‘దావోస్ పర్యటన–పెట్టుబడులు’ అంశంపై వెబినార్‌లో ప్రముఖుల వెల్లడి
ఎన్‌ఆర్‌ఐ టీడీపీ సంస్థ ద్వారా యూరప్ ఎన్‌ఆర్‌ఐలకు మెయిల్స్
రాజకీయ సంస్థకు తమ డేటాను ఎలా లీక్ చేశారని మండిపాటు
జీడీపీఆర్‌కు ఫిర్యాదు చేసేందుకు సమాయత్తం
రాష్ట్రంలో పాలన చూసి పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు
వైఎస్ జగన్ పాలనలోనే బెస్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్
సాక్షి, అమరావతి: ఎన్‌ఆర్‌ఐ టీడీపీ వింగ్‌కు ఎన్‌ఆర్‌ఐల డేటా లీక్ చేయడం కలకలం సృష్టిస్తోందని, ఒక రాజకీయ సంస్థకు తమ డేటాను ఎలా లీక్ చేస్తారని యూరోప్ ఎన్‌ఆర్‌ఐలు కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని పలువురు ప్రముఖులు వెల్లడించారు. ‘దావోస్ పర్యటన–రాష్ట్రానికి పెట్టుబడులు’ అనే అంశంపై బెటర్ ఆంధ్రప్రదేశ్ ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం వెబినార్ నిర్వహించారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు యూరోప్ నుంచి పలువురు వాణిజ్య నిపుణులు, న్యాయవాదులు, పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక రాజకీయ సంస్థ (ఎన్‌ఆర్‌ఐ టీడీపీ)కు డేటా లీక్ అయ్యిందని, ఈ సంస్థ ద్వారా యూరోప్‌లోని ఎన్‌ఆర్‌ఐలకు మెయిల్స్ రావడం చూసి అందరూ ఆందోళనకు గురయ్యారనే విషయం ఈ వెబినార్‌లో ప్రస్తావనకు వచ్చింది.
ఈ విషయమై జీడీపీఆర్ (జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్)కు ఫిర్యాదులు చేయనున్నారనే విషయం ఈ వెబినార్ ద్వారా బయట పడింది. ఈ వెబినార్‌లో ఎవరెవరు ఏం మాట్లాడారంటే..
డేటా లీక్‌పై విచారణ జరపాలి
ఒక రాజకీయ సంస్థగా ఉన్న ఎన్‌ఆర్‌ఐ టీడీపీ అనే సంస్థ నుంచి మాకు మెయిల్స్ రావడం చాలా సీరియస్ అంశం. యూరోప్‌లోని మొత్తం తెలుగు ఎన్‌ఆర్‌ఐలు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై విచారణ జరగాలి. ఆయా దేశాల్లోని ఎన్‌ఆర్‌ఐలు జీడీపీఆర్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్దమయ్యారు.
దావోస్‌లో ఆంధ్రప్రదేశ్ గురించి కాకుండా రెడ్ బుక్ గురించి మాట్లాడారు. అక్కడ నో కార్ జోన్ ఉంటుంది. ఎంత పెద్ద వారు అయినా అక్కడ నడవాల్సిందే. దానిని కూడా గొప్పగా ప్రచారం చేసుకోవడం విడ్డూరం. జిందాల్ సంస్థ ఈ రాష్ట్రంలో పెట్టాల్సిన రూ.మూడు లక్షల కోట్ల పెట్టుబడి మహారాష్ట్రకు వెళ్లిపోయింది. ఒక మహిళతో కేసులు పెట్టించడం చేటు చేసింది. – ఎల్లాప్రగడ కార్తీక్, ఆర్థిక నిపుణుడు, ఇంటర్నేషనల్ ట్రేడ్
దావోస్ ఎంవోయూలు చిత్తు కాగితాలా?
దావోస్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు రిక్త హస్తాలతో తిరిగి వచ్చి, దావోస్ ఎంవోయూలు చిత్తు కాగితాలతో సమానం అని చెప్పడం దారుణం. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు రూ.లక్షల కోట్ల పెట్టుబడులను తమ రాష్ట్రాలకు తీసుకువస్తుంటే, చంద్రబాబు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు. పైగా ప్రపంచ తీరు తెలుసుకునేందుకే దావోస్‌కు వెళ్లామని చెప్పడం ఆయన అసమర్థతకు నిదర్శనం. – వీవీఆర్ కృష్ణంరాజు, కన్వీనర్, బెటర్ ఆంధ్రప్రదేశ్ ఫోరం
ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
రాష్ట్రానికి ప్రాజెక్ట్‌లు రావాలంటే ఎటువంటి ప్రోత్సాహకాలు, ఎటువంటి సహకారం ఇస్తామనే దానిపై సమగ్ర ప్రణాళికతో దావోస్‌కు వెళ్లాలి. అది జరగలేదు. ఇటీవల విజయవాడలో జరిగిన డ్రోన్ సమ్మిట్‌కు పలు సంస్థలు వచ్చాయి.
కానీ చేసిన హడావుడికి, ఆచరణలో సంస్థల పట్ల వ్యవహరించిన తీరుకు మధ్య చాలా తేడా ఉంది. గతంలో సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో విశాఖలో నిర్వహించిన సదస్సులో భోజనాల కోసం తోపులాట జరగడం ఎవరూ మరచిపోలేదు. – జేటీ రామారావు, ఏపీ ప్రజాసంఘాల జేఏసీ అధ్యక్షుడు
ఏపీకి నిర్దిష్ట పారిశ్రామిక విధానం లేదు
పెట్టుబడులు రావాలంటే రాష్ట్రంలో మానవ వనరులతో పాటు మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అనుకూల రాజకీయ ప్రభుత్వం, సులభతర వాణిజ్య విధానాలు ఉండాలి. దేశంలో బెస్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను సాధించిన రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. తెలంగాణా రాష్ట్రం ఫార్మా, ఐటీ, హాస్పిటాలిటీ, టూరిజం వంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చింది. ఏపీ మాత్రం దేనిపైనా ఫోకస్ పెట్టలేక పోయింది. నిర్దిష్ట పారిశ్రామిక విధానం లేదు. – చింతలపాటి సుబ్బరాజు, ఏపీ సివిల్ సొసైటీ కో కన్వీనర్
పవన్ ప్రాధాన్యత తగ్గించేందుకే
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాధాన్యతను తగ్గించాలన్న లక్ష్యంతోనే దావోస్ పర్యటనను వినియోగించుకున్నారు. సీఎం చంద్రబాబు, లోకేశ్‌లు దావోస్‌కు వెళితే రూ.లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయనేది భ్రమ అని నిరూపితమైంది. ఎన్‌ఆర్‌ఐల డేటాను రాష్ట్ర ప్రభుత్వం లీక్ చేయడంపై న్యాయస్థానంలో కేసు నమోదు చేయబోతున్నాం. – పల్లి ప్రభాకర్ రెడ్డి, న్యాయ నిపుణుడు, సామాజిక ఉద్యమకారుడు
అస్తవ్యస్తంగా చంద్రబాబు పాలన
వైఎస్ జగన్ పాలనలో దావోస్ పర్యటనలో రూ.1.26 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకువచ్చారు. ఈరోజు చంద్రబాబు పర్యటన ద్వారా ఒక్క రూపాయి కూడా పెట్టుబడి రాలేదు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఎందుకు తీసుకెళ్లలేదు? రేవంత్‌రెడ్డి రూ.1.79 లక్షల కోట్లు తెలంగాణాకు తీసుకువచ్చారు. చంద్రబాబు, లోకేశ్ మాత్రం ఉత్త చేతులతో రాష్ట్రానికి వచ్చారు. బాబు పాలనలో అప్పులు పెరిగాయి, రాబడి తగ్గింది. ఈ లెక్కన ఎవరిది సమర్థమైన పాలన? – బి.అశోక్ కుమార్, ఆంధ్రా అడ్వొకేట్స్ ఫోరం కన్వీనర్
Comments
Please login to add a commentAdd a comment