మంత్రి ఆళ్ల నాని సమక్షంలో ఒప్పందం చేసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వ అధికారులు
సాక్షి, అమరావతి: అమెరికాలో స్థిరపడిన రంగరాయ వైద్యకళాశాల పూర్వ విద్యార్థులు (రంగరాయ మెడికల్ కాలేజీ అలుమిని ఆఫ్ నార్త్ అమెరికా–రాంకానా) రూ.20 కోట్లతో మాతాశిశు ఆరోగ్యకేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సోమవారం సచివాలయంలోని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) సమక్షంలో ఎంవోయూ కుదిరింది. దాదాపు రూ.20 కోట్లతో నిర్మించే మూడంతస్తుల నిర్మాణాలను 2020 డిసెంబర్ నాటికి పూర్తి చేయనున్నట్టు ఆర్‌ఎంసీఏఎన్‌ఏ ప్రతినిధులు వెల్లడించారు. ఇప్పటికే ఈ కేంద్రంలో జీ ఫ్లస్ 1 నిర్మాణం దాదాపు పూర్తయింది. దీన్ని నిర్మించేందుకు గతంలోనే ఆర్‌ఎంసీఏఎన్‌ఏ ప్రతినిధులు వైద్య ఆరోగ్య శాఖకు ప్రతిపాదనలు పెట్టుకున్నారు. ఆర్‌ఎంసీఏఎన్‌ఏ ప్రతిపాదనలో భాగంగా 2,3,4 అంతస్తుల నిర్మాణానికి తాజాగా ప్రభుత్వంతో ఒప్పందం జరిగింది. ఇక్కడ 2, 3, 4 అంతస్తుల్లో ప్రసూతి, చిన్నారుల పడకలు, ఎన్‌ఐసీయూ, ఫ్యాకల్టీ రూమ్‌లు, కాన్ఫరెన్స్ హాల్స్ నిర్మిస్తారు. కార్యక్రమంలో ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి డా. కేఎస్ జవహర్‌రెడ్డి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ కార్తికేయ మిశ్రా, డీఎంఈ డాక్టర్ వెంకటేష్, ఆర్‌ఎంసీఏఎన్‌ఏ యాక్టింగ్ ప్రెసిడెంట్ ఏవీ సుబ్బారాయ చౌదరి, ముఖ్య దాత నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్, ఓ.కృష్ణమూర్తి తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment