డీబీఎం ఆస్పత్రి ఎదుట బాధితురాలి బంధువులు(ఇన్‌సెట్) బాధిత మహిళ
అచ్చంపేట రూరల్ (మహబూబ్ నగర్): రోజురోజుకు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆగడాలు ఎక్కువవుతున్నాయి. ఆస్పత్రు ల్లో కాసుల కోసం ఇష్టానుసారంగా ఆపరేషన్లు చేస్తున్నారు. వచ్చిరాని వైద్యంతో ప్రజల ప్రాణాలను పొగొడుతున్నారు. రోగం నయం చేస్తారని ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తే ఏకంగా కాటికే పంపిస్తున్నారు. అచ్చంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిని నడపుతున్న ఓ ప్రభుత్వ వైద్యుడు.. ఓ మహిళ గర్భసంచిలోని గడ్డను తొలగిస్తానని ఆపరేషన్ ప్రారంభించి.. అది పూర్తి చేయకుండానే మధ్యలో నే ఆపి కుట్లువేసిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది.
బాధితురాలి కుటుంబసభ్యుల కథ నం ప్రకారం.. అచ్చంపేట మండలం సింగారం గ్రామానికి చెందిన గండికోట అనితకు కడుపులో తరుచూ నొప్పి రావడంతో గత నెలలో అచ్చంపేటలోని డీబీఎం ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు. అన్ని టెస్టులు చేశారు. స్కానింగ్ తీశారు. మహిళ గర్భసంచిలో గడ్డ ఉందని వైద్యుడు తారాసింగ్ గుర్తించారు. మహిళకు రక్తం తక్కువగా ఉందని ఇటీవల రక్తం ఎక్కించారు. బుధవారం ఉదయం మహిళకు ఆపరేషన్‌కు అన్ని ఏర్పాట్లు చేసుకుని ప్రారంభించారు.
అయితే సదరు మహిళ గర్భసంచిలో గడ్డ అతుకులు అతుకులుగా ఉందని గ్రహించి.. ఆపరేషన్ పూర్తి చేయకుండానే వెంటనే కుట్లు వేశారు. విషయం తెలుసుకున్న ఆ మహిళ బంధువులు ఆందోళనకు దిగారు. డాక్టర్ తారాసింగ్ ఉప్పునుంతలలోని పీహెచ్‌సీలో విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా అతని సొంత ప్రైవేటు ఆసుపత్రి కావడంతో మహిళకు ఆపరేషన్ చేశారు. మహిళ తీవ్ర అస్వస్థతకు గురయ్యింది.
అయితే ఈ విష యం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ బాధితురాలి బంధువుల ఫోన్ల ద్వారా బయటపడింది.ఈ విషయమై డాక్టర్ తారాసింగ్‌ను వివరణ కోరగా గతంలోనే మహిళకు రెండు ఆపరేషన్లు జరిగాయని, బుధవారం ఉదయం ఆపరేషన్ చేసి చూడగా గర్భసంచిలో అతుకులు ఉన్నాయని, మళ్లీ నెల రోజుల తర్వాత ఆపరేషన్ చేయవచ్చనే ఉద్దేశంతో కుట్లు వేసినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆ మహిళలకు ఎలాంటి అపాయం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment