కరీంనగర్‌హెల్త్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమం అభాసుపాలవుతోంది. దృష్టి లోపం, కళ్ల సమస్యలపై పరీక్షలు నిర్వహించి కొందరికి కళ్లద్దాలు పంపిణీ చేసింది. కానీ శస్త్రచికిత్స అవసరమని గుర్తించిన వారిపై పట్టింపు కరువైంది. ఆపరేషన్ ఎప్పుడు చేస్తారో తెలియక బాధితులు ఎదురు చూడాల్సి వస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం 16శాతం మంది కంటిచూపు మందగించి కళ్లజోళ్లు వాడుతున్నారు. రాష్ట్రంలో జరిపిన సర్వే ప్రకారం 40శాతం మంది కళ్లద్దాలు వాడుతున్నట్లు తేలింది. అందరికీ చూపు ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టింది.
ఈ కార్యక్రమంలో లక్షలాదిమంది ప్రజలు వివిధ రకాల కంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని వెల్లడైంది. కంటి వెలుగుకు సంబంధించిన కార్యక్రమం ద్వారా వైద్య, ఆరోగ్యశాఖ తాజాగా సర్కారుకు పంపిన నివేదికలో అనేక అంశాలను వెల్లడించింది. గత యేడాది ఆగస్టు నుంచి అందరికీ కంటి పరీక్షలు నిర్వహించి కళ్లద్దాలు అందజేయడంతోపాటు అవసరమైన వారందరికీ కంటి శస్త్రచికిత్సలు నిర్వహించాలని సకల్పించింది. జిల్లాలో 24 బృందాలు కంటిపరీక్షలు నిర్వహిస్తున్నాయి.
కంటి వెలుగు పథకం ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 5,88,339 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు పోగ్రాం అధికారులు తెలిపారు. 22,689 మందికి ఆపరేషన్లు అవసరం ఉన్నట్లు నిర్ధారించి కేసులను సంబంధిత ఆస్పత్రులకు రెఫర్ చేశారు. రెఫర్ చేసినవారికి ఇంతవరకు ఆపరేషన్లు చేయకపోవడంతో ఎదురుచూస్తున్నారు. ఈ ఉద్దేశం మంచిదే అయినప్పటికీ ఇప్పటివరకు ఒక శస్త్రచికిత్స కూడా నిర్వహించలేదు. ప్రభుత్వం అందజేస్తున్న కళ్లద్దాల్లో నాణ్యతలేదని, వృద్ధులకు ఇచ్చే కళ్లద్దాల ఫ్రేములు పిల్లలకు, పిల్లలవి వృద్ధులకు ఇస్తుండడంతో ధరించడం ఇబ్బందికరంగా మారిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లక్ష్యం చేరని కంటివెలుగు..
అందరిలోనూ కంటి చూపు సమస్యలు నివారించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు పథకం జిల్లాలో కొనసాగుతున్నా లక్ష్యం చేరడం లేదు. ఈ కార్యక్రమం ద్వారా విధిగా పరీక్షలు నిర్వహిస్తున్నా ఇప్పటివరకు ఒక్కరికి కూడా శస్త్రచికిత్స జరుపలేదు. ఆరంభంలో పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్సలు అవసరమైన వారికి ఆపరేషన్లు నిర్వహించింది. వరంగల్, నాగర్‌కర్నూల్‌తోపాటు మరికొన్ని ప్రాంతాల్లో ఇన్‌ఫెక్షన్ కారణంగా ఆపరేషన్లు ఫెయిలై బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
దీంతో వెంటనే ప్రభుత్వం ఆపరేషన్లు నిలిపివేసింది. ప్రత్యేక కంటి వైద్యశాలల్లోనే ఆపరేషన్లు నిర్వహిస్తామని అప్పటి వరకు కేసులను గుర్తించి జాబితా తయారు చేసుకోవాలని సూచించింది. శస్త్రచికిత్సల నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆపరేషన్లు చేయడానికి కావాల్సిన ఆస్పత్రులను సమకూర్చుకునేందుకు సిద్ధం అవుతోంది. ఈ కార్యక్రమం చేపట్టి ఆరు నెలలు కావస్తున్నా అవసరమైన వారికి శస్త్రచికిత్సలు నిర్వహించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుండడంతోపాటు బాధితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు వినవస్తున్నాయి. ప్రభుత్వం ఇస్తున్న కళ్లద్దాలలో నాణ్యత లేదని, మొక్కుబడిగా అందజేస్తున్నారని, సరైన సైజుల్లో అద్దాలు లేక వాటిని ధరించలేకపోతున్నట్లు ప్రజలు పేర్కొంటున్నారు.
ఆదేశాలు రాగానే ఆపరేషన్లు..
ప్రభుత్వం అదేశాలు రాగానే కంటి వెలుగు పథకంతో కంటి ఆపరేషన్లు నిర్వహిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా కంటివెలుగు ద్వారా ఎంతమందికి ఆపరేషన్లు అవసరం ఉందో డేటా అంతా ప్రభుత్వం వద్ద ఉంది. కంటి ఆపరేషన్లు నిర్వహించడానికి కావాల్సిన సౌకర్యాలు అన్ని సమకూర్చేందుకు ప్రయత్నం చేస్తోంది. ఆపరేషన్లు అవసరమైన వారందరికీ త్వరలోనే అనుమతిరాగానే తప్పకుండా శస్త్రచికిత్సలు నిర్వహించడం జరుగుతుంది. – డీఎంహెచ్‌ఓ డాక్టర్ రాంమనోహర్‌రావు
Comments
Please login to add a commentAdd a comment