oparations
-
అబార్షన్ల అడ్డా.. ఖలీల్‌వాడి!
నిజామాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని ఖలీల్‌వాడి అబార్షన్లకు అడ్డాగా మారింది! ప్రైవేట్ వైద్యుల కాసుల కక్కుర్తి యువతుల ప్రాణాల మీదకు తెస్తోంది. కనీస నిబంధనలు పాటించకుండా అబార్షన్లు చేస్తుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఖలీల్వాడిలోని వివిధ ఆస్పత్రుల్లో రోజూ పది వరకు అబార్షన్లు చేస్తున్నారు. కానీ, ఎక్కడా ఎలాంటి నిబంధనలు పాటించరు. ఎవరు, ఎందుకు ఆస్పత్రికి వచ్చారో, వారికి ఏ చికిత్స చేశారో కూడా రికార్డులు నిర్వహించరు. ప్రైవేట్ ఆస్పత్రులపై వైద్యశాఖ పరిశీలన లేకపోవడంతో ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. సాధారణ చికిత్సలే కాదు, అబార్షన్ల పేరిట విచ్చలవిడిగా దండుకుంటున్నారు. కాసుల కక్కుర్తి.. ఖలీల్వాడిలో సుమారు 40 వరకు ప్రసవ ఆసుపత్రులు ఉన్నాయి. ఇందులో కొన్ని ఆస్పత్రుల్లో నిబంధనలకు విరుద్ధంగా, విచ్చలవిడిగా అబార్షన్లు చేస్తున్నారు. వైద్యారోగ్యశాఖ పరిశీలన లేకపోవడంతో ఈ తతంగం యథేచ్ఛగా కొనసాగుతోంది. గతంలో ఆర్మూర్ డివిజన్‌కు చెందిన ఓ యువతికి అబార్షన్ చేయగా అది వికటించి మృతి చెందింది. ఇలాంటి ఘటనలు రెండు, మూడు వెలుగు చూసినా అధికారులు పెద్దగా స్పందించలేదు. దీంతో ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు డబ్బుల కోసం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మోసపోయి.. ప్రేమ పేరుతోనో, మరే కారణంతోనో వలలో పడి చాలా మంది అమాయక యువతులు మోసపోతున్నారు. ఎదుటి వారిని పూర్తిగా సర్వస్వం అప్పగించేస్తున్నారు. ఈ క్రమంలో గర్భం దాల్చుతున్నారు. మరోవైపు, భర్తకు దూరంగా ఉన్న మహిళలు, అలాగే, అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్న వారు అవాంఛిత గర్భం దాల్చుతున్నారు. అక్రమ సంబంధాలతో పాటు ప్రేమ పేరుతో మోసానికి గురైన వారు అబార్షన్ల కోసం ఎక్కువగా వస్తున్నారు. ఇలాంటి కేసులు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనే చోటు చేసుకుంటున్నాయి. అక్కడి మహిళలు, యువతులు పెద్దగా చదువుకోక పోవడం, అలాగే, ఆధునిక గర్భనిరోధక పద్ధతులు తెలియక పోవడంతో ఈజీగా మోసపోతున్నారు. జిల్లా కేంద్రంలోనే ఎక్కువగా.. అవాంఛిత గర్భం దాల్చిన యువతులు, మహిళలు తొలుత ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. వారు కమీషన్లకు కక్కుర్తి పడి మాయమాటలు చెప్పి జిల్లా కేంద్రంలోని ఆస్పత్రులకు తీసుకొస్తున్నారు. ఇలా వచ్చిన యువతులకు కనీస నిబంధనలు, ప్రమాణాలు పాటించకుండా ఇష్టమొచ్చినట్లు అబార్షన్లు చేస్తున్నారు. అవి వికటించి ప్రాణాల మీదకు వస్తున్నాయి. కేసులు తగ్గడంతో.. ప్రభుత్వం సర్కారు ఆస్పత్రులను బలోపేతం చేయడం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించే వారికి పలు ప్రయోజనాలు కల్పిస్తుండడంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య బాగా పడిపోయింది. ఈ నేపథ్యంలో కొందరు ప్రైవేట్ డాక్టర్లు అబార్షన్లను ఆదాయ మార్గంగా ఎంచుకున్నారు. ఎంత రిస్క్ కేసు అయినా సరే అబార్షన్లు చేసేస్తున్నారు. యువతుల బలహీనతలను ఆధారంగా చేసుకొని ఒక్కో అబార్షన్‌కు రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు తీసుకుంటున్నట్లు తెలిసింది. పట్టించుకోని వైద్యారోగ్య శాఖ ప్రైవేట్ ఆస్పత్రుల్లో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నా, అనవసరమైన పరీక్షలు, చికిత్సల పేరుతో దండుకుంటున్నా వైద్యారోగ్య శాఖ స్పందించడం లేదు. ఇక గుట్టుచప్పుడు కాకుండా సాగే అబార్షన్ల విషయంలో అసలే మాత్రం పట్టించుకోవడం లేదు. అబార్షన్లకు సంబంధించి లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు వచ్చినా వాటిపై వైద్యారోగ్యశాఖ విచారణ చేపట్టలేదు. ముఖ్యంగా ఖలీల్వాడిలోని ఓ ఆస్పత్రి, అలాగే, పక్కనే గల సరస్వతినగర్‌లో రెండు ఆస్పత్రులు, ప్రధాన రోడ్డుకు ఉన్న మరో ప్రైవేట్ ఆస్పత్రిలో ఎక్కువగా అబార్షన్లు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో ఆస్పత్రిలో వారం వ్యవధిలో 15 వరకు అబార్షన్ కేసులు నమోదవుతున్నా పెద్దగా స్పందించిందీ లేదు. వాస్తవానికి ప్రైవేట్ ఆస్పత్రుల్లో తరచూ తనిఖీలు నిర్వహించాల్సిన వైద్యారోగ్య శాఖ అధికారులు ఎక్కడా తనిఖీలు చేసిన దాఖలాల్లేవు. పైగా కనీసం పరిశీలన కూడా చేయకుండా ఎంతో కొంత తీసుకుంటూ ఆస్పత్రులకు అనుమతులు ఇచ్చేస్తున్నారు. ‘మచ్చ’తునకలెన్నో.. గతంలో ఆర్మూర్ డివిజన్‌కు చెందిన ఓ యువతికి అబార్షన్ చేయగా, అది వికటించి ఆమె మృతి చెందింది. నిర్మల్‌కు చెందిన మరో మహిళకు సరస్వతినగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాహకులు అబార్షన్ చేశారు. అది వికటించి ఆమె ప్రాణాల మీదకు వచ్చింది. డిచ్పల్లి మండలానికి చెందిన మరో మహిళ ఆస్పత్రికి రాగా, అబార్షన్ చేసేశారు. దీంతో బాధితురాలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. కఠిన చర్యలు తీసుకుంటాం.. