హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయ భూములను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ గురువారం సచివాలయంలోని సీఎం కార్యాలయం (సమతాబ్లాక్) ఎదుట పీడీఎస్‌యూ మహిళా నాయకులు ఆందోళన చేశారు. బారికేడ్ దాటుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో వారు సి-బ్లాక్ ఎదురుగా బైఠాయించి సీఎం డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. పీడీఎస్‌యూ నాయకులను అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు నానాతంటాలు పడ్డారు. మహిళా పోలీసులు లేకపోవడంతో అందుబాటులో ఉన్న ఒక మహిళా పోలీసును అక్కడికి రప్పించి ఆమె సహాయంతో ఆందోళన చేస్తున్న వారిని పోలీసుల వాహనంలోకి ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. అంతకు ముందు పీడీఎస్‌యూ నాయకురాలు సత్య మాట్లాడుతూ ఓయూ స్థలంలో ఇళ్లను నిర్మించాలన్న నిర్ణయాన్ని సీఎం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.