
కోచింగ్ సెంటర్ల బంద్ ఉద్రిక్తం
హైదరాబాద్‌సిటీ (ముషీరాబాద్) : గ్రూప్ 1, 2లతో పాటు పలు పోటీ పరీక్షలకు తర్ఫీదు పొందే విద్యార్థుల ఫీజులను ప్రభుత్వమే నిర్ణయించాలని, షాపింగ్ మాల్స్, ఫంక్షన్ హాల్స్‌లలో రౌడీషీటర్లు, బౌన్సలర్లను పెట్టి కోచింగ్‌లను నిర్వహిస్తున్న యాజమాన్యాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) శుక్రవారం ఇచ్చిన కోచింగ్ సెంటర్ల బంద్ ఉధ్రిక్తతలకు దారి తీసింది. పీడీఎస్‌యూ నేపథ్యంలో ముందస్తుగా అమీర్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, అశోక్‌నగర్ తదితర ప్రాంతాల్లో ఉన్న రామయ్య, షైన్, నాగార్జున, ఐఏఎస్ స్టడీ సర్కిల్, హెచ్‌ఐపీ, ఎమిలీ తదితర కోచింగ్ సెంటర్లు ముందస్తుగానే సెలవులు ప్రకటించాయి.
కానీ పోలీసుల బందోబస్త్‌తో భోలక్‌పూర్‌లోని మహబూబ్ ఫంక్షన్ హాల్లో జయశంకర్ కోచింగ్ సెంటర్, అశోక్‌నగర్‌లోని ఆర్‌సీ రెడ్డి కోచింగ్ సెంటర్లు యథావిథిగా నడిపిస్తుండటంతో దాదాపు వంద మంది పీడీఎస్‌యూ కార్యకర్తలు ఆ కోచింగ్ సెంటర్లను బంద్ చేయించడానికి ప్రయత్నించారు. అప్పటికే అక్కడ మోహరించి ఉన్న కోచింగ్ సెంటర్ల వ్యక్తులు, పోలీసులు పీడీఎస్‌యూ కార్యకర్తలతో వాగ్వావాదానికి దిగడంతో కొద్ది సేపు ఉధ్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. భోలక్‌పూర్‌లోని జయశంకర్ కోచింగ్ సెంటర్ గేట్లు తోసుకుంటూ లోపలికి వెళ్లిన పీడీఎస్‌యూ కార్యకర్తలను ముషీరాబాద్ ఇన్‌స్పెక్టర్ మోహన్‌కుమార్, ఎసై్స సంపత్‌ల ఆధ్వర్యంలో బలవంతంగా పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. అలాగే అశోక్‌నగర్‌లోని ఆర్‌సీరెడ్డి కోచింగ్ సెంటర్ వద్ద కూడా రాజు నేపథ్యంలో పలువురు పోలీసులు పీడీఎస్‌యూ కార్యకర్తలను అడ్డుకొని గాంధీనగర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అరెస్టు అయిన వారిలో పీడీఎస్‌యూ అధ్యక్షులు పరశురాం, ప్రధాన కార్యదర్శి ఎ.డి. రాము, నాయకులు రియాజ్, గణేష్, రంజిత్, నాగరాజు, తిరుమల్, హరికృష్ణలతో పాటు పలువురు ఉన్నారు.