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో అబార్షన్లు చేపడితే కఠిన చర్యలు చేపడుతాం. ఆస్పత్రులు నిబంధనల ప్రకారం నడుచుకోవాలి. త్వరలోనే ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం. లోపాలు ఉన్నట్లు తేలితే చర్యలు తీసుకుంటాం. – సుదర్శనం, డీఎంహెచ్‌వో -
ఎదురు‘చూపు’
కరీంనగర్‌హెల్త్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమం అభాసుపాలవుతోంది. దృష్టి లోపం, కళ్ల సమస్యలపై పరీక్షలు నిర్వహించి కొందరికి కళ్లద్దాలు పంపిణీ చేసింది. కానీ శస్త్రచికిత్స అవసరమని గుర్తించిన వారిపై పట్టింపు కరువైంది. ఆపరేషన్ ఎప్పుడు చేస్తారో తెలియక బాధితులు ఎదురు చూడాల్సి వస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం 16శాతం మంది కంటిచూపు మందగించి కళ్లజోళ్లు వాడుతున్నారు. రాష్ట్రంలో జరిపిన సర్వే ప్రకారం 40శాతం మంది కళ్లద్దాలు వాడుతున్నట్లు తేలింది. అందరికీ చూపు ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో లక్షలాదిమంది ప్రజలు వివిధ రకాల కంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని వెల్లడైంది. కంటి వెలుగుకు సంబంధించిన కార్యక్రమం ద్వారా వైద్య, ఆరోగ్యశాఖ తాజాగా సర్కారుకు పంపిన నివేదికలో అనేక అంశాలను వెల్లడించింది. గత యేడాది ఆగస్టు నుంచి అందరికీ కంటి పరీక్షలు నిర్వహించి కళ్లద్దాలు అందజేయడంతోపాటు అవసరమైన వారందరికీ కంటి శస్త్రచికిత్సలు నిర్వహించాలని సకల్పించింది. జిల్లాలో 24 బృందాలు కంటిపరీక్షలు నిర్వహిస్తున్నాయి. కంటి వెలుగు పథకం ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 5,88,339 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు పోగ్రాం అధికారులు తెలిపారు. 22,689 మందికి ఆపరేషన్లు అవసరం ఉన్నట్లు నిర్ధారించి కేసులను సంబంధిత ఆస్పత్రులకు రెఫర్ చేశారు. రెఫర్ చేసినవారికి ఇంతవరకు ఆపరేషన్లు చేయకపోవడంతో ఎదురుచూస్తున్నారు. ఈ ఉద్దేశం మంచిదే అయినప్పటికీ ఇప్పటివరకు ఒక శస్త్రచికిత్స కూడా నిర్వహించలేదు. ప్రభుత్వం అందజేస్తున్న కళ్లద్దాల్లో నాణ్యతలేదని, వృద్ధులకు ఇచ్చే కళ్లద్దాల ఫ్రేములు పిల్లలకు, పిల్లలవి వృద్ధులకు ఇస్తుండడంతో ధరించడం ఇబ్బందికరంగా మారిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్ష్యం చేరని కంటివెలుగు.. అందరిలోనూ కంటి చూపు సమస్యలు నివారించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు పథకం జిల్లాలో కొనసాగుతున్నా లక్ష్యం చేరడం లేదు. ఈ కార్యక్రమం ద్వారా విధిగా పరీక్షలు నిర్వహిస్తున్నా ఇప్పటివరకు ఒక్కరికి కూడా శస్త్రచికిత్స జరుపలేదు. ఆరంభంలో పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్సలు అవసరమైన వారికి ఆపరేషన్లు నిర్వహించింది. వరంగల్, నాగర్‌కర్నూల్‌తోపాటు మరికొన్ని ప్రాంతాల్లో ఇన్ఫెక్షన్ కారణంగా ఆపరేషన్లు ఫెయిలై బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో వెంటనే ప్రభుత్వం ఆపరేషన్లు నిలిపివేసింది. ప్రత్యేక కంటి వైద్యశాలల్లోనే ఆపరేషన్లు నిర్వహిస్తామని అప్పటి వరకు కేసులను గుర్తించి జాబితా తయారు చేసుకోవాలని సూచించింది. శస్త్రచికిత్సల నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆపరేషన్లు చేయడానికి కావాల్సిన ఆస్పత్రులను సమకూర్చుకునేందుకు సిద్ధం అవుతోంది. ఈ కార్యక్రమం చేపట్టి ఆరు నెలలు కావస్తున్నా అవసరమైన వారికి శస్త్రచికిత్సలు నిర్వహించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుండడంతోపాటు బాధితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు వినవస్తున్నాయి. ప్రభుత్వం ఇస్తున్న కళ్లద్దాలలో నాణ్యత లేదని, మొక్కుబడిగా అందజేస్తున్నారని, సరైన సైజుల్లో అద్దాలు లేక వాటిని ధరించలేకపోతున్నట్లు ప్రజలు పేర్కొంటున్నారు. ఆదేశాలు రాగానే ఆపరేషన్లు.. ప్రభుత్వం అదేశాలు రాగానే కంటి వెలుగు పథకంతో కంటి ఆపరేషన్లు నిర్వహిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా కంటివెలుగు ద్వారా ఎంతమందికి ఆపరేషన్లు అవసరం ఉందో డేటా అంతా ప్రభుత్వం వద్ద ఉంది. కంటి ఆపరేషన్లు నిర్వహించడానికి కావాల్సిన సౌకర్యాలు అన్ని సమకూర్చేందుకు ప్రయత్నం చేస్తోంది. ఆపరేషన్లు అవసరమైన వారందరికీ త్వరలోనే అనుమతిరాగానే తప్పకుండా శస్త్రచికిత్సలు నిర్వహించడం జరుగుతుంది. – డీఎంహెచ్ఓ డాక్టర్ రాంమనోహర్‌రావు -
