సాక్షి,సిటీబ్యూరో: ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులో లేక ఆపరేషన్లు వాయిదా పడిన సంఘటనలు మండలాల్లో జరుగుతుంటాయి. విద్యుత్ కోతలూ అక్కడ సర్వ సాధారణం కనుక వైద్యం వాయిదా పడుతుంది. కానీ ఆపరేషన్ థియేటర్‌లో లైటు లేక శస్త్ర చికిత్సలు నిలిపివేశారు. ఈ సంఘటన ఎక్కడో మారుమూల గ్రామాల్లోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో అనుకుంటే పొరపాటే.. రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్‌లోనే జరిగింది. అదీ ప్రతిష్టాత్మకమైన నిమ్స్ ఆస్పత్రిలో జరగడం గమనార్హం. ఇక్కడ వైద్య పరికరాల లేమి, మౌలిక సదుపాయాలు, ఆపరేషన్ థియేటర్లు న్యూరోసర్జరీ చికిత్సలకు పెద్ద అడ్డంకిగా మారాయి. రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయమై మెదడులో రక్తం గడ్డకట్టి, కణతులు ఏర్పడి, రక్తనాళాలు చిట్లిపోయి ప్రాణాపాయ స్థితిలో ఇక్కడకు వస్తున్న బాధితులకు చేదు అనుభవమే ఎదరవుతోంది. నిమ్స్‌లో చికిత్స చేసేందుకు అవసరమైన వైద్య నిపుణులు అందుబాటులో ఉన్నప్పటికీ ఆపరేషన్ థియేటర్ల కొరత, వైద్య పరికరాల లేమితో సర్జరీలు వాయిదా పడుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్పొరేట్ ఆస్పత్రులు ఓ వైపు అత్యాధునిక ‘ఓయాయ్, నావిగేషన్ టెక్నాలజీ, స్టీమోటాక్సీన్, ఇంట్రా ఆపరేటివ్ ఎంఆర్‌ఐ’ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుని న్యూరోసర్జరీ చికిత్సల్లో దూసుకుపోతుంటే.. నిమ్స్‌లో మాత్రం ఇప్పటికీ డాక్టర్ రాజారెడ్డి హయాంలో సమకూర్చిన వైద్య పరికరాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. కొత్తవి కొనుగోలు చేయక పోగా పాత వాటికి మరమ్మతులు చేయించక క్లిష్టమైన చికిత్సలనూ వాయిదా వేయాల్సి వస్తోంది.
‘లైటు లేక’ మూతపడ్డ థియేటర్
న్యూరో సర్జరీ విభాగానికి రోజుకు సగటున 150 కేసులు వస్తుంటాయి. అత్యవసర విభాగం, న్యూరాలజీ విభాగం నుంచి రిఫరల్‌పై మరికొన్ని కేసులు వస్తుంటాయి. వీటిలో 15 శాతం మందికి సర్జరీలు అవసరం అవుతుంటాయి. మూడు యూనిట్లలో ఎమినిమిది మంది సీనియర్ ఫ్యాకల్టీలతో సహా 19 మంది రెసిడెంట్లు పనిచేస్తున్నారు. వీరికి నాలుగు ఆపరేషన్ టేబుళ్లు కేటాయించారు. వీటిలోని ఓ ఓటీ లైటు నెల రోజుల క్రితం పాడైపోవడంంతో థియేటర్‌ను పూర్తిగా మూసివేశారు. దీంతో కీలకమైన సర్జరీలు కూడా వాయిదా పడుతున్నాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో 60 మంది వరకు ఈ చికిత్సల కోసం ఎదురు చూస్తున్నారు. అంతేకాదు మెదడులో ఏర్పడిన కణుతులను తొలగించే క్రమంలో వైద్యుడు ఏది టిఫ్యూనో.. ఏది కణితో గుర్తించాలి. ఇందు కోసం ప్రతి ఆపరేషన్ టేబుల్‌కు ఒక అత్యాధునిక మైక్రోస్కోప్ అవసరం కాగా, రెండు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఒకటి పనిచేయడం లేదు. ఉన్నతాధికారే స్వయంగా అత్యాధునిక మైక్రోస్కోప్‌ల కొనుగోలుకు అడ్డుపడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
నిరాకరిస్తున్నకార్పొరేట్ ఆస్పత్రులు
రోడ్డు ప్రమాదాల్లో తీవ్ర గాయాలపాలై మెదడులో రక్తం గడ్డకట్టిన ‘ఆరోగ్యశ్రీ’ బాధితులను చేర్చుకునేందుకు కార్పొరేట్ ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ పథకంలో హెడ్ ఇంజూరీ బాధితులకు రూ.లక్ష లోపే ఇస్తున్నారు. సాధారణ చికిత్సతో పోలిస్తే ఇది కొంత క్లిష్టమైంది కావడం, సర్జన్ చార్జీలతో పాటు వెంటిలేటర్, ఐసీయూ, పడక ఖర్చులకు ఇవి ఏమాత్రం సరిపోకపోవడమే ఇందుకు కారణం. హెడ్, బ్రెయిన్ ఇంజూరీ బాధితులను చేర్చుకునేందుకు కార్పొరేట్ ఆస్పత్రులు నిరాకరిస్తుండడంతో వారంతా నిమ్స్‌ను ఆశ్రయిస్తున్నారు. నిమ్స్ అత్యవసర విభాగానికి వచ్చే కేసుల్లో ఇవే ఎక్కువ. ప్రతిరోజూ వచ్చి పడుతున్న అత్యవసర కేసులకు తోడు మెదడులో కణుతులు, వెన్ను, మెడ నొప్పి బాధితులు కూడా చేరుతున్నారు. వీరందరికీ చికిత్స చేసే సదుపాయాలు ఆస్పత్రిలో లేక వైద్యులు కూడా చేతులెత్తేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment