pdsu
-
బడ్జెట్ వేళ.. అసెంబ్లీ ముట్టడికి యత్నం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ముట్టడి యత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. విద్యార్థి విభాగం పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో కొందరు అసెంబ్లీ ముట్టడికి సోమవారం యత్నించారు. దీంతో అసెంబ్లీ ఆవరణలో, నాంపల్లి చుట్టుపక్కల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెండింగ్ స్కాలర్షిప్లు ఇవ్వాలని, బడ్జెట్లో విద్యాశాఖకు 30 శాతం నిధులు కేటాయించాలనే డిమాండ్‌తో వాళ్లు ఆందోళనకు దిగారు. ఈ తరుణంలో.. అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. పరిస్ధితిని అదుపులోకి తెచ్చారు. ఇదిలా ఉంటే.. పీడీఎస్‌యూ బయట ఆందోళన చేపట్టిన సమయంలోనే లోపల ఆర్థిక మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టి.. ప్రసంగించారు. ఈ బడ్జెట్లో విద్యా రంగానికి రూ. 19 వేల కోట్ల కేటాయించింది తెలంగాణ సర్కార్. -
PDSU: ‘ప్రగతిశీల’ శక్తులన్నీ ఒక్కటి కావాలి!
హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం కేంద్రంగా 1974లో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) ఏర్పడి మరో ఏడాదికి 50 ఏళ్లు నిండనున్నాయి. అసమానమైన పోరాటాలతో, త్యాగాలతో ఇరు రాష్ట్రాల ప్రజలపై పీడీఎస్‌యూ చూపిన ప్రభావం ఎవ్వరూ చెరపలేనిది. ఈ సంస్థకు రాష్ట్ర ఉపాధ్యక్షునిగా 1980 దశకం నాటికే నా ప్రత్యక్ష నిర్మాణ సంబంధం ముగిసిపోయింది. కానీ సోదరుడు కామ్రేడ్ కూర రాజన్న ద్వారా మా ఇంటి తలుపు తట్టిన అమరుడు కామ్రేడ్ జార్జిరెడ్డి జ్ఞాపకం, ఎంతోమంది గుండెల్ని రగిలించిన ఆయన ప్రస్థానం.. నేను పుట్టి పెరిగిన సిరిసిల్ల ప్రాంత రైతాంగ పోరాటాల వెల్లువతో పెనవేసుకుపోయింది. అదే విప్లవోద్యమంతో ముడిపడి పోయి రెండు తరాల విప్లవ విద్యార్థులతో నా ఇన్నేండ్ల ప్రయాణాన్ని నిర్దేశిస్తూ వస్తోంది. అందుకే నాకిది జ్ఞాపకం మూత్రమే కాదు, వర్తమాన నిజం. అలాంటి జ్ఞాపకాలన్నింటినీ తట్టిలేపుతూ, గతం–వర్తమాన పరిస్థితులను బేరీజు వేసుకుంటూ 2023 జనవరి 21న, పీడీఎస్‌యూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరగడం అపూర్వమనే భావించాలి. కామ్రేడ్ జార్జిరెడ్డి ఆధ్వర్యాన ఏర్పడిన పీడీఎస్‌యూ, ఆయన అమరుడైన ఏప్రిల్ 14 (1974)ననే పీడీఎస్‌యూగా ఆవిర్భవించింది. అది మొదలు అధిక ధరలపై, పలు సమస్యల సాధనకై పోరాడింది. కామ్రేడ్స్ భూమయ్య, కిష్టాగౌడ్‌ల ఉరిశిక్షల రద్దుకై ఉద్యమించింది. రైల్వే కార్మికుల సమ్మెకు మద్దతుగా నడిచింది. శ్రీకాకుళ గోదావరి లోయ పోరాటాలకు సంఘీభావంగా నిలిచింది. శ్రామికవర్గ అంతర్జాతీయతను ఎలుగెత్తి చాటి, ప్రపంచ పౌరుడిగా అవతరించిన చేగువేరా త్యాగనిరతిని పునికి పుచ్చుకుంది. అందుకే మతోన్మాదుల చేతుల్లో జార్జ్, చాంద్ పాషాల హత్యలు మొదలు... రాజ్యమే యుద్ధం ప్రకటించడంతో జంపాల, శ్రీపాద శ్రీహరిల నుండి చంద్రశేఖర్, రియాజ్‌ల వరకూ డజనుల కొలది విద్యార్థి వీరులు అమరు లైనారు. మరి ఎంతోమంది విద్యాలయాల నుండి పయనమై సమాజపు విముక్తిలో అంతర్భాగమైనారు. ఇందులో కొందరు తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో నిలబడి బూర్జువా పార్లమెంటరీ రాజకీయాల్లో కీలకంగా ఎదిగారు. ఈనాడు విప్లవ విద్యార్థి ఉద్యమం ఎదుర్కొంటున్న సమస్యల ప్రత్యేక సందర్భంలో పలు పీడీఎస్యూలన్నీ ఒకే తాటి మీదకు రావడమనేది, ప్రధాన ఎజెండా కావాలనేది నా అభిప్రాయం. ఇప్పుడు గతం కంటే తీవ్రంగా యావద్దేశం హిందుత్వ రాజకీయాల ఫాసిస్టు దాడికి గురవుతోంది. ప్రారంభం నుండీ ఇలాంటి ఉన్మాద దాడుల్లోనే రక్తసిక్త పసిగుడ్డుగా పుట్టిన పీడీఎస్‌యూ అనతి కాలంలోనే ఎమర్జెన్సీ ఫాసిస్టు దాడికి గురయ్యింది. చితాభస్మంలోంచి లేచిన ఫినిక్స్ పక్షిలాగా మారిన పీడీఎస్‌యూ నేడు అప్రకటిత ఎమర్జెన్సీని ఎదుర్కొంటూనే మునుముందుకు సాగుతోంది. అయితే పీడీఎస్‌యూలో సంభవించిన చీలికలు ఉద్యమ గమనం మందగించడానికి కారణమయ్యాయి. నాకు సమకాలికులుగా ఉన్న చాలామంది కామ్రేడ్స్ ప్రత్యక్షంగా ఎదుర్కొన్న 1984 నాటి చీలికను చూసి కొందరు పీడ విరగడయిందని (గుడ్ రిడెన్స్) భావించిన వాళ్లున్నారు. కానీ అసలు పీడ అక్కడ నుండే మొదలయ్యింది. ఆ తర్వాతి 45 ఏళ్లలో 1986 రాజీవ్‌గాంధీ నూతన విద్యా విధానం, రిజర్వేషన్లు, ఎల్పీజీ, విద్యా కాషాయీకరణ – కార్పొరేటీకరణ లాంటి ఎన్నో పరిణామాలు వచ్చాయి. విద్యాహక్కు చట్టం తర్వాత కూడా ఎన్నో పాఠశాలలు మూసివేయబడి, సార్వజనీన విద్య (కామన్ స్కూల్ ఎడ్యుకేషన్) అనేది కనుమరుగై పోయింది. వాటన్నిటిపై ప్రగతిశీల విద్యార్థి ఉద్యమం బలాబలాలు మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. రెండు తరాలూ... అధిక ధరలు, ఆకలి చావులు, అన్నార్థుల ఆవేదనలు, దేశ సంపదను దోచుకెళ్తున్న పిడికెడు మంది బడా దోపిడీ దారులకు వ్యతిరేకంగా సాగే పోరాటాలతో మమేకం కావాలని కోరుకోవడం ఆహ్వానించతగ్గది. సమ్మేళనం బాధ్యతను నెత్తికెత్తుకున్న నిర్వాహకులకు విప్లవాభినందనలు. ఇది బయటి వ్యక్తి మాటగా కాకుండా మీతో నేను, నాతో మీరుగానే స్వీకరించాలని నా విజ్ఞప్తి. – అమర్ (జనవరి 21 పీడీఎస్‌యూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం సందర్భంగా) -
విద్యా వ్యాపారీకరణను ప్రతిఘటిద్దాం
నల్లగొండ టౌన్ : విద్యా వ్యాపారీకరణ, కాషాయీకరణను విద్యార్థులందరూ ప్రతిఘటించాలని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు బొల్గురి కిరణ్‌కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానికంగా జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యను ఒక వ్యాపార వస్తువుగా మార్చి పేదలకు అందని ద్రాక్షగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా బి.అనిల్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా వి.సైదులు, ఉపాధ్యక్షుడిగా ఎ.హరీష్, సహాయ కార్యదర్శిగా ఎస్కె.యూసుఫ్, కోశాధికారిగా గౌతమ్, కార్యవర్గ సభ్యులుగా సుభాష్, ప్రవీణ్, వినిత్, నాగరాజు, రవితో పాటు 13 మందితో కమిటీని ఎన్నుకున్నారు. -
పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో భగత్‌సింగ్‌కు నివాళి
కోదాడ: దేశభక్తితో బ్రిటీష్ సామ్రాజ్యవాదులను గడగడలాడించిన యువకిశోరం షహీద్ భగత్‌సింగ్‌ను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇందూరు సాగర్ అన్నారు. బుధవారం కోదాడలోని లాల్‌బంగ్లాలో భగత్‌సింగ్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చందర్రావు, మురళి,సైదులు, ఉదయగిరి, ఉమేష్, శివాజీ, సాయి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
నిజాం కళాశాలలో విద్యార్థుల ఘర్షణ
నిజాం కళాశాలలో గురువారం మధ్యాహ్నం విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సయ్యద్ రెహ్మాన్ చాంబర్ వద్ద ఇరు వర్గాల విద్యార్థులు ఘర్షణకు దిగారు. గిరిజన విద్యార్ధులపై దాడులకు పాల్పడిన తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ నాయకులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం పలు విద్యార్ధి సంఘాల నాయకులు ప్రిన్సిపల్ చాంబర్ ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగాఏబీవీపీ నిజాం కళాశాల యూనిట్ అధ్యక్షులు బంగ్ల చైతన్య, పీడీఎస్‌యూ నేత ఆనంద్ తదితరులు మాట్లాడారు. టీఎన్ఎస్ఎఫ్ నాయకులు కనక లింగేశ్వర్ అగ్రవర్ణ అహంకారంతో దళితులపై దాడులకు పాల్పడడం దారుణమన్నారు. కళాశాలకు సంబంధం లేని బయటి వ్యక్తులు ప్రిన్సిపల్ ఎదుటే సహచర విద్యార్ధులపై దాడులకు పాల్పడుతుండడం కళాశాలలో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయో అర్థమైతోందని అన్నారు. కాగా, పలు విద్యార్ధి సంఘాల నాయకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కనక లింగేశ్వర్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. -
మంత్రి హరీశ్‌రావు తీరు మార్చుకోవాలి
ఆర్మూర్(నిజామాబాద్): రెండో ఏఎన్ఎంల సమస్యలు వినకుండా మిమ్మల్ని ఎవరూ పట్టించుకోకున్నా సమ్మె ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించిన భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తన తీరు మార్చుకోవాలని పీడీఎస్‌యూ చంద్రన్న వర్గం జిల్లా అధ్యక్షుడు బొర్ర నాగరాజు సూచించారు. ఆర్మూర్‌లోని తహసీల్దార్ కార్యాలయం వద్ద తమ డిమాండ్ల సాధన కోసం రెండో ఏఎన్ఎంలు బుధవారం నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. 31వ రోజు కొనసాగుతున్న సమ్మెకు పీడీఎస్‌యూ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్మూర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనడానికి వచ్చిన మంత్రి హరీశ్‌రావుకు ఏఎన్ఎంలు వినతి పత్రం అందజేస్తే ఆయన స్పందించిన తీరు బాధాకరమన్నారు. రెండో ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడు యెల్లుల శ్రీకాంత్, స్వామి ఏఎన్ఎంలు ప్రమీళ, రాజగంగు, విజయ, స్వప్న, గీత, ఎస్తేర్, వాణి, రాణి, స్వరూప, కమల, చైతన్య, సుమలత తదితరులు పాల్గొన్నారు. -
కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలి
మంచిర్యాల సిటీ : ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం మంచిర్యాలలోని కళాశాల వద్ద పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లెల శ్రీకాంత్ మాట్లాడుతూ జూనియర్ కళాశాలల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించిన రాష్ట్ర డెప్యూటీ సీఎం నేటికీ తన మాటను నిలబెట్టుకోలేదని విమర్శించారు. కళాశాలల్లో చదివే పేద విద్యార్థులు మధ్యాహ్న భోజనం కోసం ఆశతో ఎదురు చూస్తున్నారని ప్రభుత్వం స్పందించి వెంటనే భోజనం ఏర్పాట్లు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిచో తమ సంఘం చేపట్టే ఆందోళన కార్యక్రమాలకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు రాజు, కె సాయి, కె.కుమార్ తదితరులు ఉన్నారు. -
డిప్యూటీ సీఎం కడియం ఇంటి ముట్టడి
ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజులు నియంత్రించాలని డిమాండ్ హన్మకొండ: ప్రైవేటు విద్యా సంస్థల్లో అధిక ఫీజులను నియం త్రించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థులు సోమవారం ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడి యం శ్రీహరి ఇంటిని ముట్టడిం చారు. హన్మకొండ సుబేదారి నుంచి టీచర్స్ కాలనీలోని కడి యం శ్రీహరి ఇంటికి పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థుల ర్యాలీగా వెళ్లగా, పోలీసులు అడ్డుకున్నారు. వారిని ప్రతిఘటిం చి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిం చారు. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి, ధర్నా చేశారు. అనంతరం విద్యార్థి నాయకులను అరెస్టు చేసి తీసుకెళ్లారు. కాగా, విద్యాసంస్థల్లో ఫీజులు నియంత్రించాలని, అధికఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్ఐ వరంగల్ జిల్లా అధ్యక్షుడు పైండ్ల యాకయ్య, కార్యదర్శి బి.నరసింహారావు డిమాండ్ చేశారు. పోచారం ఇల్లు ముట్టడికి యత్నం బాన్సువాడటౌన్: ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని నియంత్రించాలని డిమాండ్ చేస్తూ సోమవారం నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇల్లును పీడీఎస్‌యూ కార్యకర్త లు ముట్టడించేందుకు యత్నించారు. అంత కుముందు మంత్రి ఇల్లు ముట్టడికి ర్యాలీగా వెళ్లారు. ర్యాలీని రోడ్డుపైనే పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిసేపు రోడ్డుపైనే బఠాయిం చిన నాయకులు పోలీసులను తప్పించుకుని మంత్రి ఇంటి వైపు పరుగులు తీశారు. మం త్రి ఇంటి ఎదుట నినాదాలు చేస్తూ ధర్నా చేయగా పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ అయిన 20 మంది పీడీఎస్‌యూ నాయకులను వ్యక్తిగత పూచీపై విడుదల చేశారు. -
బడ్జెట్ ప్రతులను దగ్ధం చేసి నిరసన
విద్యా రంగానికి తగిన కేటాయింపులు చేయనుందకు నిరసనగా ఆదిలాబాద్ జిల్లా దండేపల్లిలో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో బుధవారం నిరసన ప్రదర్శన జరిగింది. అంబేద్కర్ విగ్రహం వద్ద విద్యార్థులు తెలిపారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి పిట్టల తిరుపతి మాట్లాడుతూ... విద్యా రంగానికి తెలంగాణ సర్కారు బడ్జెట్లో తగినన్ని కేటాయింపులు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. -
వీసీలను నియమించే తీరిక లేదా
- మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కేయూ క్యాంపస్(వరంగల్ జిల్లా) తెలంగాణ లోని యూనివర్సిటీలకు వీసీలను నియమించే తీరిక రాష్ట్ర ప్రభుత్వానికి లేదా అని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ ప్రశ్నించారు. పీడిఎస్యూ రాష్ర్ట మహసభల సందర్భంగా ఆదివారం కాకతీయ యూనివ ర్సిటీ ఆడిటోరియంలో ‘విద్యారంగ పరిస్థితి - తెలంగాణ రాష్ట్రం’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ కాలంలోనే కాక రాష్ట్రం సాధించిన తర్వాత కూడా ఉన్నత విద్యారంగం నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేయాల్సిన యూనివర్సిటీ విద్య నానాటికి దిగజారుతోందని అన్నారు. యూనివర్సిటీలకు వీసీలను నియమించకుండా జాప్యం చేయడం సరికాదన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల కోరిక మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో సుమారు 500 పాఠశాలల్లోనే ఇంగ్లిష్ మీడియం అమల్లో ఉందని, అదికూడా స్థానిక ఉపాధ్యాయుల కృషితోనేనని తెలిపారు. రాష్ట్రంలో 19 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే విద్యారంగం పట్ల ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి తరగతి గదికి టీచర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు గైర్హాజరు కూడా 20 శాతం వరకు ఉంటోందని, వారిలోనూ అంకితభావం కొరవడిందని అన్నారు. సదస్సులో పీడిఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు జూపాక శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కె.ఎస్.ప్రసాద్, ఉపాధ్యక్షులు సత్య, ఎం.సుధాకర్, కార్యదర్శులు రాము ,శరత్, సరిత తదితరులు పాల్గొన్నారు. -
శాస్త్రీయ విద్యావిధానం కోసం ఉద్యమించాలి: పీడీఎస్ యూ
గుమాస్తా చదువులకు స్వస్తి పలికి శాస్త్రీయ విద్యావిధానం కోసం ఉద్యమించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) 20వ రాష్ట్ర మహాసభల్లో పలువురు వక్తలు పిలుపునిచ్చారు. మూడురోజులు జరిగే మహాసభల ప్రారంభం సందర్భంగా శుక్రవారం ఆర్ట్స్ కళాశాల నుంచి సుబ్రహ్మణ్యమైదానం వరకూ భారీ ర్యాలీ జరిగింది. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రామకృష్ణ అధ్యక్షతన జరిగిన బహిరంగసభలో సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి పి.టాన్యా మాట్లాడుతూ విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందుకవసరమైన నిధులను పెంచడం లేదన్నారు. ప్రాథమిక విద్యను పటిష్టత పేరుతో ప్రభుత్వ పాఠశాలలను, రెసిడెన్షియల్ వసతి గృహాల పేరుతో సంక్షేమ వసతి గృహాలను మూసివేస్తున్నారని, మోదీ అధికారంలోకి వచ్చాక విద్యను మత విలువలతో, అజ్ఞానంతో నింపడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రామకృష్ణ మాట్లాడుతూ విద్యపై విదేశీ పెత్తనం పెరుగుతోందని, ప్రభుత్వాలు పేదలకు విద్యను దూరం చేస్తున్నాయని విమర్శించారు. విద్య, ఉపాధి కనుమరుగవుతున్న స్థితిలో ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అవ సరమన్నారు. కళాశాలలు ఆత్మహత్యల కర్మాగారాలుగా మారడానికి ప్రైవేటు యాజమాన్యాల లాభాపేక్షే కారణమన్నారు. న్యూ డెమోక్రసీ కేంద్ర నాయకుడు సాదినేని వెంకటేశ్వర్లు, పీడీఎస్‌యూ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు చిట్టిపాటి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి యు.గనిరాజు, రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సీఎస్ సాగర్ తదితరులు పాల్గొన్నారు. -
పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎ.డి.రాము
సాక్షి, హైదరాబాద్: పీడీఎస్‌యూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎ.డి.రాము, ప్రధాన కార్యదర్శిగా పసక నర్సయ్య ఎన్నికయ్యారు. ఈ నెల 6, 7, 8వ తేదీల్లో ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో రాష్ట్ర మహాసభ జరిగింది. మహాసభ ముగింపు రోజున నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బి.రవిచంద్ర, పరశురాం, శంకరి సత్యం, సహాయ కార్యదర్శులుగా విజయ్ కన్నా, పవన్, సాంబ, కోశాధికారిగా స్వప్న నియమితులయ్యారు. -
జమ్మికుంటలో పీడీఎస్‌యూ ర్యాలీ
ఫీజు రీఇంబర్స్ మెంట్ పై కరీంనగర్ జిల్లా జమ్మికుంట గ్రామంలో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో శనివారం ఉదయం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.ఫీజు రీఇంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని, స్కాలర్ షిప్ బకాయిలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. -
విద్యను విస్మరిస్తున్న కేంద్ర, రాష్ట్ర పభుత్వాలు
పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి ఆవుల అశోక్ మక్తల్(మహబూబ్‌నగర్ జిల్లా) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను విస్మరిస్తున్నాయని, విజ్ఞానాన్ని పెంచి సమాజ అభివృద్దికి విద్య ఉపయోగపడుతుందని, విద్యను విస్మరించడం సరికాదని పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి ఆవుల అశోక్ అన్నారు. బుధవారం మక్తల్ పట్టణంలో సీవీరామన్ డిగ్రీ కళాశాలలో పీడీఎస్‌యూ ఆద్వర్యంలో ఉన్నత విద్య అంశంపై సదస్సు నిర్వహించారు. పీడీఎస్‌యూ డివిజన్ అధ్యక్షుడు గోపి నేతృత్వంలో ఈ సదస్సును నిర్వహించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో యూనివర్సిటీలు, వైస్ చాన్సలర్లను నియమించ లేదన్నారు. రాష్ట్రంలోని 17యూనివర్సిటీలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయని పేర్కొన్నారు. -
నేడు, రేపు విద్యాసంస్థల బంద్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యారంగ సంస్థలు ఎదుర్కొం టున్న సమస్యలతో పాటు ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నేడు, రేపు (6, 7 తేదీలు) రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కు ఏబీవీపీ, పీడీఎస్‌యూ (విజృంభణ) వేర్వేరు ప్రకటనలో పిలుపునిచ్చారు. డిగ్రీ కాలేజీల్లో అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది నియామకం, మౌలిక వసతుల కల్పన, అధిక నిధులు, ఫీజు బకాయిల చెల్లింపు వంటి డిమాండ్లతో 6న డిగ్రీ కాలేజీల బంద్ పాటిస్తున్నట్లు ఏబీవీపీ జాతీయ నేత కడియం రాజు తెలిపారు. కుటుంబానికో ఉద్యోగం, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, కాంట్రాక్టు, పార్ట్‌టైం, టైంస్కేల్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని, ప్రైవేటురంగ సంస్థల్లో ఉద్యోగాల రిజర్వేషన్లు తదితర డిమాండ్లతో 7న విద్యా సంస్థల బంద్ పాటించనున్నట్లు పీడీఎస్‌యూ రాష్ట్రనేతదయాకర్ తెలిపారు. -
నేడు విద్యా సంస్థల బంద్
పిలుపునిచ్చిన వామపక్ష విద్యార్థి సంఘాలు సాక్షి, హైదరాబాద్: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వా న్ని డిమాండ్ చేస్తూ మంగళవారం ఇంటర్, డిగ్రీ కళాశాలల బంద్‌కు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఫీజుల నియంత్రణ చట్టాన్ని రూపొందించడం, ప్రభుత్వ ఇం టర్, డిగ్రీ కళాశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీ, మౌలిక వసతుల కల్పన, ప్రైవేటు కాలేజీడ లను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్న డిమాండ్ల సాధనకు బంద్ చేపట్టనున్నట్లు పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సత్య తెలిపారు. -
సచివాలయంలో పీడీఎస్‌యూ ఆందోళన
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయ భూములను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ గురువారం సచివాలయంలోని సీఎం కార్యాలయం (సమతాబ్లాక్) ఎదుట పీడీఎస్‌యూ మహిళా నాయకులు ఆందోళన చేశారు. బారికేడ్ దాటుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో వారు సి-బ్లాక్ ఎదురుగా బైఠాయించి సీఎం డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. పీడీఎస్‌యూ నాయకులను అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు నానాతంటాలు పడ్డారు. మహిళా పోలీసులు లేకపోవడంతో అందుబాటులో ఉన్న ఒక మహిళా పోలీసును అక్కడికి రప్పించి ఆమె సహాయంతో ఆందోళన చేస్తున్న వారిని పోలీసుల వాహనంలోకి ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. అంతకు ముందు పీడీఎస్‌యూ నాయకురాలు సత్య మాట్లాడుతూ ఓయూ స్థలంలో ఇళ్లను నిర్మించాలన్న నిర్ణయాన్ని సీఎం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. -
'ఓయూ జోలికొస్తే సీఎం కుర్చీ పెకిలిస్తాం'
మెదక్(సిద్దిపేట): ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) భూములను ముట్టుకుంటే ముఖ్యమంత్రి కుర్చీని పెకిలిస్తామని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్‌ప్రసాద్ హెచ్చరించారు. బుధవారం సిద్దిపేటలో మాట్లాడుతూ..చారిత్రాత్మక ఉస్మానియా యూనివర్సిటీకి స్వయం ప్రతిపత్తి కల్పించి సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం ఆ దిశగా వెళ్లకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల భూములపై కన్నేసిందని ఆరోపించారు. రాష్ట్రాన్ని గంపగుత్తగా కార్పొరేట్‌దారులకు విక్రయించడానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. దానిలో భాగంగానే రామోజీ ఫిల్మ్‌సిటీని లక్ష నాగళ్లతో దున్ని పేదలకు పంపిణీ చేస్తానన్న కేసీఆర్.. రహస్య ఒప్పందాలు చేసుకొని బడా ప్రైవేటు కార్పొరేట్ల కంపెనీలకు ఏజెంటుగా మారాడని మండిపడ్డారు. కాళోజీ చెప్పినట్లుగా.. ప్రాంతం వారే మోసం చేస్తే ఆ ప్రాంతంలోనే పాతరేస్తామని ఆయన హెచ్చరించారు. -
'తెలంగాణలో మహిళా యూనివర్సిటి ఏర్పాటు చేయాలి'
హైదరాబాద్: ఉన్నత విద్యలో మహిళల సంఖ్యను పెంచేందుకు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా మహిళా యూనివర్సిటీని స్థాపించాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సత్య డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ విద్యార్థులకు అందుబాటులో లేకుండా తిరుపతిలో మహిళ వర్సిటీని స్థాపించి సీమాంధ్రపాలకులు ఈ ప్రాంత మహిళలను ఉన్నత విద్యకు దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్‌లో ఆరోగ్య విశ్వవిద్యాలయాలన్ని ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ ఈ విద్య సంవత్సరం మహిళా వర్సిటీని కూడా స్థాపించాలని కోరారు. -
కోచింగ్ సెంటర్ల బంద్ ఉద్రిక్తం
హైదరాబాద్‌సిటీ (ముషీరాబాద్) : గ్రూప్ 1, 2లతో పాటు పలు పోటీ పరీక్షలకు తర్ఫీదు పొందే విద్యార్థుల ఫీజులను ప్రభుత్వమే నిర్ణయించాలని, షాపింగ్ మాల్స్, ఫంక్షన్ హాల్స్‌లలో రౌడీషీటర్లు, బౌన్సలర్లను పెట్టి కోచింగ్‌లను నిర్వహిస్తున్న యాజమాన్యాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) శుక్రవారం ఇచ్చిన కోచింగ్ సెంటర్ల బంద్ ఉధ్రిక్తతలకు దారి తీసింది. పీడీఎస్‌యూ నేపథ్యంలో ముందస్తుగా అమీర్‌పేట, దిల్సుఖ్నగర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, అశోక్‌నగర్ తదితర ప్రాంతాల్లో ఉన్న రామయ్య, షైన్, నాగార్జున, ఐఏఎస్ స్టడీ సర్కిల్, హెచ్ఐపీ, ఎమిలీ తదితర కోచింగ్ సెంటర్లు ముందస్తుగానే సెలవులు ప్రకటించాయి. కానీ పోలీసుల బందోబస్త్‌తో భోలక్‌పూర్‌లోని మహబూబ్ ఫంక్షన్ హాల్లో జయశంకర్ కోచింగ్ సెంటర్, అశోక్‌నగర్‌లోని ఆర్సీ రెడ్డి కోచింగ్ సెంటర్లు యథావిథిగా నడిపిస్తుండటంతో దాదాపు వంద మంది పీడీఎస్‌యూ కార్యకర్తలు ఆ కోచింగ్ సెంటర్లను బంద్ చేయించడానికి ప్రయత్నించారు. అప్పటికే అక్కడ మోహరించి ఉన్న కోచింగ్ సెంటర్ల వ్యక్తులు, పోలీసులు పీడీఎస్‌యూ కార్యకర్తలతో వాగ్వావాదానికి దిగడంతో కొద్ది సేపు ఉధ్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. భోలక్‌పూర్‌లోని జయశంకర్ కోచింగ్ సెంటర్ గేట్లు తోసుకుంటూ లోపలికి వెళ్లిన పీడీఎస్‌యూ కార్యకర్తలను ముషీరాబాద్ ఇన్స్పెక్టర్ మోహన్‌కుమార్, ఎసై్స సంపత్‌ల ఆధ్వర్యంలో బలవంతంగా పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. అలాగే అశోక్‌నగర్‌లోని ఆర్సీరెడ్డి కోచింగ్ సెంటర్ వద్ద కూడా రాజు నేపథ్యంలో పలువురు పోలీసులు పీడీఎస్‌యూ కార్యకర్తలను అడ్డుకొని గాంధీనగర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అరెస్టు అయిన వారిలో పీడీఎస్‌యూ అధ్యక్షులు పరశురాం, ప్రధాన కార్యదర్శి ఎ.డి. రాము, నాయకులు రియాజ్, గణేష్, రంజిత్, నాగరాజు, తిరుమల్, హరికృష్ణలతో పాటు పలువురు ఉన్నారు. -
కోచింగ్ సెంటర్లపై పీడీఎస్‌యూ కార్యకర్తల దాడి
హైదరాబాద్ : కోచింగ్ సెంటర్లలో వసతులు మెరుగుపరచాలని, ఫీజులు నియంత్రించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చారు. అయితే, ప్రొఫెసర్ జయశంకర్, ఆర్సీ రెడ్డి కోచింగ్ సెంటర్లలో క్లాసులు కొనసాగుతుండగా పీడీఎస్‌యూ కార్యకర్తలు దాడికి దిగారు. దీంతో పోలీసులు సుమారు 50 మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకుని, స్టేషన్‌కు తరలించారు. (ముషీరాబాద్) -
డైట్‌సెట్ కౌన్సెలింగ్ నిర్వహించాలి