దాతలు ఆదుకోవాలని వినతి
తూర్పుగోదావరి, అముజూరు (కె.గంగవరం): అప్పటి వరకు సంతోషంగా ఉన్న ఆ కుటంబం విషాదంలోకి వెళ్లింది. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన పాము వీర వెంకట సత్యనారాయణ(40) హిందీ మాస్టారుగా రామచంద్రపురం పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూల్లో పనిచేస్తున్నారు. ఆయనకు వచ్చే జీతంతో భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులతో సంతోషంగా ఇప్పటి వరకు కడిపారు. హిందీ మాస్టారుగా ఎంతో మంది విద్యార్థులను హిందీ భాషలో ప్రావీణ్యులను చేశారు. నెల రోజుల క్రితం సత్యనారాయణ అనార్యోగానికి గురైతే కుటుంబ సభ్యులు కాకినాడ ఆసుపత్రికి తరలించారు. వారు పరీక్షలు చేసి రెండు కిడ్నీలు పాడైపోయాయని చెప్పడంతో ఒక్కసారిగా వారి పరిస్థితి తల్లకిందులైంది. ఆయన చెల్లి కిడ్నీని దానం చేయడంతో కాకినాడలోని ట్రస్టు ఆసుపత్రిలో ఆరోగ్య శ్రీ ద్వారా రూ.ఐదు లక్షలతో ఆపరేషన్ ఇటీవల చేయించారు. ఆపరేషన్ అనంతరం చేయాల్సిన చికిత్స కొనసాగాలంటే మరో రూ.మూడు నుంచి నాలుగు లక్షల వరకు ఖర్చవుతుందని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. కూలిపనులు చేసుకునే తాము ఇంత డబ్బు తేలేక, ఆరోగ్య బాగుంటే చాలని వారు ఆవేదన చెందుతున్నారు. ఉన్నదంతా పోగేసి ఆపరేషన్ చేయించామని, మిగతా చికిత్స కోసం కావల్సిన సొమ్ములు ఎలా అని వారు సతమతమవుతున్నారు. దాతలు సాయం చేస్తే చికిత్స చేయడానికి వీలుగా ఉంటుందని దాతలు ఎవరైనా సాయం చేయాలని వారు కోరుతున్నారు. సాయం అందించాల్సిన దాతలు ఆంధ్రాబ్యాంకు అకౌంట్ నంబర్ 044010100135297, ఐఎఫ్‌సీ కోడ్ ఏఎన్‌డీబీ0000440 నంబర్‌కు సాయం అందించాలని వారు కోరుతున్నారు. నేరుగా సాయం అందించాలనే దాతలు సెల్: 98485 42811కు సంప్రదించాలని వారు కోరుతున్నారు. -
సేవా హస్తాలు..!
అనారోగ్యంతో బాధపడుతున్న ఓ అభాగ్యుడికి ఆపరేషన్ కోసం రూ.లక్షలు అవసరమయ్యాయి. కానీ ఎవరిస్తారు? చదువుకునేందుకు డబ్బులు లేక సాయం చేసే దాతలు లేక చదువు మానేసి ఇంటిబాట పట్టిన వారూ ఉన్నారు. ఇటువంటి కష్టాలకు, సమస్యలకు చెక్ పెట్టే దిశగా సేవాహస్తాలు ముందుకొచ్చాయి. కష్టం ఏదైనా.. సమస్య ఎంత పెద్దదైనా సరే.. తాము నిధులు సేకరించి ఆదుకుంటున్నారు ‘గుడ్‌క్లాప్’ నిర్వాహకులు. వెబ్సైట్ రూపొందించి దాతలు ఇచ్చిన డబ్బులతో ఆపన్నహస్తం అందిస్తున్నారు. హిమాయత్‌నగర్: నిజాంపేటకు చెందిన గండ్రపు శశాంక్ సీఏ చదువుకున్నారు. ఆర్థిక సమస్యలు, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వారికి సాయం చేసేవారు లేక, చదువుకునే వారికి ఆర్థిక సాయం చేసేవారు లేక ఇబ్బందుల పాలవుతున్నవారిని గుర్తించి ఆదుకుంటున్నారు. సమస్యల్లో ఉన్న వారి కోసం నిధుల సేకరణ చేయాలనే ఆలోచనకు 2017లో శ్రీకారం చుట్టారు. స్నేహితుడు డాక్టర్ రాజ్‌కు విషయాన్ని వివరించారు శశాంక్. రాజ్ ప్రోత్సాహంతో 2018 మార్చిలో క్రౌండ్ ఫండింగ్‌ను మొదలుపెట్టారు. దీని కోసం ‘గుడ్‌క్లాప్’ పేరుతో కంపెనీని స్థాపించి అదే పేరుతో వెబ్‌సైట్‌ను రూపొందించారు. క్లిక్ చేస్తే చాలు సాయం.. మీ ఇంట్లోని వారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా.. చదువు కోసం ఫండింగ్ కావాలన్నా.. సమాజానికి ఉపయోగపడే మంచి పని చేయాలన్నా.. డబ్బు కావాల్సిందే. మనవద్ద ఉన్న డబ్బు సరిపోని పరిస్థితుల్లో దాతల కోసం ఎదురు చూస్తుంటాం. ఇటువంటి వారు తమ ‘గుడ్‌క్లాప్’ని ఆశ్రయిస్తే తాము మధ్యవర్తిత్వం వహిస్తూ మీకు కావాల్సిన డబ్బును ఇస్తామంటున్నారు ఫౌండర్ శంశాంక్. వెబ్సైట్లోకి వెళ్లి ‘స్టార్ట్ క్యాంపెయిన్’ అనే బటన్ క్లిక్ చేస్తే చాలు. ‘గుడ్‌క్లాప్’ నిర్వాహకులు మీకు కాంటాక్ట్‌లోకి వచ్చేస్తారు. ఇప్పటివరకు వీరు ఎంతో మందిని ఆదుకున్నారు ‘గుడ్‌క్లాప్’ సభ్యులు భార్గవ, పావని, రాజు, నితిన్, ఫణి. మనల్ని కాంటాక్ట్ చేస్తారు. ఆ తరువాత ఎక్కడైతే చికిత్స జరుగుతుందో..