- మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్
కేయూ క్యాంపస్(వరంగల్ జిల్లా)
తెలంగాణ లోని యూనివర్సిటీలకు వీసీలను నియమించే తీరిక రాష్ట్ర ప్రభుత్వానికి లేదా అని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ ప్రశ్నించారు. పీడిఎస్‌యూ రాష్ర్ట మహసభల సందర్భంగా ఆదివారం కాకతీయ యూనివ ర్సిటీ ఆడిటోరియంలో ‘విద్యారంగ పరిస్థితి - తెలంగాణ రాష్ట్రం’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు.
తెలంగాణ ఉద్యమ కాలంలోనే కాక రాష్ట్రం సాధించిన తర్వాత కూడా ఉన్నత విద్యారంగం నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేయాల్సిన యూనివర్సిటీ విద్య నానాటికి దిగజారుతోందని అన్నారు. యూనివర్సిటీలకు వీసీలను నియమించకుండా జాప్యం చేయడం సరికాదన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల కోరిక మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్రంలో సుమారు 500 పాఠశాలల్లోనే ఇంగ్లిష్ మీడియం అమల్లో ఉందని, అదికూడా స్థానిక ఉపాధ్యాయుల కృషితోనేనని తెలిపారు. రాష్ట్రంలో 19 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే విద్యారంగం పట్ల ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి తరగతి గదికి టీచర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు గైర్హాజరు కూడా 20 శాతం వరకు ఉంటోందని, వారిలోనూ అంకితభావం కొరవడిందని అన్నారు. సదస్సులో పీడిఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు జూపాక శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కె.ఎస్.ప్రసాద్, ఉపాధ్యక్షులు సత్య, ఎం.సుధాకర్, కార్యదర్శులు రాము ,శరత్, సరిత తదితరులు పాల్గొన్నారు.