సాక్షి, హైదరాబాద్: డీ.ఈడీ కోర్సులో చేరాలనుకుంటున్న విద్యార్థుల ఆశలను రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అడియాసలు చేశాయని పీడీఎస్‌యూ ప్రధాన కార్యదర్శి ఆవుల అశోక్ ఆదివారం ఆవేదన వ్యక్తం చేశారు. టీటీసీ అర్హత పరీక్ష నిర్వ హించి 6 మాసాలు గడచినా, ఆగస్టులో నిర్వహించాల్సిన కౌన్సెలింగ్‌ను ఇంత వరకూ చేపట్టకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. వెంటనే డైట్‌సెట్ కౌన్సెలింగ్ నిర్వహించాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. -
కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి రాష్ట్ర పాలన
పలాస: కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి రాష్ట్ర పరిపాలనను తెలుగుదేశం ప్రభుత్వం అప్పగించిందని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పీడీఎస్యు) రాష్ట్ర అధ్యక్షుడు ఎ.రామకృష్ణ అన్నారు. అందులో భాగమే కార్పొరేట్ దిగ్గజం, నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ నేడు మంత్రి అయ్యారని ఆరోపించారు. పలాస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా విద్యా సదస్సు ఆదివారం జరిగింది. పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షురాలు డి.మల్లిక అధ్యక్షతన జరిగిన సదస్సులో రామకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబు ప్రపంచ బ్యాంకు ఏజెంటని విమర్శించారు. తొమ్మిదేళ్లు అధికారంలో, మరో తొమ్మిది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండడంతోపాటు నేడు మళ్లీ అధికారంలోకి వచ్చిన ఆయన ప్రభుత్వ విద్యా సంస్థలను నిర్వీర్యం చేసి ప్రైవేటు విద్యా సంస్థలకు ప్రోత్సాహం ఇస్తున్నారన్నారని మండిపడ్డారు. డీటీఎఫ్ రాష్ట్ర నాయకుడు కోత ధర్మారావు మాట్లాడుతూ దేశంలో 25 శాతం మందికి మాత్రమే ప్రభుత్వం ప్రకటించినట్టు 2,400 కేలరీల శక్తి భోజనం లభిస్తోందన్నారు. చాలామంది అత్యంత దారిద్య్రరేఖకు దిగువున జీవిస్తూ విద్య, వైద్య సదుపాయాలకు దూరంగా ఉన్నారన్నారు. పలాస ప్రభుత్వ జూనియన్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.రాజగోపాలరావు మాట్లాడుతూ ఉద్యమాలు చట్ట పరిధిలో ఉండాలని, అందుకు నాయకత్వం కూడా అవసరమని చెప్పారు. అలాంటి ఉద్యమ సంస్థయే పీడీఎస్‌యూ అని విద్యార్థులంతా తమ సమస్యలు పరిష్కరించుకోవడానికి శాంతియుతంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. డి.మల్లిక మాట్లాడుతూ చాలీచాలని మెస్ చార్జీలతో విద్యార్థులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించుకోవడాని కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పీడీఎస్యు అంటే ధర్నాలు, ఆందోళనలే కాదని, సామాజిక స్పృహ కలిగి మంచి యువతీ, యువకులుగా తయారు కావాలన్నారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ నాయకులు ఎస్.పెంటయ్య, రమేష్, వంకల మాధవరావు, గోపిప్రవీణ్ పాల్గొన్నారు. సదస్సు అనంతరం విద్యార్థులంతా ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. -
ఫీజుల కోసం రోడ్డెక్కిన విద్యార్థులు
-
విద్యాసంస్థల బంద్ విజయవంతం
ఒంగోలు టౌన్ : పీడీఎస్‌యూ జిల్లాశాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. జిల్లా కేంద్రమైన ఒంగోలులో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నీ మూతపడ్డాయి. విద్యాసంస్థల బంద్ గురించి రెండురోజుల ముందుగానే నేతలు ప్రకటించడంతో ప్రైవేట్ పాఠశాలలు సెలవు ప్రకటించాయి. పీడీఎస్‌యూ నాయకులు మూడు బృందాలుగా ఏర్పడి నగరంలో కొన్నిచోట్ల తెరిచిన విద్యాసంస్థలను మూసివేయించారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి ప్రకాశం భవనం వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. ధర్నానుద్దేశించి పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే మల్లికార్జున్ మాట్లాడుతూ ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభమై నెలరోజులవుతున్నప్పటికీ పాఠశాల స్థాయిలో సమస్యలన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు. ప్రతి ఏటా ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నప్పటికీ విద్యాశాఖాధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఒకవైపు పాఠ్యపుస్తకాల కొరత, ఇంకోవైపు ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థుల చదువులు ముందుకు సాగే పరిస్థితి కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమ వసతి గృహాలు సమస్యల నిలయాలుగా మారాయాన్నారు. ఎక్కువ శాతం వసతి గృహాల్లో అక్కడే ఉండి విద్యాభ్యాసం చేసే పరిస్థితులు కనిపించడం లేదన్నారు. మంచినీరు, మరుగుదొడ్లు సరిగా లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన చెందారు. ఆర్భాటంగా ప్రవేశపెట్టిన విద్యా హక్కు చట్టం కాగితాలకే పరిమితమైందని విమర్శించారు. మరోవైపు ప్రైవేట్ పాఠశాలలు పుట్టగొడుగుల్లా వెలుస్తూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఫీజుల రూపంలో దోపిడీకి గురిచేస్తున్నాయన్నారు. కనీస వసతులు, నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు లేకపోయినా ఆర్భాటాలు చేస్తున్నాయని విమర్శించారు. జీవో నంబర్ 42 ప్రకారం జిల్లాస్థాయి ఫీజుల నియంత్రణ కమిటీ నిర్ధారించిన ఫీజులనే వసూలు చేయాల్సి ఉండగా, ఇష్టం వచ్చినట్లు ఫీజులు గుంజుతున్నారని పేర్కొన్నారు. గుర్తింపులేని పాఠశాలలను రద్దు చేయకపోగా నోటీసులు, జరిమానాలు విధిస్తూ కాలయాపన చేస్తున్నారని మల్లికార్జున్ విమర్శించారు. పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు ఎల్.రాజశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వెంటనే యూనిఫాం అందించాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాలన్నారు. ధర్నాలో అరుణోదయ కళాకారుడు అంజయ్య ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. అనంతరం జిల్లా విద్యాశాఖాధికారిని కలిసి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి జే రమేష్, నాయకులు ఏ రాజు, సీహెచ్ శ్యాంసన్, ఇమ్మానియేల్, అంజి, హనుమంతు పాల్గొన్నారు. -