ఆ హాస్పిటల్‌కు వస్తారు. సంబంధిత డాక్టర్‌తో సంప్రదింపులు జరుపుతారు. మెడికల్ రిపోర్ట్స్ అన్నీ పరిశీస్తారు. వాస్తవమని నిర్ధారించుకున్న తర్వాత.. దీనికి సంబ«ంధించిన స్క్రిప్ట్‌ని తయారు చేస్తారు. స్క్రిప్ట్ చదివే వారికి నమ్మకాన్ని, కంటతడి పెట్టించేలా రాస్తారు. ఆ తర్వాత వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. దీనిద్వారా వచ్చిన డబ్బులను హాస్పిటల్‌కే వెళ్లి చెల్లిస్తారు. కమీషన్ 6శాతం.. ఇంత కష్టపడి టీం వర్క్ చేస్తూ ఫండ్ కలెక్ట్ చేస్తున్న వీరు వచ్చిన ఫండింగ్‌లో నుంచి 6శాతం కమీషన్ తీసుకుంటారు. ఈ కమీషన్‌తో సంస్థ ఉద్యోగుల జీతాలు, మెయింట్‌నెన్స్, స్క్రిప్ట్ సిద్ధం చేసిందుకు వాడతారు. సాయం చేసిన వారి వివరాలు ఫొటోతో సహా వెబ్సైట్లో ప్రచురిస్తారు. తమకు ఈ విధమైన ప్రచారం వద్దనుకుంటే ఆప్షన్ హైడ్ చేస్తే సరిపోతుంది. మీరు సాయం చేసినా.. పబ్లిగ్గా మీ ఫొటో, మీ వివరాలు కనిపించవు. మీరు మాత్రమే చూసుకునే వెసులుబాటు ఉంటుంది. వీరిని ఆదుకున్నారు.. ♦ తమిళనాడు వేలూరులోని ‘సీఎంసీ’ హాస్పిటల్లో ‘రేర్ బ్లడ్ డిజార్డర్’తో బాధపడుతున్న స్రవంతి అనే యువతి రూ.15 లక్షలు అవసరమయ్యాయి. గుడ్‌క్లాప్ వెబ్సైట్ ద్వారా ఇప్పటి వరకు రూ.2.41లక్షలు హాస్పిటల్‌కు చెల్లించారు. ♦ ఇండోసోల్ అనే కర్ణాటక వాళ్లు ఓ ఆల్బమ్ కోసం ఫండ్ కావాల్సి వచ్చింది. దీంతో గుడ్క్లాప్ను సంప్రదించారు. వారికి రూ.2.8 లక్షలు ముట్టాయి. దీనిద్వారా వాళ్ల ఆల్బమ్ రెడీ అయ్యింది. ♦ బెంగళూరుకు చెందిన నటరాజ్ అనే యువకుడు ఇంటర్నల్ బ్లీడింగ్‌తో చికిత్సలో ఉన్నాడు. దీనికి గాను రూ.10లక్షలు అవసరం. ఇప్పటి వరకు రూ.2లక్షలు నేరుగా హాస్పిటల్‌కు ఇచ్చారు. ♦ కేరళ వరదల్లో చిక్కుకున్న వారికి సాయం చేయాలనే దృక్పథంతో ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్’ వాళ్లు ఫండ్‌కు రేజ్ చేశారు. ఇలా రూ.5.66 లక్షలను కేరళ వరద బాధితులకు ఇవ్వగలిగారు. ♦ హైదరాబాద్‌కు చెందిన వేణుకుమార్ భార్య ప్రసవించింది. పాప ఏడో నెలలో పుట్టడంతో ఇంక్యుబెటర్‌లో ఉంచాల్సి వచ్చింది. వైద్య ఖర్చుల కోసం రూ.4 లక్షల వరకు అవసరమయ్యాయి. ఆమెకు రూ.3.9లక్షలు అందించారు. ♦ అన్నపూర్ణ స్టూడియోకు చెందిన కొందరు యువకులు ‘నాన్దెవ్రూ’ అనే షార్ట్‌ఫిల్మ్ తీయడానికి రూ.2.20లక్షల సాయం కావాల్సి వచ్చింది. వీరికి రూ.2.23లక్షలు వచ్చాయి. ఇదే స్టూడియోలో మరో టీం ‘అంతర్గత’ ‘ఫేక్ ప్రెగ్నెన్సీ’ పై షార్ట్ ఫిల్మ్ తీసేందుకు రూ.1.49లక్షలు అవసరం కాగా..రూ.1.50లక్షలు వచ్చాయి. ♦ నగరానికి చెందిన రాజు తండ్రి రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతిచెందారు. రాజు తలకు తీవ్రగాయాలయ్యాయి. రిబ్స్ విరిగిపోయాయి. ఇప్పుడు ఇతని చికిత్స కోసం రూ.7లక్షలు కావాలి. ప్రస్తుతం రూ.1.46లక్షలు అందాయి. -
మందగించిన ‘కంటివెలుగు’
ఆదిలాబాద్‌టౌన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘కంటి వెలుగు’ కార్యక్రమం ముందుకు సాగుతున్నా.. వైద్య పరీక్షలు చేయించుకున్న వారు శస్త్ర చికిత్సల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. దీంతో వారిచూపు మందగిస్తోంది. కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆగస్టు 15న ప్రారంభించారు. నాలుగు నెలలు గడిచినా ఇంతవరకు జిల్లాలో ఒక్కరికి కూడా కంటి ఆపరేషన్ చేసిన దాఖలాలు లేవు. దీంతో బాధితులు ఆపరేషన్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. కాగా ఈ కార్యక్రమం ఫిబ్రవరిలో ముగియనుంది. జిల్లాలో 7లక్షల 8వేల మందికి కంటి పరీక్షలు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 2లక్షల 49వేల మందికి మాత్రమే పరీక్షలు జరిపారు. గడువులోగా పరీక్షలు పూర్తవ్వడం గగనంగానే కనిపిస్తోంది. జిల్లాలోని 18 మండలాల్లో 18 బృందాలతో కంటి వెలుగు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మొత్తం 7లక్షల 8వేల మంది ఉండగా, ఇప్పటి వరకు 2లక్షల 49వేల 88 మందికి కంటి పరీక్షలు చేశారు. ఇందులో పురుషులు 1లక్ష 12వేల 120 మంది ఉండగా, మహిళలు 1లక్ష 36వేల 950 ఉన్నారు. దాదాపు 40 శాతం వరకు మాత్రమే లక్ష్యం పూర్తయినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. అప్పటిలోగా అందరికి కంటి పరీక్షలు జరిగేనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా 4లక్షల 50వేల మంది వరకు కంటి పరీక్షలు చేయాల్సి ఉంది. అయితే అధికారుల లెక్కల ప్రకారం మరో లక్ష మంది వరకు మాత్రమే కంటి సమస్యలతో బాధపడుతున్నట్లు అంచనా వేస్తున్నారు. కళ్లాద్దాల పంపిణీలోనూ జాప్యమే.. పరీక్షలు పూర్తిచేశాక కంటి సమస్యతో బాధపడుతున్న వారికి కంటి అద్దాలు పంపిణీ చేయాల్సి ఉంటుంది. అయితే జిల్లాలో బాధితులకు అద్దాల పంపిణీలోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇప్ప టి వరకు 44,035 మందికి రీడింగ్ అద్దాలు పంపి ణీ చేశారు. అలాగే దూరపు, దగ్గరి చూపునకు సంబంధించిన కంటి అద్దాలు 27,428 పంపిణీ చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 7,215 మందికి మాత్రమే పంపిణీ చేశారు. దాదాపు 20వేల మందికి ఇంకా పంపిణీ కావాల్సి ఉంది. కంటి పరీక్షలు చేయించుకున్న వీరు కంటి అద్దాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. శస్త్రచికిత్స సంగతేంటి? పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కంటి వెలుగు కార్యక్రమం ద్వారా కంటి పరీక్షలు చేయించుకున్న వారిలో కొంత మందికి శస్త్ర చికిత్సలు అవసరం కాగా, ఇప్పటివరకు ఏ ఒక్కరికి సైతం శస్త్ర చికిత్స చేసిన దాఖలాలు లేవు. కేవలం కంటి పరీక్షలకే పరిమితమవుతున్నట్లు తెలుస్తోంది. కంటి సమస్యతో బాధపడుతున్న 25,447 మందిని శస్త్ర చికిత్సల కోసం వివిధ ఆస్పత్రులకు రిఫర్ చేయగా, ఎక్కడ కూడా ఇప్పటివరకు ఆపరేషన్ చేయలేదు. కంటి సమస్యతో బాధపడుతున్న వారు అధికారులను ఆపరేషన్ ఎప్పుడు చేస్తారని అడిగితే దాటవేస్తున్నారని చెబుతున్నారు. లక్ష్యం పూర్తయ్యేనా.. ఫిబ్రవరిలోగా కంటి వెలుగు కార్యక్రమ లక్ష్యం పూర్తవ్వడం అనుమానంగానే కనిపిస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఆగస్టులో ప్రారంభించగా జిల్లాలో 50 శాతానికి కూడా లక్ష్యం చేరుకోలేదు. మరో 60 రోజుల్లో వంద శాతం కంటి పరీక్షలు చేసేలా పరిస్థితులు కనిపించడం లేదు. ప్రభుత్వ సెలవులు, పండుగ రోజుల్లో ఈ శిబిరాలకు సెలవు ఉండడంతో ప్రక్రియ ముందుకు సాగడం లేదు. కాగా గడిచిన నాలుగు నెలల్లో 2లక్షల 49వేల మందికి పరీక్షలు జరిపారు. ఇంకా 4లక్షల 50వేల వరకు పరీక్షలు చేయాల్సి ఉంది. మార్చిలో కంటి ఆపరేషన్లు కంటి వెలుగు కార్యక్రమం ద్వారా జిల్లాలో 2.60లక్షల మందికి కంటి పరీక్షలు చేశాం. శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి 2019 మార్చి మొదటి వారంలో చేయిస్తాం. ఫిబ్రవరి చివరి వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. 80 శాతం వరకు స్క్రీనింగ్ పూర్తవుతుంది. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలి. – రాజీవ్‌రాజ్, డీఎంహెచ్‌వో, ఆదిలాబాద్ -
ఆపరేషన్లకు బ్రేక్!
గుంటూరు మెడికల్: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో రెండు నెలలుగా ఈఎన్టీ వైద్య విభాగంలో ఆపరేషన్లు నిలిచిపోయాయి. ఆపరేషన్ థియేటర్‌ను ఆధునీకరించేందుకు ఆపరేషన్లు నిలిపివేశారు. నిర్మాణ పనులు నత్తనడకన నడుస్తూ ఉండటంతో ఆపరేషన్ల ప్రక్రియలో జాప్యం చోటు చేసుకుంటుందని వైద్యులు చెబుతున్నారు. ప్రతిరోజూ ఆరుగురికి.. ఈఎన్టీ ఆపరేషన్ థియేటర్లో ప్రతిరోజూ ఆరుగురికి పైగానే ఆపరేషన్లు చేస్తున్నారు. ప్రతినెలా 80కి పైగా ఆపరేషన్లు చేస్తూ ఉండటంతో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా ఆస్పత్రికి నెలకు రూ.12లక్షలకు పైగా ఆదాయం వస్తుంది. రెండు నెలలుగా ఆపరేషన్లు నిలిచిపోవడంతో ఆస్పత్రికి పథకం ద్వారా వచ్చే ఆదాయం తగ్గడంతో పాటుగా వైద్యులు, వైద్య సిబ్బందికి వచ్చే పారితోషికాలు సైతం తగ్గిపోయాయి. అత్యవసరమైన స్థితిలో ఆస్పత్రికి వచ్చే ఈఎన్టీ బాధితులకు మాత్రమే వారం ఒక్కరికి లేదా ఇద్దరికి ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్లు చేస్తున్నారు. సాధారణ రోగులకు తెల్లరేషన్‌కార్డు ఉన్నా ఎన్టీఆర్ వైద్యసేవ పథకం ద్వారా అన్ని రకాల ఆపరేష్లన్లు చేయకపోవటంతో జీజీహెచ్ చుట్టూ రోగులు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఆస్పత్రి అధికారులు సైతం హెచ్‌డీఎస్ మీటింగ్‌లో చర్చించి అత్యాధునిక వైద్య పరికరాల ను ఈఎన్టీ వైద్య విభాగానికి కేటాయించారు. అయితే ఆధునిక వైద్య సేవలను పేద రోగులకు చేరువ చేసేందుకు ఆపరేషన్ థియేటర్ నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతుందని వైద్యనిపుణులు తెలియజేస్తున్నారు. ఆర్ధోపెడిక్ది అదే పరిస్థితి.. ఆర్ధోపెడిక్ వైద్య విభాగం ఆపరేషన్ థియేటర్ సైతం నిర్మాణం జరుగుతుంది. రెండు నెలలుగా ఆపరేషన్ థియేటర్ నిర్మాణం జరుగుతూ ఉండటంతో అత్యవసర కేసులకు, రోడ్డు ప్రమాద బాధితులకు మాత్రమే ఆర్ధోపెడిక్ వైద్యులు ఆపరేషన్లు చేస్తున్నారు. సాధారణ సమస్యలతో వచ్చే వారు, మోకీళ్ల మార్పిడి ఆపరేషన్ల కోసం పేర్లు నమోదు చేయించుకున్నవారికి ఆపరేషన్ థియేటర్స్ కొరత వల్ల ఆపరేషన్లు చేయడంలేదు. ప్రభుత్వం 2015 లో ఎలుకల దాడిలో పసికందు మృతి చెందటం తో ఆస్పత్రి అభివృద్ధికి రూ.4 కోట్లు కేటాయిం చింది. నిధులను సకాలంలో వినియోగించలేదనే ఆరోపణలు ఏపీఎంఎస్ఐడీసీ ఇంజినీరింగ్ అధికా రులపై వచ్చాయి. