డి అంటే పవన్ కళ్యాణ్‌గారికి చాలా ఇష్టం. ఈ సినిమా ఆయన చేయాలనుకున్నారట.. అందుకే ఓ పాటని ఆయనకు అంకితమిచ్చాం. ఈ సినిమా వల్ల రెండేళ్లు గ్యాప్ వచ్చింది. చాలా సినిమాలు వదులుకున్నాను. అయితే ఈ కథ ముందు ఏదీ గొప్పగా అనిపించలేదు. ఈ సినిమా చూశాక ‘జార్జ్ రెడ్డి’ లాంటి గొప్ప మనిషిని మనం పోగొట్టుకున్నామా? అనే భావన తప్పకుండా వస్తుంది. ‘ఇస్రో’ లాంటి సంస్థలో అవకాశం వచ్చినా వదులుకున్నారాయన’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment