ఒంగోలు టౌన్ : పీడీఎస్‌యూ జిల్లాశాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. జిల్లా కేంద్రమైన ఒంగోలులో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నీ మూతపడ్డాయి. విద్యాసంస్థల బంద్ గురించి రెండురోజుల ముందుగానే నేతలు ప్రకటించడంతో ప్రైవేట్ పాఠశాలలు సెలవు ప్రకటించాయి. పీడీఎస్‌యూ నాయకులు మూడు బృందాలుగా ఏర్పడి నగరంలో కొన్నిచోట్ల తెరిచిన విద్యాసంస్థలను మూసివేయించారు.
అనంతరం ర్యాలీగా బయలుదేరి ప్రకాశం భవనం వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు.
ధర్నానుద్దేశించి పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే మల్లికార్జున్ మాట్లాడుతూ ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభమై నెలరోజులవుతున్నప్పటికీ పాఠశాల స్థాయిలో సమస్యలన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు. ప్రతి ఏటా ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నప్పటికీ విద్యాశాఖాధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఒకవైపు పాఠ్యపుస్తకాల కొరత, ఇంకోవైపు ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థుల చదువులు ముందుకు సాగే పరిస్థితి కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
సంక్షేమ వసతి గృహాలు సమస్యల నిలయాలుగా మారాయాన్నారు. ఎక్కువ శాతం వసతి గృహాల్లో అక్కడే ఉండి విద్యాభ్యాసం చేసే పరిస్థితులు కనిపించడం లేదన్నారు. మంచినీరు, మరుగుదొడ్లు సరిగా లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన చెందారు. ఆర్భాటంగా ప్రవేశపెట్టిన విద్యా హక్కు చట్టం కాగితాలకే పరిమితమైందని విమర్శించారు. మరోవైపు ప్రైవేట్ పాఠశాలలు పుట్టగొడుగుల్లా వెలుస్తూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఫీజుల రూపంలో దోపిడీకి గురిచేస్తున్నాయన్నారు. కనీస వసతులు, నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు లేకపోయినా ఆర్భాటాలు చేస్తున్నాయని విమర్శించారు.
జీవో నంబర్ 42 ప్రకారం జిల్లాస్థాయి ఫీజుల నియంత్రణ కమిటీ నిర్ధారించిన ఫీజులనే వసూలు చేయాల్సి ఉండగా, ఇష్టం వచ్చినట్లు ఫీజులు గుంజుతున్నారని పేర్కొన్నారు. గుర్తింపులేని పాఠశాలలను రద్దు చేయకపోగా నోటీసులు, జరిమానాలు విధిస్తూ కాలయాపన చేస్తున్నారని మల్లికార్జున్ విమర్శించారు. పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు ఎల్.రాజశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వెంటనే యూనిఫాం అందించాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాలన్నారు.
ధర్నాలో అరుణోదయ కళాకారుడు అంజయ్య ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. అనంతరం జిల్లా విద్యాశాఖాధికారిని కలిసి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి జే రమేష్, నాయకులు ఏ రాజు, సీహెచ్ శ్యాంసన్, ఇమ్మానియేల్, అంజి, హనుమంతు పాల్గొన్నారు.
విద్యాసంస్థల బంద్ విజయవంతం
Published Fri, Jul 11 2014 2:17 AM | Last Updated on Sat, Sep 2 2017 10:06 AM
Advertisement
Advertisement