కాకినాడలో జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేస్తున్న డిప్యూటీ సీఎం ఆళ్ల నాని. చిత్రంలో కలెక్టర్ మురళీధర్‌రెడ్డి, ఎస్పీ నయీం అస్మీ, ఎంపీ గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి తదితరులు
సాక్షి, తూర్పుగోదావరి: జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని, దీనికి అవసరమైన వనరుల సేకరణకు శక్తివంచన లేకుండా శ్రమిద్దామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, ఉప ముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) పిలుపునిచ్చారు. కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో గురువారం నిర్వహించిన 73వ స్వాతంత్య్ర దిన వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఆయన సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అక్టోబర్ రెండో తేదీ నుంచి జిల్లాలో 1,271 పూర్తిస్థాయి గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. వీటి ద్వారా ప్రతి కుటుంబానికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా అందిస్తామన్నారు. ఇందుకోసం ప్రతి 50 కుటుంబాలకు ఒకరు చొప్పున జిల్లాలో 24,570 మంది వలంటీర్లను నియమించామని తెలిపారు.
గ్రామ వలంటీర్లు గురువారం నుంచే తమ విధులు ప్రారంభిస్తారన్నారు. జిల్లాలో ఏర్పాటు కానున్న 1,271 గ్రామ సచివాలయాల్లో 13,981 మంది సిబ్బంది నియామకానికి సెప్టెంబర్ 1న పరీక్షలు నిర్వహించి, అభ్యర్థులను ఎంపిక చేసి, అక్టోబర్ 2 నుంచే వారు విధుల్లో చేరేవిధంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఇటీవల వరద పీడిత గ్రామాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాల అమలులో జిల్లా యంత్రాంగం చేసిన కృషిని మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, ఎంపీ వంగా గీత, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ఎమ్మెల్సీ ఐవీ రావు, జాయింట్ కలెక్టర్–2 రాజకుమారి, డీఆర్వో సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.
మంత్రి ఇంకా ఏమన్నారంటే..
⇔ఉపాధి హామీ పథకం కింద పేదలకు ఉపాధి కల్పన, సుస్థిర గ్రామీణాభివృద్ధి, ఆస్తుల కల్పన, పర్యావరణ పరిరక్షణ, జీవన ప్రమాణాల పెంపుదలే లక్ష్యంగా ఈ ఏడాది జిల్లాలో రూ.732 కోట్లు ఖర్చు చేయాలన్నది లక్ష్యం.
⇔రాష్ట్రంలో అర్హత కలిగిన అన్ని కుటుంబాలకూ ఉగాది నాటికి 25 లక్షల ఇంటిస్థలాలు అందించనున్నాం. ఇందుకు అనువైన భూమిని గుర్తించే ప్రక్రియ జిల్లాలో ప్రారంభమైంది. జిల్లాలోని అర్బన్ ప్రాంతాల్లో 1.40 లక్షల మంది లబ్ధిదారులకు 300 ఎకరాలు గుర్తించాం. గృహ వసతి లేని 1.03 లక్షల కుటుంబాలను ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ వెబ్‌సైట్‌లో నమోదు చేశాం. వీరందరికీ రానున్న నాలుగేళ్లలో దశల వారీగా వివిధ పథకాల ద్వారా గృహవసతి కల్పించేందుకు చర్యలు చేపడుతున్నాం.
⇔జిల్లాలో సాగు విస్తీర్ణం పెంచేందుకు, అధికోత్పత్తులు సాధించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. జిల్లాలో ఖరీఫ్‌లో 13.88 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి లక్ష్యంగా నిర్ణయించాం.
⇔జిల్లాలో కౌలు రైతులకు రుణ అర్హత కార్డులపై రూ.145.75 కోట్లు మంజూరు చేశాం. ప్రతి నియోజకవర్గంలోనూ విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల పరీక్షల కోసం ల్యాబ్‌ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం.
⇔వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా ప్రతి రైతుకూ పెట్టుబడి రాయితీ కింద ఏటా రూ.12,500 చెల్లిస్తాం. ఈ పథకం అక్టోబర్ 15 నుంచి అమలులోకి వస్తుంది.
⇔ప్రధానమంత్రి ఫసలీ బీమా యోజన కింద ఖరీఫ్, రబీ కాలంలో రైతులు చెల్లించాల్సిన ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ప్రతి రైతూ ఒక్క రూపాయి మాత్రమే చెల్లించడం ద్వారా బీమా పొందుతారు. ఈ నెల 21 వరకూ మాత్రమే గడువు ఉన్నందున రైతులందరూ దీనిని వినియోగించుకోవాలి. సమీకృత వ్యవసాయం, మిశ్రమ వ్యవసాయం కోసం కార్యక్రమాలు రూపొందిస్తున్నాం.
⇔మత్స్యకారుల పడవలకు కొత్తగా అనుమతులు మంజూరు చేస్తాం. వేట నిషేధ సమయంలో వారికిచ్చే ఆర్థిక సహాయాన్ని రూ.4 వేల నుంచి రూ.10 వేలకు పెంచాం. డీజిల్ సబ్సిడీని డెడికేటెడ్ పెట్రోల్ బంకుల ద్వారా పంపిణీ చేయడం, ప్రమాదవశాత్తూ మత్స్యకారుడు మరణిస్తే ఆ కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం పంపిణీ వంటి కార్యక్రమాలు చేపడుతున్నాం.
