గుమాస్తా చదువులకు స్వస్తి పలికి శాస్త్రీయ విద్యావిధానం కోసం ఉద్యమించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) 20వ రాష్ట్ర మహాసభల్లో పలువురు వక్తలు పిలుపునిచ్చారు. మూడురోజులు జరిగే మహాసభల ప్రారంభం సందర్భంగా శుక్రవారం ఆర్ట్స్ కళాశాల నుంచి సుబ్రహ్మణ్యమైదానం వరకూ భారీ ర్యాలీ జరిగింది. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రామకృష్ణ అధ్యక్షతన జరిగిన బహిరంగసభలో సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి పి.టాన్యా మాట్లాడుతూ విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందుకవసరమైన నిధులను పెంచడం లేదన్నారు.
ప్రాథమిక విద్యను పటిష్టత పేరుతో ప్రభుత్వ పాఠశాలలను, రెసిడెన్షియల్ వసతి గృహాల పేరుతో సంక్షేమ వసతి గృహాలను మూసివేస్తున్నారని, మోదీ అధికారంలోకి వచ్చాక విద్యను మత విలువలతో, అజ్ఞానంతో నింపడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రామకృష్ణ మాట్లాడుతూ విద్యపై విదేశీ పెత్తనం పెరుగుతోందని, ప్రభుత్వాలు పేదలకు విద్యను దూరం చేస్తున్నాయని విమర్శించారు. విద్య, ఉపాధి కనుమరుగవుతున్న స్థితిలో ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అవ సరమన్నారు.
కళాశాలలు ఆత్మహత్యల కర్మాగారాలుగా మారడానికి ప్రైవేటు యాజమాన్యాల లాభాపేక్షే కారణమన్నారు. న్యూ డెమోక్రసీ కేంద్ర నాయకుడు సాదినేని వెంకటేశ్వర్లు, పీడీఎస్‌యూ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు చిట్టిపాటి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి యు.గనిరాజు, రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సీఎస్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.