ఆంక్షలు లేని ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కావాలి
ఏలూరు సిటీ : రాష్ట్రంలో ఆంక్షలు లేని ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పూర్తిస్థాయిలో పేదవర్గాల విద్యార్థులందరికీ అందించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) రాష్ట్ర అధ్యక్షుడు ఎ.రవిచంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం చిట్టివలసపాకల ప్రాంతంలోని ఇఫ్టూ జిల్లా కార్యాలయంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలుపై ఆయా ప్రజా, విద్యార్థి, యువజన సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రవిచంద్ర మాట్లాడుతూ తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో చదువుతున్న మన రాష్ట్ర విద్యార్థుల ఫీజులను ఏపీ ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. బీసీ, ఓబీసీ, మైనార్టీ, వికలాంగులైన విద్యార్థులకు ఆదాయ పరిమితిని రూ.2 లక్షలకు పెంచాలన్నారు. రూ.1200 కోట్ల ఫీజు బకాయిలను, తెలంగాణలో చదువుతున్న ఆంధ్ర విద్యార్థులకు సంబంధించిన బకాయిలు రూ.196 కోట్లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.రామ్మోహన్, ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బి.ప్రభాకర్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పి.రవికుమార్, ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి బీఏ సాల్మన్‌రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఫీజు రీయింబర్స్ మెంట్ ను కొనసాగించాలి: పీడీఎస్ యూ
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని కొనసాగించాలని పీడీఎస్‌యూ తెలంగాణ కమిటీ నేతలు డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై చర్చించడానికి విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో పీడీఎస్ యూ నేతలు చర్చలు జరిపారు. పేద విద్యార్ధులకు మేలు చేసే ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని కొనసాగించాలని విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డికి సూచించారు. గత సంవత్సరం ఉన్న చెల్లించని ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని నేతలు విజ్ఞప్తి చేశారు. హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో మృతి చెందిన వీఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్ధుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తించిన వీఎన్ఆర్ కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ నేతలు కోరారు. -
డైట్ కళాశాల విద్యార్థుల ధర్నా
కాకినాడ సిటీ, న్యూస్‌లైన్ : బొమ్మూరు డైట్ కళాశాల ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పీడీఎస్‌యూ) డిమాండ్ చేసింది. పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులు గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రిన్సిపాల్ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని, విద్యార్థులపై మానసిక ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆరోపించారు. సంఘ జిల్లా అధ్యక్షుడు జి. చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులతో ప్రిన్సిపాల్ అసభ్య పదజాలంతో మాట్లాడడమే కాకుండా అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. పేరుకే ప్రభుత్వ డైట్ కళాశాల అని, ఇక్కడ చదువుతున్న వారినుంచి వేలాది రూపాయలు కట్టించుకుని, రసీదులివ్వకుండా ప్రిన్సిపాల్ స్వాహా చేశారని ఫిర్యాదు చేశారు. అడ్మిషన్లు రద్దవుతాయని భయపెట్టి విద్యార్థుల నుంచి రూ.5 వేలు కట్టించుకున్నారని ఆరోపించారు. జిల్లా ఉన్నతాధికారులు దీనిపై విచారణ జరిపించాలని, ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏజేసీ మార్కండేయులుకు వారు వినతిపత్రం సమర్పించారు. దీనిపై విచారణ జరిపిస్తామని ఆయన హామీ ఇచ్చారు. -
ఎరుపెక్కిన విద్యావనం
ఓయూలో పీడీఎస్‌యూ మహాసభలు ప్రారంభం హైదరాబాద్, న్యూస్‌లైన్: సీపీఐఎంఎల్ (న్యూడెమోక్రసీ) అనుబంధ విద్యార్థి సంఘం పీడీఎస్‌యూ 19వ రాష్ట్ర మహాసభలు ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ)లో మంగళవారం ప్రారంభమయ్యాయి. తొలుత విద్యానగర్‌లోని ఎస్వీఎస్ కళాశాల మైదానంలో పీడీఎస్‌యూ వ్యవస్థాపకులు జార్జిరెడ్డి, జంపాల చంద్రశేఖర్‌ప్రసాద్, శ్రీపాద శ్రీహరి, కోలా శంకర్, రంగవల్లి, చేరాలు, స్నేహలత తదితర అమరులకు జోహార్లు అర్పించారు. అనంతరం అక్కడి నుంచి రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వేలాది మంది విద్యార్థులతో ఓయూ ఆర్ట్స్ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు. పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని, హాస్టళ్ల సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు అశోక్, ప్రధాన కార్యదర్శి జేఎల్ గౌతంప్రసాద్, నగర అధ్యక్షురాలు సత్య, ఓయూ అధ్యక్షులు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆధార్ అనుసంధానం తొలగించాలి
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఆధార్ అనుసంధానం చేయడాన్ని వ్యతిరేకిస్తూ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో శనివారం ఖమ్మంనగరంలో విద్యార్థులు ప్రదర్శన నిర్వహించి కలెక్టరేట్ ముట్టడించారు. తొలుత వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పెవిలియన్ గ్రౌండ్‌కు చేరుకున్నారు. అక్కడనుంచి ప్రదర్శనగా బయలుదేరి మయూరిసెంటర్, బస్టాండ్, వైరారోడ్, జడ్పీ సెంటర్ మీదుగా కలెక్టరేట్ కు చేరుకుని ఆందోళన చేపట్టారు. అప్పటికే వన్‌టౌ న్ సీఐ వెంకటేష్, ట్రాఫిక్ సీఐ రామోజీ రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించి కలెక్టరేట్ గేట్లను మూసివేసి ట్రాఫిక్‌ను దారిమళ్లిం చారు. విద్యార్థులు కలెక్టరేట్‌లోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించడంతో పోలీసు లు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం జరిగిం ది. విద్యార్థులు కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. ఈ ఆందోళనను ఉద్దేశించి పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి కెఎస్.ప్రదీప్ మాట్లాడుతూ విద్యార్థుల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఆధార్‌కు అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయించడం సరైంది కాదన్నారు. ఈ ప్రక్రియ వల్ల విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. విద్యాసంవత్సరం ముగింపు దశకు చేరినా స్కాలర్‌షిప్‌ల కోసం 30 శాతం మంది కూడా దరఖాస్తు చేసుకోలేదని, దీనికి ప్రధాన కారణం ఆధార్‌కార్డు ప్రక్రియే అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు ఇవ్వకుండా ఉండేందుకే ప్రభుత్వం ఆధార్‌తో స్కాలర్షిప్లను ముడిపెడుతోందన్నారు. సంక్షేమ పథకాలను ఆధార్‌తో జత చేయవద్దని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించినా ఏకపక్ష నిర్ణయాలతో వ్యవహరించడం సరికాదన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా రెవెన్యూ అధికారి శివశ్రీనివాస్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి పృధ్వి, జిల్లా ఉపాధ్యక్షులు సంధ్య, సురేష్, సీతారామరాజు, సహాయ కార్యదర్శి అశోక్, రాజా, నాయకులు మమత, శ్రీను, మహి, లక్ష్మణ్, సాయి, నాగుల్‌మీరా, సౌందర్య, ఉమామహేష్, రాజశేఖర్, అంజి, నవీన, లక్ష్మణ్, చంటి పాల్గొన్నారు. -
విద్యా రంగ అభివృద్ధికి పీడీఎస్‌యూ పోరాటం
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: విద్యా రంగాన్ని సామ్రాజ్యవాద శక్తుల నుంచి విముక్తి చేసేందుకు పీడీఎస్‌యూ పోరాటాలు నిర్వహించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర నాయకుడు ఆర్ హరిబాబు పిలుపునిచ్చారు. 1974లో ఏర్పడిన పీడీఎస్‌యూ రాజీలేని పోరాటాలు నిర్వహిస్తూ విద్యార్థులకు వెన్నుదన్నుగా నిలుస్తోందని, అదే పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరారు. స్థానిక జిల్లా కార్యాలయంలో ఆదివారం ప్రారంభమైన పీడీఎస్‌యూ రాజకీయ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. జార్జిరెడ్డి, జంపాల, శ్రీహరి, చేరాలు, శంకర్ వంటి విద్యార్థి నాయకుల త్యాగాలతో పీడీఎస్‌యూ ఎరుపెక్కిందన్నారు. పీడీఎస్‌యూ ఆవిర్భావం నుంచే అనేక రకాల నిర్బంధాలు, దాడులను ఎదుర్కొని ముందుకు సాగిన విషయాన్ని గుర్తు చేశారు. ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు మురళీ ‘పరిణామవాదం’ అంశంపై ప్రసంగిస్తూ మానవ నాగరికత శ్రమ జీవుల కృషి ఫలితమేనన్నారు. ప్రగతిశీల విద్యార్థులు శాస్త్రీయ విజ్ఞానంతో ఆలోచించి ముందుకు సాగాలని సూచించారు. పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి బీ పద్మ ‘పాశ్చాత్య విష సంస్కృతి-విద్యార్థుల కర్తవ్యాలు’ అనే అంశంపై ప్రసంగిస్తూ తరతరాలుగా సమాజంలో స్త్రీని రెండో తరగతి పౌరులుగానే చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో పోటీ పడుతున్నా అడుగడుగునా అత్యాచారాలు, దాడులను ఎదుర్కోవలసిన పరిస్థితి నెలకొందన్నారు. మహిళలపై దాడులకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని కోరారు. తరగతులకు రాజశేఖర్, రమేష్, జాన్ అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. తొలుత పీడీఎస్‌యూ అరుణ పతాకాన్ని జిల్లా కార్యదర్శి ఎల్ రాజశేఖర్ ఆవిష్కరించారు. అరుణోదయ కళాకారులు ఆలపించిన విప్లవ గీతాలు ఆకట్టుకున్నాయి.