⇔వైఎస్సార్ భరోసా కింద జిల్లాలో 2,39,344 మంది వృద్ధులు, 11,009 మంది చేనేత పనివారు, 2,26,000 మంది వితంతువులు, 67,114 మంది విభిన్న ప్రతిభావంతులు, 5,856 మంది కల్లుగీత కార్మికులు పింఛన్లు పొందుతున్నారన్నారు. అభయహస్తం కింద 10,332 మంది ఒంటరి మహిళలకు, 7,971 మంది మత్స్యకారులకు, 1,669 మంది చర్మకారులకు, 1,411 డప్పు కళాకారులకు, 598 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులకు, 184 మంది ట్రాన్స్‌జెండర్లకు రూ.140 కోట్లు అందిస్తున్నాం.
⇔ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలో భాగంగా జిల్లాలోని 86,674 మహిళా సంఘాలకు నాలుగు విడతలుగా రూ.2,395.32 కోట్ల మేర రుణమాఫీ చేస్తాం. స్త్రీనిధి లక్ష్య సాధనలో 44.83 శాతంతో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో ఉంది.
⇔జిల్లాలోని వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలతో పాటు విద్యా ప్రమాణాలు పెంపొందించాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన మేరకు.. వివిధ కార్పొరేట్ సంస్థలు, దాతలు, మేజర్ కాంట్రాక్టర్ల సహకారంతో వాటిని అభివృద్ధి చేసే కార్యక్రమాలు ప్రారంభించాం. ఈ కార్యక్రమం కోసం ముఖ్యమంత్రి ఇప్పటికే రూ.14 కోట్లు మంజూరు చేశారు.
⇔జగ్జీవన్‌జ్యోతి ఉచిత విద్యుత్ పథకం కింద ఎస్సీలకు 100 యూనిట్లు ఉన్న విద్యుత్ రాయితీని 200 యూనిట్లకు పెంచాం.
⇔గిరిజనేతర విద్యార్థులతో సమానంగా గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే అవకాశాలు కల్పిస్తున్నాం. చింతూరు ఐటీడీఏ ఆధ్వర్యంలో ‘శబరి’ వాటర్ తయారీలో శిక్షణ ఇచ్చి, వారి ఉత్పత్తులు మార్కెటింగ్ అయ్యేలా ప్రోత్సహిస్తున్నాం.
⇔వెనుకబడిన తరగతుల వారి కోసం ప్రభుత్వం శాశ్వత కమిషన్ ఏర్పాటు చేసింది. రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలరింగ్ వృత్తి చేసుకునే వారికి ఏటా రూ.10 వేలు వారి ఖాతాల్లో జమయ్యేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
⇔వైద్య ఖర్చులు రూ.వెయ్యి దాటితే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం వర్తింపజేస్తున్నాం.
⇔పోలవరం ప్రాజెక్టు ఆర్‌ఆర్ ప్యాకేజీ అమలులో గత ప్రభుత్వం చేసిన జాప్యం మూలంగా ఏజెన్సీ గ్రామాలు ముంపునకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. దీనిని నివారించేందుకు సీజన్ అయిన వెంటనే నిర్వాసితులకు ఆర్‌ఆర్ ప్యాకేజీ అమలు చేసే దిశగా చర్యలు చేపడుతున్నాం.
⇔సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పారిశ్రామికవేత్తల కోసం జిల్లాలో 83.24 ఎకరాల్లో 4 ఎంఎస్‌ఎంఈ పార్కులను అభివృద్ధి చేస్తున్నాం.
⇔పెద్ద ఎత్తున పర్యాటకులను ఆకర్షించే విధంగా జిల్లాలో వివిధ పనులు చేపడుతున్నాం.
⇔ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో బెల్ట్ షాపులను పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు చేపడుతున్నాం.
⇔రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా చేపట్టిన ‘స్పందన’ కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు చేపడుతున్నాం.
⇔జిల్లాలో ఇప్పటికే 37,198 అర్జీలు రాగా, వీటిలో 21,713 అర్జీలు మంజూరు దశలో ఉన్నాయి. 1,986 అర్జీలు పరిష్కరించాం. 11,521 అర్జీలు పరిష్కార దశలో ఉన్నాయి.
⇔ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశం మేరకు ప్రతి పోలీస్ స్టేషన్‌లోనూ రిసెప్షన్ కౌంటర్లు ఏర్పాటు చేసి, ప్రజల సమస్యలను సామరస్యంగా పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నాం.
⇔వికాస ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తున్నాం.
⇔జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యాన రూ.40.30 కోట్లతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో క్రీడా వికాస కేంద్రాల నిర్మాణాలకు సన్నాహాలు చేస్తున్నాం. ఎస్సీ ఉపప్రణాళిక కింద రూ.4 కోట్లతో రాజానగరం మండలం కలవచర్లలో క్రీడాప్రాంగణం మంజూరు చేశాం.
Comments
Please login to add a commentAdd a comment