
కాకినాడ ఎమర్జన్సీ వార్డులో కరెంటు పోవడంతో సెల్‌ఫోన్ వెలుగులో చికిత్స చేస్తున్న వైద్యులు
సర్పవరం (కాకినాడసిటీ) : కాకినాడ నగరంలో రాత్రి ఏడుగంటల సమయంలో వీచిన ఈదురు గాలులకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రిలో సెల్‌ఫోన్ లైటింగ్ మధ్య వైద్యులు శస్త్ర చికిత్స పూర్తి చేయాల్సి వచ్చింది. పెద్దాపురం మండలం ఉలిమేశ్వరం పల్లపు వీధికి చెందిన జున్ను నాగేశ్వరరావు (72) పొలంలో పని చేస్తుండగా మంగళవారం సాయంత్రం ఈదురులుగాలులు వీచాయి.
దీంతో అతడు ఇంటికి వస్తుండగా కొబ్బరిచెట్టు విరిగి అతడి కుడి కాలిపై పడింది. తీవ్రంగా గాయపడ్డ అతడిని జీజీహెచ్‌కు తరలించారు. అత్యవసర విభాగంలో అతడి కాలికి చికిత్స చేస్తుండగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జనరేటర్ ఆన్ చేసేందుకు జాప్యం కావడంతో వైద్యులు తప్పనిసరి పరిస్థితుల్లో చీకట్లో సెల్‌ఫోన్ వెలుగులో చికిత్స అందించారు. 15 నిమిషాల వ్యవధిలో జనరేటర్ ఆన్ చేయడంతో విద్యుత్ సరఫరా వచ్చింది. అప్పటి వరకూ అత్యవసర విభాగంలోని రోగులంతా చీకట్లోనే గడిపారు. కాగా, నాగేశ్వరరావు చికిత్స పొందుతూ రాత్రి 9.40 గంటల ప్రాంతంలో మృతి చెందినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.