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి సైతం జీజీహెచ్‌కు విడుదల చేసిన నిధులు వినియోగంలో అలసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసి మెమో కూడా జారీచేశారు. ఆస్పత్రి అధికారులు సకాలంలో ఆపరేషన్ థియేటర్ నిర్మాణ పనులు పూర్తయ్యేలా చూడాలని వైద్య సిబ్బంది, రోగులు కోరుతున్నారు. వారంలో పనులు పూర్తి చేస్తాం ఎన్ఏబీహెచ్ నిధులతో జీజీహెచ్‌లో ఈఎన్టీ ఆపరేషన్ థియేటర్ నిర్మాణ పనులు నిర్వహిస్తున్నాం. మరో వారం రోజుల్లో నిర్మాణ పనులు పూర్తి చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన రూ.4 కోట్లతో నాలుగు మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్స్ నిర్మాణాలు జరుగుతున్నాయి. డిసెంబర్ కల్లా అత్యాధునిక ఆపరేషన్ థియేటర్స్ అందుబాటులోకి వస్తాయి. –యడ్లపాటి అశోక్‌కుమార్,ఈఈ, ఏపీఎంఎస్ఐడీసీ, గుంటూరు -
నిమ్స్‌లో ‘లైటు లేక’ మూతపడ్డ ఆపరేషన్ థియేటర్
సాక్షి,సిటీబ్యూరో: ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులో లేక ఆపరేషన్లు వాయిదా పడిన సంఘటనలు మండలాల్లో జరుగుతుంటాయి. విద్యుత్ కోతలూ అక్కడ సర్వ సాధారణం కనుక వైద్యం వాయిదా పడుతుంది. కానీ ఆపరేషన్ థియేటర్లో లైటు లేక శస్త్ర చికిత్సలు నిలిపివేశారు. ఈ సంఘటన ఎక్కడో మారుమూల గ్రామాల్లోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో అనుకుంటే పొరపాటే.. రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్‌లోనే జరిగింది. అదీ ప్రతిష్టాత్మకమైన నిమ్స్ ఆస్పత్రిలో జరగడం గమనార్హం. ఇక్కడ వైద్య పరికరాల లేమి, మౌలిక సదుపాయాలు, ఆపరేషన్ థియేటర్లు న్యూరోసర్జరీ చికిత్సలకు పెద్ద అడ్డంకిగా మారాయి. రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయమై మెదడులో రక్తం గడ్డకట్టి, కణతులు ఏర్పడి, రక్తనాళాలు చిట్లిపోయి ప్రాణాపాయ స్థితిలో ఇక్కడకు వస్తున్న బాధితులకు చేదు అనుభవమే ఎదరవుతోంది. నిమ్స్‌లో చికిత్స చేసేందుకు అవసరమైన వైద్య నిపుణులు అందుబాటులో ఉన్నప్పటికీ ఆపరేషన్ థియేటర్ల కొరత, వైద్య పరికరాల లేమితో సర్జరీలు వాయిదా పడుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్పొరేట్ ఆస్పత్రులు ఓ వైపు అత్యాధునిక ‘ఓయాయ్, నావిగేషన్ టెక్నాలజీ, స్టీమోటాక్సీన్, ఇంట్రా ఆపరేటివ్ ఎంఆర్ఐ’ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుని న్యూరోసర్జరీ చికిత్సల్లో దూసుకుపోతుంటే.. నిమ్స్‌లో మాత్రం ఇప్పటికీ డాక్టర్ రాజారెడ్డి హయాంలో సమకూర్చిన వైద్య పరికరాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. కొత్తవి కొనుగోలు చేయక పోగా పాత వాటికి మరమ్మతులు చేయించక క్లిష్టమైన చికిత్సలనూ వాయిదా వేయాల్సి వస్తోంది. ‘లైటు లేక’ మూతపడ్డ థియేటర్ న్యూరో సర్జరీ విభాగానికి రోజుకు సగటున 150 కేసులు వస్తుంటాయి. అత్యవసర విభాగం, న్యూరాలజీ విభాగం నుంచి రిఫరల్‌పై మరికొన్ని కేసులు వస్తుంటాయి. వీటిలో 15 శాతం మందికి సర్జరీలు అవసరం అవుతుంటాయి. మూడు యూనిట్లలో ఎమినిమిది మంది సీనియర్ ఫ్యాకల్టీలతో సహా 19 మంది రెసిడెంట్లు పనిచేస్తున్నారు. వీరికి నాలుగు ఆపరేషన్ టేబుళ్లు కేటాయించారు. వీటిలోని ఓ ఓటీ లైటు నెల రోజుల క్రితం పాడైపోవడంంతో థియేటర్‌ను పూర్తిగా మూసివేశారు. దీంతో కీలకమైన సర్జరీలు కూడా వాయిదా పడుతున్నాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో 60 మంది వరకు ఈ చికిత్సల కోసం ఎదురు చూస్తున్నారు. అంతేకాదు మెదడులో ఏర్పడిన కణుతులను తొలగించే క్రమంలో వైద్యుడు ఏది టిఫ్యూనో.. ఏది కణితో గుర్తించాలి. ఇందు కోసం ప్రతి ఆపరేషన్ టేబుల్‌కు ఒక అత్యాధునిక మైక్రోస్కోప్ అవసరం కాగా, రెండు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఒకటి పనిచేయడం లేదు. ఉన్నతాధికారే స్వయంగా అత్యాధునిక మైక్రోస్కోప్‌ల కొనుగోలుకు అడ్డుపడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నిరాకరిస్తున్నకార్పొరేట్ ఆస్పత్రులు రోడ్డు ప్రమాదాల్లో తీవ్ర గాయాలపాలై మెదడులో రక్తం గడ్డకట్టిన ‘ఆరోగ్యశ్రీ’ బాధితులను చేర్చుకునేందుకు కార్పొరేట్ ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ పథకంలో హెడ్ ఇంజూరీ బాధితులకు రూ.లక్ష లోపే ఇస్తున్నారు. సాధారణ చికిత్సతో పోలిస్తే ఇది కొంత క్లిష్టమైంది కావడం, సర్జన్ చార్జీలతో పాటు వెంటిలేటర్, ఐసీయూ, పడక ఖర్చులకు ఇవి ఏమాత్రం సరిపోకపోవడమే ఇందుకు కారణం. హెడ్, బ్రెయిన్ ఇంజూరీ బాధితులను చేర్చుకునేందుకు కార్పొరేట్ ఆస్పత్రులు నిరాకరిస్తుండడంతో వారంతా నిమ్స్‌ను ఆశ్రయిస్తున్నారు. నిమ్స్ అత్యవసర విభాగానికి వచ్చే కేసుల్లో ఇవే ఎక్కువ. ప్రతిరోజూ వచ్చి పడుతున్న అత్యవసర కేసులకు తోడు మెదడులో కణుతులు, వెన్ను, మెడ నొప్పి బాధితులు కూడా చేరుతున్నారు. వీరందరికీ చికిత్స చేసే సదుపాయాలు ఆస్పత్రిలో లేక వైద్యులు కూడా చేతులెత్తేస్తున్నారు. -
