డెంటిస్ట్‌ కాస్త ఐఏఎస్‌ అధికారిగా..! కానీ ఏడేళ్ల తర్వాత.. | Tanu Jain Trained Doctor To Become IAS Officer But Resigned After 7 Years | Sakshi
Sakshi News home page

డెంటిస్ట్‌ కాస్త ఐఏఎస్‌ అధికారిగా..! కానీ ఏడేళ్ల తర్వాత..

Published Thu, Dec 26 2024 2:00 PM | Last Updated on Thu, Dec 26 2024 4:17 PM

Tanu Jain Trained Doctor To Become IAS Officer But Resigned After 7 Years

డెంటిస్ట్‌గా సాగిన ప్రయాణం అనూహ్యంగా ఐఏఎస్‌ లక్ష్య సాధన వైపుకి మారింది. పట్టుదలతో ఐఏస్‌ సాధించి.. తన కలను సాకారం చేసుకుంది. అంతలోనే ఇది కాదు నా గమ్యం అంటూ ఆ అత్యున్నత పదవికి రాజీనామా చేసేసింది. కేవలం టీచింగ్‌పై ఉన్న అభిరుచితో ఆమె తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయానికి అందరూ విస్తుపోయారు. ఇదేంటి అని అంతా నోరెళ్లబెట్టారు..కానీ ఆమె మాత్రం మనసుకు నచ్చింది చేయడంలో కలిగే అనుభూతి వేరేలెవెల్‌ అంటోంది. ఇంతకీ ఎవరామె..? అంతటి అత్యున్నత హోదాను ఎందుకు తృణప్రాయంగా వదిలేసిందంటే..?

ఢిల్లీలోని సదర్‌ ప్రాంతానికి చెందిన తనూ జైన్‌ సాహసమే ఊపిరి అన్నట్లుగా ఊహకందని నిర్ణయాలతో అందర్నీ విస్తుపోయేలా చేస్తుంటారామె. ఆమె ప్రతి ఆలోచన వెనుక ఎంతో పెద్ద లక్ష్యం, కృతనిశ్చయాలు ఉంటాయి. అవి ఆలోచింపచేసేలా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. ఇక జైన్‌ పాఠశాల విద్యని కేంబ్రిడ్జ్ స్కూల్‌లోనే పూర్తి చేసింది. ఆ తర్వాత బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీని చదువుతూనే సివిల్స్‌పై దృష్టిసారించింది. 

తొలి ప్రయత్నంలోనే ప్రిలిమ్స్‌లో విజయం సాధించినప్పటికీ మెయిన్స్‌లో చాలాసార్లు వైఫల్యాలను ఎదుర్కొంది. అయినా.. పట్టుదలతో 2014లో మూడో ప్రయత్నంలో ఆల్ ఇండియా ర్యాంక్ 648ని సాధించి.. తన కలను సాకారం చేసుకుంది. ఆ తర్వాత జైన్‌ సివిల్‌ సర్వీస్‌కి సంబంధించి.. వివిధ హోదాల్లో ఏడేళ్ల పాటు సేవలందించారు. అయితే ఉపాధ్యాయ వృత్తిపై ఉన్న మక్కువతో అంతటి అత్యున్నత హోదాని వదులుకోవాలనే అనూహ్య నిర్ణయం తీసుకుంది. 

ఇక్కడ కూడా తనూ తనలా యూపీఎస్సీ సన్నద్ధమయ్యేవాళ్లు ఎదుర్కొనే సవాళ్లలో.. అండగా నిలబడాలనే దృక్పథంతో ఇలాంటి షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. "సివిల్‌ సర్వీస్‌లో ఉద్యోగం సాధించాలన్న తన కల నెరవేరిపోయింది. అలాగే తనలా ఇతరులు కూడా తమ డ్రీమ్‌ని నెరవేర్చుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఇలా చేసినట్లు చెప్పుకొచ్చింది." జైన్‌. ఆ నేపథ్యంలోనే ఆమె 'ఐసీఎస్‌ తథాస్తు' అనే సివిల్స్‌ కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ని ప్రారంభించింది. ఈ కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ద్వారా యూపీఎస్సీకి ప్రిపేర్‌ అయ్యేవారికి మార్గదర్శకం చేయడమే గాక ప్రేరణాత్మక ప్రసంగాలు, ఆచరణాత్మక సలహాలతో ఆకట్టుకుంటారామె. 

ఆ వైవిధ్యభరితమైన బోధనాపద్ధతుల కారణంగా ఆమెకు సోషల్‌మీడియాలో మంచి ఫాలోయింగ్‌ ఉంది. అంతేగాదు ఇన్‌స్టాలో ఏకంగా ఎనిమిది లక్షలకు పైగా ఫాలోవర్లను సంపాదించుకున్నారు జైన్‌. మాక్‌ ఇంటర్వ్యూలు, ప్రిపరేషన్‌ స్టాటజీలను మెరుగుపరుచుకోవడంపై మంచి మంచి సలహలిస్తుంటారు జైన్‌. తనలా ఇతరులు కూడా సక్సెస్‌ అందుకోవాలని ఆకాంక్షించే వ్యక్తులు దొరకడం అత్యంత అరుదు కదూ..!.

(చదవండి: వివాహాల గూఢచారి...భావనా పాలివాల్‌)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement