kakinada govt hospital
-
ప్రభుత్వాసుపత్రికి 20 కోట్లు ఇచ్చిన పూర్వవిద్యార్థులు
సాక్షి, అమరావతి: అమెరికాలో స్థిరపడిన రంగరాయ వైద్యకళాశాల పూర్వ విద్యార్థులు (రంగరాయ మెడికల్ కాలేజీ అలుమిని ఆఫ్ నార్త్ అమెరికా–రాంకానా) రూ.20 కోట్లతో మాతాశిశు ఆరోగ్యకేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సోమవారం సచివాలయంలోని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) సమక్షంలో ఎంవోయూ కుదిరింది. దాదాపు రూ.20 కోట్లతో నిర్మించే మూడంతస్తుల నిర్మాణాలను 2020 డిసెంబర్ నాటికి పూర్తి చేయనున్నట్టు ఆర్ఎంసీఏఎన్ఏ ప్రతినిధులు వెల్లడించారు. ఇప్పటికే ఈ కేంద్రంలో జీ ఫ్లస్ 1 నిర్మాణం దాదాపు పూర్తయింది. దీన్ని నిర్మించేందుకు గతంలోనే ఆర్ఎంసీఏఎన్ఏ ప్రతినిధులు వైద్య ఆరోగ్య శాఖకు ప్రతిపాదనలు పెట్టుకున్నారు. ఆర్ఎంసీఏఎన్ఏ ప్రతిపాదనలో భాగంగా 2,3,4 అంతస్తుల నిర్మాణానికి తాజాగా ప్రభుత్వంతో ఒప్పందం జరిగింది. ఇక్కడ 2, 3, 4 అంతస్తుల్లో ప్రసూతి, చిన్నారుల పడకలు, ఎన్ఐసీయూ, ఫ్యాకల్టీ రూమ్‌లు, కాన్ఫరెన్స్ హాల్స్ నిర్మిస్తారు. కార్యక్రమంలో ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి డా. కేఎస్ జవహర్‌రెడ్డి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ కార్తికేయ మిశ్రా, డీఎంఈ డాక్టర్ వెంకటేష్, ఆర్ఎంసీఏఎన్ఏ యాక్టింగ్ ప్రెసిడెంట్ ఏవీ సుబ్బారాయ చౌదరి, ముఖ్య దాత నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్, ఓ.కృష్ణమూర్తి తదితరులున్నారు. -
ప్రభుత్వాస్పత్రి నుంచి రిమాండ్ ఖైదీ పరార్..
సాక్షి, తూర్పు గోదావరి: కాకినాడ ప్రభుత్వాస్పత్రి నుంచి రిమాండ్‌లో ఉన్న ఓ ఖైదీ పరారయ్యాడు. వివరాల్లోకి వెళితే.. సామర్లకోట మండలం గూడపర్తి గ్రామంలో జరిగిన బండి సత్యవతి హత్యకేసులో ప్రధాన ముద్దాయి, హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సురేష్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో అతన్ని నిన్న కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. ఈ క్రమంలో తప్పించుకున్న రిమాండ్ ఖైదీ బండి సురేష్ ఇదే అదనుగా భావించి పరారయ్యాడు. -
ప్రాణాలతో సెల్‌గాటం
సర్పవరం (కాకినాడసిటీ) : కాకినాడ నగరంలో రాత్రి ఏడుగంటల సమయంలో వీచిన ఈదురు గాలులకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రిలో సెల్‌ఫోన్ లైటింగ్ మధ్య వైద్యులు శస్త్ర చికిత్స పూర్తి చేయాల్సి వచ్చింది. పెద్దాపురం మండలం ఉలిమేశ్వరం పల్లపు వీధికి చెందిన జున్ను నాగేశ్వరరావు (72) పొలంలో పని చేస్తుండగా మంగళవారం సాయంత్రం ఈదురులుగాలులు వీచాయి. దీంతో అతడు ఇంటికి వస్తుండగా కొబ్బరిచెట్టు విరిగి అతడి కుడి కాలిపై పడింది. తీవ్రంగా గాయపడ్డ అతడిని జీజీహెచ్‌కు తరలించారు. అత్యవసర విభాగంలో అతడి కాలికి చికిత్స చేస్తుండగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జనరేటర్ ఆన్ చేసేందుకు జాప్యం కావడంతో వైద్యులు తప్పనిసరి పరిస్థితుల్లో చీకట్లో సెల్‌ఫోన్ వెలుగులో చికిత్స అందించారు. 15 నిమిషాల వ్యవధిలో జనరేటర్ ఆన్ చేయడంతో విద్యుత్ సరఫరా వచ్చింది. అప్పటి వరకూ అత్యవసర విభాగంలోని రోగులంతా చీకట్లోనే గడిపారు. కాగా, నాగేశ్వరరావు చికిత్స పొందుతూ రాత్రి 9.40 గంటల ప్రాంతంలో మృతి చెందినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. -
కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో తప్పిన ప్రమాదం
-
చనిపోతుంటే పట్టించుకోరా..?: వైఎస్ జగన్
కాకినాడ/రంపచోడవరం: మరణాలు సంభవిస్తున్నా గిరిజన ప్రాంతాలను పట్టించుకునే తీరిక ప్రభుత్వానికి లేకుండా పోయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లప్పుడు మాత్రమే వారిని గుర్తు చేసుకుంటారా అని మండిపడ్డారు. పదుల సంఖ్యలో గిరిజనులు రోగాల బారిన పడుతున్నా వారివైపు 108గానీ, 104గానీ వచ్చే దిక్కు లేకుండా పోయిందని, కనీసం ఏఎన్ఎం సౌకర్యాలు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చాపరాయి గిరిజన గ్రామ విష జ్వర బాధితులను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం సాయంత్రం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి పౌష్టికాహార లోపం వల్లే జ్వరం బారిన పడ్డారని వైద్యులు వైఎస్ జగన్‌కు తెలిపారు. ఉదయం కొంతమందిని ఉన్నపలంగా డిశ్చార్జి చేయడంపై ప్రశ్నించగా వారికి జ్వరం తగ్గిందని అందుకే పంపించామని ప్రస్తుతం ఉన్నవారు కాస్త నీరసంగా ఉండటంతో పౌష్టికాహారం అందిస్తూ వైద్యం చేస్తున్నామని తెలిపారు. అనంతరం జ్వర బాధితులను వైఎస్ జగన్ పరామర్శిస్తూ వారి జీవన పరిస్ధితులు, ఎదుర్కొంటున్న సమస్యలను కూడా తెలుసుకున్నారు. ముఖ్యంగా మౌళిక సదుపాయాలైన విద్య, వైద్యం, విద్యుత్, రోడ్డు సౌకర్యం, ఆహారంవంటి అంశాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయగా బాధితులు బోరుమన్నారు. తమకు విద్యుత్ సౌకర్యం లేదని, రోడ్లు కూడా లేవని, సాగునీరు లేక, ఆహారం కూడా సరిగా దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. గతంలో (వైఎస్ హయాంలో) ఉచితంగా బియ్యం ఇచ్చేవారని ఇప్పుడు వాటిని కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదని, పూర్తి నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుందన్నారు. ఇప్పటికే పదిమందికి పైగా తమ గిరిజన ప్రాంతాల్లో చనిపోయారని, పలువురు రోగాల బారిన పడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని వారు వైఎస్ జగన్‌కు ఏకరువు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా బాధితులకు తాను అండగా ఉంటానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి రాగానే గిరిజనులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో సాంఘిక బహిష్కరణకు గురైన దళితులను వైఎస్ జగన్ పరామర్శించిన విషయం తెలిసిందే. అక్కడ జరిగిన సంఘటనల పర్వాన్ని తెలుసుకున్న ఆయన వివాద పరిష్కారానికి వైఎస్సార్ సీపీ తరపున కమిటీ ఏర్పాటు చేశారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరిన వైఎస్ జగన్ సాయంత్రం కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి విషజ్వర బాధితులను పరామర్శించారు. -
జేఎన్టీయూకే విద్యార్థి అనుమానాస్పద మృతి
కాకినాడ సిటీ : జేఎన్టీయూ-కాకినాడలో ఎంటెక్ రెండో సంవత్సరం చదువుతున్న కోటా రాహుల్ (23) శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కృష్ణా జిల్లా నూజివీడు మండలం గంపలగూడేనికి చెందిన రాహుల్ కాకినాడలోని ఒక ప్రైవేటు హాస్టల్లో ఉంటూ చదువు సాగిస్తున్నాడు. ఉదయం బాత్రూముకు వెళ్లిన రాహుల్ అక్కడే పడిపోయి ఉండడాన్ని రూమ్మేట్స్ గుర్తించారు. అతడిని వెంటనే కాకినాడ ప్రభుత్వాసుపత్రి(జీజీహెచ్)కి తీసుకువెళ్లారు. అప్పటికే రాహుల్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనారోగ్యంతో బాధపడుతున్న రాహుల్ లో బీపీతో పడిపోయి ఉండవచ్చని వైద్యులు చెప్పారు. మృతదేహాన్ని జీజీహెచ్ అవుట్‌పోస్ట్ పోలీసులు మార్చురీకీ తరలించారు. సహచర విద్యార్థుల నుంచి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై సర్పవరం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జేఎన్టీయూకే అధికారులు రాహుల్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. -
భార్యపై కత్తితో దాడి.. భర్త పరారీ
కాకినాడ: కట్టుకున్న భార్యపై విచక్షణ లేకుండా కత్తితో దాడిచేశాడో భర్త. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడలో ఏతిమొగ ప్రాంతంలో బుధవారం వెలుగుచూసింది. కత్తితో దాడి చేయడంతో భార్య మరియమ్మ కోమాలోకి వెళ్లింది. దాడిచేసిన అనంతరం భర్త అక్కడినుంచి పరారయ్యాడు. గమనించిన స్థానికులు ఆమెను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మద్యం మత్తులో తండ్రిని చితకబాదిన కొడుకు
సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోట మండలం ఉండూరులో ఆదివారం ఓ దారుణం వెలుగుచూసింది. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన కొడుకు తన తండ్రిని చితకబాదాడు. దాంతో తండ్రి చిట్టిపల్లి అబ్బాయికి గాయాలయ్యాయి. అతన్ని చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పిఠాపురంలో చిరువ్యాపారిపై పోలీసుల దాష్టీకం
తూర్పుగోదావరి పిఠాపురంలో పోలీసులు దాష్టీకానికి ఒడిగట్టారు. ఇటీవల ఓ హత్య చోటు చేసుకుంది. ఆ హత్య కేసులో పిఠాపురానికి చెందిన చిరువ్యాపారి శ్రీనివాస్‌కి సంబంధం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఆ హత్య కేసుకు తనకు ఎటువంటి సంబంధం లేదని శ్రీనివాస్ పోలీసులకు తెలిపాడు. అయిన ఆ కేసులో శ్రీనివాస్‌కు ప్రమేయం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేసి, అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని స్టేషన్‌కు తీసుకువెళ్లి విచారణ పేరుతో చితకబాదారు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని వైద్య చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాస్‌కు ఆ హత్యతో ప్రమేయం లేదని ఎంత వాదించిన స్టేషన్‌కు తీసుకువెళ్లారని అతడి కుటుంబ సభ్యులు ఆరోపించారు.