తెగిన కాలుతో వచ్చి.. నడిచి వెళ్లాడు
రోడ్డుప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడటంతో మోకాలు వరకు తెగిపోయిన పరిస్థితి. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి వెళిలే మా చేతకాదన్నారు. తెగిన కాలును అలాగే పట్టుకుని వారు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికొచ్చారు. ఇక్కడి వైద్యులు పలు శస్త్రచికిత్సలు చేసి అతను సొంతంగా నడిచి వెళ్లే పరిస్థితికి తెచ్చారు. మంగళవారం ఆసుపత్రిలోని ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో హెచ్ఓడీ డాక్టర్ మంజులబాయి ఆ వివరాలు వెల్లడించారు. కర్నూలు(హాస్పిటల్): అనంతపురం జిల్లా సీకే పల్లి మండలం గంగినేపల్లి గ్రామానికి చెందిన సత్యనారాయణ, వెంకటలక్ష్మి కుమారుడైన సాకె లోకేష్ స్థానికంగా వ్యాన్ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతను 2014 డిసెంబర్ 4వ తేదీన ధర్మవరం సబ్‌జైలు సమీపంలో బైక్‌పై వెళ్తుండగా అదుపు తప్పి కిందపడ్డాడు. అదే సమయంలో కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ అతని కాలుపై ఎక్కింది. అతను గట్టిగా అరిచేలోగా మళ్లీ అలాగే వెనక్కి రావడంతో మరోసారి కాలుపై టైరు ఎక్కింది. దీంతో అతని మోకాలు వరకు ఎముకలు, కండరాలు, నరాలు తెగిపోయాయి. వేలాడుతున్న కాలును అలాగే పట్టుకుని కుటుంబసభ్యులు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. లోకేష్ పరిస్థితిని చూసి మా వల్ల కాదని అక్కడి వైద్యులు కర్నూలుకు రెఫర్ చేశారు. అదే రోజు వెంటనే కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వచ్చిన లోకేష్‌ను ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ రఘునందన్ ఆధ్వర్యంలో చికిత్స అందించారు. ఆ తర్వాత ప్లాస్టిక్ సర్జరీ విభాగం హెచ్ఓడీ డాక్టర్ మంజులబాయి, డాక్టర్ రాజారవికుమార్, డాక్టర్ సావిత్రి, అనెస్తెషియా విభాగం హెచ్ఓడీ డాక్టర్ ఉమామహేశ్వర్ సంయుక్తంగా అతనికి ఆపరేషన్ చేశారు. పలుమార్లు బోన్ రీ కన్స్ట్రక్షన్, పోస్ట్ రియరిర్ ట్రిబియల్ ఆర్టరి రీ కన్స్ట్రక్షన్ వంటి శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఈ విధంగా అప్పట్లో లోకేష్ మూడు నెలలు ఆసుపత్రిలో చికిత్స పొందాడు. అనంతపురం జిల్లాలోని స్వగ్రామానికి వెళ్లి మొదట్లో ప్రతి 15 రోజులకు, ఆ తర్వాత నెలకోసారి ఆసుపత్రికి వచ్చి చికిత్స చేయించుకున్నాడు. అలా మూడేళ్లు చికిత్స పొందిన అనంతరం గత 8 నెలల నుంచి నడవడం ప్రారంభించాడు. మొదట్లో ఏదైనా ఆధారంతో నడిచేవాడు. ఇప్పుడు ఎలాంటి ఆధారం లేకుండా ఒక్కడే నడవగలుగుతున్నాడు. వైద్యులు ఎంతో కష్టపడి తనకు కాలును ప్రసాదించారని లోకేష్ ఆనందం వ్యక్తం చేశాడు. ఎంతో క్లిష్టమైన ఈ ఆపరేషన్‌ను ఆర్థోపెడిక్, అనెస్తీషియా విభాగాల సంయుక్త సహకారంతో విజయవంతంగా చేయగలిగినట్లు డాక్టర్ మంజులబాయి చెప్పారు. -
ఆపరేషన్‌ను మధ్యలో ఆపేసిన వైద్యుడు
అచ్చంపేట రూరల్ (మహబూబ్ నగర్): రోజురోజుకు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆగడాలు ఎక్కువవుతున్నాయి. ఆస్పత్రు ల్లో కాసుల కోసం ఇష్టానుసారంగా ఆపరేషన్లు చేస్తున్నారు. వచ్చిరాని వైద్యంతో ప్రజల ప్రాణాలను పొగొడుతున్నారు. రోగం నయం చేస్తారని ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తే ఏకంగా కాటికే పంపిస్తున్నారు. అచ్చంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిని నడపుతున్న ఓ ప్రభుత్వ వైద్యుడు.. ఓ మహిళ గర్భసంచిలోని గడ్డను తొలగిస్తానని ఆపరేషన్ ప్రారంభించి.. అది పూర్తి చేయకుండానే మధ్యలో నే ఆపి కుట్లువేసిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. బాధితురాలి కుటుంబసభ్యుల కథ నం ప్రకారం.. అచ్చంపేట మండలం సింగారం గ్రామానికి చెందిన గండికోట అనితకు కడుపులో తరుచూ నొప్పి రావడంతో గత నెలలో అచ్చంపేటలోని డీబీఎం ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు. అన్ని టెస్టులు చేశారు. స్కానింగ్ తీశారు. మహిళ గర్భసంచిలో గడ్డ ఉందని వైద్యుడు తారాసింగ్ గుర్తించారు. మహిళకు రక్తం తక్కువగా ఉందని ఇటీవల రక్తం ఎక్కించారు. బుధవారం ఉదయం మహిళకు ఆపరేషన్‌కు అన్ని ఏర్పాట్లు చేసుకుని ప్రారంభించారు. అయితే సదరు మహిళ గర్భసంచిలో గడ్డ అతుకులు అతుకులుగా ఉందని గ్రహించి.. ఆపరేషన్ పూర్తి చేయకుండానే వెంటనే కుట్లు వేశారు. విషయం తెలుసుకున్న ఆ మహిళ బంధువులు ఆందోళనకు దిగారు. డాక్టర్ తారాసింగ్ ఉప్పునుంతలలోని పీహెచ్సీలో విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా అతని సొంత ప్రైవేటు ఆసుపత్రి కావడంతో మహిళకు ఆపరేషన్ చేశారు. మహిళ తీవ్ర అస్వస్థతకు గురయ్యింది. అయితే ఈ విష యం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ బాధితురాలి బంధువుల ఫోన్ల ద్వారా బయటపడింది.ఈ విషయమై డాక్టర్ తారాసింగ్‌ను వివరణ కోరగా గతంలోనే మహిళకు రెండు ఆపరేషన్లు జరిగాయని, బుధవారం ఉదయం ఆపరేషన్ చేసి చూడగా గర్భసంచిలో అతుకులు ఉన్నాయని, మళ్లీ నెల రోజుల తర్వాత ఆపరేషన్ చేయవచ్చనే ఉద్దేశంతో కుట్లు వేసినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆ మహిళలకు ఎలాంటి అపాయం లేదన్నారు. -
ప్రాణాలతో సెల్‌గాటం
సర్పవరం (కాకినాడసిటీ) : కాకినాడ నగరంలో రాత్రి ఏడుగంటల సమయంలో వీచిన ఈదురు గాలులకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రిలో సెల్‌ఫోన్ లైటింగ్ మధ్య వైద్యులు శస్త్ర చికిత్స పూర్తి చేయాల్సి వచ్చింది. పెద్దాపురం మండలం ఉలిమేశ్వరం పల్లపు వీధికి చెందిన జున్ను నాగేశ్వరరావు (72) పొలంలో పని చేస్తుండగా మంగళవారం సాయంత్రం ఈదురులుగాలులు వీచాయి. దీంతో అతడు ఇంటికి వస్తుండగా కొబ్బరిచెట్టు విరిగి అతడి కుడి కాలిపై పడింది. తీవ్రంగా గాయపడ్డ అతడిని జీజీహెచ్‌కు తరలించారు. అత్యవసర విభాగంలో అతడి కాలికి చికిత్స చేస్తుండగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జనరేటర్ ఆన్ చేసేందుకు జాప్యం కావడంతో వైద్యులు తప్పనిసరి పరిస్థితుల్లో చీకట్లో సెల్‌ఫోన్ వెలుగులో చికిత్స అందించారు. 15 నిమిషాల వ్యవధిలో జనరేటర్ ఆన్ చేయడంతో విద్యుత్ సరఫరా వచ్చింది. అప్పటి వరకూ అత్యవసర విభాగంలోని రోగులంతా చీకట్లోనే గడిపారు. కాగా, నాగేశ్వరరావు చికిత్స పొందుతూ రాత్రి 9.40 గంటల ప్రాంతంలో మృతి చెందినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. -
సాయం చేయండి..ఊపిరి పోసుకుంటా
అసలే పేదరికం.....వృద్ధాప్యంలో బాగోగులు చూసుకుంటాడనుకున్న కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ నేపథ్యంలో కిడ్నీ సమస్య తీవ్రమైంది.ఆర్థిక సమస్యలతో డయాలసిస్ చేయించుకోలేకఇబ్బంది పడుతున్నాడు. దాతలు సాయం చేస్తే ఊపిరి పోసుకుంటానని వేడుకుంటున్నాడు. సున్నపురాళ్లపల్లి (రాజంపేట టౌన్) : రాజంపేట మండలం సున్నపురాళ్ళపల్లె గ్రామానికి చెందిన జి.వెంకటేష్ అలియాస్ ఉమర్‌బాషా రెండేళ్ల క్రితం కిడ్నీ వ్యాధి బారిన పడ్డాడు. వయసులో ఉన్నప్పుడు ఏదో ఒక వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ముగ్గురు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేశాడు. వయస్సు పైబడటం, దానికి తోడు ఆరోగ్యం సహకరించక పోవడంతో ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఏడాదిన్నర క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉమర్‌బాషా కుమారుడు మృతి చెందడంతో ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. ఈ నేపథ్యంలో ఉమర్‌బాషాకు కిడ్నీ సమస్య అధికమైంది. రెండు నెలలుగా మూడు రోజులకోసారి డయాలసిస్ చేసుకోవాల్సిన పరిస్థితి. బంధువులు, తెలిసిన వారు, స్నేహితుల సహకారంతో కడపలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్నాడు. ఒకసారి డయాలసిస్ చేయించుకుంటే రెండు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుందని బాధితుడు చెబుతున్నాడు. సకాలంలో డబ్బులు లభించకుంటే వారం రోజుల వరకు డయాలసిస్ చేయించుకోకుండా ఉండిపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దాతలు సహాయం చేస్తే తన ప్రాణం నిలబడుతుందని వేడుకుంటున్నాడు. మానవతావాదులు 8790085866 నంబరును సంప్రదించాలని కోరుతున్నాడు. -
గ్రహణంమొర్రి పిల్లలకు ఆపరేషన్లు
ముకరంపుర: జిల్లాలో సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) ద్వారా గుర్తించిన గ్రహణంమొర్రి గల 14 సంవత్సరాలలోపు 21 మంది విద్యార్థులకు హైదరాబాద్‌లోని ఏవీఆర్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించారు. విద్యార్థులను జిల్లా ఐఇ కో ఆర్డినేటర్ ఆర్.ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర కో ఆర్డినేటర్ సుభాషిణి, ఎస్ఎస్ఎ హైదరాబాద్ ఏఎస్పీడీ భాస్కర్‌రావు పరామర్శించారు. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఉచిత రవాణా, మందుల ఖర్చులను ఎస్ఎస్ఏ తరఫున అందించారు.